రైతులంటే ఈ సర్కారుకు పగా, చిన్న చూపా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైతులంటే ఈ సర్కారుకు పగా, చిన్న చూపా?

రైతులంటే ఈ సర్కారుకు పగా, చిన్న చూపా?

Written By news on Sunday, June 30, 2013 | 6/30/2013

- మరో ప్రజాప్రస్థానంలో షర్మిల వినతి
- రైతులంటే ఈ సర్కారుకు పగా, చిన్న చూపా?
- కమిషన్ సిఫార్సు చేసినా మద్దతు ధర పెంచడం లేదు
- అన్నదాత నడ్డి విరిచిన దుర్మార్గం చంద్రబాబుది

మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘కొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మరికొన్ని నెలల్లో సాధారణ ఎన్నికలు కూడా రానున్నాయి. ఓటు అన్నది మీ చేతిలో ఉన్న ఆయుధం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మీరు వేసే ప్రతి ఓటూ జగనన్న బయటికి రావడానికి బాటలు వేస్తుంది. టీడీపీ, కాంగ్రెస్‌లకు గట్టిగా బుద్ధి చెప్పి జగనన్నను ఆశీర్వదించిన రోజున, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మీరు గెలిపించిన రోజున రాజన్న రాజ్యం మళ్లీ వస్తుంది’’ అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా ఆమె చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో సాగింది. చోడవరంలో భారీగా తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే...

‘‘సామాన్యుల నడ్డి విరవడానికి కేంద్రం మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది. పెట్రోల్ ధరలు పెరిగాయంటే త్వరలోనే ఆర్టీసీ బస్సు చార్జీలు, కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. వరికి మద్దతు ధరను కేంద్రం తాజాగా కేవలం రూ 60 పెంచింది. కనీసం 5 శాతం పెంపు కూడా కాదన్నమాట. ఇక గ్యాస్‌కు చెల్లించాల్సిన మొత్తాన్ని రెట్టింపు చేస్తున్నట్టు ప్రకటించింది. గ్యాస్ ధరలు పెరగడం వల్ల మళ్లీ కరెంటు చార్జీలు, ఎరువుల ధరలు, వంట గ్యాస్ ధరలు పెరగనున్నాయి. ఈ నాలుగేళ్లలో వ్యవసాయంపై పెట్టుబడి ఖర్చులు చాలా పెరిగాయి. ఎరువుల ధరలు 300 శాతం నుంచి 800 శాతం దాకా పెరిగాయి. విత్తనాల ధరలు పెరిగాయి. రవాణా చార్జీలు పెరిగాయి. కానీ మద్దతు ధర మాత్రం పెరగలేదు. ఇక రైతులు నష్టపోరా? ఏ పంటకూ మద్దతు ధర పెరగాల్సినంత పెరగలేదు. 

దాన్ని కనీసం కమిటీలు సిఫార్సు చేసిన మేరకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెంచడం లేదు. వీళ్లకు రైతులంటే పగా? లేకుంటే చిన్న చూపా?’’ ‘‘రైతన్న నెల సగటు ఆదాయం కేవలం రూ. 1600 మాత్రమే అని అర్జున్‌సేన్‌గుప్తా కమిషన్ తెలిపింది. ఒక క్వింటాల్ ధాన్యం పండించాలంటే రూ. 1,638 ఖర్చవుతోందని చె ప్పింది. కానీ రాష్ట్రంలో వరి మద్దతు ధర కేవలం రూ.1,250. పెంచిన 5 శాతం కలిపినా రూ.1,310. ఈ లెక్కన రైతన్న క్వింటాల్‌కు కనీసం రూ.328 నష్టపోతున్నాడు. గిట్టుబాటు కావాలంటే మద్దతు ధరను కనీసం రూ.2,102కు పెంచాలని కమిటీ సిఫార్సు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. నష్టాల పాలై అన్నదాత ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించింది. వరి వేసుకోవడం కంటే ఉరేసుకోవడం మేలనే పరిస్థితికి తెచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మద్దతు ధర పెంచాలంటూ కోనసీమ రైతులు 1.2 లక్షల ఎకరాల్లో పంటలు వేయకుండా సాగు సమ్మె చేసి నిరసన తెలిపినా దున్నపోతు మీద వాన చందంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చలనం కలగలేదు. అసలీ ప్రభుత్వానికున్నది మనసా, బండరాయా అర్థం కావడం లేదు. రైతులు మాత్రమే గాక అన్ని వర్గాల వారూ కష్టాలపాలవుతున్నారు.

ఇదీ చంద్రబాబు ‘ఘనత’...
చంద్రబాబు ఎనిమిదేళ్ల ఎనిమిది నెలలు ముఖ్యమంత్రిగా ఉండి 8సార్లు కరెంటు చార్జీలు పెంచారు. రూ 50 ఉన్న హార్స్‌పవర్ చార్జీని రూ.625 చేశారు. కరెంటు బిల్లులు కట్టని రైతులను శిక్షించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టారు. ఏటా కరెంటు చార్జీలు పెంచుతానంటూ ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం పెట్టుకున్న దుర్మార్గపు ముఖ్యమంత్రి ఆయన. పల్లెల్లో ప్రజలు పడుతున్న కష్టాలను తన పాదయాత్రలో కళ్లారా చూసి కూడా వారి పక్షాన నిలబడలేదు. కిరణ్ సర్కారు పెంచిన కరెంటు చార్జీలకు నిరసనగా ప్రతిపక్ష పార్టీలు పెట్టిన అవిశ్వాసానికి మద్దతివ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి రక్షణగా నిలిచి, అది కూలిపోకుండా కాపాడిన ఘనుడు చంద్రబాబుగారు. చీకట్లో చిదంబరాన్ని కలిసి, తన అవినీతిపై విచారణ జరపకుండా కాంగ్రెస్‌తో చీకటి ఒప్పందాలు చేసుకున్న చరిత్ర హీనుడిగా మిగిలారు.

జగనన్న త్వరలో వస్తాడు
జగనన్నను ఆపే శక్తి కాంగ్రెస్, టీడీపీలకు లేదు. త్వరలోనే జగనన్న బయటికి వస్తారు. రాజన్న రాజ్యాన్ని నిర్మించే దిశగా మనందరినీ నడిపిస్తారు. రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మన విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్, పేదల కోసం ఆరోగ్యశ్రీ పథకాలను నిలబెడతారు. వృద్ధులకు, వితంతువులకు పింఛను రూ.700 అవుతుంది. వికలాంగులకైతే రూ.1,000 అవుతుంది. మన అక్కాచెల్లెళ్లు పిల్లలను చదివించుకునేలా ప్రోత్సహించడం కోసం ఇద్దరు పిల్లలకు పదో తరగతి దాకా ఒక్కొక్కరికి నెలకు రూ.500 చొప్పున ఏడాదికి రూ.6 వేలు అమ్మ ఖాతాలోనే పడుతుంది. ఇంటర్ చదివితే రూ.8,400, డిగ్రీ చదివితే రూ. 12,000 అమ్మ ఖాతాలోనే పడతాయి. అంతకంటే పెద్ద చదువులు చదివే వారికి రీయింబర్స్‌మెంటు పథకం ఉండనే ఉంది. రాష్ట్రంలో గుడిసె అనేదే లేకుండా ప్రతి నిరుపేదకూ పక్కా ఇల్లు కట్టిస్తారు. పేదవాళ్లు కూడా ఎప్పటిలాగే ధీమాగా పెద్దాసుపత్రికి వెళ్లి ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం చేయించుకునే రోజులు మళ్లీ వస్తాయి. వైఎస్సార్ హామీ ఇచ్చినట్టు ప్రతి పేద కుటుంబానికీ నెలకు 30 కిలోల బియ్యం ఇస్తారు. ఆ రోజు వచ్చేదాకా మీరంతా జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్సార్ సీపీని బలపరచాలని, మాతో కలిసి కదం తొక్కాలని ప్రార్థన’’

వడ్డాది నుంచి చోడవరం దాకా: షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం 194 వరోజు విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గంలో వడ్డాది గ్రామం నుంచి మొదలైంది. విజయరామరాజుపేట, లక్ష్మిపురం మీదుగా చోడవరం నియోజకవర్గ కేంద్రానికి చేరుకుని, భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. పట్టణం శివారులో ఏర్పాటు చేసిన బసకు రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. శనివారం 14 కి.మీ. నడిచారు. షర్మిల యాత్ర ఇప్పటికి 2,578.9 కి.మీ మేర జరిగింది. ఆమె వెంట నడిచిన వారిలో జిల్లా పార్టీ కన్వీనర్, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, తాజా మాజీ ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు, సాయిరాజు, చోడవరం సమన్వయకర్త బలిరెడ్డి సత్యారావు, మాజీ ఎమ్మెల్యేలు మిలట్రీ నాయుడు, కుంభా రవి బాబు, ముదునూరి ప్రసాదరాజు, పలు నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు వంశీకృష్ణ యాదవ్, పెట్ల ఉమాశంకర్ గణేశ్, తిప్పల నాగిరెడ్డి, ప్రగడ నాగేశ్వరరావు, జీవీ రవి రాజు, స్థానిక నేతలు కొయ్య ప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: