కాంగ్రెస్‌కు మోపిదేవి సోదరుని రాజీనామా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్‌కు మోపిదేవి సోదరుని రాజీనామా

కాంగ్రెస్‌కు మోపిదేవి సోదరుని రాజీనామా

Written By news on Thursday, July 4, 2013 | 7/04/2013జైల్లో అనారోగ్యంతో బాధపడుతున్నా పట్టించుకోలేదని ధ్వజం
సీఎం కాళ్లు పట్టుకున్నా కనికరించలేదని వేదన
కన్నీటిపర్యంతమైన హరనాథ్‌బాబు
ఐదున వైఎస్సార్‌సీపీలో చేరనున్నట్టు వెల్లడి

రేపల్లె(గుంటూరు జిల్లా), న్యూస్‌లైన్:మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ సోదరుడు హరనాథ్‌బాబు తన అనుచరులతో కలసి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఆయన రేపల్లె, నిజాంపట్నం, చెరుకుపల్లి మండలం రాంభొట్లవారిపాలెం పంచాయతీ పరిధిలోని పిట్టుకోటిరెడ్డిపాలెంలో బుధవారం కార్యకర్తలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించి... సమష్టిగా రాజీనామా నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ తన సోదరుడు వెంకటరమణను బలిపశువును చేశారని ఆరోపించారు. ఆ జీవోలతో తనకెలాంటి సంబంధం లేనప్పటికీ ఆయన్ను బయటకు తీసుకురావడానికి ప్రభుత్వం తరఫున ఎటువంటి చర్యలూ చేపట్టలేదన్నారు. న్యాయసహాయం చేసేందుకూ చొరవ చూపలేదన్నారు. 

పైగా ఆయన అనారోగ్యంతో సతమతమవుతుంటే ఆస్పత్రిలో చేర్పించేందుకూ సహకరించలేదని, ఈ విషయంలో తాము సీఎం కాళ్లు పట్టుకుని వేడుకున్నా ఫలితం లేకపోయిందని కన్నీటిపర్యంతమయ్యారు. ఆ మనోవేదనతోనే తాము పార్టీకి రాజీనామా చేస్తున్నామని వెల్లడించారు. ఐదో తేదీన వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ సమక్షంలో ఆ పార్టీలో చేరుతున్నామని ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఘనవిజయం చేకూర్చి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, తమ సోదరుడు వెంకటరమణకు కానుకగా ఇద్దామని చెప్పారు. నియోజకవర్గానికి చెందిన ప్రధాన నాయకులు పెద్దసంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు. నిజాంపట్నం మండల మాజీ ఎంపీపీ ప్రసాదం వాసుదేవ, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు యార్లగడ్డ భాగ్యలక్ష్మి, కాంగ్రెస్ నాయకుడు మదన్‌మోహన్, రేపల్లె మాజీ జెడ్‌పీటీసీ సుధాకర చంద్రహాసరావు, మాజీ ఎంపీపీ గరికపాటి పావని, మండల కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు గరికపాటి భానుకోటి, ఇంకా పెద్ద సంఖ్యలో మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలుసహా దాదాపు 2,400 మందికిపైగా కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.
Share this article :

0 comments: