ప్రచారం కోసం బాబులా పాకులాడం... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రచారం కోసం బాబులా పాకులాడం...

ప్రచారం కోసం బాబులా పాకులాడం...

Written By news on Wednesday, June 26, 2013 | 6/26/2013

26 అంశాలపై రెండో ప్లీనరీలో తీర్మానాలు
సీబీఐ పక్షపాత వైఖరి, కాంగ్రెస్-టీడీపీల కుమ్మక్కుపై చర్చ
ఆహ్వాన కమిటీ, ఇతర కమిటీల ఏర్పాటు

స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఒక్క రోజుకు పరిమితం: మైసూరారెడ్డి

సాక్షి, హైదరాబాద్ :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండవ ప్రజాప్రస్థానం (ప్లీనరీ) జూలై 8వ తేదీన నిర్వహించనున్నట్లు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ఎంవీ మైసూరారెడ్డి తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ వద్ద ఉదయం 9 గంటలకు ప్లీనరీ సమావేశం ప్రారంభమవుతుందన్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా రెండురోజుల ప్లీనరీని ఒక్కరోజుకు పరిమితం చేసినట్లు మైసూరారెడ్డి చెప్పారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ వ్యవహారాల సమన్వయకర్త పీఎన్వీ ప్రసాద్‌తో కలిసి ఆయన వివరాలు వెల్లడించారు. రాజకీయ, ఆర్థిక, ప్రజాసమస్యలతో పాటు మొత్తం 26 అంశాలపై ఈ సందర్భంగా తీర్మానాలు చేయనున్నట్టు తెలిపారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విషయంలో సీబీఐ వ్యవహరిస్తున్న పక్షపాతధోరణి, కాంగ్రెస్-టీడీపీ కుమ్మక్కై చేస్తున్న కుట్రలపై కూడా చర్చిస్తామన్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా పార్టీ అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందని, సంస్థాగత ఎన్నికల అధికారిగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యవహరించనున్నట్లు తెలిపారు.


తెలంగాణపై వైఎస్సార్‌సీపీది స్పష్టమైన వైఖరి

కొత్త రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాలు విభజించే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందని మైసూరా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరి చాలా స్పష్టంగా ఉందని, దీనిపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని కూడా కోరినట్లు గుర్తుచేశారు. తెలంగాణపై సాగుతున్న ఊహాగానాల గురించి తాను వ్యాఖ్యానించలేనన్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు కేంద్ర ప్రభుత్వం, అందులో కీలక పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ బాధ్యత వహించాలన్నారు. రాజకీయ అనిశ్చితి, పరిపాలన వైఫల్యానికి వందశాతం బాధ్యత కాంగ్రెస్ పార్టీదే అని చెప్పారు. ఇటువంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వం కొనసాగడంలో ప్రతిపక్షం బాధ్యత కూడా ఉంటుందని వివరించారు. ప్రధాన ప్రతిపక్షం పగటి వేషాలు వేస్తూ ప్రభుత్వాన్ని కాపాడుతోందని దుయ్యబట్టారు. అవిశ్వాసం పెట్టినప్పుడు ఆ పార్టీ ముందుకు రాలేదని విమర్శించారు.

ప్లీనరీకి ఆహ్వానితులు

సీజీసీ (కేంద్ర పాలక మండలి), సీఈసీ (కేంద్ర కార్యనిర్వాహక మండలి) సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్లమెంటు పరిశీలకులు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, రాష్ట్రస్థాయిలో వివిధ విభాగాల కమిటీలలో సభ్యులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, జిల్లాల కన్వీనర్లు, జిల్లాల స్టీరింగ్ కమిటీ సభ్యులు, జిల్లాల పరిశీలకులు, రాష్ట్ర అనుబంధ కమిటీల కన్వీనర్లు, సభ్యులు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, సింగిల్ విండో అధ్యక్షులు, మాజీ డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు, మున్సిపల్ పరిశీలకులు, మున్సిపల్ మాజీ చైర్మన్‌లు, కార్పొరేషన్ మాజీ మేయర్లు, మండల, మున్సిపల్, నగర డివిజన్ కన్వీనర్లు, జిల్లాల అనుబంధ విభాగాల కన్వీనర్లు, జిల్లాల అధికార ప్రతినిధులు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, పార్టీ సంస్థాగత (జిల్లాలు) ఎన్నికల అధికారులు ప్లీనరీలో పాల్గొంటారు. ఇలాఉండగా ప్లీనరీ కోసం ఆహ్వాన కమిటీ, ప్రాంగణ అలంకరణ కమిటీ, భోజన ఏర్పాట్ల కమిటీ, వసతి ఏర్పాట్ల కమిటీ, తీర్మానాల కమిటీ, సేవాదళం కమిటీ, మీడియా కమిటీ, సాంస్కృతిక కార్యక్రమాల కమిటీలను ఏర్పాటు చేసినట్టు మైసూరారెడ్డి తెలిపారు.

ప్రచారం కోసం బాబులా పాకులాడం

వైఎస్సార్ సీపీ వైద్య బృందం వారం రోజులుగా బాధితులకు సేవలందిస్తోంది

ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న యాత్రికులను ఆదుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పార్టీ అనుబంధ వైద్య విభాగం ఆధ్వర్యంలో వారం రోజులుగా డాక్టర్లు వైద్యసేవలు అందిస్తున్నట్లు ఎంవీ మైసూరారెడ్డి తెలిపారు. ఏ రాజకీయ పార్టీ బృందం కూడా వెళ్లలేని చోటు, వరదల వల్ల అత్యంత ప్రమాదకరంగా మారిన కేదార్‌నాథ్‌కు కూడా తమ వైద్య బృందం వెళ్లి సహాయ చర్యలు నిర్వర్తిస్తోందని వివరించారు. వైఎస్సార్‌సీపీ వైద్య బృందంతో తాము చర్చిస్తూ పరిస్థితిని తెలుసుకుంటున్నామని, వారి సూచన మేరకు కొందరు వాలంటీర్లను కూడా పంపించాలని నిర్ణయించినట్టు తెలిపారు.

అయితే తాము ప్రచారం కోసం పాకులాడటంలేదని, మీడియాలో కనిపించి కాసేపు హడావుడి చేయాలనే దౌర్భాగ్యమైన ఆలోచన లేదని స్పష్టంచేశారు. కొందరు నేతల మాదిరిగా డెహ్రాడూన్ వెళ్లి డ్రామాలు చేయలేదని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రకృతి వైపరీత్యాలను కూడా రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు. టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు వరద బాధితులకు ఢిల్లీ నుంచి విమాన సౌకర్యం కల్పించడాన్ని విలేకరులు ప్రస్తావించగా.. వ్యాపారవేత్తలు, డబ్బున్నవారు అలాంటి సౌకర్యం కల్పించడంలో తప్పులేదని మైసూరా బదులిచ్చారు. అయితే ఎక్కడ సమస్య ఉందో అక్కడ సహాయం చేయడమే గొప్పతనమవుతుందన్నారు. ప్రస్తుతం సైన్యం చేస్తున్న పని అతి క్లిష్టమైనదని, దీన్ని ప్రతి ఒక్కరూ అభినందించాలని పేర్కొన్నారు. అంతకు ముందు విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఏవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు తన అమెరికా పర్యటనను మభ్యపెట్టేందుకు చీప్ ట్రిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. మానవతను మరిచి ప్రచారం కోసం బాబు చేస్తున్న ప్రయత్నాలు సిగ్గుచేటని దుయ్యబట్టారు.

Share this article :

0 comments: