చేతి వృత్తులు చితికిపోతున్నాయి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చేతి వృత్తులు చితికిపోతున్నాయి

చేతి వృత్తులు చితికిపోతున్నాయి

Written By news on Thursday, July 25, 2013 | 7/25/2013

వైఎస్ ఉన్నప్పుడు రైతులు, వృత్తిదారుల బతుకులు బాగుండేవి
ఇప్పుడు పల్లెలపై కంపెనీల దాడి, పాలకుల నిర్లక్ష్యంతో కుంగిపోతున్నాం
జగనన్న వస్తేనే మళ్లీ మా బతుకులు బాగుపడతాయి 
త్వరలోనే జగనన్న వస్తారు..రాజన్న రాజ్యం తెస్తారంటూ షర్మిల భరోసా
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ బుధవారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 219, కిలోమీటర్లు: 2,941.9

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి:‘‘అమ్మా...! నేను హస్తకళాకారుడిని. కొమ్మను చెక్కి బొమ్మగా మలచడమే తెలుసు. ఇంకో పని రాదమ్మా. కొయ్య బొమ్మలు చెక్కి పొట్టపోసుకుంటున్నాను. ఇప్పుడు పెద్దపెద్ద కంపెనీలొచ్చి మాకంటే అందంగా బొమ్మలు చేసి అమ్ముతున్నారమ్మా.. మా బొమ్మలు కొనే దిక్కు లేదు. వైఎస్సార్ ఉన్నప్పుడు కళాకారులకు రూ.200 పింఛను ఇచ్చేవారమ్మా. మమ్ములను కూడా కళాకారుల కిందనే పరిగణించి మాకు రూ.200 పింఛను ఇవ్వాలని అనుకున్నారు. ఆయన పోయిన తరువాత మమ్ములను పట్టించుకునే వారే లేరమ్మా. ఆకలికి చస్తూ బతుకుతున్నాం’’ 
- శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన అరసవల్లి రామలింగం ఆవేదన

‘‘కుండలు చేసి పిల్లలను సాకినాం.. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి కుమ్మరి వృత్తే మాకు జీవనాధారం. అప్పట్లో చెరువుకు వెళితే చేతనైనంత వరకు మట్టి తెచ్చుకునే వాళ్లం. ఇప్పుడు అదే మట్టి ట్రాక్టర్‌కు రూ. 1,000 తీసుకుంటున్నారు. ఆ మట్టి తెచ్చి కుండలు చేసి అమ్మబోతే కొనేవాళ్లే లేరమ్మా. మేం చేసే తపాలలకు విలువ లేదమ్మా. మా వయసులో ఉన్నప్పుడు చెల్లుబాటు అయింది. ఇపుడు కుండలు అమ్ముడుపోక, కడుపు నిండక పస్తులుంటున్నాం’’ 
- శ్రీకాకుళం జిల్లా పాలవలస గ్రామానికి చెందిన కుమ్మరి ముత్యాలమ్మ, రాములు, కుమ్మరి ఎర్రయ్య, చిన్నమ్మడుల గోడు 

ఒక్క వీళ్లే కాదు.. చేతి వృత్తినే నమ్ముకున్న నేతన్న.. గీతన్న.. మేదరన్న ప్రతి ఒక్కరూ కన్నీళ్లు పెడుతున్నారు. బహుళ జాతి కంపెనీలు ఒక వైపు, పాలకుల నిర్లక్ష్యం మరో వైపు పల్లెలపై, పల్లె వృత్తులపై దాడి చేస్తున్నాయి. వృత్తులు కూలిపోయి ఉపాధి దొరక్క జనం ఆకలికి అలమటిస్తున్నారు. ప్రజాసమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని,దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరిని ఎండగడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర బుధవారం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలోని పల్లె ప్రాంతాల్లో సాగింది. దారి వెంట పలువురు చేతివృత్తులవారు ఆమెను కలిసి బాధలు చెప్పుకొన్నారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. వృత్తులు కూలిపోతున్న తీరును ఆమె వివరించారు. ఆదుకోవాలని అర్థించారు.

నాగలిపట్టి దున్నే రైతే లేడమ్మా..

‘‘రైతులంతా చెదిరిపోయారమ్మా...! మా కమ్మరి బతుకులు చెడిపోయాయి. ఈ వర్షాకాలం వస్తే రైతులతో మా ఇల్లు కళకళలాడేది. నాగళ్లు చేస్తూ నేను, మా తండ్రి, తమ్ముడు తీరికలేకుండా ఉండేవాళ్లం. ఆ రోజుల్లో ఒక్కొక్క రైతు పొలం పండినప్పుడు నాలుగు ధాన్యం కట్టలు, ఏదు సోళ్ల ధాన్యం ఇస్తే మాకు ఏడాదంతా తిండికి ఇబ్బంది లేకుండా ఇల్లు గడిచేదమ్మా. ఇప్పుడు వ్యవసాయం వట్టిపోయిందమ్మా, రైతులు ఎద్దు, వ్యవసాయానికి దూరం అయ్యారు. గడ్డి దొరక్క రైతులు ఎద్దులను అమ్ముకున్నారు. 

కొద్దోగొప్పో పొలం సాగు చేస్తే ట్రాక్టర్ పెట్టి దున్నించుకుంటున్నారు. నాగలి పట్టి దున్నే రైతులు లేరమ్మా. ఈ పని తప్పితే మరో పని రాని మేం పస్తులతో కాలం వెళ్లదీస్తున్నాం తల్లీ’’ అని పాలకొండ గ్రామానికి చెందిన అప్పల రాముడు షర్మిల వద్ద బాధపడ్డారు. ‘‘మూడేళ్ల నుంచి రైతుల పరిస్థితి బాగ లేదక్కా... నేను బుట్టలు, గంపలు అల్లి రైతులకు అమ్ముకొని జీవనం సాగించే ఎరుకలిని. మా ఆడోళ్లు సోది (జాతకం) సెప్తారక్కా, రైతులు బాగా బతుకుతేనే మేం కూడా బాగుంటామక్కా... రోజుకు రెండు గంపలు అల్లుతా... వైఎస్సార్ ఉన్నప్పుడు కాలం బాగయింది. ఆ సీజన్‌లో నేను గంప రూ.100కు అమ్ముకున్నా. గంపల కోసం రైతులు నా గుడిసె ముందుకొచ్చి కూసునేటోళ్లు. ఇప్పుడు నేనే నెత్తిన పెట్టుకొని ఊరూరూ తిరుగుతూ అమ్ముతున్నా కూడా రూ.50కి గంప కొనే దిక్కు లేదక్కా’’ అని పాలకొండకు చెందిన ఎరుకలి అప్పలస్వామి షర్మిల వద్ద ఆవేదన వ్యక్తంచేశారు.

పాలకులకు పోయే కాలం దగ్గరకొచ్చింది: ప్రజల కష్టాలు విన్న షర్మిల పలు చోట్ల వారితో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు తొమ్మిదేళ్ల పరిపాలనలో ప్రజలను ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించారు. ఆయన హయాంలో రాష్ట్రం కుదేలయిపోయింది. ఇప్పుడు కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా అచ్చం చంద్రబాబు పాలనను తలపిస్తున్నారు. వీళ్లకు పోయేకాలం దగ్గరకొచ్చింది. రైతులు, చేతి వృత్తుల వాళ్ల ఉసురుతాకి పోతారు’’ అని ఘాటుగా విమర్శించారు. ‘‘అమ్మా...! జగనన్నను ఆశీర్వదించండి. మళ్లీ మంచి రోజులు వస్తాయి. ఆ సువర్ణయుగం రావాలంటే ఓటు అన్నది మీ చేతిలో ఉన్న ఆయుధం. దాన్ని వృథా కానివ్వకండి. ఆ ఆయుధంతో జగనన్నను, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను మీరు ఆశీర్వదించిన రోజున రాజన్న రాజ్యం తప్పకుండా సాధ్యమవుతుంది’’ అని షర్మిల భరోసా ఇచ్చారు.

16.7 కిలోమీటర్ల మేర యాత్ర..

బుధవారం 219వ రోజు పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలోని తుడ్డలి గ్రామం నుంచి ప్రారంభమయింది. అక్కడి నుంచి మర్రిపాడు, లక్కుపురం, పాలవలస, రామన్నపేట, కొండపేట, పెద్దపేట, మథనాపురం, అప్పలపేట, కురింపేట, సంకురాడ, కొల్లి వలస, సింగన్నపాలెం, ఉప్పినివలస, వైకుంఠపురం గ్రామాల మీదుగా సాగింది. ఇదే గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి ఆమె రాత్రి 7.00 గంటలకు చేరుకున్నారు. బుధవారం మొత్తం 16.7 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 2,941.9 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది. షర్మిల వెంట నడిచిన వారిలో జిల్లా పార్టీ కన్వీనర్ ధర్మాన పద్మప్రియ, ఆమదాలవలస నియోజకవర్గ సమన్వయకర్తలు బొడ్డేపల్లి మాధురి, కిల్లి రామ్మోహన్‌రావు, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు వరుదు కళ్యాణి, వైవీ సూర్యనారాయణ, స్థానిక నాయకులు బొడ్డేపల్లి పద్మజ, కొయ్య ప్రసాదరెడ్డి, దుప్పల రవీంద్ర, దవళ వెంకట గిరిబాబు తదితరులు ఉన్నారు.
Share this article :

0 comments: