9 నుంచి 13వ తేదీ వరకు నామినేషన్లు.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 9 నుంచి 13వ తేదీ వరకు నామినేషన్లు..

9 నుంచి 13వ తేదీ వరకు నామినేషన్లు..

Written By news on Thursday, July 4, 2013 | 7/04/2013


9న జిల్లాల్లో నోటిఫికేషన్ జారీ చేయనున్న కలెక్టర్లు
9 నుంచి 13వ తేదీ వరకు నామినేషన్లు..
ఉపసంహరణకు 17 చివరి తేదీ
23, 27, 31 తేదీల్లో ఎన్నికలు.. పోలింగ్ రోజు మధ్యాహ్నం ఓట్ల లెక్కింపు..
మొత్తం ఓటర్లు 3,94,01,855.. పోలింగ్ కేంద్రాలు 2,19,753
ఎన్నికల వ్యయం పరిశీలనకు ఐఎఫ్‌ఎస్ అధికారి

సాక్షి, హైదరాబాద్:పంచాయతీ పోరుకు తెరలేచింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను ప్రకటించారు. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జిల్లా ఎన్నికల అధికారులు (కలెక్టర్లు) ఈనెల తొమ్మిదో తేదీన ఆయా జిల్లాల్లో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారని చెప్పారు. పోలింగ్ మూడు దశలుగా జూలై 23, 27, 31 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. మూడు దశల ఎన్నికలకు ఒకేసారి నామినేషన్లు స్వీకరిస్తారు. ఉపసంహరణకు కూడా ఒకే గడువు ఉంటుంది. జూలై తొమ్మిది నుంచి 13వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారని, 17వ తేదీన ఉపసంహరణకు చివరి తేదీ అని రమాకాంత్‌రెడ్డి తెలిపారు. రెవెన్యూ డివిజన్ల ఆధారంగా మూడు దశల ఎన్నికలు ఉంటాయని చెప్పారు. మొత్తం 21,491 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవులతోపాటు 2,17,578 వార్డు మెంబర్లకు బ్యాలెట్ పేపర్ ఆధారంగా ఎన్నికలు నిర్వహిస్తామని, ఇందుకోసం మొత్తం 2,19,753 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇలావుండగా మొత్తం 3.94 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో మహిళా ఓటర్లే అధికంగా ఉండటం గమనార్హం. మొత్తం గ్రామీ ణ ఓటర్లలో మహిళలు కోటీ 97 లక్షల మంది ఉంటే, పురుష ఓటర్లు కోటీ 96 లక్షల మంది ఉన్నారు. ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛగా నిర్వహించడానికి వీలుగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని రమాకాంత్‌రెడ్డి తెలిపారు. ప్రతి జిల్లాకు ఇద్దరు ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీల కులుగా, ఒక ఐఎఫ్‌ఎస్ అధికారిని ఎన్నికల వ్యయ పరిశీలకునిగా నియమిస్తున్నామని చెప్పారు.

వీరి మొబైల్ నంబర్లను ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు ప్రకటిస్తారని.. ఎన్నికలలో ఎక్కడైనా అవకతవకలు, అన్యాయం జరుగుతున్నట్టు తెలిసిన పక్షంలో ఎవరైనా ఆ ఫోన్ నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. మొత్తం 1.32 లక్షల బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నామన్నారు. మొదటి దశలో 6,863, రెండో దశలో 7,738, మూడో దశలో 6,890 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి. ఒక జిల్లాలో మూడు కంటే ఎక్కువ రెవెన్యూ డివిజన్లు ఉన్న పక్షంలో.. ఒకదశలో రెండు డివిజన్లలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషనర్ చెప్పారు. నామినేషన్లను ఉద యం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. ఎన్నికల రోజున పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుందని అన్నారు. ఉప సర్పంచ్ ఎన్నికను కూడా అదే రోజు నిర్వహించాలని, ఎన్నికైన వార్డు సభ్యులు చేతులు ఎత్తడం ద్వారా ఉప సర్పంచ్‌ను ఎన్నుకుంటారని చెప్పారు. అభ్యర్థుల ధరావతు మొత్తాన్ని, ఎన్నికల వ్యయాన్ని పెంచినట్లు రమాకాంత్‌రెడ్డి వివరించారు. విలేకరుల సమావేశంలో ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ మిట్టల్ కూడా పాల్గొన్నారు. ఇలావుండగా రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

కలెక్టర్లకు వెసులుబాటు...: పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల మూడో తేదీన జారీ చేసి, ఐదో తేదీన జిల్లాల్లో కలెక్టర్లతో నోటిఫికేషన్ ఇప్పించాలని తొలుత భావించినా చివరి నిమిషంలో ఆ ఆలోచన విరమించుకున్నట్లు సమాచారం. పత్రికల్లో తేదీలతో సహా ముందుగానే వార్తలు వచ్చాయనే కారణంతో పాటు.. కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేసి అది అన్ని గ్రామాలకు చేరేందుకు సమయం పడుతుందన్న ఉద్దేశంతో కొంత వ్యవధి ఇచ్చి 9వ తేదీని నిర్ణయించినట్లుగా ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి.

ఏకగ్రీవం అయినా ప్రోత్సాహకం నో!
‘ఏకగ్రీవ పంచాయతీ’లను ప్రోత్సహించిన వైఎస్

గ్రామ సర్వోతోముఖాభివృద్ధి కోసం రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఎన్నికలు నిర్వహించడమే కాక, గ్రామాల్లో సుహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పి అభివృద్ధికి దోహద పడేలా.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక జరిగే పంచాయతీలను ‘ప్రోత్సహించే’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 2006 ఎన్నికల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులు అంతా ఏకగ్రీవం అయితే ఆ పంచాయతీ అభివృద్ధి కోసం రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని ఇచ్చింది. ఈ స్ఫూర్తితో అప్పట్లో దాదాపు మూడు వేలకు పైగా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. అలాగే అనేకవేల మంది వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పంచాయతీలకు ప్రోత్సాహకం కింద మొత్తం రూ.147 కోట్లను అప్పటి రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఇచ్చింది.

అయితే ఇప్పుడు ప్రభుత్వం ప్రోత్సాహకం ఊసు ఎత్తడం లేదు. పంచాయతీలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలంటే ఈసారి దాదాపు రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు వ్యయం అవుతుందని, దీనిపై ప్రభుత్వ పెద్దలే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ప్రస్తుతానికి అలాంటి ఫైలు ఏదీ పంచాయతీరాజ్ శాఖ అధికారులు రూపొందించలేదని సమాచారం. రాజకీయ పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరుగుతున్నందున వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాజకీయ పార్టీలతోపాటు అధికారులు కూడా అభిప్రాయ పడుతున్నారు. ఏకగ్రీవమయ్యే పంచాయతీలకు ప్రోత్సాహకాలపై ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డిని ప్రశ్నించగా..అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశం అని అన్నారు.
Share this article :

0 comments: