జిల్లాల వారీగా బీసీ రిజర్వేషన్లు ఖరారు.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జిల్లాల వారీగా బీసీ రిజర్వేషన్లు ఖరారు..

జిల్లాల వారీగా బీసీ రిజర్వేషన్లు ఖరారు..

Written By news on Saturday, June 22, 2013 | 6/22/2013

జిల్లాలో ఏ పంచాయతీ ఎవరికి రిజర్వ్ చేశారో ఈ నెల 25లోగా గెజిట్ నోటిఫికేషన్
జిల్లా కలెక్టర్లు, డీపీవోలకు పంచాయతీరాజ్ కమిషనర్ రాంగోపాల్ ఆదేశాలు
జిల్లాల నుంచి వచ్చిన జాబితాలను ఈసీకి సమర్పించనున్న అధికారులు
21,590 గ్రామ పంచాయతీల ఎన్నికలకు వచ్చే నెల మొదటి వారంలో నోటిఫికేషన్!

 పంచాయతీ ఎన్నికలకు బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలవారీగా ఖరారు చేసింది. ఎస్సీ, ఎస్టీలకు మాత్రం రాష్ట్రం యూనిట్‌గా రిజర్వేషన్లు ఖరారు చేసింది. బీసీ రిజర్వేషన్లు రాష్ట్రం యూనిట్‌గా తీసుకోవడంవల్ల పలు జిల్లాల్లో అన్ రిజర్వుడు స్థానాలు తగ్గిపోయాయని కొందరు శాసనసభ్యులు అసంతృప్తి వ్యక్తం చేయడంతో ప్రభుత్వం రిజర్వేషన్ల విధానాన్ని జిల్లాలవారీగా మార్చింది. దీని ఆధారంగా ప్రతి జిల్లాలో కేటగిరీలవారీగా రిజర్వేషన్ల సంఖ్యను పంచాయతీరాజ్ కమిషనర్ రాంగోపాల్ శుక్రవారం అన్ని జిల్లాలకు పంపించారు. 

జిల్లా జనాభాలో బీసీలకు దామాషా పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేయడంతో ఆ వర్గాలకు గతంలో తక్కువ స్థానాలు వచ్చిన జిల్లాల్లో ఇప్పుడు ఎక్కువ రాగా, మరికొన్ని జిల్లాల్లో తగ్గాయి. బీసీల జనాభా అధికంగా ఉన్న జిల్లాల్లో ఎక్కువ స్థానాలు రిజర్వు అయ్యాయి. బీసీ జనాభా తక్కువగా ఉన్న జిల్లాల్లో ఆమేరకు తగ్గిపోయాయి. రాష్ట్రం మొత్తంగా చూసుకుంటే బీసీలకు 34 శాతం స్థానాలు దక్కాయి. మొత్తం 6,926 స్థానాలు వారికి లభించాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల సంఖ్యలో ఎటువంటి మార్పులు ఉండవు. బీసీలు, అన్ రిజర్వుడు స్థానాల సంఖ్య మాత్రం మారింది. బీసీల స్థానాలు పెరిగిన జిల్లాల్లో ప్రధానంగా కరీంనగర్, విశాఖపట్టణం, శ్రీకాకుళం, ఆదిలాబాద్, విజయనగరం, ఖమ్మం, వరంగల్, చిత్తూరు, మెదక్, కృష్ణా, వైఎస్సార్, నల్లగొండ, మహబూబ్‌నగర్, అనంతపురం ఉన్నాయి. 

దీంతో ఈ జిల్లాల్లో అన్ రిజర్వుడు స్థానాలు తగ్గాయి. మిగతా వాటిలో బీసీల స్థానాలు తగ్గి, అన్ రిజర్వుడు స్థానాలు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 21,590 పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఇందులో షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్న 1,218 గ్రామ పంచాయతీలన్నింటినీ ఎస్టీలకు రిజర్వ్ చేశారు. మిగిలిన 20,372 గ్రామ పంచాయతీలకు జిల్లాల్లో ఆయా కేటగిరీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేశారు. దీనిప్రకారం ఎస్టీలకు షెడ్యూల్ ఏరియాలోని 1,218 పంచాయతీలోపాటు రిజర్వేషన్ల దామాషాలో మరో 1,279 దక్కాయి. అంటే ఎస్టీలకు మొత్తం 2,497 స్థానాలు లభించాయి. ఎస్సీలకు 3,958 స్థానాలు లభించాయి. అన్‌రిజర్వుడు కేటగిరీలో 8,209 పంచాయతీలు ఉన్నాయి. మహిళలకు 50 శాతం స్థానాలు రిజర్వ్ చేశారు. తద్వారా ఈసారి పంచాయతీ ఎన్నికల్లో మహిళలు 10,795 స్థానాల్లో సర్పంచ్‌లుగా ఎన్నిక కానున్నారు. జిల్లాలో ఏ పంచాయతీ ఎవరికి రిజర్వ్ చేశారన్న వివరాలతో ఈ నెల 25వ తేదీలోగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి పంపాలని రాంగోపాల్ జిల్లాల కలెక్టర్లు, డీపీవోలను ఆదేశించారు. జిల్లాల్లో రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయి, ఆ జాబితాలు వచ్చిన వెంటనే ప్రభుత్వానికి నివేదించిన తరువాత రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించనున్నారు. ఆ తర్వాత వారం రోజులకు ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తారు. అంటే.. వచ్చేనెల మొదటి వారంలో నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది.
Share this article :

0 comments: