18, 19 తేదీల్లో విజయమ్మ ఫీజు దీక్ష - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 18, 19 తేదీల్లో విజయమ్మ ఫీజు దీక్ష

18, 19 తేదీల్లో విజయమ్మ ఫీజు దీక్ష

Written By news on Monday, July 15, 2013 | 7/15/2013

విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం తూట్లు పొడిచి, నీరుగారుస్తున్నందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ ఈ నెల 18, 19 తేదీల్లో హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు దీక్ష చేయనున్నారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. 

వాస్తవానికి ఈ సమస్యపై ఈ నెల 14, 15 తేదీల్లోనే విజయమ్మ దీక్ష చేస్తారని తొలుత ప్రకటించామని, అయితే భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణం కారణంగా వాయిదా వేశామని వివరించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగే ఈ దీక్షలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయమ్మకు మద్దతు ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. డబ్బుకు పేదలు కావచ్చు కానీ, చదువుకు పేదవారుగా ఉండకూడదనే మంచి ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారని, అలాంటి పథకానికి ప్రభుత్వం దొడ్డిదారిన చిల్లులు పొడుస్తోందని విమర్శించారు.

పేద విద్యార్థులకు ఎంతో మేలు చేసే ఈ పథకాన్ని నీరు గార్చడాన్ని తమ పార్టీ ప్రతిఘటిస్తుందన్నారు. ఈ పథకం విషయంలో ప్రభుత్వం తాజాగా ప్రకటించిన విధానం వల్ల ఒక్కొక్క విద్యార్థి రూ.15 వేల నుంచి రూ.75 వేల వరకూ ఫీజు సొంతంగా భరించుకోవాల్సి ఉంటుందని, ఇది వారికి పెనుభారమే అవుతుందన్నారు. విద్యార్థుల ఫీజు మొత్తంలో రూ.35 వేలు మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుందని, మిగతా సొమ్ము విద్యార్థులే చెల్లించుకోవాలనడం ఏ మాత్రం సరికాదని అన్నారు. ప్రభుత్వానికి భారీగా ఆదాయం పెరిగిన తరువాత కూడా ఏదో విధంగా భారం తగ్గించుకోవాలని చూస్తోందని ఆయన పేర్కొన్నారు. ఫీజుల పథకం పరిరక్షణ కోసం గతంలో కూడా తమ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, విజయమ్మ దీక్షలు చేశారని, అయినప్పటికీ ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు.
Share this article :

0 comments: