ఇవన్నీ చూసి ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేయాలా..? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇవన్నీ చూసి ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేయాలా..?

ఇవన్నీ చూసి ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేయాలా..?

Written By news on Monday, June 17, 2013 | 6/17/2013

మరో ప్రజాప్రస్థానంలో నిప్పులు చెరిగిన షర్మిల
వంటగ్యాస్ ధరలు పెంచినందుకా..?
రక్తం పిండి మరీ కరెంటు చార్జీలు వసూలు చేస్తున్నందుకా?
సాగునీటి ప్రాజెక్టులను అటకెక్కించినందుకా?
ఫీజు రీయింబర్స్‌మెంట్ లేకుండా చేసినందుకా?
ఆరోగ్యశ్రీ నుంచి 135 వ్యాధులు తొలగించినందుకా?
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పండి
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ ఆదివారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 181, కిలోమీటర్లు: 2,397.9

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి సాక్షి ప్రతినిధి: ‘‘ఏ ఎన్నికల్లో అయినా ఏం చూసి ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేయాలి. వంటగ్యాస్ ధరలు పెంచారనా? కరెంటు చార్జీలు పెంచి రక్తం పిండి మరీ వసూలు చేస్తున్నారనా? సాగునీటి ప్రాజెక్టులను అటకెక్కించారనా? ఎవ్వరికీ కరెంటు ఇవ్వనందుకా? పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ లేకుండా చేశారనా? ఆరోగ్యశ్రీలో 135 వ్యాధులను తొలగించినందుకా? రేషన్ కార్డులు ఇవ్వనందుకా.. పక్కా ఇళ్లు కట్టనందుకా? ఇవన్నీ చూసి ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేయాలా..?’’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిప్పులు చెరిగారు. ప్రజా శ్రేయస్సును గాలికొదిలేసిన ఈ కాంగ్రెస్ పార్టీకి రాబోయే అన్ని ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన చంద్రబాబు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లో సాగింది. సామర్లకోట సెంటర్‌లో అశేష జనవాహినిని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లో...

గ్రామాలను చంద్రబాబు శ్మశానాలుగా మార్చారు..

‘‘అధికార పక్షమే కాదు.. రాష్ట్రంలో అంతే నీచమైన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కూడా ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలో కొనసాగాలంటే 148 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. లేకుంటే మెజార్టీ లేనట్టే. ఇప్పుడు కాంగ్రెస్‌కు 146 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మైనార్టీలో ఉన్న కాంగ్రెస్ ఎలా అధికారంలో ఉంది? ఈ చంద్రబాబు అండతో కాదా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఎమ్మెల్యేల ఉప ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మక్కవ్వడం వాస్తవం కాదా? ఇప్పుడు ప్రభుత్వం కూలిపోదనే భరోసా ఉంది కాబట్టి చంద్రబాబు మరోసారి అవిశ్వాసం పెడతారు. ప్రజలు ఈ నీచమైన కుమ్మక్కు రాజకీయాలను చూస్తున్నారు. ఎనిమిదేళ్లు ఎనిమిదిసార్లు కరెంటు చార్జీలు పెంచి గ్రామాలను శ్మశానాలుగా మార్చారు చంద్రబాబు. స్కాలర్‌షిప్పులు అడిగిన పాపానికి విద్యార్థులపై లాఠీచార్జీ చేయించారు. 

చివరకు పేదలకు చేసే వైద్య సేవలపై కూడా యూజర్ చార్జీలు వసూలు చేశారు. కళ్లు ఆర్పకుండానే ఎన్ని అబద్ధాలైనా చెప్పగల సమర్థుడు చంద్రబాబు. వైఎస్ అమలు చేసిన పథకాలను తాను చేసినట్టు చెప్పుకుంటున్న ఈ చంద్రబాబుకు మతిభ్రమించిందనుకోవాలా..? అబద్ధాలకోరు అనుకోవాలా? ఇంకొంచెం ముందుకెళితే చార్మినార్, నాగార్జునసాగర్ తానే కట్టానంటారు. నరకాసురుడు వచ్చి అధికారం ఇవ్వమంటే ఎవరైనా ఇస్తారా? గాడ్సే వచ్చి మహాత్మాగాంధీ ట్రస్టుకు అధ్యక్షుడిని చేయమంటే చేస్తారా. ఎవరూ చేయరు. అలాగే బాబుకు మళ్లీ అధికారం ఇస్తే రాష్ట్రం మాడిమసైపోతుంది. ఓటేసిన 70 లక్షల మందిని పిచ్చోళ్లను చేసి మంత్రి పదవి కోసం చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో కలిపేశారు. ఓటేసిన రెండు కోట్ల మందిని పిచ్చోళ్లను చేసి ఈ చంద్రబాబు టీడీపీని కాంగ్రెస్‌కు అమ్మేశారు.


రైతును వైఎస్ రాజులాగా చూసుకున్నారు

రైతన్నను వైఎస్ రాజశేఖరరెడ్డి రాజులాగా చూసుకున్నారు. అండగా ఉన్నారు. ప్రతి ఎకరాకు నీరిచ్చారు. చంద్రబాబు రైతులకు రూపాయి వడ్డీకి రుణాలిస్తే రాజశేఖరరెడ్డి పావలా వడ్డీకే రుణాలిచ్చారు. చంద్రబాబు 16 లక్షల పెన్షన్‌లు ఇస్తే రాజశేఖరరెడ్డి 75 లక్షల పింఛన్లు ఇచ్చారు. ఇది దుర్మార్గపు సర్కారు. కరెంటు కోసం ఎదురుచూస్తూ పొలాల్లోనే పడుకుంటున్నామమ్మా అని ఎక్కడికి వెళ్లినా రైతులు చెబుతున్నా రు. వారి బాధలు వింటుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి.

రాజన్న రాజ్యంలో అందరికీ మేలు..

జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక గుడిసెలనేవి ఉండవు. ప్రతి ఒక్కరికీ పక్కా ఇళ్లు కట్టించే బాధ్యత జగనన్న తన భుజాలపై వేసుకుంటాడు. రైతు నష్టపోడు. రైతులకు, మహిళలకు వడ్డీ లేకుండానే రుణాలిస్తాడు. అక్కా చెల్లెళ్లు వారి బిడ్డల్ని చదివించుకోవడం కోసం అమ్మఒడి పథకం కింద పదో తరగతి వరకు ఒక్కో విద్యార్థికి నెలకు రూ.500 చొప్పున సంవత్సరానికి రూ.6,000 నేరుగా వారి అకౌంట్‌కే పడుతుంది. ఇంటరైతే సంవత్సరానికి రూ.8,400, డిగ్రీ అయితే సంవత్సరానికి రూ.12,000 నేరుగా వారి అకౌంట్‌లోనే పడతాయి. వృద్ధులకు, వితంతువులకు పింఛను రూ.700 అవుతుంది. వికలాంగులకు వెయ్యి రూపాయలు అవుతుంది. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తారు. అన్ని పథకాలు బ్రహ్మాండంగా అమలవుతాయి. రాజన్న రాజ్యం కోసం మీరు చేయాల్సింది ఒక్కటే.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు గట్టిగా బుద్ధి చెప్పండి. జగనన్నను ఆశీర్వదించండి. రాబోయే అన్ని ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బలపరచాలని మా ప్రార్థన’’

13.9 కిలోమీటర్ల మేర నడక

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 181వ రోజు ఆదివారం ఉదయం 9.30 గంటలకు పిఠాపురం జగ్గయ్యచెరువు సమీపంలోని స్థలం నుంచి ప్రారంభమైంది. ఉదయం జగ్గయ్యచెరువు, కుమారపురం, కొత్తకందరాడ గ్రామాల మీదుగా జల్లూరు వరకు సాగింది. మధ్యాహ్నం జల్లూరు నుంచి కోదండ రామపురం, బ్రౌన్‌పేట జంక్షన్, సామర్లకోట పట్టణ పురవీధుల మీదుగా సాగింది. సామర్లకోట యూనియన్ బ్యాంకు సమీపంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి ఏడు గంటలకు షర్మిల చేరుకున్నారు. ఆదివారం షర్మిల 13.9 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 2,397.9 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయ్యింది. పాదయాత్రలో పార్టీ జిల్లా కన్వీనర్ కుడిపూడి చిట్టబ్బాయి, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, సీజీసీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, గంపల వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పార్టీ నేతలు చలమలశెట్టి సునీల్, తోట సుబ్బారావు నాయుడు, కొల్లి నిర్మలాకుమారి, స్థానిక నాయకులు మంతెన రవిరాజు, మట్టా శైలజ, విప్పర్తి వేణుగోపాల్, మిండగుదిటి మోహన్, రొంగలి లక్ష్మి, కర్రి పాపారాయుడు, జ్యోతుల నవీన్ తదితరులు పాల్గొన్నారు.


చదువుకోవాలని ఉందక్కా..!

‘‘అక్కా.. మా అమ్మానాన్న చనిపోయారు. నాకు ఓ అక్కా, చెల్లి ఉన్నారు. అక్కకు పెళ్లయింది. చెల్లి, నేను అమ్మమ్మతాతయ్య వద్ద ఉంటున్నాం. నేను పిఠాపురంలోని కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుకుంటున్నాను. అమ్మమ్మతాతయ్య మమ్మల్ని పోషించలేక పోతున్నారు. అందువల్ల సెలవుల్లో నేను కూలీ పనులకు వెళ్లాల్సి వస్తోంది. బాగా చదువుకోవాలని ఆశగా ఉందక్కా..’’ అని పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని కొత్త కందరాడ గ్రామ సమీపంలో పొలంలో పనిచేస్తున్న జల్లూర గంగ.. షర్మిల వద్ద గోడు వెళ్లబోసుకుంది. దీంతో చలించిపోయినషర్మిల ‘‘మీ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాను. బాగా చదువుకో’’ అంటూ ధైర్యం చెప్పారు. పక్కనే ఉన్న మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబును పిలిచి గంగ కుటుంబ ఆర్థిక పరిస్థితిపై తనకు వివరాలు అందించాలని సూచించారు.
Share this article :

0 comments: