ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండటమే లక్ష్యం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండటమే లక్ష్యం

ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండటమే లక్ష్యం

Written By news on Thursday, June 27, 2013 | 6/27/2013

- రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్ చేయాలని వైఎస్ ఆలోచన చేస్తే..
- కిరణ్ మద్యాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారు
- ప్రతి మద్యం దుకాణాన్ని మినీ బార్‌లా మార్చి వ్యాపారాన్ని విస్తరిస్తారట..
- ఆరోగ్యశ్రీలో ఉన్న జబ్బులు మాత్రం కుదిస్తారట
- బెల్టు దుకాణాలకు నాంది పలికింది చంద్రబాబు నాయుడే
- జగన్‌కు మద్యంపై వచ్చే ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యం..
- ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండటమే లక్ష్యం

మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘కాంగ్రెస్ పెద్దలు వారిది గాంధేయ వాదం అని చెప్పుకుంటారు. కానీ ఆ పార్టీ నమ్ముకున్నది గాంధేయ వాదాన్ని కాదు.. బ్రాందేయ వాదాన్ని. కాబట్టే మద్యం మాఫియా డాన్‌ను ఆ పార్టీ అధ్యక్షునిగా పెట్టుకుంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ రాష్ట్రాన్ని హరితాంధ్రప్రదేశ్‌గా చేయాలని ఆలోచన చేస్తే.. ఈ కిరణ్‌కుమార్‌రెడ్డిగారు మద్యాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారు. ప్రతి మద్యం దుకాణాన్ని ఒక మినీ బార్‌లా మార్చేసి మద్యం వ్యాపారాన్ని విస్తరిస్తారట. కానీ.. ఆరోగ్యశ్రీలో ఉన్న జబ్బులు మాత్రం కుదిస్తారట. మద్యం అమ్మకాలు రెట్టింపు చేస్తారట కానీ, ఫీజు రీయింబర్స్‌మెంటు లబ్ధిదారులను తగ్గించేస్తారట’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరిని, ప్రజాస్వామ్య విరుద్ధంగా దానితో అంటకాగుతున్న ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు వైఖరిని ఎండగడుతూ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర బుధవారం విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో సాగింది. నర్సీపట్నంలో భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలనుద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఆ ప్రసంగం సారాంశం ఆమె మాటల్లోనే..

‘‘ఇది జూన్ మాసం. వ్యవసాయ పనులు మొదలయ్యాయి.రైతన్నలకు విత్తనాలు, ఎరువులు పెద్దమొత్తంలో అవసరమవుతాయి. వాటిని రైతులకు అందుబాటులో ఉంచడంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం చేతులెత్తేసింది. జూన్ అంటే చదువులు ప్రారంభమయ్యే నెల. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించి, ఫీజు భారాన్ని దించడానికి ప్రణాళికలు వేసుకొని అమలు చేయాల్సిన సమయం ఇదే. కానీ, ఈ ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు సమకూర్చడంలో, ఫీజుల భారాన్ని తగ్గించడంలో పూర్తిగా విఫలమైంది. రైతులు, విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేసిన ఈ సర్కారు మద్యం విధానంపైనే పూర్తిగా దృష్టి పెట్టింది. మొన్న ఈ సంవత్సరానికి సంబంధించి ఎక్సైజ్ పాలసీ ప్రకటించారు. బెల్టు దుకాణాలు అరికడతామని సర్కారు మాట వరసకు కూడా చెప్పలేదు. దీన్నిబట్టి బెల్టు దుకాణాలు ఎంతవరకు తీసేస్తారో మనకు అర్థమవుతోంది. 

ఈ కొత్త పాలసీ ప్రకారం రూ. 2 లక్షలు కడితే మద్యం దుకాణాల్లోనే తాగడానికి వీలుగా సిట్టింగ్ రూంలు ఇస్తారట. అంటే ఇక మీదట మద్యం దుకాణాలన్నీ మినీ బార్లుగా మారబోతున్నాయన్నమాట. జనాలను దుకాణాల్లోనే కూర్చోబెట్టి ఇంకా ఎక్కువ తాగించాలనేది కిరణ్‌కుమార్‌రెడ్డి గారి లక్ష్యం. ఈ కిరణ్ సర్కారుకు బుద్ధి, జ్ఞానం, మానవత్వం ఏమైనా ఉన్నాయా.. అని చూస్తే అవి ఎక్కడా కనిపించవు. కొన్ని నెలల కిందటే తెనాలి పట్టణంలో మద్యం దుకాణం బయటే మందు తాగిన కొంతమంది వ్యక్తులు ఆ మత్తులో సునీల అనే ఒక మహిళను బస్సు కింద తోసేసి హత్య చేశారు. 

మద్యం దుకాణాలు, మందు తాగడం ఒకే చోట ఉండకూడదని రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. అంత ఘోరమైన సంఘటన నుంచి పాఠాలు నేర్చుకోవాల్సింది పోయి, దుకాణాల దగ్గర లిక్కర్ తాగకుండా చూడాల్సింది పోయి, అక్కడే కుర్చీలు వేసి తాగిస్తామంటున్న ఈ పాలకులను ఏమనాలి? కిరణ్‌కుమార్‌రెడ్డి గారు ఇలా ఉంటే.. ఆయనకో ఎక్సైజ్ మంత్రి ఉన్నారు. పేరు పార్థసారథి. మద్యం రోడ్ల మీద తాగకుండా ఉండటానికే ఈ నిర్ణయం తీసుకున్నాం అని ఆయన అంటున్నారు. ఇది ఎలా ఉందంటే.. ‘మా ఇంట్లో దొంగలు పడ్డారు అని పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి పోలీసులను పంపించండి అని కోరితే, వాళ్లేమో.. ఎలాగూ దొంగలు పడ్డారు కదా, మీ బీరువా తాళాలు వాళ్లకే ఇచ్చేసి వెళ్లిపోండి’ అన్నట్టు ఉంది.

పోలీసులను పెట్టి ఎవరూ మద్యం దుకాణాల్లో తాగకుండా చూడాల్సింది పోయి.. పోలీసులను కాపలా పెట్టి మద్యం దుకాణాల్లోనే తాగిస్తామంటున్న వీళ్లు ఈరోజు మన ఖర్మకొద్దీ నాయకులై కూర్చున్నారు. వీళ్లు మంత్రులు.. వీళ్లు పాలకులు.. చెప్పుకుంటే సిగ్గు చేటు. ఈ కిరణ్‌కుమార్‌రెడ్డి గారి నిర్లక్ష్యం వలన ఎక్కడా సాగు, తాగు నీరు లేదుగాని, మద్యం మాత్రం ఎక్కడపడితే అక్కడ పుష్కలంగా దొరుకుతోంది. ప్రతి ఏటా వ్యవసాయం నుంచి వచ్చే ఉత్పత్తులు తగ్గినా ఫర్వాలేదు కానీ, మద్యం అమ్మకాలు మాత్రం ఏటేటా పెరగాలన్నది కిరణ్‌కుమార్‌రెడ్డి గారి లక్ష్యం. కేవలం నాలుగేళ్లలోనే అమ్మకాలను రెట్టింపు చేసుకున్నారు. ఇక మీదట రాష్ట్రం మూడు పర్మిట్ రూంలు, ఆరు బార్లుగా వర్ధిల్లుతుందన్నమాట. 

పాలకపక్షం ఇలా ఉంటే.. మన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారేమో.. పాదయాత్ర చేస్తూ కళ్లారా మద్యం వలన బుగ్గిపాలైన కుటుంబాలను చూశారు. ఆ కుటుంబాల్లోని మహిళల రోదన విన్నారు. అయినా ఆయన అంటాడు.. మద్యం ధరలు చాలా పెరిగిపోయాయట. టీడీపీ అధికారంలోకి వ స్తే సరసమైన ధరలకే అందరికీ మద్యం అందుబాటులోకి తెస్తారట. ఈయన ప్రతిపక్ష నాయకుడు. అసలు బెల్టు దుకాణాలకు నాంది పలికింది చంద్రబాబునాయుడు గారు. ఇలాంటి నాయకుడు అలాంటి మాటలు కాకపోతే ఎలాంటివి మాట్లాడతారు? మంచినీళ్లు వద్దు.. మద్యమే ముద్దు అని పాలక, ప్రతిపక్ష నాయకులు అనుకుంటున్నారు. ఆ నాయకుల చేతిలో పడి ఇవాళ మన రాష్ర్టం అతలాకుతలం అవుతోంది.

కుటుంబాల్లో మద్యం మహమ్మారి ఎలాంటి చిచ్చు పెడుతుందో జగన్‌మోహన్‌రెడ్డి గారికి బాగా తెలుసు. మద్యం నేరాలను ఎలా ప్రోత్సహిస్తుందో, కుటుంబాలను ఎలా విడగొడుతుందో పూర్తిగా అర్థం చేసుకున్నారు. కాబట్టే మద్యాన్ని అదుపు చేసే విషయంలో జగనన్న చాలా స్పష్టత కలిగి ఉన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి గారికి మద్యం మీద వచ్చే ఆదాయంకంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యం. ప్రజల ఆయుష్షే ప్రధానం. ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండటమే లక్ష్యం. మద్యం కారణంగా జరిగే నేరాలు, ప్రమాదాలను అరికట్టడమే ముఖ్యం. మద్యంతో చితికిపోయిన జీవితాలను మళ్లీ నిలబెట్టడమే ప్రధానం. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం బాగుంటుందని నేను మాటిచ్చి చెప్తున్నాను.’’

12.2 కిలోమీటర్లు నడిచిన షర్మిల
బుధవారం 191 వరోజు మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని బెండవరం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి కృష్ణపురం, కొత్తబయ్యపురెడ్డిపాలెం, బలిఘట్టం మీదుగా నర్సీపట్నం నియోజకవర్గ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడి నుంచి బొడెపల్లి కూడలి మీదుగా నడిచి శ్రీరాంనగర్‌లో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.30 గంటలకు చేరుకున్నారు. మొత్తం 12.2 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 2,532.3 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది. 

ఈ కార్యక్రమంలో ఎమ్మె ల్యే సుజయకృష్ణ రంగారావు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్, మాజీ ఎమ్మెల్యేలు కుంబం రవిబాబు, జ్యోతుల నె హ్రూ, నియోజకవర్గ కోఆర్డినేటర్లు కిడారి సర్వేశ్వర్‌రావు, వంశీకృష్ణ యాదవ్, తిప్పల నాగిరెడ్డి, వంజంగి కాంతమ్మ, కోరాడ రాజబాబు, పాడేరు సత్యవాణి, జీవీ రవిరాజు, ప్రగడ నాగేశ్వరరావు, బొడ్డేటి ప్రసాద్, స్థానిక నాయకులు కొయ్య ప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: