ఐఎంజీపై విచారణకు సిద్ధమా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఐఎంజీపై విచారణకు సిద్ధమా?

ఐఎంజీపై విచారణకు సిద్ధమా?

Written By news on Thursday, June 20, 2013 | 6/20/2013

- సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు బాబు ముందుకు రావాలి
- ప్రభుత్వాన్ని కాపాడుతున్నందుకే సీబీఐ దర్యాప్తు జరగడం లేదు
- ఐఎంజీకి కేటాయింపుల్లో బాబు అవకతవకలకు పాల్పడ్డారని ఆనాడు కిరణే చెప్పారు
- ఎకరా రూ.10 కోట్లు విలువచేసే భూమిని బాబు ఎకరా రూ.50 వేలకే కట్టబెట్టారు
- అదీ.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో బాబు ఐఎంజీకి భూ కేటాయింపులు చేశారు
- ఆనాడు వైఎస్ విచారణకు ఆదేశిస్తే తగినంతమంది సిబ్బంది లేరని సీబీఐ చెప్పింది

 రోజూ తమ పార్టీ నేతలపై ఆరోపణలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఐఎంజీ వ్యవహారంపై విచారణకు సిద్ధమేనా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సవాల్ చేశారు. ఐఎంజీ సంస్థకు కారుచౌకగా భూముల కేటాయింపుపై సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు చంద్రబాబు ముందుకు రావాలని డిమాండ్ చేశారు. తమ సవాల్‌ను స్వీకరించి ఆ సంస్థకు భూములు కేటాయించిన చంద్రబాబుపై విచారణ జరిపించడానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దమ్ము, ధైర్యం తెచ్చుకోవాలని సూచించారు. ఐఎంజీ వ్యవహారంలో చంద్రబాబుపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బుధవారం శాసన సభ నుంచి సస్పెండ్ చేశారు. 

అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు భూమన కరుణాకరరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి, ధర్మాన కృష్ణదాస్, బాలినేని శ్రీనివాసరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, గొల్ల బాబూరావు, ఆకేపాటి అమరనాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు నినాదాలు చేసుకుంటూ బయటకు వచ్చారు. ‘బాబుపై విచారణ కోరితే... సస్పెండ్ చేస్తారా’ అని నినాదాలు చేశారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద సహచర ఎమ్మెల్యేలతో కలిసి భూమన కరుణాకరరెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఐఎంజీ భారత సంస్థకు చేసిన భూకేటాయింపుల్లో చంద్రబాబు పాల్పడిన అవకతవకలపై న్యాయవిచారణ జరిపించాలని తాము కోరితే శాసన సభ నుంచి సస్పెండ్ చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికార, ప్రధాన ప్రతిపక్షాలను ప్రజలు గెంటివేసే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ నిలబెడుతోందన్న కారణంతోనే ఐఎంజీ వ్యవహారంలో చంద్రబాబుపై సీబీఐ దర్యాప్తు జరగడంలేదని చెప్పారు. ఐఎంజీకి భూకేటాయింపులు జరపడంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు డబ్బులు ముట్టాయని, దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కిరణ్‌కుమార్‌రెడ్డి చీఫ్ విప్‌గా ఉన్నప్పుడు డిమాండ్ చేశారని గుర్తు చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఉద్దేశపూర్వకంగానే సీబీఐ దర్యాప్తు జరిపించడంలేదని ఆరోపించారు. ఈ విషయంలో చిత్తూరు బ్రదర్స్ అయిన కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబునాయుడు కుమ్మక్కయ్యారని అన్నారు. ప్రభుత్వాన్ని కాపాడుతున్నందుకు విచారణ జరిపించనని వాళ్లకు ముఖ్యమంత్రి ప్రమాణం చేయబట్టే వెనుకంజ వేస్తున్నారని ఆరోపించారు. ఐఎంజీకి భూ కేటాయింపులపై తమ పార్టీ అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఇచ్చి సిట్టింగ్ జడ్జితో విచారణకు పట్టుబడితే ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం టీడీపీలు పారిపోయాయని అన్నారు. 

ఎకరా రూ.10 కోట్ల విలువైన భూమిని ఆనాడు చంద్రబాబు ఎకరా రూ.50 వేలకే ఇచ్చారని తెలిపారు. విశ్వవిద్యాలయానికి చెందిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం తరపున కేటాయించడం వింతగా ఉందన్నారు. అది కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఈ భూమిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఐఎంజీకి కేటాయించిన భూమిలో 450 ఎకరాలను వెనక్కి తీసుకున్నారని చెప్పారు. మిగిలిన 400 ఎకరాల భూ కేటాయింపులను రద్దు చేయాలని ప్రయత్నిస్తే ఐఎంజీ కోర్టుకు వెళ్లిందన్నారు. దీనిపై అప్పుడే విచారణకు ఆదేశిస్తే తమ దగ్గర తగినంత మంది సిబ్బంది, వనరులు లేవని సీబీఐ చెప్పడంతో దర్యాప్తు జాప్యమైందని తెలిపారు. సీబీఐ జేడీగా అప్పుడు లక్ష్మీనారాయణే ఉన్నారన్నారు. ఎంత ప్రయత్నించినా ఆనాడు మొత్తం స్థలాన్ని వైఎస్ స్వాధీనం చేసుకోలేకపోయారని తెలిపారు.
Share this article :

0 comments: