ఇంత నీచమా! మనుషులా.. రాక్షసులా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇంత నీచమా! మనుషులా.. రాక్షసులా?

ఇంత నీచమా! మనుషులా.. రాక్షసులా?

Written By news on Friday, June 7, 2013 | 6/07/2013

జగన్ మీద టీడీపీ కుటిల రాజకీయాలపై వైఎస్సార్‌సీపీ నేత కొండా సురేఖ ఆవేదన
ఒక్క మనిషిని లక్ష్యంగా చేసుకుని ఇంత రాద్ధాంతమా!
ఎంపీని, పార్టీ అధ్యక్షుడిని ఏడాదిగా జైల్లో పెట్టడమే అన్యాయం
ఇపుడు జగన్‌ను ఎవరూ కలవరాదని ములాఖత్‌లపైనా టీడీపీ రాజకీయం
ఆయన తన భార్యతోమాట్లాడ్డం కూడా తప్పా!
మద్యం, నీలి చిత్రాలంటూ మరీ దిగజారుడు విమర్శలు చేస్తున్నారు
జగన్ ఏనాడూ మద్యం ముట్టింది లేదు.. రక్త పరీక్షలు చేయిద్దామా?
మీ ఆరోపణలు నిజమైతే మేం రాజకీయాల నుంచి వైదొలుగుతాం
అబద్ధమని రుజువైతే టీడీపీని మొత్తంగా మూసేస్తారా?


సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్న కుమ్మక్కు రాజకీయాలను చూడాల్సి రావడం ప్రజల దురదృష్టమని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కొండా సురేఖ ఆవేదన వ్యక్తంచేశారు. తమ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జైలు ములాఖత్‌లపై టీడీపీ చేస్తున్న అనవసర రాద్ధాంతంపై ఆమె నిప్పులు చెరిగారు. మద్యం, నీలి చిత్రాలంటూ దిగజారుడు విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. జగన్‌కు వైద్య పరీక్షలు చేయిద్దాం సిద్ధమా? అని ఆమె టీడీపీకి సవాలు విసిరారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఆమె అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీడీపీ కుమ్మక్కు రాజకీయాలను ఎండగట్టారు. తన రాజకీయ జీవితంలో ఇంతటి దారుణమైన, నీచమైన రాజకీయాలు ఎన్నడూ చూడలేదని సురేఖ అన్నారు. ఆమె జారీ చేసిన ప్రకటనలోని ముఖ్యాంశాలివీ..

ప్రభుత్వం కౌంటర్ వేయకపోవడమే ఓ కుట్ర..

‘‘ఇపుడు అధికార పార్టీతో కుమ్మక్కయిన ప్రతిపక్షం ఆడుతున్న అబద్ధాలుగానీ, ఇంతటి దారుణమైన రాజకీయాలుగానీ నా జీవితంలో ఇంతవరకూ నేనెప్పుడూ చూడలేదు. ఒక మనిషిని లక్ష్యంగా పెట్టుకుని, అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశంవారు కలిసి కోర్టు దాకా వెళ్లి కేసులు వేశారు. జగన్ మోహన్‌రెడ్డి మీద పిల్ వేస్తే.. అందులో జగన్‌ను 52వ ప్రతివాదిగా పేర్కొంటే.. 1 నుంచి 15 వరకు ప్రభుత్వం, ప్రభుత్వ విభాగాలే ప్రతివాదులుగా ఉన్నాయి. ఇందుకు సంబంధించి కోర్టు సమన్లు జారీ చేసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రత్యుత్తరమూ రాకపోవడంలోనే కుట్ర కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కనుక స్పందిస్తే.. జీవోలన్నీ సరైనవేనని చెప్పాల్సి వస్తుందని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా ఆయన హయాంలో అలాంటివే అనేక జీవోలు ఇచ్చారని చెప్పాల్సి వస్తుందని... ఈ ప్రభుత్వం కౌంటర్ వేయలేదు.

కాంగ్రెస్‌ను వీడగానే ఐటీ నోటీసులు

మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి చనిపోయిన 15 నెలల తరువాత, కాంగ్రెస్-టీడీపీలు కుమ్మక్కు అయి వేసిన కేసు ఇది. అది కూడా జగన్ తాను నల్లకాల్వ దగ్గర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఓదార్పు యాత్ర కొనసాగించడానికి నిర్ణయించుకుని.. ఆ తరువాతి పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీకి, తన ఎంపీ పదవికి రాజీనామా చేశాక.. నెల రోజుల్లోనే ఐటీ శాఖ ద్వారా దుర్మార్గమైన నోటీసులు జారీ చేయించారు. ఆ తరువాత రెండు పార్టీల వారూ ఒక కుట్రలో భాగంగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజల్లో గెలవలేమన్న ఉద్దేశంతో దొంగ దెబ్బలు తీయడానికి ఈ రెండు పార్టీలూ చేయని ప్రయత్నాలేమైనా మిగిలి ఉన్నాయా? ఈ కేసుకు సంబంధించి విచారణ కాలం 2004 నుంచి 2009 వరకు. ఆ సమయంలో జగన్ ఎలాంటి రాజకీయ పదవిలో లేరు. అసలు రాజకీయాల్లోనే లేరు. 2009 ఏప్రిల్ నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఎంపీగా పోటీ చేయడానికి ముందు ఏ ఒక్క మంత్రికిగానీ, ఏ ఒక్క అధికారికి గానీ, ఎప్పుడూ ఫోన్ చేసింది లేదు. ఆయన ఏనాడూ సెక్రటేరియట్‌లో కాలు పెట్టిందీ లేదు. అసలు ఆయన హైదరాబాద్‌లో కాకుండా బెంగళూరులోనే ఉంటూ వచ్చారు. అయినప్పటికీ.. అలాంటి వ్యక్తి మీద రాజకీ యంగా దిగజారిపోయి, ఎలాంటి విలువలూ లేకుండా దురుద్దేశపూర్వకంగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి రాజకీయాలు చేస్తున్నాయి.

ఏడాదిగా జైల్లో పెట్టడమే అన్యాయం

జగన్‌ను హింసించడమే కాకుండా, ఆయనపై కేసులు వేయడమే కాకుండా, సీబీఐ ద్వారా ఘోరమైన ఆరోపణలు చేయిస్తున్నారు. చట్ట ప్రకారం ఏ వ్యక్తికైనా మూడు నెలల లోపు బెయిల్ ఇవ్వాలని చట్టం చెబుతోంది. అయినా ఆయన బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తాడన్న దొంగ సాకు చూపి అధికారంలో లేని, అధికారపక్షంతో పోరాటం చేస్తున్న ఒక వ్యక్తిని, ఒక ఎంపీని, 18 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలున్న ఒక పార్టీ అధ్యక్షుడిని ఏడాదికి పైగా జైల్లో పెట్టారు. 

అయినా చిత్తశుద్ధి, విశ్వసనీయతల మీద నమ్మకం ఉంచి, ఆయన మాటకు ఎనలేని విలువ ఇచ్చి.. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో పేదవాడి తరఫున పోరాడుతూ.. పెరిగిన కరెంటు చార్జీలకు వ్యతిరేకంగా మరో 15 మంది ఎమ్మెల్యేలు తమ పదవులు పోయినా ఫరవాలేదని వారి పార్టీలకు అతీతంగా అవిశ్వాస తీర్మానానికి మద్దతిచ్చారు. అటువంటి వ్యక్తిని, ఏడాదికి పైగా జైలులో పెట్టడమే అన్యాయం. ఇప్పుడు ఆ మనిషి తన భార్యతో, మరో ఆరుగురితో మాట్లాడ్డం తప్పా? ఎప్పుడూ లేని విధంగా కెమెరాలు బిగించారు. ఎప్పుడూ లేని విధంగా వారానికి కేవలం ఏడుగురినే కలవాలని కట్టడి చేశారు. అదీ ఫలానా రోజుల్లో మాత్రమే కలవాలన్నారు. సీబీఐ అంటూ, ఈడీ అంటూ, ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అంటూ, కోర్టు కేసులు అంటూ.. రకరకాలుగా జగన్‌ను క్షోభ పెడుతున్నారు. ఇంతకూ ఆయన చేసిన తప్పేంటి..? ఒక మాట కోసం నిజాయితీగా నిలబడటం, ఎన్నాళ్లు బతికామన్నది కాదు ముఖ్యం... బతికినంత కాలం ఎలా బతికామన్నదే ముఖ్యమని నమ్మి దాన్ని ఆచరించి చూపించడమేనా?

కాంగ్రెస్, టీడీపీ.. నోరు తెరిస్తే అబద్ధాలు: ఈ రోజున ఈ అధికార కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వారు చేస్తున్న రాజకీయాలు ఏమిటి..? నోరు తెరిస్తే చాలు అబద్ధాలు ఆడుతున్నారు. జగన్‌తో ఎవరినీ కలవనీయకుండా నిలువరించాలని, ఈ రెండు పార్టీలకూ వ్యతిరేకంగా మూడో మనిషిగానీ, మూడో పార్టీగానీ ఉండకూడదని నిస్సిగ్గుగా కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు. మద్యం అని, నీలి చిత్రాలు అని ఇంకా దిగజారుడు మాటలు ఎన్నెన్నో మాట్లాడారు. నేను సవాల్ విసురుతున్నా.. మా నాయకుడు ఈరోజే కాదు, ఏరోజూ మద్యాన్ని ముట్టింది లేదు. 

రండి.. రక్త పరీక్షలు చేయిద్దాం. ఆయన ఏరోజైనా మద్యం ముట్టాడని తెలిస్తే మేం, మా నాయకుడితో కలిసి రాజకీయాల నుంచే వైదొలుగుతాం. మరి మీరు అబద్ధాలు ఆడుతున్నారని రుజువు అయితే మీ పార్టీని మూసేస్తారా? మీరు చెప్పిన అబద్ధాలకు ఆ తల్లి విజయమ్మ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతారా? ప్రజా జీవితంలో మాటలు స్థాయికి తగ్గట్టుగా ఉండాలి. వయసుకు తగ్గట్టుగా ఉండాలి. మీ అబద్ధాలను చూసి పిల్లలు కూడా అసహ్యించుకుంటున్నారు. చంద్రబాబూ.. ఐఎంజీ, ఎమ్మార్ కేసుల వ్యవహారంలో.. మీరు వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటున్నట్టుగా బహుశా మరెవరూ మేనేజ్ చేయలేరేమో. ఒక్కొక్కరికీఒక్కో న్యాయంగా ఈ వ్యవస్థలు దిగజారిన పరిస్థితి చూస్తే బాధ అనిపిస్తుంది.

చంద్రబాబు మద్దతు లేకుంటే ప్రభుత్వం ఎలా కొనసాగుతుంది?

ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కొనసాగాలీ అంటే 294 మంది శాసనసభ్యులు ఉన్న అసెంబ్లీలో 148 మంది మద్దతు ఉండాలి. కానీ ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలం 146 మాత్రమే. మైనార్టీలో ఉన్న ఈ ప్రభుత్వం ఇంకా కొనసాగుతోందంటే- అది చంద్రబాబు చలవ కాదా? రైతుల పక్షాన, చిన్న, చిల్లర వర్తకుల పక్షాన ఎఫ్‌డీఐల మీద ఓటింగ్ జరుగుతున్నప్పుడు మీ ఎంపీలను గైర్హాజరు చేయించి నీచమైన కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడటాన్ని ప్రతి ఒక్కరూ చూస్తున్నారు చంద్రబాబూ. ఇలాంటి రాజకీయాలను చూడాల్సి రావటం ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టం. ఎప్పటికైనా, అంతిమంగా దేవుడు ఈ అన్యాయాన్ని శిక్షిస్తాడు. జగన్ బయటకు వస్తారు. ప్రతి పేదవాడి ముఖాన చిరునవ్వు కనపడే సువర్ణ పరిపాలనను, ఆ రాజన్న రాజ్యాన్ని మళ్లీ తీసుకువస్తారు.’
Share this article :

0 comments: