ఏమిటీ ‘పచ్చ’పాతం? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏమిటీ ‘పచ్చ’పాతం?

ఏమిటీ ‘పచ్చ’పాతం?

Written By news on Tuesday, June 11, 2013 | 6/11/2013

ఎక్కడా లేనివిధంగా సీబీఐలో ఏడేళ్ల పొడిగింపు
మొదటి నుంచీ కుట్రపూరితంగా జగన్ కేసు దర్యాప్తు
ఏడెనిమిది చార్జిషీట్లు వేస్తామంటూ విచారణ
పూర్తవక ముందే జేడీ ప్రకటనలు
చంద్రబాబు అక్రమాస్తులపై విచారణ జరపాలంటూ హైకోర్టే ఆదేశించినా అడ్డంగా కాలయాపన

సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్ అధికారులకు డిప్యుటేషన్ మీద సీబీఐలో మొదట రెండేళ్లకు పోస్టింగ్ ఇస్తారు. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థలో డిప్యుటేషన్ విధానం. తర్వాత ఏటా దాన్ని పొడిగించుకోవాలి. పొడిగింపు (ఎక్స్‌టెన్షన్) రావాలంటే రాజకీయంగా గట్టి పలుకుబడి ఉండి తీరాలి. లేదా, ఆ అధికారి ద్వారా తమకు కావాల్సిన పనులు చక్కదిద్దుకోవాలని ప్రభుత్వ పెద్దలు భావించాలి. లేకుంటే పొడిగింపులు రావు. అందులోనూ సీబీఐ లాంటి సంస్థలో, అది కూడా ఐదేళ్ల తర్వాత పొడిగింపంటే మరీ కష్టం. పోస్టింగ్‌కు సంబంధించిన మంత్రిత్వ శాఖ పరిధిని దాటి, సిబ్బంది వ్యవహారాల శాఖ నుంచి అనుమతి సంపాదించాలి. ఒకే అధికారి, ఒకే చోట అటువంటి పొడిగింపులను వరుసగా తీసుకుంటూ ఏకంగా ఏడేళ్ల పాటు కొనసాగడం సీబీఐలో అత్యంత అరుదైన విషయం. అందులోనూ సదరు అధికారి తన సొంత రాష్ట్రంలో అలా కొనసాగడం మరీ మరీ అరుదు. 

సదరు అధికారికి అదే రాష్ట్రానికి సంబంధించిన కేసును దర్యాప్తు చేసే అవకాశం ఇవ్వడమూ అంతే అసాధారణం. అది కూడా రాజకీయ ప్రేరేపిత కేసును దర్యాప్తు చేసే అవకాశం రావడమైతే అసంభవమే. కానీ సీబీఐ జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణకు ఇవన్నీ సులువుగా సాధ్యపడ్డాయి. పైన పేర్కొన్న అవకాశాలన్నీ ఆయనకు అనాయాసంగానే దక్కాయి. ఏడేళ్లు నిరంతరాయంగా సొంత రాష్ట్రంలో ఒకే పోస్టింగ్‌లో కొనసాగడం, రాజకీయ ప్రేరేపిత జగన్ కేసు దర్యాప్తు... సాధారణ పరిస్థితుల్లో వీలు పడని ఇలాంటి అవకాశాలన్నీ సాధ్యమవడం వెనక పరమార్థం కూడా బహిరంగ రహస్యమే. నిబంధనలను పక్కనపెట్టి, విలువలకు తిలోదకాలిచ్చి, పాలకులు చెప్పినట్టు చేస్తే తప్ప అది సాధ్యం కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీబీఐ దర్యాప్తులు ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం అన్నట్టుగా సాగుతున్న వైనం అందరికీ కనిపిస్తూనే ఉంది. రాజకీయ కుట్ర నుంచి పుట్టుకొచ్చి, ఆద్యంతం కుట్రపూరితంగానే సాగుతున్న జగన్ కేసు దర్యాప్తులో అడుగడుగునా సమాధానం లేని ప్రశ్నలే...!

వీడినందుకే వేధింపులు
రాజకీయ ప్రేరేపిత కేసంటూ ఏదైనా ఉందంటే అది జగన్ కేసే. వైఎస్ మరణించిన 15 నెలల తర్వాత, కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ బయటికి వచ్చిన తర్వాతే ఆయనపై కేసు ఎందుకు వేయాల్సి వచ్చింది? వైఎస్‌పై టీడీపీ చేసిన ఆరోపణలను ఆయన జీవించి ఉండగా ఎందుకు పట్టించుకోలేదు? అంతా బాగుందంటూ ఇదే కాంగ్రెస్ వాళ్లు అప్పుడు పొగడటం నిజం కాదా? కేవలం జగన్ కాంగ్రెస్‌ను వీడిన కారణంగానే ఆయనపై దర్యాప్తు ప్రహసనానికి తెర లేచిందనడం వాస్తవం కాదా? కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు ప్రజాప్రయోజన వ్యాజ్యం వేయడం, చంద్రబాబు పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఎర్రన్నాయు డు, బెరైడ్డి రాజశేఖరరెడ్డి, అశోక్‌గజపతిరాజు అందులో ఇంప్లీడ్ కావడం కుట్ర అమలు కార్యాచరణలో తొలి అడుగులు. ఒకరేమో సోనియాగాంధీ వేయమంటే కేసు వేశానంటారు. మరొకరి విషయంలోనేమో స్క్రీన్‌ప్లే, డెరైక్షన్ వంటివన్నీ చంద్రబాబువే. ఇలాంటి రాజకీయ ప్రేరేపిత కేసులో జగన్‌ను 52వ ప్రతివాదిగా పేర్కొంది. 1 నుంచి 15 వరకు ప్రతివాదులుగా ప్రభుత్వ శాఖలను పేర్కొంటూ నోటీసులిచ్చింది. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వాటికి స్పందించకపోవడం నిజం కాదా? స్పందిస్తే... జీవోలన్నీ నిబంధనల ప్రకారమే ఇచ్చారని, చంద్రబాబు హయాంలో కూడా ఇలాంటి జీవోలు అనేకం ఇచ్చారన్న వాస్తవాలను వెల్లడించాల్సి వస్తుందనే మిన్నకుండిపోవడం అబద్ధమా?

ఆగమేఘాలపై...
నోటీసులకు ప్రభుత్వం స్పందించకపోయినప్పటికీ న్యాయస్థానం సీబీఐ విచారణకు ఆదేశిస్తే.. అవి వెలువడిందే తడవుగా, నాలుగే రోజుల్లో జేడీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో సీబీఐ సోదాలు ప్రారంభించలేదా? కేవలం 15 రోజుల్లో కోర్టుకు నివేదిక కూడా సమర్పించలేదా? మొత్తం వ్యవహారమంతా రెండు వారాల్లో జరిగింది. దేశంలో ఎక్కడా, ఎప్పుడూ లేనంత వేగంగా ఈ కేసులో స్పందించడం నిజం కాదా?

దురుద్దేశానికి దర్పణం
జగన్‌ను విచారణే చేయకుండా, ఆయనను కనీసం పిలవను కూడా పిలవకుండా 10 నెలల్లో 3 చార్జిషీట్లు దాఖలు చేశారు. ఒకే కేసులో, ఒకే ఎఫ్‌ఐఆర్‌లో ఒకే చార్జిషీట్ వెయ్యాలన్న నిబంధనను కూడా తుంగలో తొక్కారు. పైగా ‘ఆరు నుంచి ఎనిమిది చార్జిషీట్లు వేస్తాం. అన్నింట్లోనూ జగన్ తొలి ముద్దాయి, విజయసాయి రెండో ముద్దాయిగా ఉంటారు’ అని విచారణాధికారి మీడియాతో చెప్పారు. వీటన్నింటినీ ఎలా అర్థం చేసుకోవాలి? విచారణను పూర్తి కూడా చేయకుండానే వారిద్దరినీ మొదటి, రెండో నిందితులని ఎలా చెప్పారు? ఈ కేసు విచారణ ఎంత దురుద్దేశపూరితంగా జరుగుతోందో దీన్నిబట్టే అర్థం కావడం లేదా? కనీసం సంబంధిత వ్యక్తిని పిలిచి విచారించాలనే సహజ న్యాయ సూత్రాలను కూడా విస్మరించి 10 నెలల్లో 3 చార్జిషీట్లు దాఖలు చేయడం సీబీఐ చరిత్రలో ఎక్కడా లేదే! తర్వాత ఉప ఎన్నికలకు కేవలం 15 రోజుల ముందు, జగన్ మీద బురదజల్లడమే లక్ష్యంగా విచారణ కోసమంటూ పిలిపించి ఏకంగా అరెస్టు చేశారు. అది కూడా 3 చార్జిషీట్లు వేసిన తర్వాత! బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారనే సాకుతో!! చార్జిషీట్లు వేస్తున్నప్పుడు చూపని ప్రభావాన్ని, వాటిని దాఖలు చేసిన తర్వాత చూపుతారనడంలో అర్థముందా? అది కూడా 10 నెలల తర్వాత సాక్షులను ప్రభావితం చేస్తారనడం విడ్డూరం కాదా? పైగా సాక్షులను జగన్ ప్రభావితం చేశారని చెప్పడానికి ఒక్క ఆధారాన్నయినా సీబీఐ చూపించగలిగిందా?

చట్టం చట్టుబండలు
ఎవరికైనా చట్టపరంగా, రాజ్యాంగబద్ధంగా 3 నెలల్లో బెయిలివ్వాలి. మన కళ్ల ఎదుటే గురజాల టీడీపీ ఎమ్మెల్యే ఒక హత్య కేసులో కోర్టుకు రావడం, బెయిల్ తీసుకుని పోవడం రెండూ చూశాం. కానీ జగన్ విషయంలో ఈ నిబంధనలేవీ వర్తించకుండా పోయాయేం? జగన్ అరెస్టుకు ముందు 10 నెలల పాటు ఆయనను కనీసం ప్రశ్నించకుండా 3 చార్జిషీట్లు దాఖలు చేశారు. సీబీఐ విచారణ పరిధి 2004-09 మధ్య వ్యవహారాలకే పరిమితమని కోర్టు స్పష్టంగా చెప్పింది. జగన్ అరెస్టు 2012లో జరిగింది. అధికారం చలాయిస్తున్నది జగన్ వ్యతిరేక ప్రభుత్వమే. కేసు విచారణకు సంబంధించిన రికార్డులన్నీ పాతవే. ఎవరూ ఏమీ చేయలేని, మార్చడానికి వీల్లేనివే. అయినా.. సాక్షులను ప్రభావితం చేస్తారంటూ జగన్‌కు బెయిల్ రాకుండా అడ్డుపడ్డారంటే... కేవలం ఆయనను ప్రజలకు దూరం చేయాలనే కుట్రతోనే కాదా?

‘ఎమ్మార్ బాబు’ను కనీసం ప్రశ్నించలేదేం?
సీబీఐ విచారణ తీరు ‘ఒక్కో మనిషికో న్యాయం’ అన్న చందాన ఉందనేందుకు ఎమ్మార్ కేసు విచారణే స్పష్టమైన ఉదాహరణ. ఏపీఐఐసీ వైస్ చైర్మన్‌గా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఎమ్మార్ కేసులో నిందితునిగా తీసుకొచ్చారు. హైదరాబాద్ నడిబొడ్డున 530 ఎకరాల అత్యంత విలువైన భూమిని చంద్రబాబు హయాంలోనే పప్పుబెల్లాలకు అమ్మినట్టుగా అత్యంత చౌకగా, పక్కా పథకం ప్రకారం సింగిల్ టెండర్‌కు కట్టబెట్టారు. ఇందుకు పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయి. అయినా ఈ కేసులో బాబును కనీసం విచారణకు కూడా పిలవలేదు. నిందితునిగా సీబీఐ పేర్కొన్న సుబ్రమణ్యం సారథ్యంలోని ఏపీఐఐసీ తొలుత ఎమ్మార్‌కు 480 ఎకరాలను మాత్రమే కేటాయించింది. అబ్బే, అది సరిపోదు... 535 ఎకరాలు కావాలంటూ బాబు హుకుం జారీ చేశారు. సీబీఐకి మాత్రం ఇది కనిపించదు. హెటిరో, అరబిందో ఫార్మా కంపెనీల ఉదంతంలో... కనీసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి టేబుల్ మీదకు కూడా వెళ్లని ఫైలును పట్టుకుని, ఆయనను దోషిగా చూపేందుకు ఇదే సీబీఐ ప్రయత్నించింది. చార్జిషీట్లలో ఆయన పేరును చేర్చింది. ఇంతా చేస్తే వాటికి భూముల విక్రయం కూడా జరగలేదు. ఇచ్చింది కేవలం లీజులే. అవి కూడా ఏపీఐఐసీ ఇచ్చింది. సంబంధిత ఫైలు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ టేబుల్ మీదకు కూడా చేరలేదని అందరికీ తెలుసు. అక్కడ పరిశ్రమలు వచ్చి వేలాది మందికి ఉపాధి లభించిన విషయం కూడా కళ్ల ముందు కనబడుతున్న వాస్తవమే. అయినా సరే, చనిపోయిన వ్యక్తిని దోషిగా చూపించడానికి ప్రయత్నించడం ఏ ప్రమాణాల కిందకు వస్తుంది? కేసు కేసుకూ, మనిషి మనిషికీ సీబీఐ విచారణలో ప్రమాణాలు ఎందుకు మారుతున్నాయి? ఎవరికి లబ్ధి చేకూర్చడానికి ఈ ద్వంద్వ ప్రమాణాలు...?

కోర్టు చెప్పినా చెవికెక్కలేదు
ఇక ఐఎంజీ కేసయితే మరీ దారుణం. ఈ కేసులో చంద్రబాబు మీద విచారణ చేపట్టాలని స్వయంగా హైకోర్టు ఆదేశించినా... నెల రోజుల పాటు సీబీఐ ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసింది. జగన్ కేసులో నాలుగే రోజుల్లో సోదాలు మొదలుపెట్టి, పక్షం రోజుల్లో కోర్టుకు నివేదిక ఇచ్చిన ఇదే జాయింట్ డెరైక్టర్ లక్ష్మీనారాయణ, బాబుపై మాత్రం విచారణకు ఎందుకు చొరవ చూపలేదు? ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ ఫైలు ను కనీసం మంత్రివర్గానికి కూడా పంపించకుండా ఒక బినామీ, బోగస్ సంస్థకు ఎకరా కనీసం రూ.2 కోట్లు విలువ చేసే భూమిని ఎకరా కేవలం రూ.50 వేల చొప్పున ఏకంగా 830 ఎకరాలు ధారాదత్తం చేసిన వైనం కళ్ల ముందు కన్పిస్తున్నా బాబును కనీసం విచారణకైనా పిలవలేదేం?

ఇవేం విలువలు?
దాల్మియా కేసులో ఇమిడి ఉన్నది ప్రైవేటు భూములైనప్పటికీ... కేటాయింపులు, బదలాయింపుల విషయంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని సీబీఐ తప్పుబట్టింది. మరి 2002లో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ)కి గనులను రెన్యువల్, బదలాయింపు చేయడాన్ని ఇదే సీబీఐ జేడీ ఎందుకు పట్టించుకోలేదు? బీజేపీ నేత సుష్మాస్వరాజ్ బళ్లారిలో పోటీ చేసినప్పుడు, అదేచోట శ్రీరాములు ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో బాబు అక్కడ బీజేపీ ఎన్నికల బహిరంగ సభల్లో పాల్గొనడం సీబీఐకి కన్పించలేదా? సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకోవడానికి ఎల్ అండ్ టీకి చంద్రబాబు ప్రభుత్వం ఎకరా రూ.4 వేలకే ప్రభుత్వ భూములిచ్చిన విషయం సీబీఐకి తెలీదా? తెలిసినా తెలియనట్టే వ్యవహరిస్తోందా? నిజంగా దాల్మియాకో, ఇంకొకరికో మేలు చేయాలని వైఎస్ అనుకుంటే ఆయన కూడా వారికి ప్రభుత్వ భూములే కట్టబెట్టేవారు కాదా? ఎకరా ఏ 4 వేల రూపాయలకో కారుచౌకగా ఇచ్చి మేలు చేసేవారు కాదా? వాటికి వైఎస్ హయాంలో జరిగిన భూ కేటాయింపుల్లో అవకతవకలేవీ జరగలేదనేది దీన్నిబట్టే అర్థం కావడం లేదా?

ఏమిటీ ‘పచ్చ’పాతం?
‘‘బాధ్యత గల హోదాలో ఉంటూ ఒక వర్గం మీడియా ప్రతినిధులకు లక్ష్మీనారాయణ 500 పై చిలుకు ఫోన్లు కాల్స్ చేశారు. కేవలం ఒక వ్యక్తి మీద బురదజల్లాలనే ఆలోచనతో, నాణేనికి ఒకవైపు సమాచారాన్ని లీక్ చేశారు. ఇది తప్పుగా అనిపించలేదా?’’ అని రిటైర్డ్ సీబీఐ అధికారే వ్యాఖ్యానించారు. ప్రత్యేకించి రాజకీయ నాయకులపై కేసులను విచారించే సమయంలో సీబీఐ పూర్తిగా తన మాన్యువల్ ప్రకారం నడుచుకోవాలని గుర్తు చేశారు. ‘‘ఏ విషయాన్నయినా మీడియాకు చేరవేయాలనుకుంటే సీబీఐ అధికార ప్రతినిధి మాత్రమే చెప్పాలి. కానీ జగన్ కేసులో మాత్రం జేడీయే నేరుగా మీడియాతో చీటికీమాటికీ ఫోన్‌లో మాట్లాడారు. ఇది ఆందోళన కలిగించే అంశం. ఇవన్నీ చూస్తుంటే ఈ కేసు విచారణ సాగుతున్న తీరుపైనే అనుమానాలు కలుగుతున్నాయి’’ అని కూడా ఆ అధికారి అన్నారు. ఇలా ఒక వ్యక్తిని పథకం ప్రకారం అభాసుపాలు చేసే అధికారం జేడీకి ఎవరిచ్చారు? అసలు సీబీఐ జేడీకి మాత్రమే తెలిసిన, ఇంకెవరికీ తెలియని సమాచారం ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఎలా వస్తుంది? సీబీఐ ఏం చేయబోతోందో కూడా ఆ పత్రికలు ముందుగానే చెప్పేస్తున్నాయి. 

సీబీఐ విచారణను ఆ పత్రికలే నిర్దేశిస్తున్నాయన్న విధంగా విచారణ సాగుతున్న విషయం జేడీగా ఆయనకు తప్పుగా కనపడలేదా? ఆ రెండు పత్రికలకు సాక్షి పోటీగా నిలబడిందని, దాన్ని ఉనికిలోనే లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ కుట్ర జరుగుతోందని జేడీకి కనిపించలేదా? అన్ని విలువలనూ పక్కన పెట్టి మరీ వ్యహరించిన తీరును జేడీ ఎలా సమర్థించుకుంటారు? ఏ అధికారంలోనూ లేని జగన్ సాక్షులను ప్రభావితం చేస్తారంటూ అరెస్టు చేశారు. అధికారంలో ఉన్న మంత్రులకేమో బెయిలిచ్చి పంపుతున్నారు. ఇది మనిషికో న్యాయం కాదా? చంద్రబాబునేమో కనీసం విచారణకు కూడా పిలవరు. ఇదే సీబీఐ.. బోఫోర్స్ కేసులో రాజీవ్‌గాంధీ చనిపోయిన వెంటనే చార్జిషీట్ నుంచి ఆయన పేరును తొలగించింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్ సతీమణి డింపుల్ విషయంలో కూడా... చార్జిషీట్ వేసే సమయంలో రాజకీయాల్లో లేరు గనుక ప్రైవేటు వ్యక్తిగా భావించి చార్జిషీట్ నుంచి ఆమె పేరు తీసేశారు. సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాను కూడా ప్రైవేటు వ్యక్తి అని పేర్కొంటూ డీఎల్‌ఎఫ్ కేసులో విచారణ జరగకుండా చేశారు. 

కానీ జగన్ విషయంలో మాత్రం సీబీఐ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్న వైనం అడుగడుగునా కన్పించడం లేదా? అప్పుడు రాజకీయాల్లో లేనప్పటికీ, ఏ మంత్రికి గానీ, అధికారి గానీ కనీసం ఫోన్ కూడా చేయనప్పటికీ, సచివాలయంలో అడుగు కూడా పెట్టనప్పటికీ, అంతెందుకు.. అసలు హైదరాబాద్‌లోనే లేకుండా బెంగుళూరులో తన కుటుంబంతో కలిసి నివాసం ఉన్నప్పటికీ, జగన్ కంపెనీలేవీ బోగస్ కానప్పటికీ, దాదాపు 25 వేలకు పైచిలుకు కుటుంబాలు సాక్షి మీద ఆధారపడి బతుకుతున్నప్పటికీ, వచ్చిన సొమ్మంతా జగన్ జేబులోకి కాకుండా కంపెనీలోనే ఉన్నప్పటికీ, సాక్షిలో ఒక్క రూపాయి కూడా జీతం తీసుకోకుండా కష్టపడి పని చేసినప్పటికీ... ఇవేమీ తన కంటికి కన్పించలేదన్నట్టుగా ప్రవర్తించడాన్ని సీబీఐ ఎలా సమర్థించుకోగలదు? సాక్షి, భారతి సిమెంట్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటైన సంస్థలు. సాక్షి అనతికాలంలోనే దేశంలోనే ఏడో అతి పెద్ద పత్రికగా నిలిచింది. దేశంలోనే అత్యున్నతమైన ప్రమాణాలతో ఏర్పాటైంది భారతి సిమెంట్స్. జర్మనీ నుంచి నిపుణుల బృందం దీన్ని చూసింది. ఒక సిమెంట్ కంపెనీల్లో ప్రమాణాలంటే ఇలా ఉండాలని ప్రశంసించింది. అయినా సరే.. ఈ వాస్తవాలన్నిటినీ విస్మరించి జగన్‌ను ఏదోలా ఇరికించాలనే ప్రయత్నం చేయడం ఏం న్యాయం? రాజీవ్, డింపుల్, వాద్రా వంటివాళ్లకూ జగన్‌కూ తేడా ఏమిటి? వాళ్లకు సంబంధించిన వాళ్లంతా జీవించి ఉండటం, అధికారంలో కొనసాగే పరిస్థితి ఉండటం, వాళ్లందరికీ వ్యవస్థలను మేనేజ్ చేసే పరిచయాలూ, పలుకుబడి ఉండటం.. అవేవీ జగన్‌కు లేకపోవడమే ప్రధాన వ్యత్యాసమా?
Share this article :

0 comments: