ఆ ముగ్గురిపై వేటు వేయలేదేం? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆ ముగ్గురిపై వేటు వేయలేదేం?

ఆ ముగ్గురిపై వేటు వేయలేదేం?

Written By news on Tuesday, June 11, 2013 | 6/11/2013

ట్యాంక్‌బండ్ నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర 
కుమ్మక్కు రాజకీయాలపై నిరసన

హైదరాబాద్: టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు ఆలోచనల ప్రకారమే ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పరిపాలన సాగుతోందని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ గ్రహించారని, వారిద్దరికీ బుద్ధి చెప్పే రోజు త్వరలో వస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరితో కలిసి హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్ నుంచి శాసనసభ వరకూ పాదయాత్ర చేశారు. విపరీతంగా పెరిగిన విద్యుత్ చార్జీలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇలా పాదయాత్ర చేసుకుంటూ అసెంబ్లీకి వచ్చారు. సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో ఆమె ట్యాంక్‌బండ్‌కు ఎమ్మెల్యేలతో కలిసి చేరుకుని తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. యాత్ర ప్రారంభానికి ముందు ఆమె మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్-టీడీపీ పొలిటికల్ ఫిక్సింగ్ రాజకీయాలపై ధ్వజమెత్తారు.

ఆ ముగ్గురిపై వేటు వేయలేదేం?

విప్‌ను ఉల్లంఘించి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసిన పదిహేను మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన విధానాన్ని విజయమ్మ ప్రశ్నించారు. వారిని అనర్హతకు గురి చేసిన తీరును తాము ఖండిస్తున్నామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రజల పక్షాన నిలబడిన వారిపై వేటు వేసి మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోకపోవ డాన్ని విజయమ్మ విమర్శించారు. ఒకవేళ చంద్రబాబు కనుక అవిశ్వాసం పెడితే వీరి ఓట్లు అవసరమవుతాయనే ఉద్దేశంతోనే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదేమోనన్నారు. రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు, సమాచారహక్కు కమిషనర్ల నియామకం, రాజ్యసభలో ఎఫ్‌డీఐలపై ఓటింగ్ వంటి అంశాలన్నింటిలోనూ చంద్రబాబు.. కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారని ఆమె విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో తాము ప్రధానంగా విపరీతంగా పెరిగిపోయిన విద్యుత్ చార్జీల అంశాన్ని ప్రస్తావిస్తామన్నారు. ఎమ్మెల్యేల అనర్హత విషయం కూడా మాట్లాడతామన్నారు.

‘రహస్య మిత్రులు’ పోస్టర్ల ప్రదర్శన

ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, మేకతోటి సుచరిత, భూమా శోభా నాగిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, బి.గురునాథ్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, తెల్లం బాలరాజు, ఆకేపాటి అమరనాథరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, బూచేపల్లి శివప్రసాదరెడ్డి వెంట రాగా విజయమ్మ ట్యాంక్‌బండ్ నుంచి బూర్గుల రామకృష్ణారావు భవన్, సచివాలయం, రిజర్వుబ్యాంకు మీదుగా నలభై నిమిషాలకు పైగా నడుచుకుంటూ అసెంబ్లీకి చేరుకున్నారు. ‘ఇండియా టుడే’పత్రిక తాజా సంచికలో ముఖచిత్ర కథనంగా ‘రహస్య మిత్రులు’ అనే శీర్షికన ప్రచురించిన కథనానికి సంబంధించి కిరణ్-బాబు ఫొటోలతో కూడిన పోస్టర్లను అందరూ చేతబూని నడిచారు. దారి పొడవునా ఎమ్మెల్యేలు... ‘జోహార్...వైఎస్సార్!’, ‘బాబు, కిరణ్ రహస్య ఒప్పందాన్ని బయట పెట్టాలి’, ‘కుమ్మక్కు రాజకీయాలు నశించాలి’ అంటూ నినాదాలు చేశారు. సమావేశ మందిరంలోకి ప్రవేశించే వరకూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూనే ఉన్నారు.
Share this article :

0 comments: