విజయమ్మ జోగిపేట పర్యటన విజయవంతం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విజయమ్మ జోగిపేట పర్యటన విజయవంతం

విజయమ్మ జోగిపేట పర్యటన విజయవంతం

Written By news on Tuesday, June 25, 2013 | 6/25/2013

జోగిపేట: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మెదక్ జిల్లా జోగిపేట పర్యటన విజయవంతమైంది. స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఈరోజు నుంచి విజయమ్మ తెలంగాణ జిల్లాలలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఉదయం ఆమె హైదరాబాద్ నుంచి మెదక్ జిల్లా పర్యటనకు బయలుదేరారు. మెదక్ జిల్లాలో అడుగుపెట్టగానే ఆమెకు అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో ప్రజలను ఉద్దేశించి విజయమ్మ ప్రసంగించారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆమె విమర్శించారు. పార్టీ శ్రేణులు ప్రజా క్షేత్రంలో విస్త్రతంగా పర్యటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా విజయమ్మ సమక్షంలో యువజన కాంగ్రెస్ నేత మనోజ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మనోజ్ రెడ్డికి ఆమె పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆమె వెళ్లే మార్గంలో సింగూరు ప్రాజెక్టు కాలువల నిర్మాణ పనులను కూడా ఆమె పరిశీలించారు. అందోలు నియోజకవర్గం జోగిపేట జోగిపేట చేరుకున్న విజయమ్మకు అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మండల కార్యాలయం ఎదుట వైఎస్ విగ్రహానికి ఆమె పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ప్రసంగించారు. ప్రసంగించే ముందు ఆమె తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అమరవీరులకు నివాళులర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

కుమ్మక్కు కుట్ర తిప్పికొట్టాలి:విజయమ్మ

పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కు కుట్రని తిప్పికొట్టాలని కార్యకర్తలకు విజయమ్మ పిలుపు ఇచ్చారు. దివంగత మహానేత డాక్టర్ వైస్ రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం అందరూ కలసికట్టుగా కృషి చేయాలన్నారు. ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని కార్యకర్తలను కోరారు. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. తనతో సహా పార్టీ నేతలు అందరూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. గ్రామగ్రామానా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు. సమైక్యంగా కృషిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని సాధించి, ఆ విజయోత్సవ సభకు జగన్‌ను ఆహ్వానించేలా తయారుకావాలన్నారు.

వైఎస్ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ వెనుకబాటుతనాన్ని వైఎస్ గుర్తించారని చెప్పారు. వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ పెంచినట్లు తెలిపారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను పేర్లు మార్చి కిరణ్ నూతన పథకాలుగా గ్లోబల్ ప్రచారం చేసుకుంటున్నారన్నారు. ఈ ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని చేయలేదన్నారు. నేడు 108 వాహనాలు కనిపించడంలేదని చెప్పారు. రైతుల సమస్యలు పట్టించుకునేవారు లేరన్నారు. రైతులకు గిట్టుబాటు ధర రావడంలేదని తెలిపారు.

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు అధికార ధ్యాసే తప్ప ప్రజా సంక్షేమం కోసం ఆలోచించరన్నారు. తమ కుటుంబంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలు తాము తాతలనాటి నుంచి సేవాకార్యక్రమాలపైనే దృష్టిపెడుతూ వచ్చామన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.

తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలన్నారు.

ఈ నెల 26న నల్గొండ జిల్లాలో, 27న ఖమ్మం, 28న రంగారెడ్డి, 29న మహబూబ్‌నగర్, 30న కరీంనగర్, జూలై 1వ తేదీన ఆదిలాబాద్, 2న నిజామాబాద్, 3న వరంగల్ జిల్లాలో విజయమ్మ పర్యటిస్తారు. 
Share this article :

0 comments: