గాంధేయవాదమా.. బ్రాందేయవాదమా?: షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గాంధేయవాదమా.. బ్రాందేయవాదమా?: షర్మిల

గాంధేయవాదమా.. బ్రాందేయవాదమా?: షర్మిల

Written By news on Monday, July 15, 2013 | 7/15/2013

కాంగ్రెస్ పాలనలో మద్యం ఏరులు: షర్మిల
3 దుకాణాలు, 6 పర్మిట్ రూములుగా వర్థిల్లుతోంది
మద్యం మాఫియాడాన్‌ను పీసీసీ చీఫ్‌గా నియమించింది
మద్యం దుకాణాలు విస్తరిస్తారు కానీ..ఆరోగ్యశ్రీకి, ఫీజులకు కోతలా? అని మండిపాటు
చీపురుపల్లిలో వ్యాపారాలన్నీ బొత్స కుటుంబానివే
షర్మిల వద్ద నియోజకవర్గ ప్రజల ఆవేదన

మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘రాష్ట్రంలో ఒకవైపున మద్యం ఏరులై పారుతోంది... ఇంకోవైపు మహిళల మీద అత్యాచారాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మొన్ననే గుంటూరు జిల్లా తెనాలిలో మద్యం దుకాణం వద్దే తాగిన వ్యక్తులు సునీల అనే మహిళను లారీ కింద తోసేసి ఆమెను హత్య చేసిన ఘటనను మన ం అంతా చూశాం. అంత ఘోరమైన సంఘటన నుంచి పాఠాలు నేర్చుకుని మద్యం దుకాణాల వద్ద పోలీసులను పెట్టి తాగటాన్ని నియంత్రించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం... రూ. 2 లక్షలు కట్టండి, మద్యం దుకాణాల వద్దే తాగనిస్తాం అని చెబుతోంది అంటే వీళ్లను మనుషులు అనుకోవాలా? లేకుంటే మృగాలు అనుకోవాలా?’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఘాటుగా విమర్శించారు. మనసులేని ఈ పాలకుల ఏలుబడిలో మద్యం 3 మద్యం దుకాణాలు, 6 పర్మిట్ రూములుగా వర్థిల్లుతోందని మండిపడ్డారు.

మద్యం మాఫియాడాన్‌ను తెచ్చి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టుకున్న ఈ ప్రభుత్వం ఇంతకంటే ఎక్కువ ఇంకేం చేస్తుందని ధ్వజమెత్తారు. ‘జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మద్యాన్ని పూర్తిగా నియంత్రించి నియోజకవర్గానికి ఒక మద్యం దుకాణం మాత్రమే ఉండేలా చేస్తారు’ అని భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని, దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వైఖరిని ఎండగడుతూ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో సాగింది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రంలో భారీగా తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఈ ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

‘‘మొన్న విజయనగరం పట్టణంలో కొంతమంది మహిళలు వచ్చి.. ‘అమ్మా! మా కాలనీలో ఇప్పటికే వీధికో మద్యం దుకాణం ఉంది. మా కుటుంబాలు ఛిన్నాభిన్నం అయిపోయాయి. పొద్దంతా కష్టం చేసి కూలి డబ్బులు తెస్తే మా మగవాళ్లు మమ్మల్ని కొట్టి డబ్బు లాక్కొని తాగుడుకు తగలేస్తున్నారమ్మా. ఇదీ ఒక బతుకేనా అనిపిస్తోంది తల్లీ! ఇప్పుడేమో.. మా ఇళ్ల పక్కనే ఇంకో దుకాణం పెడతారట.. ఇక మా మగవాళ్లు ఇంటికి కూడా రారమ్మా’ అని చెప్పి బాధపడ్డారు. ఇక్కడ బెల్టు దుకాణం పెట్టవద్దని అందరం కలిసి ఆందోళన చేస్తే బొత్స గారి మనుషులు వచ్చి కొట్టి తరిమేశారమ్మా అని చెప్పారు. అధికారుల వద్దకు వెళ్లి చెప్పినా లాభం లేకపోయిందమ్మా అని బాధపడ్డారు. పొద్దున ఒక అన్న నన్ను కలిసి ‘అమ్మా.. ఇక్కడ అన్ని వ్యాపారాలూ బొత్స గారి కుటుంబానివే. మిగతావారు పైకి రావడం లేదమ్మా.. అక్రమ వ్యాపారాలైనా, సక్రమ వ్యాపారమైనా అన్నీ బొత్స, ఆయన మనుషులే చేయాలమ్మా. ఈ అరాచకాలు ఎప్పుడు ఆగుతాయి తల్లీ? మా ఊర్లు, మా బతుకులు ఎప్పుడు బాగుపడతాయమ్మా?’ అని అడిగారు. పాపం ఆ అన్న చెప్తుంటే చాలా బాధనిపించింది. బొత్స లాంటి నాయకులు ఈ రోజు మనకు మంత్రులుగా, పాలకులుగా ఉన్నారు. ఇది మన ఖర్మ కాకపోతే ఇంకేమిటి? బొత్స గారు రాష్ట్రంలోనే అతిపెద్ద డాన్ అని, మద్యం వ్యాపారంలో ఆయన్ను మించినవారే లేరని రాష్ర్ట ప్రజలందరికీ తెలుసు. మహాత్మాగాంధీ మాకు ఆదర్శం అని చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గుగా ఒక మద్యం మాఫియా డాన్‌ను తెచ్చి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పెట్టుకుందీ అంటే ఈ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తోంది గాంధేయవాదాన్నో? బ్రాందేయ వాదాన్నో? అక్కడే తేలిపోతోంది.

టార్గెట్లు పెట్టి మద్యం అమ్మిస్తున్నారు..
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఒక కొత్త మద్యం పాలసీ తెచ్చింది. దాని ప్రకారం కేవలం రూ.2 లక్షలు కడితే మద్యం దుకాణాలకే పర్మిట్ రూంను ఇస్తారు. అంటే మద్యం దుకాణాల వద్దే కూర్చోబెట్టి తాగిస్తారు. అందుకనే మద్యం దుకాణాలన్నీ బార్లుగా మారిపోతున్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులూ మద్యం మూడు మద్యం దుకాణాలు, ఆరు బార్లుగా వర్థిల్లుతుందన్న మాట. మద్యం ఎలాంటి చిచ్చుపెడుతుందో, నేరాలను ఎలా ప్రోత్సహిస్తుందో తెలిసి కూడా ఈ కాంగ్రెస్ పాలకులు ప్రతి నెలా గత నెల కంటే 15 శాతం అమ్మకాలు అదనంగా చేయాలని టార్గెట్లు పెట్టి మరీ అమ్మిస్తున్నారు. కేవలం నాలుగేళ్లలో మద్యం అమ్మకాలను రెట్టింపు చేశారు. ప్రాజెక్టులు, పక్కా ఇళ్ల పథకాన్ని మాత్రం అమలు చేయటం లేదు. మద్యం దుకాణాలను విస్తరిస్తారట కానీ ఆరోగ్యశ్రీ పథకానికి కోత పెడతారట! ఫీజు రీ ఇయింబర్స్‌మెంటు పథకాన్ని అటకెక్కిస్తారట!

మద్యాన్ని చంద్రబాబు తక్కువ రేట్లకే ఇస్తారట
పాలక పక్షం ఇంత అధ్వానంగా పని చేస్తుంటే నిలదీయాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మద్యం ధరలు అందరికీ అందుబాటులోకి తెచ్చి సరసమైన ధరలకే అందిస్తామంటున్నారు. మద్యం వల్ల బుగ్గిపాలైన కుటుంబాలను పాదయాత్రలో చూసి కూడా, ఆ మహిళల రోదనలు విన్న తరువాత కూడా ఆయన ఇలా అంటున్నారు. మన ఖర్మ కొద్దీ ఈరోజు ఇలాంటి వ్యక్తి ప్రతిపక్షనేత హోదాలో ఉన్నారు. చంద్రబాబు వ్యవసాయం దండగన్నారు. సబ్సిడీ ఇస్తే ప్రజలు సోమరిపోతులు అవుతారని చెప్పారు. ప్రాజెక్టులు కడుతుంటే పిచ్చి లెక్కలు వేసి చెప్పారు. ఇలాంటి ఆలోచన ఉన్న చంద్రబాబు మద్యాన్ని సరసమైన ధరలకే అందిస్తామని చెప్పకుంటే ఇంకేం చెబుతారు’’ మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఆదివారం 209వరోజు నెల్లిమర్ల నియోజకవర్గంలోని అచ్యుతాపురం నుంచి ప్రారంభమైంది. షర్మిల అక్కడి నుంచి పెనుబర్తిజంక్షన్, గరివిడి, శ్రీరాంనగర్ మీదుగా చీపురుపల్లి చేరుకున్నారు. అక్కడ భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఇదే పట్టణ శివారులోని బస కేంద్రానికి రాత్రి 8.15కి చేరుకున్నారు. ఆదివారం మొత్తం 15.1 కి.మీ. నడిచారు. ఇప్పటివరకు 2,787.9 కి.మీ యాత్ర పూర్తయ్యింది. షర్మిల వెంట నడిచిన వారిలో విజయనగరం జిల్లా పార్టీ కన్వీనర్, మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు, తాజా మాజీ ఎమ్మెల్యేలు సుజయ్‌కృష్ణ రంగారావు, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబురావు ఉన్నారు. చీపురుపల్లి సమన్వయకర్తలు కోట్ల సూర్యనారాయణనాయుడు, సిమ్మి నాయుడు యాత్రలో షర్మిలను కలిశారు. రాజాం, పార్వతీపురం నియోజకవర్గాల సమన్వయకర్తలు పీఎంజీ బాబు, కొయ్య శ్రీవాణి కూడా పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆదివారం ఉదయం గుజ్జన వలసలో షర్మిలను కలిసి యోగక్షేమాలు విచారించారు.

షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’
ఆదివారం యాత్ర ముగిసేనాటికి
రోజులు: 209
కిలోమీటర్లు: 2,787.9

బొత్స మార్కు రాజకీయం....
చీపురుపల్లిలో కేబుల్ ప్రసారాలు నిలిపివేత
చీపురుపల్లిలో పీసీసీ చీఫ్ బొత్స తన మార్కు రాజకీయాన్ని మరోసారి చూపించారు. గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓదార్పు యాత్ర సందర్భంగా చీపురుపల్లిలోని గాంధీబొమ్మ సెంటర్‌లో పెద్ద ఎత్తున తరలి వ చ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ సమయంలో జగన్ ప్రసంగాన్ని ప్రజలు చూడకుండా చేసేందుకు చీపురుపల్లిలో కేబుల్ కనెక్షన్ తీసేశారు. తాజాగా షర్మిల పాదయాత్రలో కూడా అవే ట్రిక్స్‌ను ప్రయోగించారు. బొత్స ఆదేశాలను, బెదిరింపులను బేఖాతర్ చేస్తూ ప్రజలు భారీ ఎత్తున చీపురుపల్లి బస్టాండ్ సెంటర్‌కు తరలివచ్చారు. వారిని ఉద్దేశించి షర్మిల ప్రసంగించినంతసేపు చీపురుపల్లిలో కేబుల్ ప్రసారాలను నిలిపివేశారు. సత్య కేబుల్స్ పేరుతో ఇక్కడ కేబుల్ ప్రసారాలు సత్తిబాబు కుటుంబం చేతిలోనే ఉన్నాయి. షర్మిల పాదయాత్ర పట్టణంలో సాగినంత సేపు వీధి లైట్లు తీసేశారు. ఆ సమయంలో చీపురుపల్లిలో కరెంటు ఉంది కానీ వీధి లైట్లు మాత్రం వెలగకుండా చేశారు. షర్మిల చీపురుపల్లి శివారు దాటే వరకు వీధి లైట్లు తీసేసి ఆ తరువాత మాత్రం వెలిగేలా చేశారు.
Share this article :

0 comments: