పింఛన్లూ లాగేసుకుంటారా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పింఛన్లూ లాగేసుకుంటారా?

పింఛన్లూ లాగేసుకుంటారా?

Written By news on Wednesday, June 26, 2013 | 6/26/2013

పాదయాత్రలో గోడు వెళ్లబోసుకున్న వికలాంగులు, వృద్ధులు.. చలించిన షర్మిల
వికలాంగులకు, వృద్ధులకు సహాయం చేయలేని వాళ్లు పాలకులా.. రాక్షసులా అని ధ్వజం
జగనన్న వికలాంగులను, వృద్ధులను సంతోషంగా ఉంచుతారని స్పష్టీకరణ
అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పార్టీ నేతలకు సూచన
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ మంగళవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 190,కిలోమీటర్లు: 2,520.1

మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి
‘‘వయసు మళ్లి రాలటానికి సిద్ధంగా ఉన్న పండుటాకులు, తోడు లేనిదే ముందుకు సాగలేని వికలాంగులకు సర్కారే అండగా నిలబడాలి. చేతనైనంత సాయం చేయాలి. సర్కారు అందించే పింఛను మినహా అవ్వా తాతలకు, వికలాంగులకు మరో ఆధారం లేదు. మానవతా దృక్పథంతో వీళ్లకు సహాయం చేయాల్సిన ప్రభుత్వం వాళ్లకిచ్చే పింఛన్లకు కూడా తూట్లు పొడుస్తోంది. వీళ్లు పాలకులా? రాక్షసులా’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా దానితో అంటకాగుతున్న చంద్రబాబునాయుడు వైఖరిని నిరసిస్తూ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో సాగింది. నాతవరం మండలంలోని పల్లెల గుండా ఆమె నడుచుకుంటూ వెళ్తుండగా దారిలో వంద మందికి పైగా వృద్ధులు, వికలాంగులు షర్మిలను కలిసి వారి గోడు వెళ్లబోసుకున్నారు. ‘‘అమ్మా.. నాకు ఏడేళ్లు పింఛన్ వచ్చింది. రెండేళ్ల నుంచి తీసేశారు’’ అని వృద్ధుడు కె.చిన్నారావు చెప్పారు. తనకు పింఛన్ రావడంలేదని నూకాలమ్మ ఆవేదనతో తెలిపింది.

సింగంపల్లి నారాయణమ్మ, మహాలక్ష్మమ్మ, అచ్చాయమ్మ, జగ్గునాయుడు, వన్నాల కుమారి.. ఇలా వృద్ధులు, వికలాంగులు పింఛన్ రావట్లేదని కొందరు, పింఛన్ తీసేశారని ఇంకొందరు షర్మిల వద్ద కన్నీళ్లు పెట్టుకున్నారు. వాళ్ల ఆవేదన చూసి షర్మిల చలించిపోయారు. ఇంత మందికి పింఛన్ రావడంలేదాఅంటూ ఆశ్చర్యపోయారు. ‘‘వికలాంగులకు, వృద్ధులకు పింఛన్ ఇస్తే ఖజానా ఖాళీ అవుతుందా? వికలాంగుల పింఛన్లు లాగేసుకుంటారా? ఈ పాలకులకు, రాక్షసులకు తేడా లేదు’’ అంటూ మండిపడ్డారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ మంజూరు చేసేలా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని, అవసరమైతే కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగాలని పక్కనే ఉన్న నర్సీపట్నం నియోజకవర్గం సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్‌ను కోరారు. ఈ సందర్భంగా షర్మిల పలు చోట్ల మాట్లాడారు.

‘‘వైఎస్సార్ మానసిక వికలాంగులకు కూడా పింఛన్ ఇచ్చారు. అదీ ఆయనకున్న గొప్ప మనసు. చంద్రబాబునాయుడు హయాంలో కేవలం 16 లక్షల మందికి పింఛన్ ఇస్తే.., వైఎస్సార్ 71 లక్షల మందికి ఇచ్చారు. వికలాంగుల పట్ల ఇంకొంచెం ప్రేమ, ఆప్యాయతతో మెలగాలని, అలా చేయకపోతే మనకు, రాక్షసులకు తేడా ఉండదని వైఎస్సార్ అనేవారు. ఆయన రెక్కల కష్టం మీద వచ్చిన ఈ ప్రభుత్వం వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సింది పోయి, ఆయన పథకాలను తుంగలో తొక్కుతోంది. వృద్ధులను, వికలాంగులను గాలికి వదిలేసింది. పింఛన్ డబ్బు సరిపోవడంలేదు పెంచండి మహాప్రభో అని వాళ్లు మొరపెట్టుకుంటుంటే.. ఉన్న పింఛన్లు ఊడపీకేస్తున్న ఈ ప్రభుత్వం ఉంటే ఎంత? లేకుంటే ఎంత? అమ్మా..! మీరు అధైర్యపడవద్దు. త్వరలోనే మీరు కోరుకున్నట్టుగానే జగనన్న వస్తాడు. వైఎస్సార్ ఏ విధంగాై మీకు సహాయపడ్డారో.., జగనన్న కూడా అదే విధంగా మిమ్మల్ని ఆదరిస్తారు. ఎందుకంటే.. రాజన్నకున్న మంచి మనసు జగనన్నకు ఉంది. మీ గురించి జగనన్న ఎప్పుడో ఆలోచన చేశారు. మీరు చేస్తున్న డిమాండ్లలో చాలావరకు జగనన్న ప్లీనరీలోనే ప్రకటించారు. మీ అందరినీ జగనన్న సంతోషంగా ఉంచుతారు. అవ్వాతాతలు ఈ వయసులో పనికి పోవాల్సిన అవసరమే రాకుండా జగనన్న చూసుకుంటారు. చదువు లేని వికలాంగులు చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలిచ్చి వారి కాళ్ల మీద వారు నిలబడే విధంగా ప్రోత్సహిస్తారు’’ అని షర్మిల చెప్పారు.

12.7 కిలోమీటర్లు నడిచిన షర్మిల

మంగళవారం 190వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని ఎ శరభవరం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి శృంగవరం, గాంధీనగరం, తాండవ కూడలి, ఎర్రవరం కూడలి, ములగపూడి మీదుగా బెన్నవరం చేరుకున్నారు. బెన్నవరం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.30 గంటలకు చేరుకున్నారు. మంగళవారం మొత్తం 12.7 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 2,520.10 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా పార్టీ కన్వీనర్, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, కుంబం రవిబాబు, జ్యోతుల నెహ్రూ, అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ, పార్టీ నేత ఆర్కే, నియోజకవర్గాల కోఆర్డినేటర్లు పెట్ల ఉమాశంకర్ గణేష్, కిడారి సర్వేశ్వరరావు, బొడ్డేటి ప్రసాద్, కోరాడ రాజ బాబు, పాడేరు సత్యవాణి, జీవీ రవిరాజు, స్థానిక నాయకులు కోయ ప్రసాదరెడ్డి, పీలా ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.

షర్మిల చరిత్ర సృష్టించబోతున్నారు: తలశిల రఘురాం

100 నియోజకవర్గాల్లో నడిచిన నేతగా షర్మిల ప్రపంచ రికార్డు సృష్టించబోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం చెప్పారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌కు చేరుకోవడంతోనే 100 నియోజకవర్గాలు పూర్తవుతాయని వివరించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు 86 నియోజకవర్గాలు, 152 మండలాల్లో నడవగా, షర్మిల ఆ రికార్డును ఎప్పుడో దాటేశారని తెలిపారు. ఇప్పటికే ఆమె 92 నియోజకవర్గాలు, 153 మండలాల్లో పాదయాత్ర చేశారని చెప్పారు. మొత్తంగా 1,550 గ్రామాల్లో లక్షలాది రైతులను, మహిళలను, వృద్ధులను, యువతను, నిరుద్యోగులను కలిశారని చెప్పారు. వైఎస్సార్ ఎంత నిబద్ధతతో ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్ర చేశారో, షర్మిల కూడా అంతే నిబద్ధతతో ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రను కొనసాగిస్తున్నారని తెలిపారు.
- See more at: http://www.sakshi.com/main/FullStory.aspx?catid=625781&Categoryid=1&subcatid=33#sthash.2ayMYitX.dpuf
Share this article :

0 comments: