ప్రతి పంచాయతీలో పార్టీ జెండా ఎగరాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రతి పంచాయతీలో పార్టీ జెండా ఎగరాలి

ప్రతి పంచాయతీలో పార్టీ జెండా ఎగరాలి

Written By news on Saturday, June 15, 2013 | 6/15/2013

కాంగ్రెస్, టీడీపీల కుట్రలను భగ్నం చేయాలి
కనీసం 80 శాతం సీట్లలో పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవాలి
నవంబర్, డిసెంబర్ నెలల్లో సార్వత్రిక ఎన్నికలు వచ్చే అవకాశం
కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలే సెలవిస్తారు

సాక్షి, తిరుపతి: కాంగ్రెస్, టీడీపీల కుట్రలను భగ్నం చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించాలని, పార్టీ నేతలంతా ఇదే లక్ష్యంతో పనిచేయాలని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు ైవె ఎస్ విజయమ్మ పిలుపునిచ్చారు. కనీసం 80 శాతం సీట్లలో గెలిపించి, పార్టీకి క్యాడర్ లేదనే అపవాదు తొలగిపోయేలా చేయాలని కోరారు. ప్రతి పంచాయతీలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలని చెప్పారు. శుక్రవారం తిరుపతిలోని వైఎస్సార్ ప్రాంగణంలో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన జరిగిన ‘పంచాయతీ ఎన్నికలు - ప్రజా ప్రతినిధులు’ సదస్సు ప్రారంభ, ముగింపు సమావేశాల్లో ఆమె ప్రసంగించారు. తొలుత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి విజయమ్మ పుష్పాంజలి ఘటించారు. 

అనంతరం సదస్సులో పాల్గొన్న రాయలసీమ జిల్లాలు, నెల్లూరు జిల్లాకు చెందిన ప్రతినిధులనుద్దేశించి మాట్లాడారు. స్థానిక ఎన్నికలు పార్టీకి గట్టి పునాది అవుతాయని, తద్వారా భవిష్యత్తులో వైఎస్ సువర్ణయుగం వస్తుందని తెలిపారు. జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాభిమానం ఉందని చెప్పారు. పల్లెల్లో జగన్‌మోహన్‌రెడ్డి గాలి వీస్తోందని నిర్లక్ష్యం చేయకూడదని హితవు పలికారు. పోటీలో దిగేందుకు ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నా, అందరూ కలిసి ఒకరిని ఎంపిక చేసుకొని, విజయం కోసం పని చేయాలని సూచించారు. 

నామినేషన్ నుంచి ఫలితాలు వచ్చేవరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఓటర్ల జాబితాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అన్ని పంచాయతీల్లో విజయం సాధించి, జగన్‌మోహన్‌రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ముగిశాక విజయోత్సవ సభకు తిరిగి వస్తానని, దేవుడు కరుణిస్తే ఆ సభకు జగన్‌మోహన్‌రెడ్డి కూడా వస్తారని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడి గెలుపొందాలని చూస్తున్నారని, వారి అక్రమాలను సమర్థంగా ఎదుర్కోవాలని చెప్పారు. సీఎం కిరణ్ నియంతలా వ్యవహరిస్తున్నారని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించే స్థితిలో లేరని అన్నారు. చంద్రబాబు అవినీతి, ఆయనపై ఉన్న కేసులు, కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలను, సీబీఐ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలా పనిచేస్తోందనే విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. ప్రభుత్వం క్రాప్ హాలిడే, పవర్ హాలిడే ఇచ్చిందని, త్వరలో ప్రజలు కాంగ్రెస్, టీడీపీలకు హాలిడే ఇస్తారని అన్నారు. పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించకపోవడంతో రూ.350 కోట్ల డీఆర్‌డీఏ నిధులు, 2013-14 సంవత్సరానికి రావాల్సిన రూ. 2,400 కోట్ల నిధులు నిలిచిపోయాయని తెలిపారు. బీసీ జనాభా దామాషాను దృష్టిలో ఉంచుకుని వారిని పోటీకి దింపాలని జగన్‌ఏనాడో సూచించారని తెలిపారు. 

జైల్లో ఉన్నా జగన్‌ను వదలడంలేదు: జగన్‌మోహన్‌రెడ్డి జైలులో ఉన్నా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వదలడంలేదని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. జైలులో చిన్న గదిలో మూడడుగుల మంచం మీద పడుకుంటున్న జగన్‌ని చూస్తే కళ్లల్లో నీళ్లు వస్తున్నాయని అన్నారు. ఆయనకు పక్కకు తిరిగితే పడిపోయే మంచం, ఒక ఫ్యాన్ ఉంటుందని తెలిపారు. ఒక టాయిలెట్‌ను ముగ్గురు ఉపయోగించుకోవాలని చెప్పారు. అటువంటి జీవితం గడుపుతున్న జగన్‌పై టీడీపీ లేనిపోని ఆరోపణలు చేయడం దారుణమన్నారు. 

నీలి చిత్రాలు చూస్తున్నాడని, మద్యం సేవిస్తున్నాడని అనడం బాధ కలిగిస్తోందని అన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లతోనే సాగుతోందన్నారు. 26 జీవోల విషయంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణలకు ఒక న్యాయం, మిగిలిన మంత్రులకు మరో న్యాయం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. జగన్‌పై ఉన్న అరవిందో, హెటిరో, రామ్‌కీ, దాల్మియా, ఎమ్మార్, ఇండియా సిమెంట్స్ వంటి కేసులన్నీ తప్పుడువేనని చెప్పారు. పరిశ్రమలకు రాయితీలు ఇవ్వడం సహజమేనని, ఇటీవల ముఖ్యమంత్రి చిత్తూరు జిల్లాలో ఒక సంస్థకు 135 శాతం రాయితీలిచ్చారని తెలిపారు. 

రాజీవ్‌గాంధీ మరణించిన తర్వాత ఆయన పేరును బోఫోర్సు కేసు నుంచి తొలగించారని, అయితే వైఎస్ పేరును ఆయన మరణించినా నమోదు చేయడం రాజకీయ కక్ష సాధింపు కాక మరేమిటని ప్రశ్నించారు. జగన్‌మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉంటే కేంద్ర మంత్రో, ముఖ్యమంత్రో అయిఉండేవారని కాంగ్రెస్ రాష్ట్ర పరిశీలకులు గులాంనబీ ఆజాద్ చెబుతున్నారని, ఆ మాటలనుబట్టే కుట్ర అర్థమవుతోందని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా దేవుడు ఉన్నాడని, ఆయనే చూసుకుంటాడని కార్యకర్తలకు మనోధైర్యం నింపారు. జగన్ జైలులో ఉన్నా, ఆయన మనసంతా ప్రజల మీదే ఉందన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం నిత్యం ప్రజల మధ్యే గడిపిన జగన్ జైలులో ఉన్నప్పటికీ, పార్టీకి దిశ, దశ నిర్దేశిస్తూ ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో సార్వత్రిక ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం ఇప్పటికే బొగ్గు, 2జీ స్పెక్ట్రమ్, కామన్‌వెల్త్ క్రీడలు, ఆదర్శ్ కేసుల్లో కూరుకుపోయిందని చెప్పారు. 

పంచాయతీ ఎన్నికలను సవాలుగా తీసుకుని ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలని సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి కోరారు. జగన్‌మోహన్‌రెడ్డిని ఒక్క నిమిషం విడుదల చేసి ఎన్నికలు నిర్వహిస్తే ఏ పార్టీకీ ఒక్క స్థానంలో కూడా డిపాజిట్లు దక్కవని పార్టీ రాయలసీమ కన్వీనర్ భూమా నాగిరెడ్డి అన్నారు. అంతకు ముందు స్థానిక ఎన్నికల్లో గెలుపొందేందుకు అందరూ కృషి చేస్తామని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు నాయకుల చేత ప్రమాణం చేయించారు. ఈ సదస్సులో పార్టీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు శోభా నాగిరెడ్డి, కె.శ్రీనివాసులు, కాపు రామచంద్రారెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు, మాజీ ఎమ్మెల్యేలు ఏఎస్ మనోహర్, అమరనాథరెడ్డి, పార్టీ నేతలు విజయ్‌చందర్, ఆర్.కె.రోజా, బియ్యపు మధుసూదనరెడ్డి, నారాయణరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఐదు జిల్లాల కన్వీనర్లు పాల్గొన్నారు.
Share this article :

0 comments: