ఉచిత విద్యుత్ పథకంలో కోత! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఉచిత విద్యుత్ పథకంలో కోత!

ఉచిత విద్యుత్ పథకంలో కోత!

Written By news on Friday, July 5, 2013 | 7/05/2013


ప్రైవేటు కన్సల్టెన్సీ ‘కాకి లెక్కలకు’ సర్కారు ఓకే
రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల ఉచిత కనెక్షన్లకు ఎసరు
ఒక్కో హెచ్‌పీకి 1,255 యూనిట్ల ఉచిత విద్యుత్తే!
3 హెచ్‌పీ ఉంటే 3,765 యూనిట్లకే పరిమితి
ఏడాదిలో 240 రోజులే సరఫరా...
5 హెచ్‌పీ దాటితే ‘ఉచితం’ హుళక్కే
ఉచిత విద్యుత్ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకే...
మండిపడుతున్న విద్యుత్‌రంగ నిపుణులు

సాక్షి, హైదరాబాద్: వ్యవసాయానికి ఉచిత విద్యుత్ పథకాన్ని మోయలేని భారంగా భావిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం రోజుకో నిబంధనను తెరపైకి తెస్తోంది. వీలైనంత ఎక్కువమంది రైతులు ఈ పథకానికి అనర్హులయ్యేలా ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తోంది. తద్వారా ఖర్చును తగ్గించుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే 2.5 ఎకరాల కంటే ఎక్కువ మాగాణి (తరిపంట) ఉన్న రైతులకు ఉచిత కరెంటును ఎత్తివేసిన ప్రభుత్వం.. ప్రైవేటు సంస్థ ‘కాకి లెక్కల’ నేపథ్యంలో ఉచిత విద్యుత్‌కు మరిన్ని పరిమితులు విధిస్తోంది. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటి, వర్షాభావంతో అల్లాడుతున్న రైతుల్ని మరింత దెబ్బతీసేలా.. ఒక హార్స్ పవర్ (హెచ్‌పీ)కు ‘ఏడాది’కి కేవలం 1,255 యూనిట్ల విద్యుత్‌ను మాత్రమే సరఫరా చేయాలని తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలను జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.

మరోవైపు వ్యవసాయ పంపుసెట్ల సామర్థ్యానికీ పరిమితులు విధించనుంది. ప్రస్తుతం వ్యవసాయ పంపుసెట్ల సామర్థ్యం ఎంత ఉన్నప్పటికీ ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇక మీదట కేవలం 5 హెచ్‌పీలోపు సామర్థ్యం కలిగిన వ్యవసాయ పంపుసెట్లకు మాత్రమే ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అదే జరిగితే రాష్ట్రవ్యాప్తంగా 5 హెచ్‌పీ దాటిన 8 లక్షలకుపైగా వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత విద్యుత్ హుళక్కి కానుంది. ఇంకోవైపు ఖరీఫ్, రబీ సీజన్‌లను మాత్రమే పరిగణనలోకి తీసుకుని మిగతా కాలంలో వేసే కత్తెర పంటలకు కరెంటు సరఫరా చేయకుండా ‘కత్తెర’ వేయనుంది. ఏడాదిలో కేవలం 240 రోజులు మాత్రమే వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేయనుంది. ఏడాది పొడవునా కాయగూరలు, పండ్ల తోటలు సాగుచేసే రైతాంగాన్ని ఆర్థికంగా దెబ్బతీయనుంది. తనకు అనుకూలంగా లెక్కలు తయారు చేసేందుకే ప్రైవేటు సంస్థకు ప్రభుత్వం అధ్యయన బాధ్యతలు అప్పగించిందని విద్యుత్ రంగ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం క్రమేణా ఉచిత విద్యుత్‌కు మంగళం పాడటం ఖాయమనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి.

ప్రైవేటు సంస్థ కొత్త లెక్కలు!
ఆదాయపన్ను చెల్లించే వారు, కార్పొరేట్ రైతులకు మినహా మిగిలిన వారందరికీ ఉచిత విద్యుత్ పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ప్రవేశపెట్టారు. అది కూడా ఏడాది మొత్తం విద్యుత్‌ను సరఫరా చేశారు. ఆయన మరణానంతరం ‘ఉచితానికి’ ఉరి వేసే ప్రక్రియకు తెరలేచింది. ఈ క్రమంలోనే విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల పనితీరుపై నివేదికను అందించాలని ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీ సంస్థకు ఇంధనశాఖ బాధ్యత అప్పగించింది. ఈ మేరకు అధ్యయనం నిర్వహించిన ఆ కన్సల్టెన్సీ వ్యవసాయానికి ఎంత విద్యుత్‌ను అందించాలనే విషయాన్ని కూడా అధ్యయనం చేసింది. గత నెలలో తన నివేదికను ఇంధనశాఖకు అందించింది.

అందులో కొత్త, మరికొంత వింత లెక్కలను వేసింది. ఏడాదిలో 120 రోజులు ఖరీఫ్, మరో 120 రోజులు రబీ సీజను ఉంటుందని పేర్కొంది. ఆ విధంగా 365 రోజుల్లో కేవలం 240 రోజులు మాత్రమే వ్యవసాయానికి ఏడు గంటల పాటు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని సూచించింది. అదేవిధంగా ఒక హెచ్‌పీ సామర్థ్యం కలిగిన పంపుసెట్టు గంటకు కేవలం 0.747 యూనిట్లను మాత్రమే వినియోగిస్తుందని అంచనా వేసింది. అంటే రోజుకు 7 గంటల చొప్పున కేవలం 5.229 యూనిట్లు మాత్రమే వినియోగమవుతుందని... ఈ విధంగా ఏడాదిలో 240 రోజులకు 1255 యూనిట్లను మాత్రమే సరఫరా చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఇంతకంటే మించి సరఫరా జరిగితే... ఉచిత విద్యుత్ పథకం దారి మళ్లినట్టేనని (5హెచ్‌పీకి మించిన సామర్థ్యం, 7 గంటలకు మించి సరఫరా) తెలిపింది.

ఉచిత కరెంటుకు కోత వేయడం ద్వారా ఖర్చు తగ్గించుకోవాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ సిఫారసులు, సూచనల అమలుకు రంగంలోకి దిగింది. ఒక హెచ్‌పీకి ‘ఏడాది’లో కేవలం 1255 యూనిట్ల కరెంటే సరఫరా చేయాలని ఇంధనశాఖ నిర్ణయించింది. అంటే 3 హెచ్‌పీ (3ఁ1255) సామర్థ్యం కలిగిన పంపుసెట్టు ద్వారా ‘ఏడాది’లో 3,765 యూనిట్ల విద్యుత్‌ను మాత్రమే వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇంతకు మించి సరఫరా జరగకుండా కట్టడి చేయాలని కిందిస్థాయి సిబ్బందికి సర్కారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ప్రైవేటు లెక్కలపై విద్యుత్‌రంగ నిపుణులు మండిపడుతున్నారు. భూగర్భజలాలు రోజురోజుకూ అంతరించిపోతున్న నేపథ్యంలో నీటిని తోడేందుకు మోటార్లు అధిక విద్యుత్‌ను వినియోగించే అవకాశం ఉంది. అదేవిధంగా వ్యవసాయానికి సరఫరా అవుతున్న విద్యుత్ లో-ఓల్టేజీలో సరఫరా అవుతుంటుంది. దీనివల్ల కూడా అధిక విద్యుత్ ఖర్చు అవుతుంది. అంటే వాస్తవంగా 7 గంటల ఉచిత సరఫరా జరగదు. ఆ మేరకు రైతులు నష్టపోతారు. ఈ వాస్తవాలను పక్కనపెట్టి వ్యవసాయానికి విద్యుత్ సరఫరాను పరిమితం చేయడమంటే పథకాన్ని నిర్వీర్యం చేయడమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

రాష్ట్రంలో వ్యవసాయ పంపుసెట్ల వివరాలు
హెచ్‌పీ సామర్థ్యం కనెక్షన్ల సంఖ్య (లక్షల్లో)
5 హెచ్‌పీలోపు 23.52
7.5 హెచ్‌పీ 2.61
10 హెచ్‌పీ 2.98
15 హెచ్‌పీ 2.62
మొత్తం 31.73
Share this article :

0 comments: