నిర్ణయానికి ముందే అన్నింటిపైనా చర్చించాలి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నిర్ణయానికి ముందే అన్నింటిపైనా చర్చించాలి

నిర్ణయానికి ముందే అన్నింటిపైనా చర్చించాలి

Written By news on Wednesday, July 31, 2013 | 7/31/2013

 రాష్ట్ర విభజనపై తుది నిర్ణయం తీసుకునే ముందు నీరు, రెవెన్యూ వాటా, కొత్త రాజధాని ఏర్పాటుకు అవసరమయ్యే నిధులు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అన్ని అంశాలను చర్చకు పెట్టాలని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ డిమాండ్ చేసింది. కోట్లాది మంది ప్రజల‌ సెంటిమెంటు విషయంలో కాంగ్రెస్ బాధ్యతా‌ రహితంగా వ్యవహరిస్తోందని పార్టీ దుయ్యబట్టింది. తెలంగాణ అంశంపై ఇప్పటికి జరిగిన మూడు అఖిలపక్ష సమావేశాల్లో తన అభిప్రాయం ఏమిటో వెల్లడించని కాంగ్రెస్ పార్టీ ఎలాంటి బహిరంగ చర్చా లేకుండానే హఠాత్తుగా రాష్ట్ర విభజనకు అనుకూల నిర్ణయం తీసుకు‌న్నామని ప్రకటించడం దిగ్భ్రాంతి కలిగించిందని పార్టీ ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, గడికోట శ్రీకాంత్‌రెడ్డి మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

MLA Mekathoti Sucharithaరాష్ట్రంలోని రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, పారిశ్రామిక, వ్యాపార వర్గాలు, వాణిజ్య సంఘాలు, పౌర సమాజం ప్రతినిధులు ఎవ్వరినీ విశ్వాసంలోకి తీసుకోకుండా మరో రెండు లేదా మూడు రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించడం కూడా ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విడగొట్టాలని తీసుకున్న నిర్ణయం వల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నీళ్లు లేక ఎం‌డారిగా మారిపోయే ప్రమాదం ఉందని సుచరిత, శ్రీకాంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. దీనితో ఆ ప్రాజెక్టుల కింద ఉన్న విస్తారమైన ఆయకట్టు ఎండిపోయి పంటలు రాని ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో ఉన్న భద్రాచలం రెవెన్యూ డివిజన్ 1956 అక్టోబ‌ర్ 31వ వరకూ తూర్పుగోదావరి జిల్లాలో ఉండేదని, దాని గురించి అజ‌య్ మాకె‌న్ తన ప్రకటనలో ‌ప్రస్తావించకపోవడం దురదృష్టకరమని వారు పేర్కొన్నారు.

నదీ జలాల పంపకం, విద్యుత్‌ను వాటాలు చేయడంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రజల హక్కుల పరిరక్షణకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని అజ‌య్ మాకె‌న్ ప్రకటించారని‌ సుచరిత, శ్రీకాంత్‌రెడ్డి గుర్తుచేశారు. అయితే ఈ అంశాలను, సమస్యలను పరిగణనలోకి తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని, వీటన్నింటినీ పరిష్కరించా‌లని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడాన్ని తప్పుపట్టారు. గత ఏడాది డిసెంబర్ 28న కేంద్ర హోంమంత్రి నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానిదేనని, రాజ్యాంగంలోని 3వ అధికరణ కింద ఒక నిర్ణయం తీసుకోవచ్చని వై‌యస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చెప్పిన విషయాన్ని వారు తమ ప్రకటనలో ప్రస్తావించారు. ఇలాంటి సున్నితమైన అంశంలో కేంద్ర ప్రభుత్వం రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలని కూడా సూచించిన విషయాన్ని గుర్తుచేశారు.

కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై ఏం చేయబోతోందో కొన్ని ప్రతిపాదనలతో ముందుకు వస్తుందని రాష్ట్ర ప్రజలు కూడా భావించారని సుచరిత, శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనుకుంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలను పరిరక్షించడానికి ఏం చర్యలు తీసుకుంటుందో, విభజించాలనుకుంటే నీరు, రాబడి వంటి అంశాలతో పాటు హైదరాబాద్‌ను ఏం చేయబోతుందో కేంద్రం చెప్తుందని రాష్ట్ర ప్రజలు ఎదురుచూశారని తెలిపారు.

‌గడచిన 57 ఏళ్లుగా రాష్ట్ర రాజకీయ రాజధానిగానే కాదు, తయారీ రంగంలో 70 శాతం జిడిపి, 95 శాతం సాఫ్టువేర్ టర్నోవర్‌తో పాటు ప్రధానమైన సివిల్, రక్షణ ప్రయోగశాలలు, ఉన్నత విద్యా సంస్థలు ఉన్న శక్తివంతమైన ఆర్థిక కేంద్రంగా కూడా ఆవిర్భవించిన హైదరాబా‌ద్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో చెబుతారని భావించామని పేర్కొన్నారు. ఇవేవీ చర్చించకుండా విభజనపై నిర్ణయం తీసుకోవడం కోట్లాది మంది ప్రజల ప్రాణాలతో  చెలగాటం ఆడటమే అని వారు విమర్శించారు. ఇంతటి నిర్దయాపూరితమైన నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్‌ పార్టీని భావితరాలు ఏ మాత్రం క్షమించబోవన్నారు. తాము లేవనెత్తిన అంశాలన్నింటిపైనా చర్చ జరగాలని సుచరిత, శ్రీకాంత్‌రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

http://www.ysrcongress.com/news/top_stories/center-must-discuss-on-all-aspects-before-final-decission.html
Share this article :

0 comments: