స్థానిక ఎన్నికలకు శ్రేణుల సమాయత్తమే లక్ష్యం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » స్థానిక ఎన్నికలకు శ్రేణుల సమాయత్తమే లక్ష్యం

స్థానిక ఎన్నికలకు శ్రేణుల సమాయత్తమే లక్ష్యం

Written By news on Tuesday, June 18, 2013 | 6/18/2013

జూలై 3 వరకు తొమ్మిది జిల్లాలో సభలు
జూలై 8న ఇడుపులపాయలో రెండో ప్లీనరీ
షర్మిల పాదయాత్ర ముగింపు చోట పైలాన్
బోడ జనార్ధన్ నిర్ణయం వెనుక వ్యక్తిగత ఎజెండా 
ఎవరితోనూ ఎలాంటి ఒప్పందాలూ కుదుర్చుకోలేదు
స్పష్టం చేసిన వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ 

సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఈ నెల 25వ తేదీ నుంచి తెలంగాణ జిల్లాల్లో పర్యటించనున్నారు. సోమవారం జరిగిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ విజయమ్మ పర్యటన కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను, నేతలను ఉత్తేజపర్చేందుకు విజయమ్మ ఈ పర్యటన చేపట్టారని చెప్పారు. ఈనెల 25న మెదక్, 26న నల్లగొండ, 27న మహబూబ్‌నగర్, 28న ఖమ్మం (భద్రాచలం), 29న రంగారెడ్డి, 30న కరీంనగర్, జూలై 1న వరంగల్, 2న అదిలాబాద్, 3న నిజామాబాద్ జిల్లాల్లో విజయమ్మ సభలు ఉంటాయని వివరించారు. కరీంనగర్ జిల్లా పర్యటనలో విజయమ్మ రామగుండం, ఎల్లంపల్లి ప్రాజెక్టులను కూడా సందర్శిస్తారని తెలిపారు. 

ఎల్లంపల్లి వద్ద బహిరంగ సభ కూడా ఉంటుందన్నారు. విజయమ్మ పర్యటన సందర్భంగా జరిగే సభలకు ఆయా జిల్లాల పార్టీ అడహక్ కమిటీ కన్వీనర్లు, స్టీరింగ్ కమిటీ సభ్యులు, పార్లమెంటు పరిశీలకులు, సీజీసీ, సీఈసీ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని బాజిరెడ్డి విజ్ఞప్తి చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ జిల్లాల్లో ఓదార్పుయాత్రను గతంలో చేపట్టలేకపోయారని, షర్మిల కూడా కొన్ని జిల్లాల్లో పాదయాత్ర చేయలేదని, ఈ నేపథ్యంలో విజయమ్మ ప్రస్తుత పర్యటనల ప్రాధాన్యతను శ్రేణులు గుర్తించాలని కోరారు. జూలై 8వ తేదీన వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ వద్ద పార్టీ రెండో ప్లీనరీ జరుగుతుందన్నారు. పార్టీ నేతలంతా తమ ప్రాంతాల్లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొనాల్సి ఉన్నందున ప్లీనరీని ఒకరోజు పాటే నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. 

షర్మిల యాత్ర పైలాన్: జగన్ సోదరి షర్మిల ఇడుపులపాయ నుంచి చేపట్టిన పాదయాత్ర 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకుని ఇచ్ఛాపురం చేరుకోవడంతో ముగుస్తుందని బాజిరెడ్డి చెప్పారు. యాత్ర ముగింపు సందర్భంగా అక్కడ ఒక పైలాన్‌ను నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా ఇచ్ఛాపురంలో తన పాదయాత్రను ముగించారని, అక్కడ ఒక పైలాన్ ఉందన్నారు. అదే విధంగా షర్మిల యాత్ర ముగింపు సందర్భంగా కూడా నిర్మిస్తామని చెప్పారు. యాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభను ఎక్కడ నిర్వహించాలన్న అంశంపై నిర్ణయం తీసుకోలేదన్నారు. ఆమె యాత్ర జూలై ఆఖరుకు ముగిసే అవకాశాలున్నాయని, పీఏసీ మరోసారి సమావేశంలో సభాస్థలిపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. 

బోడ జనార్ధన్ వ్యక్తిగత ఎజెండా ఏమిటో....!

అదిలాబాద్‌కు చెందిన బోడ జనార్ధన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడటంలో ఆయన వ్యక్తిగత ఎజెండా ఏదో ఉందని బాజిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఉండటం, వెళ్లిపోవడం అనేది జనార్ధన్ ఇష్టమని, అయితే వెళుతూ వెళుతూ తమ పార్టీపైనా, తమ నాయకుడిపైనా బురద జల్లడం ఏ మాత్రం సరికాదని తప్పుబట్టారు. జనార్ధన్‌ను బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వకర్తగా పార్టీ నియమించిందని, పెద్దపల్లి లోక్‌సభ స్థానాన్ని కూడా ఇవ్వడానికి జగన్ సుముఖంగా ఉన్నా ఆయన వెళ్లిపోయారని చెప్పారు. బహుశా ఆయనకు పార్టీ టికెట్‌తో పాటుగా ఇంకేదో అదనంగా ఇస్తామని కాంగ్రెస్ నుంచి హామీ లభించి ఉండొచ్చని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. టీఆర్‌ఎస్‌తో తమ పార్టీ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుందన్న అనుమానాన్ని ఖండించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎవరితోనూ ఒప్పందం కుదుర్చుకోలేదని, ఒంటరిగా పోరాటం చేస్తోందని చెప్పారు. పార్టీలో ఉన్నత వర్గాలకు వత్తాసు పలుకుతున్నారని సోయం బాపూరావు చేసిన విమర్శలను కూడా బాజిరెడ్డి ఖండించారు. బోథ్ గిరిజన నియోజకవర్గం అనీ, ఇక అక్కడ ఉన్నత వర్గాలకు వత్తాసు పలకడం అనే ప్రశ్న ఎక్కడినుంచి ఉత్పన్నం అవుతుందని ప్రశ్నించారు. వారిద్దరూ తమపై వేసిన అభాండాలు, ఆరోపణలను ప్రజలకే వదలి వేస్తున్నామని ఆయన చెప్పారు. 

యాత్రికులను రక్షించాలి: కాశీ యాత్రకు వెళ్లి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో వరదల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని పీఏసీ సమావేశం డిమాండ్ చేసిందని బాజిరెడ్డి తెలిపారు. ఆపదలో ఉన్న వారందరినీ తక్షణమే రక్షిం చి వారిని స్వస్థలాలకు తరలించే బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. విజయమ్మ నివాసంలో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో వై.ఎస్.విజయమ్మ, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, డీఏ సోమయాజులు, ఎంవీ మైసూరారెడ్డి, భూమా శోభానాగిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారని ఆయన తెలిపారు. 
Share this article :

0 comments: