ధరలన్నీ పెరుగుతున్నా.. పాల సేకరణ ధర పెంచడం లేదు.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ధరలన్నీ పెరుగుతున్నా.. పాల సేకరణ ధర పెంచడం లేదు..

ధరలన్నీ పెరుగుతున్నా.. పాల సేకరణ ధర పెంచడం లేదు..

Written By news on Thursday, July 4, 2013 | 7/04/2013


ధరలన్నీ పెరుగుతున్నా.. పాల సేకరణ ధర పెంచడం లేదు..
మనసు విరిగి రైతు పాలు కింద పారేసుకునే పరిస్థితి వచ్చింది
జగనన్నను సీఎం చేసుకుంటే.. వైఎస్‌లానే సబ్సిడీలు ఇస్తారు
పాడి పరిశ్రమను నిలబెడతారు, పాలకు మంచి ధర వచ్చేలా చేస్తారు
హెరిటేజ్ సిండికేట్‌తో దోచుకుంటోందంటూ రైతుల ఆవేదన
హెరిటేజ్‌పై సీబీఐ దాడి చేయదేమని ప్రశ్న
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ బుధవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 198, కిలోమీటర్లు: 2,637.8

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఒక పక్క ధరలు పెరిగిపోతున్నాయి.. అన్ని చార్జీలూ పెరిగిపోతున్నాయి. అయినా ఈ ప్రభుత్వం పాల సేకరణ ధర మటుకు పెంచడం లేదు. పాడి రైతులు మనసు విరిగి పాలు కింద పారబోసుకునే పరిస్థితి వచ్చింది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘పశువులకు రోగం వస్తే మందులు అందుబాటులో ఉండవు. వైద్యులు అసలే ఉండరు. ఈ రాక్షస పాలనలో మనుషుల వైద్యానికే దిక్కు లేదు.. ఇక పశువుల వైద్యం గురించి ఆలోచన చేస్తారా? ఇది చాలా దారుణం. రైతుల గోడు పట్టని ఇట్లాంటి సర్కారు ఎక్కువ రోజులు ఉండదు. వీళ్లకు రైతుల ఉసురు, మహిళల ఉసురు తాకి పోతారు’’ అని ఆమె నిప్పులు చెరిగారు.

‘‘నేను మీకు మాటిచ్చి చెప్తున్నా.. జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటే వైఎస్సార్ ఇచ్చినట్టుగానే మీ అందరికీ సబ్సిడీలు ఇస్తారు. మీరు కోరుకున్నట్టుగానే పాడి పరిశ్రమను నిలబెడతారు. మీకు గిట్టుబాటు అయ్యేలా పాల సేకరణ ధర నిర్ణయిస్తారు. పశువులకు వైద్యం చేయించడం కోసం ఒక అంబులెన్స్‌ను కూడా పెడతారు’’ అని షర్మిల రైతులకు భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర బుధవారం విశాఖ జిల్లా పెందుర్తి, గాజువాక నియోజకవర్గాల్లో సాగింది. పెందుర్తి నియోజకవర్గంలోని పైడివాడ గ్రామంలో పాల రైతులు షర్మిలను కలిసి తమ కష్టాలు చెప్పుకొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

కార్పొరేట్ డెయిరీల సిండికేట్..: పైడివాడ పాల ఉత్పత్తిదారుల సహకారం సంఘ మాజీ అధ్యక్షుడు దాసరి నర్సింహులు షర్మిలతో మాట్లాడుతూ.. ‘‘హెరిటేజ్ కంపెనీ వచ్చాక కార్పొరేట్ డెయిరీ సంస్థలు అన్నీ కలిసి సిండికేటుగా మారాయి. డెయిరీ సంస్థలు పాల సేకరణలో పాలలో కొవ్వు శాతానికి, ఎస్‌ఎంఎఫ్ రీడింగ్‌కు ముడిపెట్టి ధర నిర్ణయిస్తున్నాయి. నిజానికి ఫ్యాటు శాతం, ఎస్‌ఎంఎఫ్ రీడింగ్‌లు ఎప్పుడూ ఒకటి పెరిగితే రెండవది తగ్గుతుంది. అయితే బోడిగుండుకు, మోకాలికి ముడిపెట్టినట్టు డెయిరీ సంస్థలు.. రైతులకు రూ. 23 నుంచి 30 వరకు మాత్రమే సేకరణ ధర చెల్లిస్తున్నారు. సాధారణంగా ఫ్యాట్ శాతం ఆధారంగా పాల ధర చెల్లించాలి. హెరిటేజ్ ప్రాబల్యం లేని ప్రాంతాల్లో ఫ్యాట్ శాతం ఆధారంగానే ధరలు చెల్లిస్తున్నారు.హెరిటేజ్ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో మాత్రం దొంగ పద్ధతిని అమల్లోకి తెచ్చారు’’ అని తెలిపారు.

హెరిటేజ్‌పై సీబీఐ దాడిచేయదేం?: ‘‘ైవైఎస్సార్ ఉన్నప్పుడు వర్షాలు పడేవి.. కరెంటు పిలిస్తే పలికింది. కావలసినంత పచ్చి గడ్డి దొరికింది. 50 కిలోల పశువుల దాణా రూ.200 ఉండేది. లీటరు పాల ధర రూ. 22 పలికింది. ఆయన మరణించిన నెల రోజులకే పాల సేకరణ ధర రూ.19.50 పైసలకు పడిపోయింది. ఈ రోజు దాణా సంచి ఖరీదు రూ.500, తవుడు క్వింటాల్ రూ.500 అయింది. ధర మాత్రం పెద్దగా పెరగలేదు’’ అని నర్సింహులు అన్నారు. ఇప్పుడు వర్షాలు సరిగా పడక, కరెంటు రాక ఎండు గడ్డి కూడా దొరికే పరిస్థితి లేదని, ఆ రోజుల్లో ఎనిమిది లీటర్ల పాలు ఇచ్చే పశువులు ఇప్పుడు మూడు నుంచి నాలుగు లీటర్లు ఇస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘గేదెను కొనాలంటే రూ.50 వేలు.. రూ.60 వేలు అవుతోంది. పాల ధర మాత్రం పెరగదు. హెరిటేజ్ వచ్చాకే పాల సేకరణ ధర దిగిందమ్మా. రైతులను అడ్డగోలుగా ముంచుతున్న ఈ హెరిటేజ్ మీద సీబీఐ ఎందుకు దాడి చేయదమ్మా?’’ అని పరదేశిమాంబ మహిళా గ్రూపు సభ్యులు మోపాటి వెంకటరమణమ్మ, వడ్డాది వరలక్ష్మి, దాసరి రమాదేవి, దాసరి పరదేశమ్మ అనే మహిళలు ఆవేదన, ఆక్రోశం వ్యక్తం చేశారు. అనంతరం షర్మిల స్పందిస్తూ..‘‘అమ్మా.. హెరిటేజ్ డెయిరీ కోసం చంద్రబాబు నాయుడు చిత్తూరు సహకార డెయిరీ గొంతు నులిమాడు. చిత్తూరు జిల్లా పాల రైతుల పొట్టగొట్టి ఆయన తన హెరిటేజ్ డెయిరీని పెంచుకున్నారు. అదే హెరిటేజ్ కోసం చంద్రబాబు నాయుడు దేశంలోని రైతుల, చిరు వ్యాపారుల పొట్టగొట్టే ఎఫ్‌డీఐ చట్టానికి దొంగచాటుగా మద్దతు పలికారు’’ అని షర్మిల విమర్శించారు.

15.7 కిలోమీటర్ల మేర యాత్ర..

బుధవారం 198వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర విశాఖపట్నం జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని పైడివాడ నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి జగన్నాథపురం, పెదగొల్లలపాలెం, నంగినారపాడు, అజనగిరి, ఏదుల్లనరవ, గాజువాక నియోజకవర్గంలోని దువ్వాడ, రాజీవ్‌నగర్, ముస్తఫా సెంటర్, వడ్లపూడి సెంటర్, శ్రీనగర్ మీదుగా షర్మిల నడిచారు. గాజువాక లంకా గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.00 గంటలకు చేరుకున్నారు. బుధవారం మొత్తం 15.7 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 2,637.8 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది. షర్మిల వెంట నడిచిన వారిలో జిల్లా పార్టీ కన్వీనర్, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, మాజీ ఎమ్మెల్యే, పెందుర్తి సమన్వయకర్త గండి బాబ్జి, గాజువాక సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, మాజీ మంత్రులు పెన్మత్స సాంబశివరాజు, దాడి వీరభద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు చెంగల వెంకట్రావు, ముదునూరి ప్రసాదరాజు, నేతలు కొణతాల లక్ష్మీనారాయణ, సిటీ కన్వీనర్ వంశీకృష్ణ యాదవ్, వివిధ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు కిడారి సర్వేశ్వర్‌రావు, బొడ్డేటి ప్రసాద్, కోలా గురువులు, జీవీ రవిరాజు, స్థానిక నాయకులు గండి రవికుమార్, చెల్ల కనకారావు, కొయ్య ప్రసాదరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రేపటితో పాదయాత్రకు 200 రోజులు: తలశిల రఘురాం

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన పాదయాత్రకు శుక్రవారంతో 200 రోజులు పూర్తి అవుతాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం చెప్పారు. గాజువాకలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 5న షర్మిల విశాఖపట్టణంలోని ఆర్కే బీచ్‌కు చేరుకోవడంతోనే 100 నియోజకవర్గాల్లో ఆమె యాత్ర పూర్తవుతుందని వివరించారు. ఈ సందర్భగా అక్కడే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చంద్రబాబు 86 నియోజకవర్గాలు, 152 మండలాలు, 28 మున్సిపాల్టీలు, 5 కార్పొరేషన్లు, 1,250 గ్రామాల్లో నడవగా షర్మిల ఆయన రికార్డును ఎప్పుడో దాటేశారని అన్నారు. ఇప్పటికే ఆమె 97 నియోజకవర్గాలు, 158 మండలాలు, 38 మున్సిపాల్టీల్లో నడిచారని, శుక్రవారంతో 100 నియోజకవర్గాలు, 8 కార్పొరేషన్లలో యాత్ర పూర్తవుతుందని చెప్పారు. ఇప్పటి వరకు ఆమె 1,565 గ్రామాల్లో పర్యటించారని తెలిపారు. 
Share this article :

0 comments: