కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యేది టీడీపీనే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యేది టీడీపీనే

కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యేది టీడీపీనే

Written By news on Wednesday, July 3, 2013 | 7/03/2013

- ధ్వజమెత్తిన పేర్ని నాని
- సర్కారును నిలదీయకుండా జగన్‌పై విమర్శలా?
- చంద్రబాబు, మోత్కుపల్లిల డీఎన్‌ఏ ఏమిటి?
- కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యేది టీడీపీనే 
- ఉత్తరాఖండ్ వరదలనూ రాజకీయం చేశారు

సాక్షి, హైదరాబాద్: అన్ని రంగాల్లో వైఫల్యం చెందిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్ష స్థానంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ బాధ్యతను విస్మరించి అనునిత్యం వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని, వైఎస్సార్‌సీపీని టార్గెట్ చేసి అత్యంత హీనంగా మాట్లాడటం వారి దివాలాకోరుతనానికి నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే పేర్నినాని దుయ్యబట్టారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఢిల్లీ నుంచి వచ్చిన దిగ్విజయ్‌సింగ్ ఏదో కామెంట్ చేస్తే దాన్నే పట్టుకొని టీడీపీ నేతలు నానాయాగీ చేయడమేమిటని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను కేంద్రం పెంచితే, తానేం తక్కువన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇంధన సర్‌చార్జీల పేరుతో రూ.540 కోట్లు విద్యుత్‌చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, తదితరాలు పెంచి ప్రజలను చీల్చి చెండాడుతుంటే టీడీ పీ పల్లెత్తుమాట ప్రశ్నించకపోవడంలో ఉన్న మతలబేమిటని ప్రశ్నించారు. 

ఆ పార్టీనేత యనమల రామకృష్ణుడు వైఎస్సార్‌సీపీ, జగన్‌పై ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన దివాలాకోరుతనం స్పష్టంగా బయటపడుతోందన్నారు. చంద్రబాబు భజన చేస్తున్న మోత్కుపల్లి గతంలో కాంగ్రెస్ తరఫున పోటీచేసిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. అసలు చంద్రబాబు ఏపార్టీ నుంచి వచ్చారో గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీలో టీడీపీ విలీనమయ్యే అవకాశముందే కానీ వైఎస్సార్‌సీపీ ఎట్టి పరిస్థితిలో విలీనం కాబోదని స్పష్టంచేశారు. కాంగ్రెస్‌తో కలవాలనుకుంటే జగన్ ఏడాదిపైగా జైల్లో ఉంటూ ఇన్ని ఇబ్బందులు ఎందుకు ఎదుర్కొంటారని ప్రశ్నించారు. ‘‘ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న రాష్ట్ర వాసులను ఆదుకునేందుకు మొట్టమొదటగా వైఎస్సార్‌సీపీ తరఫున వైద్యబృందం పంపించాం. కానీ ప్రచారం చేసుకోవాలని ఆరాటపడలేదు. చంద్రబాబు ఇందుకు పూర్తిభిన్నంగా అమెరికాలో వ్యాపారాలు సరిదిద్దుకొని సకుటుంబ సపరివార సమేతంగా విహారయాత్ర చేసి వచ్చి ఉత్తరాఖండ్‌లో రాజకీయాలు చేయడం దురదృష్టకరం. ఆయన అమెరికా పర్యటన నుంచి ప్రజలను దృష్టి మళ్లించడానికే చేశారని కొందరు వ్యాఖ్యానించినా మేం మాత్రం రాజకీయం చేయదల్చుకోలేదు’’ అని చెప్పారు. 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ వైఖరిని మొదటి ప్లీనరీలోనే పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారని, దానికి తాము కట్టుబడి ఉన్నామని నాని తెలిపారు. కేంద్రం ఒక తండ్రి మాదిరిగా ఎవరి మనసులు గాయపడకుండా అందరికీ ఆమోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ, జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాకుండా నిరోధించడానికి రాష్ట్రాన్ని ఎన్ని ముక్కలు చేయడానికైనా, ప్రజలను ఎన్ని ఇబ్బందులకు గురిచేసేందుకైనా కాంగ్రెస్, టీడీపీ సిద్ధంగా ఉన్నాయని మరో ప్రశ్నకు సమాధానంగా వ్యాఖ్యానించారు.
Share this article :

0 comments: