మ్యాచ్‌ఫిక్సింగ్‌పై మభ్యపెట్టేందుకే బాబు ఎత్తుగడ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మ్యాచ్‌ఫిక్సింగ్‌పై మభ్యపెట్టేందుకే బాబు ఎత్తుగడ

మ్యాచ్‌ఫిక్సింగ్‌పై మభ్యపెట్టేందుకే బాబు ఎత్తుగడ

Written By news on Friday, June 14, 2013 | 6/14/2013

- వైఎస్సార్ కాంగ్రెస్ నేత మైసూరారెడ్డి ధ్వజం
- ప్రభుత్వాన్ని వదిలి స్పీకర్‌పై అవిశ్వాసం ఎందుకు?
- మ్యాచ్‌ఫిక్సింగ్‌పై మభ్యపెట్టేందుకే బాబు ఎత్తుగడ

సాక్షి, హైదరాబాద్: శాసనసభ స్పీకర్‌పై అవిశ్వాసం పెడతామంటూ తెలుగుదేశం పార్టీ ప్రకటించడం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం సంధించడమే అవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ఎంవీ మైసూరారెడ్డి చెప్పారు. సభను సజావుగా నడిపించడంలో ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ తన బాధ్యతను పూర్తిగా విస్మరించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రెండుసార్లు కాపాడిన చంద్రబాబు, ఇప్పుడు ఎలాంటి కుమ్మక్కు లేదని ప్రజల్ని మభ్యపెట్టేందుకు స్పీకర్‌పై అవిశ్వాసమంటూ కొత్త ఎత్తుగడ వేశారని విమర్శించారు. ప్రభుత్వానికి ఉండే మెజార్టీయే స్పీకర్‌కు కూడా ఉంటుందని, అలాంటప్పుడు ప్రభుత్వంపై అవిశ్వాసం ఎందుకు పెట్టడంలేదని సూటిగా ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘గతంలో అవిశ్వాసం సందర్భంగా కాంగ్రెస్‌లో చిరంజీవి పీఆర్పీ విలీనం అయ్యేంత వరకు చంద్రబాబు వేచి చూశారు. 

కాంగ్రెస్‌కు సంఖ్యాబలం కుదిరిన తర్వాత అవిశ్వాసం పెట్టారు. రెండోసారి ప్రతిపక్షాలన్నీ అవిశ్వాసం పెడితే కల్లబొల్లి కబుర్లు చెప్పి ప్రభుత్వాన్ని కాపాడారు. ఈ విధంగా రెండుసార్లు కాంగ్రెస్‌ను ఒడ్డుకు చేర్చింది చంద్రబాబే కదా..’ అని స్పష్టం చేశారు. ఇప్పుడు కూడా 15 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడ్డాక స్పీకర్‌పై అవిశ్వాసం అంటున్నారని వివరించారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకముందు ఎందుకు ఈ పని చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో తాను చేసుకున్న మ్యాచ్‌ఫిక్సింగ్ ప్రజలకు స్పష్టంగా తెలిసిపోవడం వల్లే.. వారిని మభ్యపెట్టేందుకు చంద్రబాబు స్పీకర్‌పై అవిశ్వాసమంటూ కొత్త డ్రామాకు తెరదీశారని మైసూరా దుయ్యబట్టారు. చంద్రబాబుకు శాసనసభపై నమ్మకమున్నట్లయితే సమావేశాలు జరుగుతున్న సమయంలో అమెరికా ఎందుకు వెళ్తున్నారని నిలదీశారు. చంద్రబాబు గత సమావేశాల సందర్భంగా కూడా పాదయాత్ర అంటూ ఒక్క రోజు కూడా సభకు హాజరుకాని విషయాన్ని మైసూరా గుర్తుచేశారు. 

ఫ్రంట్‌లో బాబుకు స్థానం ఉండదు: వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒకటీ రెండు ఎంపీ స్థానాలు కూడా గెలిచే పరిస్థితి లేదని మైసూరా తెలిపారు. సంఖ్యాబలం ఉన్న వారినే పిలుస్తారు తప్ప రెండు స్థానాలు కూడా గెలవలేని చంద్రబాబుకు ఫెడరల్ ఫ్రంట్‌లో స్థానమెక్కడుంటుందని మీడియా అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. పిలువని పేరంటానికి వెళ్లిన చందంగా తనను ఎవరూ పిలవకముందే గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. ‘జేడీయూ, బీజేడీ, మమతాబెనర్జీ కలిసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్లు పత్రికల్లో కథనాలొచ్చాయి. మేము కూడా ఈ పరిణామాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం. ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా లౌకికవాదులతో జతకలుస్తాం’ అని మైసూరా వెల్లడించారు.
Share this article :

0 comments: