అదెంతవరకు సమంజసం? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అదెంతవరకు సమంజసం?

అదెంతవరకు సమంజసం?

Written By news on Tuesday, July 30, 2013 | 7/30/2013

టీడీపీ, కాంగ్రెస్ ఇవే ఆరోపణలు చేసినప్పుడు సురేఖ స్వయంగా తిప్పికొట్టారు
పార్టీకి సురేఖ అండగా ఉండాలని కోరుకుంటున్నాం.. పునరాలోచించుకోవాలి
ఇతర తెలంగాణ నేతలతో చర్చించకుండా సురేఖ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరికాదు
తెలంగాణపై పార్టీ ప్లీనరీకే కట్టుబడి ఉంది
పార్టీ వదిలి వెళ్లడం వారిష్టం.. అయితే వెళ్లే ముందు ఆరోపణలు చేయడం సబబు కాదు

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సోదరీమణి కొండా సురేఖ చేసిన ఆరోపణలను ఆమె విజ్ఞతకే వదలేస్తున్నామని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పారు. ఇవే ఆరోపణలు గతంలో ఇతరులు చేసినప్పుడు ఆమే స్వయంగా తిప్పికొట్టిన విషయాన్ని ఒకసారి మననం చేసుకోవాలని కోరారు. వైఎస్సార్ సీపీకి సురేఖ అండగా ఉండాలని తామంతా కోరుకుంటున్నామని, కాబట్టి ఆమె పునరాలోచించుకోవాలని చెప్పారు. జగన్‌పై ఆరోపణలు చేస్తూ కొండా సురేఖ సోమవారం బహిరంగ లేఖ రాసిన నేపథ్యంలో.. ఇతర తెలంగాణ నేతలు ఎడ్మ కృష్ణారెడ్డి, శివకుమార్‌తో కలిసి బాజిరెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సురేఖ వైఖరి పట్ల ఆవేదన వ్యక్తంచేశారు. జగన్‌కు సురేఖ రాసిన బహిరంగ లేఖను ప్రస్తావిస్తూ.. ‘‘ఆ లేఖను చదివాం. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ నేతలు ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు మీరు (సురేఖ) ఏ విధంగా ఆ ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టారో ఒకసారి మననం చేసుకోవాలని కోరుతున్నాం. 

మీరు త్యాగం చేశామంటున్నారు. నిజమే.. మంత్రిపదవి, ఎమ్మెల్యే పదవిని త్యాగం చేశారు. కొండా మురళీధర్‌రావు ఎమ్మెల్సీ పదవిని కూడా త్యాగం చేశారు. ఇందులో ఎలాంటి వివాదం లేదు. మనమందరమూ ఏదో ఒక త్యాగం చేసి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత ఆయన కుటుంబానికి అండగా ఉండాలనుకున్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకోవాలని భీష్మ ప్రతిజ్ఞ చేసి వచ్చిన వాళ్లమే. ఈ రోజు జగన్‌ను అన్యాయంగా జైల్లో నిర్బంధించారు. విజయమ్మ పార్టీని పటిష్టం చేయడానికి నడుం బిగించారు. ఆమెతో పాటుగా మనం రాష్ట్రమంతటా తిరిగి పటిష్టం చేస్తున్న సమయంలో.. తెలంగాణ విషయంలో యూ టర్న్ తీసుకున్నారనే ఆరోపణ ఏమాత్రం సరైనది కాద ని భావిస్తున్నాను. ఎందుకంటే 16 మంది రాయలసీమకు చెందిన ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా రాజీనామాలు చేశారు. 

కేంద్రం తెలంగాణకు అనుకూలమని ఒకసారి, కాదని ఒకసారి, రాయల తెలంగాణకు అనుకూలమని మరోసారి చెబుతోంది. హైదరాబాద్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చి మిగతా రాష్ట్రాన్ని విభజిస్తామని లీకులు ఇస్తూ రాష్ట్రమంతటా రాజకీయ పార్టీలను అస్థిర పరుస్తోంది. కేంద్రం చేస్తున్న ఈ నిర్వాకానికి నిరసనగానే రాజీనామాలు చేసినట్లు ఎమ్మెల్యేలు ప్రకటించారు’ అని బాజిరెడ్డి వివరించారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్‌లో కీలకమైన నాయకులుగా ఉండే మీరు, యావత్ రాష్ట్రమంతటా తిరిగి జగన్‌కు, రాజశేఖరరెడ్డి కుటుంబానికి మా అందరితో కలిసి అండగా నిలిచారు. కానీ, ఈ రోజు ఆ కుటుంబం ఏ పరిస్థితుల్లో ఉంది? జగన్ ఇబ్బందుల్లో ఉన్నారా, లేదా? సమస్యల్లో నుంచి ఏమైనా బయటకు వచ్చారా? లేదు. ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారా? ఆయన ఏం సుఖంగా ఉన్నాడని మీరు పార్టీ నుంచి వెళ్లిపోయారు? ఆయన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అండగా ఉండాలని ప్రతిజ్ఞ చేసిన మేరకు.. ఆయన కష్టాల్లో నుంచి బయటపడేదాకా మనమంతా అండగా ఉంటే బాగుండేదేమో అని మేమందరమూ అనుకుంటున్నాం. అలా కాకుండా మీరు వెళ్లిపోయారు. పోవడమే కాకుండా తీవ్రమైన అభాండాలు వేశారు. వాటిని మీ విజ్ఞతకే వదలివేస్తున్నాం. మీమీద ప్రత్యారోపణలు చేయడంలేదు. మీరు పునరాలోచించుకుని మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్‌కు అండగా ఉంటారని భావిస్తున్నాం. 

అయితే, కొంతమంది వ్యక్తులు ఏది మాట్లాడినా, పార్టీపరంగా మీకొక విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఏవైతే తీవ్రమైన ఆరోపణలు చేశారో, వాటిని వెనక్కి తీసుకుంటే నిజంగా రాష్ట్ర ప్రజలందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. మునుపటిలాగా మీకు గౌరవం లభిస్తుందని మనవి చేస్తున్నాం’’ అని సురేఖనుద్దేశించి బాజిరెడ్డి అన్నారు. ‘‘మేమంతా రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో నిమగ్నమై ఉన్నప్పుడు సురేఖ ఈ విషయంపై విజయమ్మ గారిని ప్రశ్నించారు. ప్లీనరీలో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికే పార్టీ కట్టుబడి ఉందని విజయమ్మ వివరణ కూడా ఇచ్చారు. కానీ, సురేఖ అందుకు సంతృప్తి చెందకుండా, ఆమె నుంచి ఒక స్టేట్‌మెంట్ కావాలని అడగడంతోపాటుగా రాజీనామాలు వ్యక్తిగతమా లేక ప్లీనరీ తీర్మానానికి విరుద్ధంగా చేశారా అంటూ నిలదీశారు.

అదెంతవరకు సమంజసం? తెలంగాణ ప్రాంత నాయకులందరితో మాట్లాడకుండా, ఏ విధంగా చేస్తే బాగుంటుందో చర్చిం చకుండా, ఒక్క మాట కూడా చెప్పకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని సురేఖ వెళ్లి విజయమ్మను అడగటం సరికాదు. ఓ ఆడకూతురును, ఇబ్బందుల్లో ఉన్న వాళ్లను, మరింత ఇబ్బంది పెట్టేలా అడిగారు. అయినా మరుసటి రోజు మేమంతా (తెలంగాణ నేతలు 40 మంది) సమావేశమై ఈ విషయంపై చర్చిం చాం. 16 మంది రాజీనామాల అనంతరం జరిగిన పరిణామాలపై సురేఖ నిలదీసిన తరువాత తెలంగాణ ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు కొంత వరకూ నష్టం జరిగింది. ఈ విషయంపైనా చర్చించాం. రెండు రోజుల్లో తెలంగాణకు వైఎస్సార్ కాంగ్రెస్ వ్యతిరేకం కాదని, ప్లీనరీ తీర్మానానికే కట్టుబడి ఉన్నామని విజయమ్మ స్వయంగా వివరణ ఇవ్వాలని సమావేశంలో అందర మూ కోరాం. ఆ విషయం చెప్పడానికి వారు సిద్ధంగా ఉన్నారు. మాకు కూడా సంతృప్తికరంగానే ఉంది. దానికంటే ముందుగానే సురేఖ బహిరంగ లేఖ రాసి ఈ విధంగా అవమానపర్చడం మంచిది కాదని భావిస్తున్నాం’’ అని చెప్పారు. పార్టీ వదిలి వెళ్లడమనేది వారిష్టమని, అయితే వెళ్లే ముందు ఆరోపణలు చేయడం సబబు కాదని చెప్పారు. సురేఖ వ్యాఖ్యల వెనుక ఎవరి కుట్రో ఉంటుందని భావించడంలేదని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణకు కట్టుబడి ఉందని చెప్పారు. తమది జాతీయ పార్టీ అని, రెండు రాష్ట్రాలైనా, మూడు రాష్ట్రాలైనా అక్కడ పార్టీ ఉంటుందన్నారు. 
Share this article :

0 comments: