అధికార పక్షానికి ప్రధాన ప్రతిపక్షం భరోసా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అధికార పక్షానికి ప్రధాన ప్రతిపక్షం భరోసా

అధికార పక్షానికి ప్రధాన ప్రతిపక్షం భరోసా

Written By news on Friday, June 7, 2013 | 6/07/2013


సాక్షి, హైదరాబాద్: ఎటు చూస్తే అటు అసమ్మతులు, అసంతృప్తులు. కేబినెట్లోనే ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య ముదురు పాకాన పడ్డ అంతర్గత పోరు. పార్టీ నుంచి నానాటికీ పెరిగిపోతున్న ఎంపీలు, ఎమ్మెల్యేల వలసలు. వెరసి పీకల్లోతు కష్టాలు. అయినా సరే.. సీఎం కిర ణ్ సహా కాంగ్రెస్ పెద్దలెవరిలోనూ ఎలాంటి అలజడీ లేదు. పైగా మిన్ను విరిగి మీద పడ్డా ప్రభుత్వానికి ఏమీ కాదన్న ధైర్యమే వారిలో కన్పిస్తోంది. 

అసెంబ్లీలో తగినంత బలం లేక ప్రభుత్వం మైనారిటీలో కొట్టుమిట్టాడుతున్నా, దాని మనుగడకు మాత్రం ఢోకా లేదని కాంగ్రెస్ పెద్దలు ఎంతో ధీమాగా ఉన్నారు. పైగా రాష్ట్ర పార్టీలో నానాటికీ ముదురుతున్న కుమ్ములాటలను కూడా అధిష్టానం తేలిగ్గా తీసుకుంటోంది. ఈ ధీమాకు కారణం ఏమిటంటే... చంద్రబాబు అండదండలేనన్న మాట కాంగ్రెస్ నేతల్లోనే గట్టిగా వినిపిస్తోంది.
జూన్ 10 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అధికార పార్టీలో ఇప్పుడున్న అసంతృప్తుల నేపథ్యంలో ప్రభుత్వ నేతల్లో ఆందోళన, అలజడి సాధారణం. ఇలాంటి సమయంలో సాధ్యమైనంత వరకు పార్టీలోని వారందరినీ కలుపుకుపోవడం ద్వారా అసంతృప్తిని తగ్గించుకోవడంతో పాటు ఇతర మిత్రపక్షాలనూ మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించడం పరిపాటి. కానీ కిరణ్ మాత్రం అలాంటివేవీ చేయకపోగా, అసమ్మతివాదుల విషయంలో దూకుడు మరింత పెంచారు. 

డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సీనియర్ మంత్రి జానారెడ్డి తదితరులతో సీఎం కీచులాటలు మరింత ముదిరాయి. సీనియర్ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని బర్తరఫ్ చేయడమే గాక మరో ఇద్దరు మంత్రులపై వేటు వేస్తాననే సంకేతాలతో కయ్యానికి కాలుదువ్వుతున్నారు. అందులోనూ కేంద్ర మంత్రి చిరంజీవికి అత్యంత సన్నిహితుడైన మంత్రి సి.రామచంద్రయ్యపై వేటు వేసే యోచనలో కిరణ్ ఉన్నారు. తద్వారా... 17 మంది ఎమ్మెల్యేలతో తన ప్రభుత్వాన్ని నిలబెట్టిన చిరంజీవి వర్గీయులతో వైరానికి ఆయన సిద్ధపడుతుండడం విశేషం. మైనారిటీ సర్కారును నడుపుతూ అసెంబ్లీ సమావేశాలకు ముందు సీఎం ఇలాంటి వైఖరి అనుసరించడం, అధిష్టానం కూడా కిమ్మనకపోవడం కాంగ్రెస్ నేతలను సైతం విస్మయానికి గురి చేస్తోంది. కాంగ్రెస్‌లో దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది. కేవలం టీడీపీ అధ్యక్షుని అండదండ లు చూసుకునే... ప్రభుత్వానికి ఢోకా లేదన్న భరోసాతోనే కిరణ్, కాంగ్రెస్ పెద్దలు ఇలా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.

బాబు అభయ ‘హస్తం’

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోకుండా ఇప్పటికి రెండుసార్లు చంద్రబాబే ఆదుకున్నారు. ఇప్పుడు కూడా ఈ విషయమై కాంగ్రెస్ అధిష్టానానికి బాబు నుంచి స్పష్టమైన హామీ ఉందని ఏఐసీసీ నేతలే చెబుతున్నారు. ‘‘చంద్రబాబు ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ నేతలను కాదని నేరుగా ఢిల్లీలోని పెద్దలతోనే అన్ని విషయాలూ మాట్లాడుతున్నారు. ఎప్పుడేం చేయాలో కూడా ఆయనే సూచిస్తున్నారు. ఆయన సూచనలపై అవసరమైతే ఢిల్లీ పెద్దలు రాష్ట్ర నేతలతో సంప్రదించడం, వాటినే అమలు చేయాలని ఆదేశించడం కొంతకాలంగా పరిపాటి అయింది’’ అంటూ ఏఐసీసీ ముఖ్యడితో సత్సంబంధాలున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడొకరు అసలు గుట్టు విప్పారు. ఈ నేపథ్యంలో త్వరలో ప్రారంభం కాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు అనుసరించబోయే వ్యూహంపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. 

గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం అడ్డగోలుగా కరెంట్ చార్జీలు పెంచి సామాన్యుల నడ్డి విరిచినా, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌పై చర్చ జరిగినా ప్రధాన ప్రతిపక్ష నేత అయి కూడా బాబు కనీసం అసెంబ్లీ ముఖమే చూడలేదు. ప్రభుత్వ మనుగడకు కనీసం 148 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా, కాంగ్రెస్‌కు ఇప్పుడున్నది 146 మంది మాత్రమే. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ మైనారిటీ ప్రభుత్వంపై బాబు అవిశ్వాసం ప్రతిపాదిస్తారా, లేదా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ నేతలు మాత్రం అందుకు ఏమాత్రం అవకాశం లేదని ఘంటాపథంగా చెబుతున్నారు. ‘‘చంద్రబాబు ఆ పని చేయరు. ఆ మేరకు మాకిప్పటికే భరోసా ఇచ్చారు. ప్రజల నుంచి విమర్శలు రాకుండా ఉండేందుకు ఒకవేళ అవిశ్వాసం పెట్టినా, ప్రభుత్వం పడిపోకుండా ఉండే విధంగా చూస్తానంటూ ఆయనే హామీ కూడా ఇచ్చారు. కాబట్టి మాకేమీ నష్టం లేదు’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు స్పష్టంగా చెప్పారు. ఈ విషయమై కాంగ్రెస్ పెద్దలకు బాబు ముందస్తుగానే కొన్ని ‘సలహాలు, సూచనలు’ కూడా చేసినట్టు తెలుస్తోంది. 

గత మార్చిలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా కాంగ్రెస్, టీడీపీలకు చెందిన 18 మంది ఎమ్మెల్యేలు పార్టీల విప్‌లను ఉల్లంఘించి నిరసన తెలపడం, వారి అనర్హత పిటిషన్లు స్పీకర్ విచారణలో ఉండటం తెలిసిందే. వాటిపై అసెంబ్లీ సమావేశాల్లోపు నిర్ణయం వెలువ రించాలని, ఆ తర్వాతే అవిశ్వాసం ప్రతిపాదిస్తామని కాంగ్రెస్‌కు బాబు చెప్పారంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుజయకృష్ణ రంగారావు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఆళ్ల నాని, మద్దాల రాజేశ్‌కుమార్, జోగి రమేశ్, పేర్ని నాని, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీడీపీకి చెందిన పిరియా సాయిరాజ్, తానేటి వనిత, కొడాలి నాని, వై.బాలనాగిరెడ్డి, ఎ.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎన్.అమర్‌నాథ్‌రెడ్డిలపై అసెంబ్లీ భేటీకి ముందే అనర్హత చర్యలు తీసుకోవచ్చని తెలుస్తోంది. మిగతా ముగ్గురు హరీశ్వర్‌రెడ్డి, వేణుగోపాలచారి, చిన్నంరామకోటయ్యలపై విచారణ ఇంకా కొనసాగుతున్నందున వారిపై చర్యలు ఇప్పుడు ఉంటాయో, లేదో తేలాల్సి ఉంది. తాను అవిశ్వాసం పెట్టినా పెట్టకున్నా వైఎస్సార్‌సీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని మాత్రం బాబు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. తద్వారా అసెంబ్లీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు తగ్గడమే గాక ఈ సమావేశాల్లో ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదని బాబు, కాంగ్రెస్ పెద్దలు కూడా ఒక అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్‌తో బాబు క్విడ్ ప్రొ కొ

మూడేళ్లుగా అనేక విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చంద్రబాబు అండదండలు అందిస్తూనే ఉన్నారు. మూడేళ్లలో ప్రభుత్వం సామాన్యులపై అనేక విధాలుగా భారం మోపింది. కరెంట్ చార్జీలనైతే అడ్డగోలుగా పెంచింది. బాబు అండ ఉన్నందున ప్రభుత్వ మనుడకు ఢోకా లేదన్న భరోసాతోనే ఏకంగా రూ.32 వేల కోట్ల మేరకు భారం మోపింది. ఇంత జరుగుతున్నా ప్రధాన ప్రతిపక్షం నుంచి పెద్ద నిరసనలు రాకపోవడం కాంగ్రెస్‌లోని కింది స్థాయి నేతలు, కార్యకర్తలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సహకారానికి బాబుకు మంచి ప్రతిఫలమే లభించిందని కాంగ్రెస్ ముఖ్యులు చెబుతున్నారు. ఎమ్మార్ కేసులో బాబును సీబీఐ విచారించకపోవడాన్ని వారిక్కడ ప్రస్తావిస్తున్నారు. అతి విలువైన భూములను కారు చౌకగా ఐఎంజీకి కట్టబెట్టిన వ్యవహారం తన మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న భయంతో కూడా బాబు కాంగ్రెస్‌కు అండదండలు అందిస్తున్నారన్న వాదన ఎంతోకాలంగా వినిపిస్తోంది. ఇలా కేసుల వ్యవహారం చుట్టుకోకుండా బాబు, ప్రభుత్వం పడిపోకుండా కాంగ్రెస్ పరస్పర సహకారంతో ‘ముందుకు’ పోతున్నట్టు కన్పిస్తోందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.

సంఖ్య మరింత తగ్గినా బేఖాతర్!

గత అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రభుత్వానికి అనుకూలంగా పడ్డ ఓట్లు 140 మాత్రమే. మొత్తం 294 మంది సభ్యుల్లో 148 మంది సభ్యుల బలముంటేనే మెజార్టీ ఉన్నట్టు. ప్రభుత్వానికి ఆమేరకు సంఖ్యాబలం రాలేదు. సాంకేతికంగా కాంగ్రెస్‌కు 155 మంది సభ్యులుండగా అవిశ్వాస పరీక్షలో వారిలో 9 మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు. దాంతో కాంగ్రెస్ బలం 146కు కుదించుకుపోయింది. మంత్రి వట్టి వసంతకుమార్ సహా కొందరు సభ్యులు ఓటింగ్‌కు గైర్హాజరవడంతో ప్రభుత్వానికి అనుకూలంగా 140 ఓట్లే వచ్చాయి. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కేవలం బాబు తటస్థ వైఖరి వల్లే ప్రభుత్వం అవిశ్వాసం గండాన్ని గట్టెక్కగలిగింది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్‌లో మారిన పరిస్థితుల్లో మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కిరణ్ పట్ల తీవ్ర అసంతృప్తి గూడు కట్టుకుని ఉంది. కాంగ్రెస్ అనుబంధ సభ్యునిగా కొనసాగిన కూన శ్రీశైలం గౌడ్ ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీడీపీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ టీఆర్‌ఎస్‌లో చేరారు. వీరిద్దరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసేవారే. సీనియర్ తెలంగాణ నేత కె.కేశవరావుతో పాటు కాంగ్రెస్ ఎంపీలు వివేక్, మందా జగన్నాథం పార్టీని వీడడానికి కిరణ్ వైఖరీ కారణమేనన్న వాదన ఆ ప్రాంత నేతల్లో ఉంది. ఈ తరుణంలో మళ్లీ అవిశ్వాసం ఎదురైతే తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తారో, ముఖం చాటేస్తారోనన్న అనుమానాలు ఆ పార్టీ నేతల్లోనే నెలకొన్నాయి. ఈ రకంగా అసెంబ్లీలో కిరణ్ సర్కారు బలం మరింత తగ్గిపోనుంది. డీఎల్ బర్తరఫ్ సీమాంధ్రకు చెందిన సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేల్లో అసంతృప్తికి కారణమైంది. డీఎల్ కూడా అవిశ్వాసం వంటి అవకాశాన్ని ‘వినియోగించుకుంటారన్న’ వాదన వినిపిస్తోంది. దామోదర కూడా కిరణ్‌పై ఆగ్రహంతో ఉన్నారు. 

డిప్యూటీ సీఎంకు మద్దతుగా ఉన్న దళిత ఎమ్మెల్యేల్లోనూ ఇదే అభిప్రాయం ఉంది. ఇక మాజీ మంత్రి పి.శంకర్రావు కిరణ్‌పై సుప్రీంకోర్టులో కేసు వేసేందుకూ సిద్ధపడుతున్నారు. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకవేళ టీడీపీయే అవిశ్వాసం పెట్టాల్సి వచ్చినా సర్కారుకు ఇబ్బంది లేకుండా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు సాధ్యమైనంత మేరకు తగ్గిపోయేలా చూసేందుకు కాంగ్రెస్ పెద్దలు, చంద్రబాబు తర్జనభర్జన పడుతున్నారు. ‘‘వైఎస్సార్‌సీపీలోకి వెళ్లిన తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు టీడీపీకి చెందిన ఆరుగురిపైనా ముందుగా అనర్హత వేటు వేయిం చడం అందులో మొదటిది. అప్పటికీ ప్రభుత్వానికి ముప్పు వాటిల్లే పరిస్థితే ఉంటే టీడీపీ అవిశ్వాసం పెట్టబోదు. ఒకవేళ పెట్టినా టీడీపీ ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు దూరంగా ఉంటారు. కాబట్టి ఏదేమైనా ప్రభుత్వానికి ఢోకా ఉండదు. ఈ విషయంలో కాంగ్రెస్ పెద్దలకిచ్చిన హామీని బాబు వమ్ము చేయరు. జరిగేదిదే’’ అని కాంగ్రెస్ నేతలే గట్టిగా చెబుతున్నారు!
Share this article :

0 comments: