విజయమ్మ రోడ్ కు అపూర్వ ఆదరణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » విజయమ్మ రోడ్ కు అపూర్వ ఆదరణ

విజయమ్మ రోడ్ కు అపూర్వ ఆదరణ

Written By news on Wednesday, June 26, 2013 | 6/26/2013

కోదాడ: నల్గొండ జిల్లా కోదాడలో ఈరోజు వైఎస్ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పాల్గొన్న రోడ్షోకు అపూర్వ ఆదరణ లభించింది. కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. కోదాడలో వైఎస్‌ఆర్ సీపీ నేత గున్నం నాగిరెడ్డి కుటుంబ సభ్యులను విజయమ్మ పరామర్శించారు.

తెలంగాణ జిల్లాల పర్యటనలో భాగంగా ఈరోజు విజయమ్మ కోదాడలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. అధిక సంఖ్యలో కార్యకర్తలు ఈ సమావేశానికి తరలి వచ్చారు. అంతకు ముందు నకిరేకల్ వద్ద ఆమెకు కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఆ తరువాత ముకుందాపురంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి, పూలమాల వేసి నివాళులర్పించారు.
జగన్‌కు భోజనం పంపుదామన్నా అనుమతిలేదు

కోదాడలో జరిగిన కార్యకర్తల సమావేశంలో విజయమ్మ మాట్లాడుతూ జైలులో ఉన్న జగన్కు భోజనం పంపుదామన్నా అనుమతిలేదని బాధపడ్డారు. జగన్ జైల్ ములాఖత్‌పై ప్రతిపక్షపార్టీ లేనిపోని ఆరోపణలు చేస్తోందన్నారు. వారానికి రెండు రోజులు నలుగురిని మాత్రమే అనుమతిస్తున్నారని చెప్పారు.

ఓటర్ల జాబితాపై నిఘాపెట్టాలి

స్థానిక సంస్థలకు నిధులు, విధులు అవసరమని విజయమ్మ అన్నారు. పంచాయతీ ఎన్నికలలో అందరూ కలసికట్టుగా పార్టీ విజయం కోసం కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. ఓటర్ల జాబితాపై నిఘాపెట్టమని సలహా ఇచ్చారు. కార్యకర్తలను అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కార్యకర్తల క్రమశిక్షణను ఆమె కొనియాడారు. స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ సత్తా ఏంటో ప్రత్యర్థులకు చూపాలన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి పంచాయతీపై పార్టీ జెండా ఎగరాలని చెప్పారు. చిన్న చిన్న గొడవలున్నా పరిష్కరించుకుని ముందుకెళ్లాలని కోరారు. మొన్న సహకార ఎన్నికల్లో అధికార పార్టీ అవకతవకలకు పాల్పడిందని గుర్తు చేశారు. అందువల్ల రేపు జరగబోయే ఎన్నికల్లో కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అమ్మ హస్తం పథకం ద్వారా నాణ్యత లేని వస్తువులను ప్రజలకు ఇస్తున్నారని విమర్శించారు.
చతికిలబడిన పంచాయతీలు

పంచాయతీలకు వైఎస్ అన్నీ సమకూర్చారని, ఇప్పుడు అన్నీ చతికిలబడ్డాయన్నారు. ఈ ప్రభుత్వం ఆర్టీసి చార్జీలు మూడు సార్లు పెంచిందని, విద్యుత్ చార్జీలు పెంచిందని తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రం నుంచి ఎటువంటి సాయం తీసుకురావడంలేదన్నారు. ఆరోగ్యశ్రీ పథకంపై ఎన్నో ఆంక్షలు విధించారని తెలిపారు. ఈ సమావేశానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు.

courtesy:sakshi
Share this article :

0 comments: