వనవాసం ముగుస్తుంది..ధర్మమే గెలుస్తుంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వనవాసం ముగుస్తుంది..ధర్మమే గెలుస్తుంది

వనవాసం ముగుస్తుంది..ధర్మమే గెలుస్తుంది

Written By news on Monday, June 24, 2013 | 6/24/2013

జగనన్నకు విలువలు, విశ్వసనీయతే ముఖ్యం.. ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలు వచ్చినా ముందడుగు వేశారు
జగనన్నను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లే కే కాంగ్రెస్, టీడీపీల కుట్ర
10 తలలు ఉన్న రావణాసురుడిపైన, కౌరవులపైన ధర్మమే గెలిచింది
2,500 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించిన షర్మిల పాదయాత్ర
కాకరాపల్లిలో వైఎస్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన షర్మిల, విజయమ్మ

మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘జగనన్నకు విలువలు, విశ్వసనీయత చాలా ముఖ్యం. ఇచ్చిన మాట కోసం ఊపిరి ఉన్నంత వరకు ఎన్ని కష్టాలొచ్చినా ఎదుర్కోవాలని గుండె నిబ్బరంతో, దేవునిపై నమ్మకంతో ముందడుగు వేసిన వ్యక్తి జగనన్న. మాటపై నిలబడిన గొప్ప వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్మూధైర్యం ఈ కాంగ్రెస్, టీడీపీలకు లేక ఈరోజు జగనన్నను బంధించారు. వీళ్లు నాయకులు కాదు పిరికిపందలు. కానీ ధర్మమే గెలుస్తుంది. 10 తలలున్న రావణాసురుడిపై ధర్మమే గెలిచింది.. శకుని ఆలోచనలతో కుట్రలు పన్నిన కౌరవుల మీద ధర్మమే గెలిచింది.. అది ధర్మానికి ఉన్న శక్తి. ఒకరోజున జగనన్న వనవాసం ముగుస్తుంది. ధర్మం గెలుస్తుంది..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఉద్ఘాటించారు. 

పజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలోని కాకరాపల్లి గ్రామం వద్ద 2,500 కిలోమీటర్ల మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా వైఎస్సార్ అభిమానులు ఇక్కడ ఏర్పాటు చేసిన 24 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో కలిసి షర్మిల ఆవిష్కరించారు. అనంతరం భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఈ ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే...

కిరణ్ గారి లెక్కల గారడీ..

‘‘వైఎస్సార్ బతికే ఉంటే ఈరోజు 30 కిలోల బియ్యం ఇచ్చేవారు. అంటే పేదలకు 10 కిలోల బియ్యం అదనంగా అందేవి. కిలో బియ్యానికి కనీసం రూ.40 వేసుకున్నా.. ప్రతి పేద కుటుంబానికి రూ.400 మిగిలేవి. కానీ కిరణ్‌కుమార్‌రెడ్డి గారు రూ.2 కిలో బియ్యాన్ని రూపాయి చేశానంటూ అవే 20 కిలోలు ఇస్తున్నాడు. ఈ లెక్కన కిరణ్ మిగిల్చింది రూ.20 మాత్రమే. ఇదికాకుండా అమ్మహస్తం అంటూ రేషన్ దుకాణాల ద్వారా ఇచ్చే సరుకులకు కత్తెర పెట్టి, ఒక పొట్లంలో కొన్ని సరుకులు వేసి దాని మీద ఆయన బొమ్మ వేసుకొని నేను రూ.100 మిగులుస్తున్నాను అని చెప్తున్నారు. ఈ లెక్కన సరుకులకు రూ.100, బియ్యానికి రూ.20 వేసుకుంటే కిరణ్‌కుమార్‌రెడ్డి మనకు మిగులుస్తుంది కేవలం రూ.120 మాత్రమే. అది కూడా ఆయన 2009 నుంచి చేయలేదు.. ఎన్నికలు ఏడాదో, ఏడాదిన్నరో ఉన్నాయనగా చేశారు. ఆయన పథకం ద్వారా ఏడాదిన్నరలో ప్రజలకు మిగిలేది మహా అయితే రూ.2,000. అదే వైఎస్సార్ బతికి ఉంటే బియ్యం మీద ప్రతినెల రూ.400 మిగిలేవి. 12 నెలలకు రూ.4,800.. ఐదేళ్లకు చూస్తే కనీసం రూ.24 వేలు ప్రతి పేద కుటుంబానికి మిగిలేవి. వైఎస్సార్ మిగల్చాలనుకున్న ఈ రూ.24 వేలు ఎక్కడా? కిరణ్‌కుమార్‌రెడ్డి గారు మిగుల్చుతున్న ఈ రూ.2,000 ఎక్కడ? ఇది కిరణ్‌కుమార్‌రెడ్డి గారు చేస్తున్న లెక్కల గారడీ!

ఎస్టీలకు ఏం చేశారో చెప్పండి..

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అంటూ ఎన్నో అడ్వర్టైజ్‌మెంట్లు చూస్తున్నాం. ఎస్సీ, ఎస్టీలకు చేసింది ఏమిటో ధైర్యం ఉంటే కిరణ్‌కుమార్‌రెడ్డి గాారు బహిరంగంగా చెప్పాలి. వైఎస్సార్ 20 లక్షల ఎకరాల అటవీ భూమిపై గిరిజనులకు హక్కులు కల్పించారు. ఎస్సీ, ఎస్టీల కోసం ఎన్నో చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రచారం చేసుకోవడం తప్ప నిజంగా వారికి ఒరగబెట్టిందేమీ లేదు. ఇక రాజీవ్ యువకిరణాలు అంటూ ఇంకో పథకం పెట్టారు. 35 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. రూ.6 లక్షల కోట్ల విలువ చేసే పెట్టుబడులు తెస్తానన్నారు. ఏమైంది కిరణ్‌కుమార్‌రెడ్డి గారు అంటే ఆయన మాటలు కోటలు దాటుతున్నాయి కాని.. చేతలు మాత్రం గడప దాటడం లేదు. కనీసం 10, 15 శాతమైనా ఉద్యోగాలిప్పించారా అంటే లేదనే సమాధానం వస్తుంది.

‘లఖ్‌పతి’ని కాపీ కొట్టి ‘బంగారు తల్లి’..

కిరణ్‌కుమార్‌రెడ్డిగారు బంగారు తల్లి అని ఇంకో పథకం పెట్టారు. వైఎస్సార్ పెట్టిన ‘లఖ్‌పతి’ పథకాన్ని కాపీ కొట్టి దానికి నఖలు పథకంగా బంగారుతల్లిని పెట్టారు. లఖ్‌పతి పథకం కింద అమ్మాయికి 18 ఏళ్లు నిండితే రూ లక్ష ఇస్తామన్నారు. ఇంటర్ చదివాక రూ.50 వేలు, డిగ్రీ చదివితే రూ.50 వేలు.. అంటే 21 ఏళ్లు వచ్చిన తర్వాత రూ లక్ష ఇస్తానని చెప్తున్నారు. ఇది నఖలు పథకమే కాదు.. న కిలీ పథకం అని ఆయన కేబినెట్ మంత్రులే చెబుతున్నారు. కిరణ్‌ది పని తక్కువ, ప్రచారం ఎక్కువ. ఆయన పని చేస్తున్నట్టు ఎక్కడా కనిపించదు. కానీ ప్రచారం మట్టుకు బ్రహ్మాండంగా చేసుకుంటారు. పథకాలు ప్రజలకు అందకపోయినా ఫర్వాలేదు.. అవి ప్రచారానికి పనికి వస్తే చాలు అనుకుంటున్నారు. అందుకే రూ.100 కోట్ల ప్రజల సొమ్ము ఖర్చు చేసి ఇమేజ్‌ను పెంచుకోవడానికి వాడుకుంటున్నారు.

రెండు పథకాలు అద్భుతంగా అమలు చేస్తున్నారు..

కిరణ్‌కుమార్‌రెడ్డి గారు రెండు పథకాలు అద్భుతంగా అమలు చేస్తున్నారు. ఒకటి.. అన్ని చార్జీలు పెంచే పథకం. ఈ పథకం కింద ఇప్పటికే ఎరువుల ధరలు 300 శాతం నుంచి 800 శాతం వరకు పెంచారు. రూ.305 ఉన్న గ్యాస్ ధరను రూ.440 చేశారు. అది సబ్సిడీ ఉంటే.. సబ్సిడీ లేకుంటే ఒక్క గ్యాస్ సిలిండర్ రూ.1000 పెట్టాలి. ఇదే పథకం కింద ఆర్టీసీ చార్జీలు మూడు సార్లు పెంచారు. మున్సిపల్, రిజిస్ట్రేషన్, పన్నులను పెంచారు. ఇదే పథకం కింద రూ.30 వేల కోట్ల విద్యుత్ చార్జీలను ప్రజల నెత్తిన మోపారు. మరో పథకం పేరు.. వైఎస్సార్ సంక్షేమ పథకాలకు తూట్లు పెట్టే పథకం. ఈ పథకం కింద వైఎస్సార్ తలపెట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులను అటకెక్కించారు. 7.20 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే పోలవరం ప్రాజెక్టు వైఎస్సార్ వెళ్లిపోయిన తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదు. 

ఏడు గంటల ఉచిత విద్యుత్ పథకాన్ని కుదించి మూడు గంటలు చేశారు. ఈ పథకం కిందనే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కుదించి సగం ఇస్తాం, ముక్కాలు ఇస్తామంటూ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారు. ఆరోగ్య శ్రీ నుంచి 133 వ్యాధులను, 97 ఆసుపత్రులను తొలగించారు. ఈ పథకం కిందనే 108, 104 నిర్వీర్యం చేస్తున్నారు.. పక్కా ఇళ్లకు పాడెకట్టారు. వైఎస్సార్ ఇచ్చిన పింఛన్లను, రేషన్ కార్డులను తీసేస్తున్నారంటే ఇక ఆయనకు చంద్రబాబు గారికి పెద్దగా తేడా లేదు. కిర ణ్ తెలుసుకోవాల్సింది ఏమిటంటే.. పథకాల పేర్లు మార్చి, పబ్లిసిటీ ఇచ్చుకుంటే సరిపోదు. ఆ పథకాలు అమలు కావాలంటే వైఎస్‌లాగా చిత్తశుద్ధి ఉండాలి. వైఎస్సార్ తన పథకాలను అలా అమలు చేసి చూపించారు కాబట్టే ప్రజలు వైఎస్సార్ లాంటి నాయకుడే మళ్లీ కావాలని కోరుకుంటున్నారు.

బాబూ.. మీ పాలన మళ్లీ తెస్తానని చెప్పగలరా?

ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెడితే, చంద్రబాబు గారేమో ఈ కాంగ్రెస్ సర్కారును కాపాడారు. ఎప్పుడూ ఏ పని చేయకుండా తిని కూర్చునే వాడిని ‘‘ఎందుకయ్యా ఏ పని చేయవూ అని అడిగితే ఆయన చెప్పాడటా.. ఏం చేద్దాం? తినక ముందు నీరసం, తిన్నాక ఆయాసం అన్నాడటా. చంద్రబాబు గారు తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నారు. కానీ ప్రజలకు ఈ మేలు చేశాను అని చెప్పుకునే పరిస్థితిలో లేరు. ఇప్పుడు 9 ఏళ్లు ప్రతిపక్షనాయకునిగా ఉన్నారు. నేను ప్రజల కోసం ఈ పోరాటం చేశాను అనే పరిస్థితి కూడా లేదు. ఏం చేశారయ్యా చంద్రబాబు అని అంటే.. ‘ఏం చేద్దాం ముందు నీరసం, ఇప్పుడు ఆయాసం’ అన్నట్టు ఉంది ఆయన తీరు. రాజన్న రాజ్యం వచ్చిన రోజున, జగనన్న ముఖ్యమంత్రి అయిన రోజున వైఎస్సార్ అమలు చేసిన ప్రతి సంక్షేమ పథకానికీ జగనన్న మళ్లీ జీవం పోస్తారు. చంద్రబాబూ.. మీకు ధైర్యం ఉంటే మీ 9 ఏళ్ల పాలనను తిరిగి తెస్తాను అని చెప్పగలరా?’’
Share this article :

0 comments: