ఆది నుంచి అదే తీరు.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆది నుంచి అదే తీరు..

ఆది నుంచి అదే తీరు..

Written By news on Thursday, June 13, 2013 | 6/13/2013

 ‘సాక్షి’ సద్విమర్శలను జీర్ణించుకోలేని బాబు
- పార్టీ సమావేశాలకు ‘సాక్షి’ పత్రిక, ‘సాక్షి’ చానల్ ప్రతినిధులను పిలవరాదని నేతలకు హుకుం
- ‘టీ న్యూస్’ చానల్‌పైనా ఇదే చర్య.. 
- పాత్రికేయ సంఘాల ఖండన.. అప్రజాస్వామిక, అవివేక చర్యగా అభివర్ణన

సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి’ దినపత్రిక, ‘సాక్షి’ టీవీ చానల్‌ను కోట్లాది ప్రజలు ఆదరించడాన్ని రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో ప్రధాన ప్రతిపక్షం వైఫల్యాలను ‘సాక్షి’ ఎత్తిచూపడాన్ని ఆ పార్టీ భరించలేకపోతోంది. ప్రజాస్వామ్యం గురించి నిత్యం మాట్లాడే చంద్రబాబు.. అత్యంత ప్రజాదరణ కలిగిన పత్రికల్లో ఒకటైన ‘సాక్షి’ చేస్తున్న సద్విమర్శలను స్వీకరించి, సరిదిద్దుకోవడానికి బదులు.. ఆ పత్రికను, ‘సాక్షి’ టీవీ చానల్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం సాయంత్రం తన నివాసంలో పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులతో సమావేశం నిర్వహించి ‘సాక్షి’ దిన పత్రిక, ‘సాక్షి’ టీవీ చానల్‌లతో పాటు ‘టీ న్యూస్’ చానల్‌ను బహిష్కరించాలని నిర్ణయించినట్టు చెప్పారు. 

ఆ రెండు చానళ్లు, ‘సాక్షి’ దినపత్రిక ప్రతినిధులు టీడీపీ నిర్వహించే విలేకరుల సమావేశాల్లో ప్రశ్నలు వేసి ఇబ్బందికరమైన పరిస్థితులను తేవడమే కాకుండా, పార్టీ వ్యతిరేక వార్తలు రాస్తున్నారని, అందువల్ల వాటిని బహిష్కరించడం మంచిదని చంద్రబాబు చెప్పడంతో మిగతా నేతలంతా సరేనన్నారు. అనంతరం పార్టీ నాయకుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు చంద్రబాబు నివాసం బయట నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘సాక్షి’ దినపత్రిక, ‘సాక్షి’ టీవీ చానల్, టీ న్యూస్ చానల్‌ను బహిష్కరించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇకనుంచి పార్టీ సమావేశాలకు ఆ పత్రిక, చానళ్ల ప్రతినిధులను ఆహ్వానించబోమని చెప్పారు.

ఆది నుంచి అదే తీరు..
‘సాక్షి’ పత్రిక పుట్టినప్పటి నుంచి చంద్రబాబు దానిపై విమర్శలు చేస్తున్నారు. కోట్లాది పాఠక మహాశయులు ఆదరిస్తున్న పత్రికలో వస్తున్న వార్తలపై అనేక సందర్భాల్లో అసహనాన్ని ప్రదర్శించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీగా చెప్పుకునే తెలుగుదేశం.. అదే కాంగ్రెస్‌తో ఏఏ సందర్భాల్లో ఎలా సహకరించిందీ, ఎన్నికల్లో ఏ విధంగా మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నదీ సోదాహరణంగా అనేకసార్లు ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఆ వార్తలను చంద్రబాబు ఏమాత్రం జీర్ణించుకోలేక అప్రజాస్వామిక రీతిలో తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. టీడీపీ ప్రతిరోజూ నిర్వహించే విలేకరుల సమావేశాలను ‘సాక్షి’ ప్రచురిస్తూనే ఉంది. తగినంత ప్రాధాన్యం ఇస్తూనే ఉంది. ఏరోజూ వారు చెప్పిన విషయాలను వక్రీకరించలేదు. 

అలా జరిగి ఉంటే ఆ వెంటనే వారు ఖండించేవారు కూడా. అలాగని ఈ అయిదేళ్లలో వారు నిర్వహించిన సమావేశాలకు సంబంధించి ‘సాక్షి’ వక్రీకరించినట్లు ఒక్క ఫర్యాదు కూడా చేయలేదు. అయితే పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు, నేతల ఆధిపత్య పోరాటాలు, ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న వైనాలను ‘సాక్షి’ ఎప్పటికప్పుడు ప్రజల ముందుంచింది. 32 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహిస్తున్న చంద్రబాబు అనేక సందర్భాల్లో ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడుతుంటారు. ఈనాడు అధినేత రామోజీరావుకు చెందిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమాలపై కేసులు నమోదైనప్పుడు పత్రికా స్వేచ్ఛ అంటూ గొంతు చించుకున్నారు. 

అలాంటి చంద్రబాబు ప్రారంభం నుంచి ‘సాక్షి’ని నిందిస్తూనే ఉన్నారు. తమను బాబు నిందించిన వార్తలను కూడా సాక్షి ప్రచురించింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి తగినంత గౌరవాన్ని ఇస్తూనే ఉంది. అయినా చంద్రబాబు ‘సాక్షి’పై అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. చివరకు అప్రజాస్వామిక రీతిలో పత్రికను, రెండు చానళ్లను బహిష్కరించారు. ఒక రాజకీయ పార్టీ అందులోనూ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ విశేష ప్రజాదరణ చూరగొన్న పత్రికను బహిష్కరించాలని పిలుపునివ్వడం దేశ చరిత్రలోనే ఇంతవరకు లేదు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కాంగ్రెస్‌కు, వైఎస్‌కు వ్యతిరేకంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు పుంఖానుపుంఖాలుగా, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కథనాలు ప్రచురించాయి. అయినప్పటికీ ఆ రెండు పత్రికలు కక్షపూరితంగా వార్తలు రాస్తున్నాయని చెప్పారే తప్ప ఏనాడూ వాటిని బహిష్కరించాలని పిలుపునివ్వలేదు.

టీడీపీ నిర్ణయాన్ని ఖండించిన ఏపీడబ్ల్యూజేఎఫ్
‘సాక్షి’ పత్రిక, ‘సాక్షి’ టీవీ, టీ న్యూస్ చానళ్లను బహిష్కరించాలన్న టీడీపీ నిర్ణయాన్ని ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్), హైదరాబాద్ జర్నలిస్టుల యూనియన్‌లు తీవ్రంగా ఖండించాయి. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు పత్రికల గొంతు నొక్కడం సరైంది కాదని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు బి.బసవపున్నయ్య, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, హెచ్‌యూజే అధ్యక్షులు ఆనందం, మాజీ అధ్యక్షులు మామిడి సోమయ్యలు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఇలాంటి సాహసం ఏ రాజకీయ పార్టీ చేయలేదని తెలిపారు. తెలుగుదేశం పార్టీ మీడియాలో విభజన తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోందని, విభజించు పాలించు అనే విధానం ఏ రాజకీయ పార్టీకీ చెల్లదని అన్నారు. గతంలో కొన్ని పత్రికలు పార్టీలపైన, ప్రభుత్వంపైన విమర్శనాత్మక కథనాలు రాసినప్పటికీ, వాటిని ఆ పార్టీలు బహిష్కరించలేదన్న విషయాన్ని టీడీపీ గ్రహించాలని చెప్పారు. టీడీపీ తీసుకున్న నిర్ణయం పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఉందని, ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

అహంభావంతో కూడుకున్న నిర్ణయం : అంబటి రాంబాబు
‘సాక్షి’ పత్రిక, ‘సాక్షి’ టీవీ, టీ న్యూస్ చానళ్లను బహిష్కరిస్తూ తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకోవడం అహంభావంతో కూడుకున్న చర్య. చంద్రబాబునాయుడుకు వయసు పెరుగుతున్నకొద్దీ జ్ఞానం నశిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రసార మాధ్యమాల్లో ప్రత్యేకంగా కథనాలు రాయించుకొని, పత్రికల సహాయంతోనే నాయకునిగా గుర్తింపు తెచ్చుకున్న చంద్రబాబు.. ఇప్పుడు ప్రసార మాధ్యమాలనే బహిష్కరించడం దురదృష్టకరం. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సీఎం నిర్వహిస్తున్న చానళ్లు, పత్రికల జోలికి తెలుగుదేశం పార్టీ వెళ్లకపోవడం బాబు, కాంగ్రెస్ పార్టీల మిలాఖత్‌కు మరొక నిదర్శనంగా నిలుస్తోంది. కాంగ్రెస్‌కు అనుబంధంగా ఉన్న ప్రసార మాధ్యమాల జోలికి వెళ్లకుండా ‘సాక్షి’ని మాత్రమే బహిష్కరించడం తెలుగుదేశం పార్టీ కక్షగట్టి వ్యవహరిస్తోందని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనం. తెలుగుదేశం పార్టీ తీరును ప్రజలు క్షమించరు.

ప్రజాభిమానానికి నిదర్శనం.. ‘సాక్షి’
2008లో ప్రారంభమైన ‘సాక్షి’ దినపత్రిక తొలి సంచిక నుంచే పాఠక మహాశయుల ఆదరణ చూరగొంది. దేశంలో అతి ఎక్కువ సర్క్యులేషన్ కలిగిన పత్రికల్లో ఒకటిగా నిలుస్తోంది. దేశంలోనే అత్యంత పాఠకాదరణ కలిగిన ప్రాంతీయ భాషా పత్రికల్లో ఏడో స్థానంలో ఉంది. ‘సాక్షి’ దినపత్రిక పాఠకాదరణ రోజురోజుకూ పెరుగుతోందని చెప్పడానికి ఇండియన్ రీడర్‌షిప్ సర్వే (ఐఆర్‌ఎస్) తాజా ఫలితాలే రుజువు. క్రమం తప్పకుండా పత్రికలు చదివే పాఠకుల విభాగంలో ‘సాక్షి’ విజయపరంపర కొనసాగిస్తోంది. ఇండియన్ రీడర్‌షిప్ సర్వే (ఐఆర్‌ఎస్) తాజా నివేదిక ప్రకారం 2012 నాలుగో త్రైమాసికంలో (క్వార్టర్‌లో) పాఠకాదరణ మరింత పెరిగి మొత్తం పాఠకుల సంఖ్య 1.43 కోట్ల (143.42 లక్షలు)కు చేరుకుంది. ఐఆర్‌ఎస్ 2009 రెండో రౌండ్‌లో ‘సాక్షి’ ప్రవేశించే సమయానికి 1.25 కోట్ల మంది పాఠకులు ఉన్నారు. 2010 నాలుగో త్రైమాసికంలో ఆ సంఖ్య 1.34 కోట్లకు పెరిగింది. అలాగే 2011 ముగింపు త్రైమాసికంలో 1.42 కోట్లకు పెరిగింది. ఇంత పాఠకాదరణ కలిగిన పత్రికపై తెలుగుదేశం పార్టీ అధినేత అక్కసు వెళ్లగక్కడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

అవివేక చర్య : ఐజేయూ నేత దేవులపల్లి అమర్
‘సాక్షి’ పత్రిక, ‘సాక్షి’ టీవీ, ‘టి న్యూస్’ చానళ్లను టీడీపీ బహిష్కరించడం హాస్యాస్పదం, అవివేకం. తెలుగుదేశం పార్టీ నిర్ణయాన్ని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నా. భావప్రకటన, పత్రికా స్వేచ్ఛను గౌరవించే ఏ రాజకీయ పార్టీ ఇటువంటి నిర్ణయం తీసుకోదు. దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ ఇటువంటి నిర్ణయం తీసుకొని ఉండదు. ప్రసార మాధ్యమాలను బహిష్కరించడం ఆ పార్టీకే నష్టం. వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న కొన్ని ప్రసార మాధ్యమాలను, మీడియాను ఆహ్వానించకుండా ఉండాలనే ఆలోచనలో ఉన్నట్లు కొన్ని రోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. 

ఇది ఆలోచనకు మాత్రమే పరిమితమవుతుందని అనుకున్నా. ఆచరిస్తారని భావించలేదు. కొన్ని ప్రసార మాధ్యమాలు ఎవరికైనా వ్యతిరేకంగా కథనాలు రాస్తున్నాయని భావించినప్పుడు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలకు ఫిర్యాదు చేసుకోవచ్చు. ఇంకా తీవ్రమైనవని భావించినప్పుడు చట్టపరమైన, న్యాయపరమైన చర్యలు చేపట్టే వీలు కూడా ఉంది. ఇవన్నీ కాదని ప్రసార మాధ్యమాలు బహిష్కరించడం పత్రికా స్వేచ్ఛను, భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమే. సుదీర్ఘ కాలంపాటు రాజకీయాల్లో ఉన్న చంద్రబాబునాయుడు ఈ విషయంపై పునరాలోచించుకోవాలని కోరుతున్నా.
Share this article :

1 comments:

Laxminarayana Paladi said...

కొంతమంది, పుట్టుకే విచిత్రంగా వుంటుంది. వాళ్లు, విజయానికి విశృంఖల మార్గాన్నెంచుకుంటారు. ఆ మారార్గం తో ప్రజలు, కొన్నాళ్లు, త్వరగా మోస పోతారు. అది ఈ దుష్ఠ నాయకులకు, శాశ్వత విజయంగా అనిపిస్తుంది. యేమార్గమైతేనేం, గెలిచే దిక్కు పయనిద్దాం అని కొంతమంది,అవే గుణగణాలు గలవారీనాయకునితొ జతగడతారు. ఇలా కొన్నాళ్లు సాగుతుంది. ప్రజలు కన్ను తెరుచుకుంటారు. దుష్టత్వాన్ని దునుమాడే నిర్ణయానికొస్తారు. అప్పుడు మొదలవుతుందీ దుష్ట నాయకుల మెదళ్లలో అలజడి. పాలను నీరుగానూ, నీళ్ళను పాలుగాను చిత్రీకరించే, విఫల యత్నం ప్రారంభిస్తారు. ప్రజలు తృణీకార యోగ్యతా పత్రమిచ్చేవరకీ దుష్ఠ యత్నం, కొనసాగుతూనే వుంటుంది. ఇదంతా ప్రజలకొక దుస్వప్నంగా మిగిలిపోతుంది. ప్రజాస్వామ్యం, విజయ దుంధుభి మ్రోగిస్తుంది. దేశం కళ్లు వెళ్లబెడుతుంది. ప్రపంచం, విస్తుబోతుంది.