వైఎస్ హయాంలో ‘రైతన్న రాజ్యాన్ని’ గుర్తు చేసుకుంటున్న అన్నదాతలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ హయాంలో ‘రైతన్న రాజ్యాన్ని’ గుర్తు చేసుకుంటున్న అన్నదాతలు

వైఎస్ హయాంలో ‘రైతన్న రాజ్యాన్ని’ గుర్తు చేసుకుంటున్న అన్నదాతలు

Written By news on Tuesday, June 18, 2013 | 6/18/2013

ఇప్పుడు తమను పట్టించుకునేవారే కరువయ్యారని షర్మిల వద్ద ఆవేదన
మద్దతు ధరలు లేక అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నామని గోడు
తూర్పుగోదావరిలో పంటల బీమా కింద రైతులకు రూ.200 కోట్లు చెల్లించాల్సి ఉన్నా.. పైసా కూడా ఇవ్వని ప్రభుత్వం
వైఎస్ ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాలు జగనన్న కొనసాగిస్తారని షర్మిల భరోసా
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ సోమవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 182, కిలోమీటర్లు: 2,412.5

మరో ప్రజాప్రస్థానం నుంచి సాక్షిప్రతినిధి:మహానేత వైఎస్ హయాంలో రైతుల బతుకులకు భరోసా ఉండేది. ప్రజాప్రస్థానం పాదయాత్రలో రైతుల కడగండ్లను స్వయంగా తెలుసుకున్న వైఎస్ అధికారంలోకి రాగానే.. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉచిత విద్యుత్ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. 2007లో కేంద్ర ప్రభుత్వం వరి కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.50 మాత్రమే పెంచింది. ఈ నామమాత్రపు పెంపుతో ఎలాంటి ప్రయోజనం కలగడం లేదన్న రైతుల ఆవేదనను అర్థం చేసుకున్న వైఎస్.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనంగా రూ.50లు బోనస్ ఇచ్చారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీతో లబ్ధి పొందలేని రైతులకు రూ.5,000 అందేలా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. కొబ్బరి రైతుల విజ్ఞప్తి మేరకు రెండు శాతం ఉన్న వ్యాట్‌ను తొలగించి రైతుల గుండెల్లో చిరస్థాయిగా ముద్రవేసుకున్నారు. చంద్రబాబు హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు సైతం వైఎస్ రాజశేఖరరెడ్డి లక్ష రూపాయల చొప్పున సాయమందించి ‘రైతు పక్షపాతి’ అనిపించుకున్నారు. కానీ నేటి పాలకులు రైతుల పక్షపాతం వహించడం మాట అటుంచి కనీసం వారిపట్ల మానవతాదృక్పథంతో కూడా ఆలోచించడం లేదు. ఎదిగే చేనుకు కరెంటు లేదు. చేతికొచ్చిన పంటకు మద్దతు ధర లేదు. వానలు ముంచెత్తితే నష్టపరిహారం లేదు. తూర్పుగోదావరి జిల్లాలో పంటల బీమా కింద రూ.200 కోట్లు చెల్లించాల్సి ఉన్నా.. నేటికీ రైతులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. పైగా సవరించిన పంటల భీమా పథకంలో రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను 4.5 శాతం నుంచి 5.4 శాతానికి పెంచి రైతులపై అదనపు భారం మోపింది. వీటన్నింటినీ ఏకరువు పెడుతూ రైతులు షర్మిల వద్ద గోడు వెళ్లబోసుకుంటున్నారు. కష్టాల సాగు చేయలేక అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నా తమను పట్టించుకునే నాథుడే లేడని కన్నీరుమున్నీరవుతున్నారు. 

పజాసమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన చంద్రబాబు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం పెద్దాపురం నియోజకవర్గంలో సాగింది. ఈ సందర్భంగా పలుచోట్ల రైతులు షర్మిలతో తమ బాధలు చెప్పుకున్నారు. రాష్ట్రంలో సగ్గుబియ్యం (సాగో-కర్రపెండలం) సాగయ్యే ఏకైక జిల్లా తూర్పుగోదావరిలో నేడు ఆ పంట కనుమరుగయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయని పెద్దాపురం ఎంఆర్ కాలేజీ సమీపంలో రైతులు షర్మిలకు వివరించారు. 35 వేల ఎకరాల్లో సాగవుతోన్న సాగో పంటలో మెలకువలు అందచేసే రీసెర్చ్ సెంటర్‌ను కూడా తరలించికుపోయారని వాపోయారు. ఈ సెంటర్‌ను తిరిగి రైతుల వద్దకే తీసుకువచ్చేలా జగనన్న దృష్టికి తీసుకువెళతానని షర్మిల వారికి భరోసా ఇచ్చారు.

సర్కారు చేయూత లేదమ్మా..

వడ్లమూరుకు సమీపంలో చెరకు తోటల్లో పనులు చేసుకుంటున్న రైతులు పరుగుపరుగున వచ్చి షర్మిలను కలిశారు. చెరకు సాగుకు సర్కారు చేయూతనివ్వడం లేదమ్మా అని గోడు వెళ్లబోసుకున్నారు. ‘‘వైఎస్ అధికారంలోకి వచ్చే సమయానికి టన్ను చెరకు ధర రూ.1,100 ఉండేది. వైఎస్ దాన్ని రూ.2,000కు పెంచారు. గడచిన నాలుగేళ్లలో టన్నుకు కేవలం రూ.200 మాత్రమే పెరిగింది. దీంతో మేం తీవ్రంగా నష్టపోతున్నాం’’ అని రైతులు షర్మిలకు వివరించారు. ప్రస్తుతం చెరకు సాగుతో నష్టాలపాలై పొలాలు అమ్ముకునే పరిస్థితి ఏర్పడిందని కంటతడిపెట్టారు. ఈ సందర్భంగా షర్మిల మెట్ట రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా ఎలా ఉంది.. సాగునీరు అందుతుందా, వ్యవసాయాధికారులు వస్తున్నారా అని రైతులను ఆరా తీశారు. వైఎస్ మంజూరుచేసిన రూ.138 కోట్లు ఖర్చు చేసి ఏలేరు ఆధునీకరణ పూర్తి చేసి ఉంటే మెట్ట రైతులకు ఈ పరిస్థితి ఎదురయ్యేదే కాదని రైతులు షర్మిలకు వివరించారు. వారి కష్టాలను తెలుసుకున్న షర్మిల.. వైఎస్ హయాంలో అమలైన రైతు సంక్షేమ పథకాలన్నీ జగనన్న కొనసాగిస్తారని భరోసా ఇచ్చారు. ‘‘రైతుల గోడు వినే సర్కారు కాదిది. రాబోయే రోజులన్నీ మంచి రోజులే. రాజన్న రాజ్యంలో మీ కష్టాలన్నీ తీరిపోతాయి. మీకు గిట్టుబాటు ధర వస్తుంది. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తారు. తొమ్మిది గంటలు విద్యుత్ సరఫరా జరుగుతుంది’’ అని రైతులకు భరోసా ఇచ్చారు.

14.6 కిలోమీటర్లమేర నడక..

మరోప్రజాప్రస్థానం పాదయాత్ర 182వ రోజు సోమవారం ఉదయం 9.00 గంటలకు సామర్లకోట యూనియన్ బ్యాంక్ సమీపం నుంచి ప్రారంభమైంది. సామర్లకోట, పెద్దాపురం పురవీధుల మీదుగా మరిడమ్మ ఆలయం వరకు సాగింది. మధ్యాహ్నం పెద్దాపురం ఆర్టీసీ కాంప్లెక్స్, జడ్‌రాగంపేట, వడ్లమూరు, గోరింటాల మీదుగా షర్మిల పులిమేరుకు చేరుకున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.20 గంటలకు చేరుకున్నారు. సోమవారం షర్మిల 14.6 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 2,412.5 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయింది. పాదయాత్రలో ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ, మాజీ ఎంపీ ఏజేవీబీ మహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, పార్టీ నేతలు చలమలశెట్టి సునీల్, తోట సుబ్బారావునాయుడు, కొల్లి నిర్మలాకుమారి, చెల్లుబోయిన వేణు, గంగాధరరావు, అనంత ఉదయభాస్కర్, కర్రి పాపారాయుడు పాల్గొన్నారు. షర్మిల పాదయాత్రలో ప్రతిరోజూ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, జ్యోతుల నవీన్ తదితరులు నడుస్తున్నారు.
Share this article :

0 comments: