రాజన్న రాజ్యానికి బాటలు వేయండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజన్న రాజ్యానికి బాటలు వేయండి

రాజన్న రాజ్యానికి బాటలు వేయండి

Written By news on Tuesday, July 23, 2013 | 7/23/2013

మీ సంక్షేమం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీ ఓటును ఆయుధంగా మలచుకోండి
సంక్షేమాన్ని విస్మరించిన బాబును, చార్జీలు పెంచిన కిరణ్‌ను తిరస్కరించండి
మద్యం, పచ్చ నోట్లు వెదజల్లుతారు..వారి కుట్రలను భగ్నం చేయండి
బాబు పాలనలో రుణాల మాఫీ లేదు, ఉచిత విద్యుత్తు లేదు.. యూజర్ చార్జీలంటూ పేదల నుంచి డబ్బులు పిండారు
వైఎస్ మరణించిన తరువాత.. గతంలో చంద్రబాబు పాలననాటి పరిస్థితులే మళ్లీ వచ్చాయి
మీరేం చేశారని కాంగ్రెస్, టీడీపీ బలపరిచే అభ్యర్థులను నిలదీయండి

సాక్షి, హైదరాబాద్:‘‘మీ సంక్షేమం, మీ బిడ్డల సంక్షేమం, మొత్తంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీ ఓటును ఆయుధంగా మలచుకోండి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కాకుండా.. ప్రజల కష్టాలు, నష్టాలు తెలుసుకుని తనకు తానే పథకాలు అమలు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణయుగానికి మరోసారి పునాదులు వేయండి’’ అని రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పిలుపునిచ్చారు. వంచనకు మారుపేరైన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల కుట్రలను తిప్పికొట్టాలని కోరారు. ఎన్నికల క్షేత్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో తలపడలేక, జన నేతపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయించిన వారిని తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఆమె ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన పూర్తి పాఠం..

‘‘నాలుగేళ్ల క్రితం మీరు, మీ కుటుంబం ఎలా ఉన్నారు? ఈ రోజున ఎలా ఉన్నారు? ఈ ప్రశ్నకు రాష్ట్రంలో ఎవరిని అడిగినా సమాధానం చెబుతారు. నాలుగేళ్లుగా వ్యవసాయం దెబ్బతిన్నది. ఎరువుల ఖర్చులు 300 నుంచి 800 శాతం పెరిగాయి. వ్యవసాయానికి పెట్టుబడులు పెరిగాయి. గిట్టుబాటు ధర కానీ, మద్దతు ధర కానీ లభించడంలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పల్లెలను పూర్తిగా మరచిపోయింది. పంచాయతీ ఎన్నికలు ఏనాడో నిర్వహించాల్సి ఉన్నా.., ఈ ప్రభుత్వానికి ధైర్యం లేకపోయింది. గతంలో నోడల్ ఆఫీసర్లను పెట్టి పంచాయతీలను, వాటి అధికారాలను నాశనం చేసిన చరిత్ర చంద్రబాబుది. ఈ విషయం ప్రపంచ బ్యాంకే చెప్పింది.

చంద్రబాబు పాలనలో అంతా అధోగతే...

పల్లె బాగుండాలంటే రైతులంతా బాగుండాలి. రైతు కూలీలు బాగుండాలి. గ్రామంలో వ్యవసాయానికి అనుబంధంగా శతాబ్దాలుగా కులవృత్తులు, గ్రామీణ వృత్తులు చేసుకుంటున్న అన్ని సామాజిక వర్గాలు బాగుండాలి. ఆ పరిస్థితి చంద్రబాబునాయుడు గారి పరిపాలనలో లేదు. సబ్సిడీ మీద బియ్యమే ఇవ్వటానికి వీల్లేదని వాదించిన చరిత్ర చంద్రబాబుది. 2 రూపాయల కిలో బియ్యాన్ని రూ 5.25కు పెంచిన చరిత్ర చంద్రబాబుది. నీటి ప్రాజెక్టులు కడితే ఖర్చు ఎక్కువ, రాబడి తక్కువ అని చెప్పిన చరిత్ర చంద్రబాబుకు మాత్రమే ఉంది. మీ గ్రామంలో ఒక రోడ్డు వేసుకోవాలన్నా, ఒక చెరువు బాగు చేసుకోవాలన్నా, ఒక బడిలో తరగతి గదులు మరమ్మతు చేసుకోవాలన్నా అది ప్రభుత్వం పని కాదు.. అన్నీ ప్రజలే చందాలు వేసుకుని, లేదా వారే పలుగు, పార పట్టుకుని ఆ పనులు చేసుకోవాలని చంద్రబాబు చెప్పారు. అదీ చంద్రబాబుగారి విజన్ 2020. అదీ చంద్రబాబు గ్రామ స్వరాజ్యం. చివరికి మనిషి చచ్చిపోతుంటే.. ఒక 108, ఒక 104, ఒక ఆరోగ్యశ్రీ లేకపోవట మే కాదు.. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి సేవకీ యూజర్ చార్జీలు అంటూ... పేదల నుంచి డబ్బులు పిండిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు గ్రామాలకు ఏదో చేశానంటాడు. ఆయన పాలనలో రైతులకు రుణాల మాఫీ లేదు. ఉచిత విద్యుత్తు లేదు. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు తీసివేయటమే తప్ప కొత్తగా నియామకాలు లేవు. గ్రామాల్లో కరెంటు కోత తప్ప, కరెంటే లేదు. ఏటా ఆర్టీసీ చార్జీల భారం, ఏటా విద్యుత్ చార్జీల భారం.. ఇలా ప్రతిదీ ప్రజల మీద బరువు వేసి బిల్ క్లింటన్, టోనీ బ్లెయిర్‌లతో ఫొటోలు దిగి రాష్ట్రంలో గ్రామాల్ని సర్వ నాశనం చేశారు చంద్రబాబు.

వైఎస్సార్ మరణం తరువాత మళ్లీ అదే పరిస్థితి...

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తరువాత.. గతంలో చంద్రబాబు పాలనలో ఎలాగైతే చార్జీలు విధించటమే ఒక పనిగా పెట్టుకున్నారో.. గత నాలుగేళ్లలో అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఈ రెండు పార్టీలు, వాటి అభ్యర్థులను మీ గుమ్మం ముందుకు వచ్చినప్పుడు ప్రజలుగా ఒక్క ప్రశ్న అడగాలి. ‘మీరు మాకేం చేశారు’ అని ప్రశ్నించండి. ఏదో చేశాం అని చెబితే కుదరదు.. ‘మా ఇంటికి, ఇందులో కుటుంబ సభ్యులకు మీరేం ప్రయోజనం చేశారో చెప్పండి’ అని నిలదీయండి. కాంగ్రెస్‌గానీ, తెలుగుదేశం పార్టీగానీ మద్యాన్ని పంచగలవు. పచ్చ నోట్లను వెదజల్లగలవు. కానీ.. అభిమానాన్ని, ఆప్యాయతల్ని పంచలేవు. వంచనకు మారుపేరుగా మారిన ఈ రెండు పార్టీల కూటమి మంచి పరిపాలన ద్వారా కాకుండా ప్రలోభాల ద్వారా మాత్రమే పరువు దక్కించుకోవాలనుకుంటోంది. వారి కుట్రల్ని పటాపంచలు చేయండి. ఎన్నికల క్షేత్రంలో వైఎస్సార్ కాంగ్రెస్‌తో తలపడలేక, జననేతపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయించిన వారిని తిరస్కరించండి.

ప్రజలే సరైన నిర్ణేతలు...

తన 8 ఏళ్ల 8 నెలల 13 రోజుల పరిపాలనను మళ్లీ తీసుకు వస్తాం అని చంద్రబాబే ఎందుకు చెప్పలేకపోతున్నారు? అలాగే రాజశేఖరరెడ్డి 5 ఏళ్ల 3 నెలల పరిపాలనలో ఏ ఒక్క చార్జీ పెంచకుండా సువర్ణయుగాన్ని అందిస్తే, కాంగ్రెస్ వారు ఈ నాలుగేళ్లలో కరెంటు చార్జీలు, ఆర్టీసీ చార్జీలు ఇంతగా పెంచారు కదా.. వారు ఎలా ఓట్లు అడగడానికి వస్తున్నారు? కేవలం రెండే రెండు వాగ్దానాలు 2009 కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నాయి. 9 గంటల ఉచిత విద్యుత్, 30 కిలోల బియ్యం.. ఈ రెండూ కూడా అమలు చేయలేని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామంటే ఎవరు నమ్ముతారు? చంద్రబాబు, రాజశేఖరరెడ్డి, కిరణ్... ఈ ముగ్గురి పాలనల గురించి ప్రజలకు ఎవరో చెప్పాల్సిన పని లేదు. ఈ ముగ్గురి ప్రభుత్వాల్లో కష్ట సుఖాలేమిటో ప్రజలు నేరుగా అనుభవించారు. కాబట్టే అధికారం ఎవరి చేతిలో పెట్టాలి, ఎవరిని అధికారానికి దూరం పెట్టాలన్న విషయంలో ప్రజలే సరైన నిర్ణేతలు.

సువర్ణయుగానికి పునాదులు వేయండి...

అధికారంలోకి రాగానే రాజశేఖరరెడ్డి పరిపాలనను వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సగర్వంగా చెబుతోంది. అలాంటి పరిస్థితి మిగతా పార్టీల్లో లేదు. కాబట్టి మీ సంక్షేమం, మీ బిడ్డల సంక్షేమం, మొత్తంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీ ఓటును ఆయుధంగా మలచుకోండి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కాకుండా.. ప్రజల కష్టాలు, నష్టాలు తెలుసుకుని తనకు తానే పథకాలు అమలు చేసిన రాజశేఖరరెడ్డి సువర్ణయుగానికి మరోసారి పునాదులు వేయండి. పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరిగే ఎన్నికలు కావు. అయితే ఇవి మీ సంక్షేమాన్ని మీరే నిర్ణయించుకోవటంలో మొదటి మెట్టులాంటివి. కాబట్టి సంక్షేమాన్ని వ్యతిరేకించి చార్జీల భారాన్ని ప్రజల నెత్తిన వేసి గ్రామ సీమల్ని శ్మశానాలుగా మార్చిన చరిత్ర గల పార్టీలను ఈ ఎన్నికల్లోనే తిరస్కరించడం అవసరం. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ పంచాయతీ ఎన్నికల్లోనూ వైఎస్సార్ అభిమానుల్ని వార్డు మెంబర్లుగా, సర్పంచ్‌లుగా ఎన్నుకోవటం ద్వారా రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెచ్చుకునేందుకు బాటలు పరవండి. ఇది ప్రజలందరికీ వినమ్రంగా నా విజ్ఞప్తి.’’
Share this article :

0 comments: