స్థానిక ఎన్నికలు ఎలా జరిపినా సిద్ధమే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » స్థానిక ఎన్నికలు ఎలా జరిపినా సిద్ధమే

స్థానిక ఎన్నికలు ఎలా జరిపినా సిద్ధమే

Written By news on Wednesday, June 26, 2013 | 6/26/2013

మెదక్ జిల్లా జోగిపేటలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో వైఎస్సార్సీపీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్. విజయమ్మ పిలుపు

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి (మెదక్): ‘మున్సిపాలిటీలు, స్థానిక సంస్థలు ఆ తర్వాత పంచాయతీలకు ఎన్నికలు జరగాలి. తెలుగుదేశం, కాంగ్రెస్ కుమ్మక్కై పార్టీరహితంగా జరుగుతున్న ఎన్నికల్లో ఎవరు గెలిచినా అన్నీ తామే గెలిచామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారు ఎలా జరపాలనుకున్నా అన్ని ఎన్నికలకు పార్టీ సిద్ధంగా ఉంది. పంచాయతీలపై వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేయాలి..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా అందోలు నియోజకవర్గ కేంద్రం జోగిపేటలో మంగళవారం జరిగిన పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా విజయమ్మ స్థానిక సంస్థలకు రెండేళ్లుగా ఎన్నికలు జరగకపోవడంతో వివిధ మార్గాల్లో కేంద్రం నుంచి అందే దాదాపు ఏడువేల కోట్ల రూపాయల నిధులు ఆగిపోయే పరిస్థితి దాపురించిందని అన్నారు. ఫలితంగా అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయని తెలిపారు. ప్రభుత్వం చేతకానితనం, చిత్తశుద్ధి లేకపోవడంతో 2.50 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళలు స్థానిక సంస్థలకు పదవులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.


వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానులు, జగన్‌ను ఆదరించే వాళ్లు తెలంగాణలో చాలామంది ఉన్నారనీ.. వైఎస్ మాదిరిగానే జగన్ తెలంగాణవాదాన్ని గౌరవిస్తున్నారని చెప్పారు. ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా తెలంగాణ సమస్య పరిష్కారం కావాలని జగన్ కోరుకుంటున్నారని తెలిపారు. అప్పుడు, ఇప్పుడు కూడా రాష్ట్ర విభజన కేంద్రం చేతిలో ఉందంటూ ఆమె.. తెలంగాణలో వెనుకబాటుతనాన్ని గమనించినందునే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారని వివరించారు. ఈ పథకంలో 70 శాతం లబ్ధి తెలంగాణ ప్రాంత రైతులకే చేకూరుతోందని తెలిపారు.’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వ్యాఖ్యానించారు. గంటకు పైగా సాగిన విజయమ్మ ప్రసంగంలో స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

చంద్రబాబు, కాంగ్రెస్ డ్రామాలు

‘తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు 37 ఏళ్ల రాజకీయ జీవితం అంతా కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు, చీకటి ఒప్పందాలమయం. సొంత ప్రయోజనాలు తప్ప, ప్రజలు, రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు. ఒక ఓటు రెండు రాష్ట్రాలన్న బీజేపీతో 1998, కేసీఆర్‌తో 2009లో కలిసి పోటీ చేశారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కై కడప ఎన్నిక, ఆ తర్వాత ఉప ఎన్నికల్లో డమ్మీ అభ్యర్థులను పెట్టి డిపాజిట్ లాస్ చేసుకున్నాడు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానాలు, ఎఫ్‌డీఐ బిల్లుకు మద్దతు ఇలా అన్ని అంశాల్లోనూ వైఎస్సార్ సీపీని దెబ్బతీసేందుకు చంద్రబాబు సహకరిస్తున్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు బలం లేకున్నా చంద్రబాబు మద్దతుతోనే ప్రభుత్వం నడుస్తోందని పలు ఘటనలను విజయమ్మ ఉదహరించారు. బడుగు, బలహీనవర్గాల సంక్షేమం కోసం వైఎస్ ప్రవేశ పెట్టిన పథకాలను నిర్వీర్యం చేస్తూ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు సీఎం కిరణ్ ప్రయత్నిస్తున్నారంటూ అటు చంద్రబాబు, ఇటు సీఎం కిరణ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విజయమ్మ నిప్పులు చెరిగారు. ప్రచార ఆర్భాటానికి ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని దుయ్యబట్టారు. ‘జగన్, వైఎస్, కుటుంబం గురించి వీళ్లు కొన్ని మాటలు మాట్లాడుతున్నారు. మీరు అత్యంత ఆప్తులు కాబట్టి మీ ముందు చెప్తున్నాను. (భావోద్వేగంతో) సీబీఐని అడ్డుపెట్టుకుని జగన్ స్వతంత్రంగా ఎదగనీయకుండా చేసేందుకు సీబీఐని పావులా వాడుకుంటున్నారు. ఇందిరాగాంధీని హత్య చేసిన వారిని కూడా విచారణ జరిపిన తర్వాతే అభియోగాలు నమోదు చేశారు.

కోల్‌గేట్ కుంభకోణంలో ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు, మంత్రులు పేరాలకు పేరాలు మార్చినా చర్యలు లేవు’ అని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ‘పులివెందుల్లో తరతరాలుగా మా కుటుంబం ఉంటోంది. చంద్రబాబులా దోచుకోవడం, దాచుకోవడం తెలి యదు. ఆయనలా మా కుటుంబం రెండెకరాల స్థాయి నుంచి రాలేదు. వైఎస్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలోనే బెరైటీస్ వ్యాపారంలో అగ్రస్థానంలో ఉన్నాం.’ అని అన్నారు. పులివెం దుల్లో విద్యా సంస్థలు, ఆసుపత్రుల ద్వారా అందజేస్తున్న సేవలను ఈ సందర్భంగా విజయమ్మ ప్రస్తావించారు. జిల్లా నలుమూలల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరైన సమావేశంలో పార్టీ సీజీసీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్దన్, ప్రాంతీయ సమన్వయకర్త కేకే మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, గోనె ప్రకాశ్‌రావు, విజయారెడ్డి, జిల్లా కన్వీనర్ బట్టి జగపతి, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాశ్‌రావు, జహీరాబాద్, మెదక్ లోక్‌సభ నియోజకవర్గ పరిశీలకులు ఉజ్వల్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మనోజ్‌రె డ్డి చేరిక: 65వ నంబరు జాతీయ రహదారి మీదుగా మెదక్ జిల్లాలోకి ప్రవేశించిన విజయమ్మ ఇస్నాపూర్ చౌరస్తాలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. భారీ ర్యాలీ నడుమ జిల్లా కేంద్రం సంగారెడ్డికి వచ్చిన విజయమ్మ సమక్షంలో యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల మనోజ్‌రెడ్డి వైఎస్సార్ సీపీలో చేరారు. అనంతరం జోగిపేటకు చేరుకుని దివంగత సీఎం వైఎస్ విగ్రహాన్ని విజయమ్మ ఆవిష్కరించారు. 

Share this article :

0 comments: