నాడు క్రాంతి.. నేడు భ్రాంతి.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నాడు క్రాంతి.. నేడు భ్రాంతి..

నాడు క్రాంతి.. నేడు భ్రాంతి..

Written By news on Saturday, July 27, 2013 | 7/27/2013

వ్యవసాయంలో నష్టాలను చవిచూస్తున్న రైతులకు ఆ కష్టాల నుంచి గట్టెక్కేందుకు పాడిపరిశ్రమ ప్రత్యామ్నాయ ఉపాధి మార్గంగా మారింది. ఈ నేపథ్యంలో 2008-09 సంవత్సరంలో పశుక్రాంతి పథకాన్ని ప్రవేశపెట్టి దివంగత సీఎం వైఎస్.. ప్రభుత్వపరంగా పాడి రైతులకు ఆసరా అందించారు. యూనిట్‌కు రెండు గేదెల చొప్పున ఇచ్చారు. అప్పుడు ఒక్కో యూనిట్ విలువ రూ.30 వేలు ఉండగా.. ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ ఇచ్చింది. వైఎస్సార్ మరణానంతరం పశుక్రాంతి పథకాన్ని ప్రభుత్వం మూలన పడేసింది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పథకం కింద మినీ డెయిరీల ఏర్పాటు ప్రోత్సాహమిస్తామని నమ్మబలుకుతున్న సర్కారు.. ఐదు పశువులు ఒక యూనిట్‌గా అందిస్తామని, సబ్సిడీ మాత్రం 25 శాతమేనని మెలిక పెట్టింది. 

ఒక యూనిట్ ఖరీదు పాడిగేదెలకు రూ.2.95 లక్షలు కాగా, సబ్సిడీ కేవలం రూ.73,750 ఇస్తున్నారు. ఆవుల యూనిట్ ఖరీదు రూ.2,47,500 కాగా సబ్సిడీ రూ.61,875 మాత్రమే వస్తోంది. మరోవైపు పూచీ లేనిదే బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. దీంతో యూనిట్ ఖరీదు మొత్తం రైతులే భరించుకోవాల్సి వస్తోంది. అంత ఆర్థిక భారాన్ని భరించలేని రైతులు మినీ డెయిరీల ఏర్పాటుపై ఆసక్తి కనబర్చడం లేదు. పోనీ పశుక్రాంతి పథకం కింద 50 శాతం సబ్సిడీకి గేదెలను తీసుకుందామని రైతులు అధికారుల చుట్టూ తిరిగినా.. కాళ్లు అరగడమే తప్ప సర్కారు మాత్రం కరగడం లేదు. పశుక్రాంతి పథకం నాడు-నేడు ఎలా ఉందో చెప్పడానికి ఈ రెండు ఉదాహరణలు చాలు...
- న్యూస్‌లైన్, జగిత్యాల రూరల్/హుస్నాబాద్

ఆ పథకమే ఆదుకుంది.. 

‘‘నేను నేలతల్లిని నమ్ముకొని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాణ్ణి. అయితే వర్షాలు ఎక్కువయితే పంటలు నీటమునగడం, వానలు పడకుంటే చేలు ఎండిపోవడం.. ఏటా ఇదే తంతు. ఈ నేపథ్యంలో 2008-09లో వైఎస్ హయాంలో ప్రభుత్వం పశుక్రాంతి పథకాన్ని ప్రవేశపెట్టింది. వెంటనే ఈ పథకం కింద ఆవుల కోసం దరఖాస్తు పెట్టుకుంటే నాలుగు ఆవులు వచ్చినయి. నేను వ్యవసాయ పనులు చేస్తుంటే.. నా భార్యబిడ్డలు ఆవుల పోషణ చూసుకునేవారు. నాలుగు ఆవులు రోజుకు నలభై లీటర్ల పాలిస్తున్నయి. అన్ని ఖర్చులు పోనూ నెలకు పదివేల దాకా మిగులుతున్నయి. ఏడాదిలోనే మా కుటుంబం కష్టాల నుంచి గట్టెక్కింది. నలభై వేలు పెట్టి పొలంలో బోర్ వేయించిన. దీంతో వర్షాల కోసం ఎదురుచూపులు తప్పినయి. ఒక సంవత్సరం పంటలు పండకున్నా పాడిపై బతుకుతామన్న భరోసా వచ్చింది. ఇదంతా వైఎస్ చలవే.’’
- రామంచ మహేందర్‌రెడ్డి, అంతకపేట, హుస్నాబాద్ మండలం, కరీంనగర్ జిల్లా

లక్షల పెట్టుబడి ఎట్లా తెచ్చేది?

‘‘నేను రెండేళ్ల క్రితం పశుక్రాంతి పథకం కింద రెండు ఆవుల కోసం దరఖాస్తు పెట్టుకున్న. నెలలు గడిచినా మంజూరు కాకపోవడంతో కరీంనగర్ వెళ్లి జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీని కలిసి మొరపెట్టుకున్న. ఇప్పుడు బడ్జెట్ లేదు.. వచ్చాక చూద్దాం.. అని పెద్దసారు చెప్పిండు. అధికారుల చుట్టూ తిరిగీ తిరిగీ అలసిపోయా. నాకు ఆవులు రావనే విషయం అర్థమయింది. ఇక ఎదురుచూస్తే లాభం లేదని గ్రామంలోని ఓ ఆసామి వద్ద రూ.24 వేలు అప్పు తీసుకొని ఓ బర్రెను కొనుక్కున్న. అసలు, వడ్డీ కలిపి రూ.31 వేలు అయ్యింది. నెలనెలా కిస్తీలు(వాయిదాలు) కట్టుకుంట పోతున్నా అప్పు మాత్రం తీరుతలేదు. అప్పు తీర్చేందుకు గ్రామంలోని మరో అసామి వద్ద పాలేరుగా పనిచేస్తున్నా. నా రెక్కల కష్టం మీదనే తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలు, మా అక్క కొడుకు ఆధారపడి ఉన్నారు. ఎప్పటికైనా సాయం అందితే కష్టాల నుంచి గట్టెక్కుతాననుకుంటే.. ఈ సర్కారు పశుక్రాంతి పథకాన్ని చంపేసి కడుపు మీద కొట్టింది. ఇప్పుడు మినీ డెయిరీలకు లక్షలు పెట్టుబడి పెట్టాలంటే మాలాంటి వారికి సాధ్యం కాదు.’’
- సలేంద్ర రాజు, అంతకపేట, హుస్నాబాద్ మండలం, కరీంనగర్ జిల్లా
Share this article :

0 comments: