రైతుల ఇబ్బందులపై ప్రభుత్వాన్ని నిలదీసిన షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైతుల ఇబ్బందులపై ప్రభుత్వాన్ని నిలదీసిన షర్మిల

రైతుల ఇబ్బందులపై ప్రభుత్వాన్ని నిలదీసిన షర్మిల

Written By news on Wednesday, June 19, 2013 | 6/19/2013

అన్నదాతలంటే ఈ ప్రభుత్వానికి చిన్నచూపని మండిపాటు
జూన్ నెల సగం గడచినా రైతులు విత్తనాల కోసం క్యూలు కడుతూనే ఉన్నారు
ఎరువులు, విత్తనాల ధరలు పెరిగిపోయాయి
రైతుల మద్దతు ధరలు మాత్రం పెరగడం లేదు
వైఎస్ పట్టుబట్టి మరీ ధరలు తగ్గించారు
రైతులపై అలాంటి ప్రేమ, చిత్తశుద్ధి ఈ పాలకుల్లో ఏది?
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ మంగళవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 183, కిలోమీటర్లు: 2,426.1

మరో ప్రజాప్రస్థానం నుంచి సాక్షి ప్రతినిధి: ‘‘ఈ ప్రభుత్వానికి రైతులంటే అసలు విలువే లేదు. జూన్ నెలలో రైతులకు ఎరువులు, విత్తనాలు చాలా అవసరమన్న ఇంగిత జ్ఞానమే లేకుండా పోయింది. ఎక్కడ చూసినా విత్తనాలు దొరకడం లేదని, ఎరువులు దొరకడం లేదని రైతులు చెబుతున్నారు. జూన్ నెల సగం గడిచినా రైతులు విత్తనాల కోసం క్యూ కడుతూనే ఉన్నారు. దుకాణాల్లో దొరక్క దిక్కులేక బ్లాక్‌మార్కెట్‌లో కొనుక్కుంటున్నారు.. ఇదీ ఈ సర్కారుకు రైతుల మీద ఉన్న శ్రద్ధ..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి రైతులంటే శ్రద్ధ లేదు.. కనికరం లేదని మండిపడ్డారు. ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న ప్రభుత్వానికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల్లో సాగింది. కిర్లంపూడి సెంటర్‌లో జరిగిన బహిరంగ సభకు వచ్చిన అశేష జనవాహినిని ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

వైఎస్ ఉన్నప్పుడు విత్తనాలు, ఎరువుల ధరలు పెరగలేదు

‘‘అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధరలు పెరిగితే.. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు సబ్సిడీని పెంచకుండా, ఆ పెరిగిన భారాన్ని రైతులపైనే మోపుతున్నాయి. కానీ అంతర్జాతీయ మార్కెట్‌లో వాటి ధరలు తగ్గితే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు రైతులపై భారం తగ్గించకుండా సబ్సిడీలో అడ్జస్ట్ చేస్తుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత రాక్షస పాలన చేస్తోందో దీన్ని బట్టే అర్థమవుతోంది. ఇక విత్తనాల ధరలు చూస్తే బాగా పెరిగిపోయాయి. రాజశేఖరరెడ్డిగారు ఉన్నప్పుడు ఎరువుల ధరలు పెరగలేదు. విత్తనాల ధరలు కూడా పెరగలేదు. ఇప్పుడు ఎరువుల ధరలు 300 శాతం నుంచి 800 శాతం పెరిగిపోయాయి. విత్తనాల ధరలు అంతే పెరిగిపోయాయి. బీటీ పత్తి విత్తనాల ప్యాకెట్‌ను రూ.1,850కు అమ్మితే రాజశేఖరరెడ్డి గారు ఆ విత్తన కంపెనీ వాళ్లతో పోరాటం చేసి.. ‘మీరు అమ్మితే తగ్గించి అమ్మండి లేకపోతే వెళ్లిపోండి, మేం వేరే చోట నుంచి తెచ్చుకుంటాం’ అని చెప్పారు. దీంతో ఆ రోజుల్లో వాటి ధర రూ.650కి తగ్గించారు. వైఎస్ రాజశేఖరరెడ్డిగారికి రైతుల మీద, వ్యవసాయం మీద ఉన్న ప్రేమ అలాంటిది. వైఎస్ ఒకవైపు వ్యవసాయానికి అయ్యే ఖర్చును తగ్గించారు. అదే సమయంలో మద్దతు ధరను పెంచారు. కానీ ఈ సర్కారుకు అంత పెద్ద మనసు లేదు. ఎరువుల ధరలు, విత్తనాల ధరలు పెంచింది. కానీ మద్దతు ధర పెరగలేదు. అంటే ఖర్చులు పెరిగిపోయాయి. రాబడి తగ్గిపోయింది. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల కరెంటు లేక, నీళ్లు లేక దిగుబడి కూడా తగ్గిపోయింది. ఈ ప్రభుత్వం రైతులను ఎన్ని విధాలుగా హింసించాలో అన్ని విధాలా హింసిస్తోంది. కిరణ్ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో ఎక్కడా కరెంటు లేదు. వైఎస్ బతికే ఉంటే ఈ రోజు రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ అందేది. ఈ పాలకులు తొమ్మిది గంటలు కాదు కదా, వైఎస్ ఇచ్చి చూపించిన ఏడు గంటలు కాదు కదా, కనీసం మూడు గంటలు కూడా ఇవ్వడం లేదు. అదీ అర్ధగంటకోసారి, గంటకోసారి.. ముక్కలు చెక్కలు చేసి ఇస్తున్నారని రైతులు చెబుతున్నారు. వైఎస్ బతికి ఉన్నప్పుడు ఏలేరు ఆధునీకరణ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. రూ.138 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన కూడా చేశారు. ఆయన వెళ్లిపోయాక ఈ ప్రభుత్వం ఆ పనులను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఇక్కడున్న నేతలు ఆ ప్రాజెక్టు కోసం పాదయాత్ర కూడా చేశారు. కానీ ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడలేదు. రాజన్న రాజ్యం రాగానే జగనన్న ఏలేరు ప్రాజెక్టును పూర్తిచేస్తారు.

బాబుకు స్వార్థం లేదంటే టీడీపీ వాళ్లు కూడా నమ్మరు

చంద్రబాబు అంటున్నారు.. ఆయనకు స్వార్థం లేదట, పదవీ వ్యామోహం లేద ట. అవేమీ లేకపోతే ఎన్టీఆర్ పదవిని ఎందుకు లాగేసుకున్నట్టు? ఈయనకు అవేమీ లేకపోతే ఎన్టీఆర్‌గారి కొడుకుల్లో ఏ ఒక్కరినో తీసుకువచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టకుండా అందరినీ పక్కకుతోసేసి చంద్రబాబు ఎందుకు కూర్చున్నట్టు? చంద్రబాబుకు పదవీ వ్యామోహం, స్వార్థం లేదంటే టీడీపీ వాళ్లు కూడా నమ్మరు. చంద్రబాబుకు ప్రజాసేవ ముఖ్యమట.. రాష్ట్రంలో వెలుగులు నింపుతానని చెబుతున్నారు. ప్రజాసేవే ముఖ్యమైతే సీఎంగా ఉన్న సమయంలో ఎందుకు చేయలేదు. అంత దారుణంగా ప్రజలను ఎందుకు హింసించారు? వెలుగునింపే వాడైతే నాడు గ్రామాలను శ్మశానాలుగా ఎందుకు మార్చారు? రైతుల జీవితాలను ఎందుకు బుగ్గిపాలు చేశారు? ఒక సామెత ఉంది. వినేవాడు వెర్రివాడైతే చెప్పేవాడు వేదాంతట. ప్రజలు వెర్రివాళ్లని, తాను వేదాంతినని చంద్రబాబు అభిప్రాయం. ఈ కాంగ్రెస్, టీడీపీ నాయకులను రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ క్షమించరు.’’

13.6 కిలోమీటర్లమేర నడక: మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 183వరోజు మంగళవారం ఉదయం 9 గంటలకు పెద్దాపురం నియోజకవర్గం పులిమేరు శివారు నుంచి ప్రారంభమైంది. చదలాడ, తిరుపతి, దివిలి, రాజుపాలెం, కిర్లంపూడి మీదుగా సాగింది. కిర్లంపూడి శివారు పద్మసాయి మోడ్రన్ రైస్ మిల్లులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాతి ఏడున్నర గంటలకు షర్మిల చేరుకున్నారు. మంగళవారం 13.6 కి.మీ. నడిచారు. ఇప్పటివరకు మొత్తం 2,426.1 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న వారిలో పార్టీ సీజీసీ సభ్యులు జ్యోతుల నెహ్రూ, పిల్లి సుభాష్‌చంద్రబోస్, జక్కంపూడి విజయలక్ష్మి, వెంకటరమణ, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, ఎం.ప్రసాదరాజు, చిర్ల జగ్గిరెడ్డి, పెండెం దొరబాబు, పార్టీ జిల్లా కన్వీనర్ కుడిపూడి చిట్టబ్బాయి, పార్టీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, మాజీ ఎంపీ బుచ్చిమహేశ్వరరావు, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి, రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని, ఆదిలాబాద్ జిల్లా కో కన్వీనర్ ప్రసాద్, స్థానిక నేతలు చలమలశెట్టి సునీల్, కొత్తపల్లి గీత తదితరులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: