ఒప్పందం బాబుది.. భూములిచ్చింది రోశయ్య.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఒప్పందం బాబుది.. భూములిచ్చింది రోశయ్య..

ఒప్పందం బాబుది.. భూములిచ్చింది రోశయ్య..

Written By news on Wednesday, June 26, 2013 | 6/26/2013



దాన్ని పట్టుకుని టీడీపీ యాగీ... ఐఎంజీపై దృష్టిని పక్కదోవ పట్టించటమే లక్ష్యం
బాబు ఇరకాటాన్ని అర్థం చేసుకుని రామోజీ రంగంలోకి
కృష్ణపట్నం ఇన్‌ఫ్రాటెక్‌కు భూ కేటాయింపులపై రాతలు
దానికోసం 1996లోనే నాట్కోతో చంద్రబాబునాయుడు ఎంఓయూ
పరిస్థితులు అనుకూలించక పక్కనబెట్టిన నాట్కో
అప్పటికి నాట్కో కేవలం ఫార్మా కంపెనీనే.. టర్నోవర్ రూ. 35 కోట్లు
అయినా దానికి పోర్టు; ఐదు నెలలకే ఇండస్ట్రియల్ పార్కు
పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేయలేక నాట్కో వెనుకంజ
2008లో నవయుగతో కలిసి ఇన్‌ఫ్రాటెక్ ఏర్పాటు.. డీపీఆర్, అధ్యయన నివేదిక రూపకల్పన
వాటన్నిటినీ ప్రజెంట్ చేయటంతో సరేనన్న వైఎస్.. ఏపీఐఐసీ భూ సేకరణకు వీలుగా జీవోలు
వైఎస్ మరణించాకే ఆ భూమిని కేటాయించిన ఏపీఐఐసీ
రెండు విడతలుగా 4,737 ఎకరాల కేటాయింపు.. అన్నీ వదిలి వైఎస్ టార్గెట్‌గా వింత రాతలు


ఒక బోగస్ కంపెనీకి 950 ఎకరాలు ఎలా ఇచ్చారంటూ అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ నిలదీసింది. చర్చకు పట్టుబట్టింది. కోర్టులో సైతం ఈ కంపెనీకి భూమి కేటాయించిన తీరుపై విచారణ నిర్ణయాత్మక దశకు చేరుకుంది. ఇది చంద్రబాబును, ఆయన మిత్ర పరివారాన్ని కలవరపెట్టింది. రామోజీ రంగంలోకి దిగారు. అశ్శరభ శరభంటూ... కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సిటీకి భూమి కేటాయించటంపై శివాలెత్తారు. వైఎస్సార్‌పై బురదజల్లి జనం దృష్టిని మళ్లించాలనుకున్నారు. కానీ... అది కూడా బాబు పెట్టిన పుట్టేనని, ఇప్పుడొస్తున్న పాములన్నీ నాటివేనని స్పష్టంగా తెలుస్తున్నా, టీడీపీ సైతం ఆ పాటకు తలాడిస్తుండటమే ఈ కుట్రలోని అసలు కోణం. బాబు చేసుకున్న ఒప్పందం ప్రకారం... వైఎస్సార్ తరవాత వచ్చిన ముఖ్యమంత్రులు భూములు కేటాయిస్తే... దాన్ని వైఎస్‌కు అంటగడుతూ దుష్ర్పచారానికి తెరతీయటమే ఇక్కడ అసలు రాజకీయం. ఎంఓయూ చేసుకున్నదొకరు. భూములు కేటాయిస్తూ అగ్రిమెంట్ చేసుకున్నదొకరు. అలా అగ్రిమెంట్ చేసుకోవటంతో పాటు వారే ఆ భూముల్ని విక్రయించి రిజిస్ట్రేషన్ కూడా చేయించేశారు. కానీ ఈ రాష్ట్ర ప్రజలకు సుద్దులు చెప్పడానికే పుట్టాననుకునే రామోజీరావుకు ఇవేవీ పట్టవు. ఇవేవీ అవసరం లేదు కూడా.

సదరు ఎంఓయూ మేరకు భూములు కేటాయించాలని నిర్ణయం తీసుకోవటమే రామోజీ దృష్టిలో ఘోరంగా.. నేరంగా.. పాపంగా కనిపిస్తోంది. కారణం ఒక్కటే. ఆ నిర్ణయం తీసుకున్నది వై.ఎస్.రాజశేఖరరెడ్డి. ప్రతిక్షణం వైఎస్సార్ కుటుంబంపై విషం గక్కటమే లక్ష్యంగా బతుకుతున్న రామోజీకి ఈ నిర్ణయం తప్పనిపించింది. అందుకే తాను పత్రికల్లో పతాక శీర్షికల్లో రాయటమే కాక... గత కొద్ది రోజులుగా తన తెలుగుదేశం మిత్రులను ఉస్కో అంటూనే ఉన్నారు. వారు కూడా రామోజీ చెప్పిందే తడవుగా ఈ వ్యవ హారంపై ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు. అసలు కృష్ణపట్నం ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ (కేపీఐఎల్)కు సంబంధించిన వాస్తవాలేంటి? దానితో ఎంఓయూ చేసుకున్నదెవరు? భూములు కేటాయించిందెవరు? సేల్‌డీడ్ ఒప్పందం చేసుకున్నదెవరు? రిజిస్ట్రేషన్ చేయించిందెవరు? నిజంగా ‘ఈనాడు’ చెబుతున్నట్టు ఈ కేపీఐఎల్‌తో ఎలాంటి ఎంఓయూ లేదా? భూ కేటాయింపునకు ఎలాంటి జీవోలూ విడుదల కాలేదా? వీటిల్లో ‘‘ఏది నిజం?’’
- సాక్షి ప్రత్యేక ప్రతినిధి

ఆది నుంచీ గురివింద తీరే..
రామోజీరావు నీతులు చెప్పడానికే ఉన్నారు. అవేవీ ఆయనకు వర్తించవు. ఎందుకంటే మద్య నిషేధ ఉద్యమాన్ని హైజాక్ చేసి మరీ నడిపించిన ఉద్యమకారుడు. తన ఫిలిం సిటీ కోసం దాన్ని ఎత్తివేయించడమే కాదు.. ఇప్పుడు అక్రమంగా మద్యం అమ్మటానికీ అలవాటు పడ్డారు. ఇక భూ కబ్జాలంటూ వెర్రెత్తిపోయే రామోజీది.. తన బంధువుల భూముల్నే కబ్జా చేసిన చరిత్ర. లీజుకు తీసుకున్న భూమిని ప్రభుత్వానికి ధారాదత్తం చేసేసి... ప్రతిగాా ఇచ్చిన భూమిని సొంత ఖాతాలోకి వేసుకున్న ఘనుడు. ఆఖరికి ఫోర్జరీ సంతకాలకు సైతం పాల్పడి చీటింగ్ కేసు ఎదుర్కొంటున్న ‘చిట్’ వ్యాపారి. అంతేకాదు!! నాయకుల బినామీలంటూ రాతలతో చెలరేగిపోయే ఈ పత్రికాధిపతి... తన ఫిలిం సిటీ సౌధాలన్నిటినీ బినామీల పేరిట కొన్న భూముల్లోనే కట్టారన్నది తెలియని విషయమేమీ కాదు. ఇంత నలుపును పెట్టుకున్న రామోజీకి ఎదుటివారిపై అన్యాయంగా బురద జల్లాలనిపించటమే అన్నిటికన్నా చిత్రం.

నాట్కోతో బాబు నాటకం..
కృష్ణపట్నంలో మొదట పోర్టు ప్రాజెక్టు కోసం నాట్కో ఫార్మా కంపెనీతో 1996 మార్చి 10న ఒప్పందం చేసుకున్నది చంద్రబాబు నాయడు. అసలు ఒక ఫార్మా కంపెనీకి పోర్టును అప్పగించాలన్న ఆలోచన రావటమే బాబు మార్కు రాజకీయంగా చెప్పుకోవాలి. అప్పటికి కేవలం రూ.35 కోట్ల టర్నోవర్ ఉన్న నాట్కో ఫార్మా కంపెనీ.. ఈ పోర్టును ఎలా నిర్మిస్తుందో, ఎలా నడిపిస్తుందో అన్న ఆలోచన కూడా బాబుకు రాలేదంటే లోగుట్టును అర్థం చేసుకోక తప్పదు. కొన్ని విదేశీ కంపెనీలతో కలిసి నాట్కో కన్సార్షియంగా ముందుకు రావటం.., కృష్ణపట్నం పోర్టుకు పచ్చజెండా ఊపేసి బాబు వెనకా ముందూ చూడకుండా భూములు కట్టబెట్టడం వేగంగా జరిగిపోయాయి.

పోనీ అంతటితో ఊరుకున్నారా అంటే అదీ లేదు. మార్చిలో పోర్టు కోసం ఒప్పందం చేసుకున్న నాట్కో అధిపతి నన్నపనేని చౌదరి.. ఐదు నెలలు కూడా గడవక ముందే మరో ప్రతిపాదనతో బాబు ముందుకొచ్చారు. అక్కడ పోర్టు వస్తోంది కనక పోర్టు ఆధారిత పరిశ్రమల కోసం ఏపీఐఐసీతో కలిసి మెగా ఇండస్ట్రియల్ సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. దీనిక్కూడా బాబు సరేనని తలూపేశారు. అసలే అది ఫార్మా కంపెనీ. అప్పటిదాకా దానికి ఇన్‌ఫ్రా రంగంలో అనుభవమేదీ లేదు. ఇచ్చిన పోర్టు పనులకు ఇంకా టెంకాయ కొట్టనే లేదు. మరి అంత హడావుడిగా ఇండస్ట్రియల్ సిటీకి కూడా పచ్చజెండా ఊపాల్సిన అవసరం ఎందుకొచ్చిందన్నది బాబుకు, రామోజీకి మాత్రమే తెలిసిన రహస్యం. ఎందుకంటే ఈ మెగా ఇండస్ట్రియల్ సిటీ కోసం అదే ఏడాది ఆగస్టు 12న నాటి చంద్రబాబునాయుడి ప్రభుత్వం ఎంఓయూ చేసుకోగానే.. ఆ దెబ్బతో రాష్ట్ర పారిశ్రామిక ముఖచిత్రమే మారిపోబోతోందంటూ ‘ఈనాడు’ ఊదరగొట్టేసింది. రామోజీ మార్కు కథనాలను కుమ్మేసింది.

ఆ ఎంఓయూలో.. మెగా ఇండస్ట్రియల్ సిటీ కోసం ఆరు నెలల్లో నాట్కో సంస్థ డీటెయిల్డ్ ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను తయారు చేయాలంటూనే.. ఆ సిటీ నిమిత్తం పోర్టు చుట్టుపక్కల ఉన్న స్థలాలను ఏపీఐఐసీ సేకరిస్తుందని కూడా స్పష్టంగా పేర్కొన్నారు. ఈ పార్కులో ఏమేం ఉంటాయో, దాన్లోని భూముల్ని పరిశ్రమలకు ఎలా కేటాయించాలో వివరంగా రాసేసుకున్నారు. పర్యావరణ అంశాలను పరిశీలించటంతో పాటు సరిపోయేంత స్థలాన్ని, తగిన పరిశ్రమలను గుర్తించటం, ఆయా పరిశ్రమలకు అనుబంధంగా ఏఏ తరహా పరిశ్రమలు రావాలో అధ్యయనం చేయటం, వివిధ రకాల పరిశ్రమలకు అన్ని అంశాలనూ దృష్టిలో పెట్టుకుని తగిన స్థలాలను, ప్లాట్లను కేటాయించటం వంటివన్నీ ఎంఓయూలో స్పష్టంగా వివరించారు.

వైఎస్ మరణించాకే భూముల అప్పగింత..
కృష్ణపట్నం పోర్టు ఇన్‌ఫ్రాటెక్‌కు ఇప్పటిదాకా అప్పగించిన భూమి 4,731 ఎకరాలు. దీన్లో ఒక్క ఎకరం కూడా వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గానీ, ఆయన జీవించి ఉండగా గానీ కేపీఐఎల్‌కు ఇవ్వలేదన్నది ఇక్కడ గమనార్హం. మొత్తం భూమి ఆయన మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలే ఆ కంపెనీకి దఖలు పరిచాయి. తేదీలతో సహా చూసినట్లయితే.. 2009 సెప్టెంబర్ 23న (వైఎస్ మరణించిన 21 రోజులకు) 2,682 ఎకరాలను ఎకరా రూ.1.15 లక్షల చొప్పున కేటాయిస్తూ ఏపీఐఐసీ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి అదే నెల 28న సేల్ అగ్రిమెంట్‌ను, సేల్ డీడ్‌ను రిజిస్ట్రేషన్ కూడా చేసింది.

ఆ తరువాత 2010 సెప్టెంబర్ 10న మరో 2,048 ఎకరాలను కేటాయిస్తూ ఏపీఐఐసీ ఉత్తర్వులిచ్చింది. వీటిలో 1,727 ఎకరాలుగా పట్టా భూములకు ఎకరా రూ.4,47,000 చొప్పున, 321 ఎకరాలుగా ఉన్న ప్రభుత్వ భూములకు మాత్రం ఎకరాకు రూ.1.15 లక్షలు చొప్పున చెల్లించాలని కోరారు. ఈ మేరకు అదే నెల 15న సేల్ అగ్రిమెంట్ చేసుకోవటం.. అదే రోజున సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ కావటం కూడా జరిగిపోయాయి. ఇలా రెండు విడతలుగా మొత్తం 4,731 ఎకరాలను అప్పగించారు.

చిత్రమేంటంటే ఈ భూమిని ఏపీఐఐసీకి రెవెన్యూ శాఖ అప్పగించే నిమిత్తం జీవోలు కూడా జారీ అయ్యాయి. ఇక ఏపీఐఐసీ ఏ సంస్థకు భూమి కేటాయించినా జీవోలు జారీ చేయటమన్నది ఉండదు. ఇక్కడా అదే జరిగింది. ఈ మొత్తం భూమిని వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించాకే రెండు విడతలుగా కేటాయించింది. మరి దీన్లో వైఎస్సార్ పాత్ర ఎక్కడుంది? ఎంఓయూ కుదుర్చుకోవటంలోనా? లేక భూమి కేటాయించడంలోనా? ఈ రెండూ ఆయనకు సంబంధం లేకుండా జరిగినప్పుడు ఇక ఆయన పాత్ర ఎక్కడుంది? ఒక్క రామోజీకి, తెలుగుదేశానికి మాత్రమే వైఎస్సార్ తప్పు చేసినట్లు కనిపిస్తుండటంలో అర్థమేంటి? ఇదంతా ఐఎంజీ భూముల కేటాయింపుపై జనం దృష్టిని పక్కదోవ పట్టించడానికి కాదా? బాబు బాగోతం బయటపడకుండా ఆయన్ను ఆదుకోవటానికి కాదా? ఒకవైపు ఐఎంజీ వ్యవహారంపై కోర్టు విచారణ నిర్ణయాత్మక దశను చేరుకోవటం.. దానిపై చర్చ జరపాలంటూ వివిధ పక్షాల ఎమ్మెల్యేలు పట్టుబట్టడం.. ఇదే సమయంలో కావాలని ‘ఈనాడు’ కృష్ణపట్నం వ్యవహారాన్ని రాయటం.. దానికి తెలుగుదేశం తందానతాన పలకటం.. ఇదంతా సియామీ కవలలు రామోజీ-చంద్రబాబు ఆడుతున్న డ్రామాలు కావా?

నవయుగతో కలిసి ముందుకు..
చంద్రబాబునాయుడి ప్రభుత్వంతో చేసుకున్న ఎంఓయూ ప్రకారం నాట్కో సంస్థ ముందుకెళ్లాల్సి ఉన్నా, దానికి అంత శక్తి లేకపోవటంతో ప్రాజెక్టు ముందుకు కదల్లేదు. 2004 వరకూ మిన్నకున్నా.., ఆ ఏడాది మాత్రం సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) అమలు చేయటానికి సిద్ధంగా ఉందంటూ ఏపీఐఐసీకి నాట్కో ఒక లేఖ రాసింది. ఆ తరువాత తన భాగస్వామిగా ఇన్‌ఫ్రా రంగంలో అనుభవమున్న నవయుగ సంస్థను చేర్చుకుని కృష్ణపట్నం ఇన్‌ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ (కేపీఐఎల్)ను ఏర్పాటు చేసింది. ఇది సీబీ రిచర్డ్ ఎల్లిస్ సంస్థ చేత సవివర మార్కెట్ అధ్యయన నివేదికను తయారు చేయించటంతోపాటు.., మహీంద్రా కన్సల్టింగ్ ఇంజినీర్స్ లిమిటెడ్ చేత ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను, ప్రాజెక్ట్ నివేదికను కూడా తయారు చేయించింది.

వీటన్నిటినీ పరిశీలించిన మీదట.. 2008 మార్చి 27న జరిగిన సమావేశంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పారు. ఏపీఐఐసీ ద్వారా కృష్ణపట్నం ఇన్‌ఫ్రాటెక్‌కు భూమిని అప్పగించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా నెల్లూరు జిల్లా కలెక్టర్‌ను కోరాలని ఈ సమావేశం మినిట్స్‌లో కూడా పేర్కొన్నారు. ఆ తరువాత నాలుగైదు సార్లు సమీక్ష సమావేశాల్లో ఈ అంశం చర్చకు రావటం.., పనితీరును సమీక్షించటంతో పాటు.. సెజ్ స్థాయి కోసం కేపీఐఎల్ పెట్టిన దరఖాస్తును ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. 2009 జూన్‌లో కేంద్ర ప్రభుత్వం సెజ్ హోదాకు సూత్రప్రాయంగా అనుమతించింది. ఆ తరువాత తుది అనుమతి కోసం 2009 డిసెంబర్లో నవయుగ సంస్థ (అప్పటికి వైఎస్ మరణించి మూడు నెలలవుతోంది) రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దరఖాస్తు చేయటం.., 2010 మార్చిలో కేంద్ర ప్రభుత్వం లాంఛనంగా అనుమతించటం జరిగాయి.

బాబు చేస్తే బాగున్నట్టేనా?
శ్రీమంతుల విల్లాలు, క్రీడల కోసం ఎమ్మార్ సంస్థకు 534 ఎకరాలు కట్టబెట్టినా, విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్ని తీసుకుని మరీ గంగవరం పోర్టుకు ధారాదత్తం చేసినా... సవ్యంగా నడుస్తున్న కాకినాడ పోర్టును కావాలని ప్రైవేటుకిచ్చేసినా.. ఎల్ అండ్ టీకి నాలుగు వేల ఎకరాలను పప్పుబెల్లాల్లా కట్టబెట్టేసినా, ఒక ఎయిర్‌పోర్టు ఉండగానే మరో ఎయిర్‌పోర్టు నిమిత్తం జీఎంఆర్‌కు 5 వేల ఎకరాలు అప్పగించినా.. ఐఎంజీలాంటి బోగస్ కంపెనీకి, రహేజాలకు భారీగా భూములు కట్టబెట్టినా అప్పట్లో అది ‘ఈనాడు’కు మహోన్నతమైన అభివృద్ధిలా కనిపించింది. ఎందుకంటే ఆ కేటాయింపులు చేసింది చంద్రబాబునాయుడు కాబట్టి. అంతెందుకు..!! ఇదే కృష్ణపట్నం పోర్టు కోసం 1996లో నాట్కోతో చంద్రబాబు ఎంఓయూ కుదుర్చుకున్నపుడు రాసిన రాతల్ని రామోజీ మరిచిపోయారా? ఇక రాష్ట్రమంతటా అభివృద్ధి వెలుగులేనంటూ కీర్తించిన తీరు పాఠకులకు గుర్తులేదనుకుంటారా?

ఐఏఎస్‌ల విషయంలోనూ అవే ప్రమాణాలు..
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో స్పెషల్ సెక్రటరీగా ఉన్న ఐఏఎస్ అధికారి ప్రభాకరరెడ్డి పదవీ విరమణ పొందిన రెండు నెలలకే కేపీఐఎల్‌లో మేనేజింగ్ డెరైక్టర్‌గా చేరటం కూడా ‘ఈనాడు’కు తప్పుగానే కనిపించింది. కానీ చంద్రబాబునాయుడి హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగా పనిచేసి, ఆ తరవాత స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని మరీ నేరుగా చంద్రబాబుకే చెందిన హెరిటేజ్ ఫుడ్స్‌లో ప్రెసిడెంట్‌గా చే రారు ఐఏఎస్ అధికారి ఎం.సాంబశివరావు. అలాగే బాబు హయాంలో సీఎంఓలో పనిచేసిన కె.వి.రావు సైతం మరో కార్పొరేట్ కంపెనీలో చేరారు. చిత్రమేంటంటే అప్పట్లో ‘ఈనాడు’కు ఇవన్నీ ఒప్పులుగానే కనిపించాయి. కార్పొరేట్ రంగం ఐఏఎస్‌లను ఆకర్షిస్తోందంటూ పెద్ద ఎత్తున కథనాలు సైతం ప్రచురితమయ్యాయి. కానీ వైఎస్సార్ విషయానికొచ్చేసరికి మాత్రం రామోజీకి, ఆయన విషపుత్రిక ‘ఈనాడు’కు అన్నీ తప్పులుగానే కనిపిస్తున్నాయి. అదే విచిత్రం.
- See more at: http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=64641&Categoryid=1&subcatid=1#sthash.mzwi8LiM.dpuf
Share this article :

0 comments: