రెండూ కలిసి ‘రెండో’ఆట! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రెండూ కలిసి ‘రెండో’ఆట!

రెండూ కలిసి ‘రెండో’ఆట!

Written By news on Sunday, July 28, 2013 | 7/28/2013

అయినా.. గణనీయ స్థానాలు గెలుచుకున్న వైఎస్సార్ సీపీ
కాంగ్రెస్, టీడీపీ.. విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ
ప్రలోభాలతో పరువు కాపాడుకునే యత్నం
‘తూర్పు’ వీరవరంలో మంత్రి తోట వీరంగం
వైఎస్సార్సీపీ ఒక్కటే లక్ష్యంగా కుట్రలు, కుతంత్రాలు

సాక్షి నెట్‌వర్క్: ఏకగ్రీవాల్లోనూ, తొలి విడత పంచాయతీ సమరంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల ఆధిక్యతకు అడ్డుకట్ట వేయలేని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు మలి విడత పోలింగ్‌లో కుమ్మక్కు కుట్రలకు మరింత పదునుపెట్టాయి. వైఎస్సార్సీపీ హవాకు ఎలాగైనా అడ్డుకట్ట వేయకపోతే రాష్ట్రంలో తమ మనుగడే పూర్తిగా ప్రశ్నార్థకమవుతుందని భావించిన ఇరు పార్టీలూ ఎన్నడూ లేనివిధంగా పంచాయతీ ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు వెదజల్లాయి. కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడ్డాయి. ఇరు పార్టీలూ పోటీ ఉన్న చోట్ల ఒకరు బలంగా ఉంటే మరొకరు వారికి మొగ్గుచూపేలా ఒప్పందం కుదుర్చుకుని లెక్క తేల్చుకున్నాయి. మరికొన్ని చోట్ల పరస్పర అవగాహనతో ఉపసంహరణలు, నామమాత్రపు పోటీల ఆట సాగించాయి. రెండోదశ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు సాధారణ ఎన్నికలు తలదన్నేలా రూ.వందల కోట్లు ఖర్చు చేశాయి. అడ్డూ అదుపులేని అధికారదుర్వినియోగంతో ‘ఫలితాలు’ తమకు అనుకూలంగా వచ్చేందుకు యథాశక్తి కృషిచేశాయి. కాంగ్రెస్, టీడీపీలు కొన్నిచోట్ల వైఎస్సార్‌సీపీ శ్రేణులు, సానుభూతిపరులపై దాడులకు యత్నించాయి. గ్రామాల్లో ఓట్లను తమకు తరలిస్తే మంచిపనులు కట్టబెడతామంటూ కాంట్రాక్టర్లకు తాయిలాలు ఎరవేయడం, తమ తాలూకు వారి ఓట్లను గంపగుత్తగా వేయించకపోతే బకాయి బిల్లులు మంజూరు చేయమంటూ చోటామోటా కాంట్రాక్టర్లను బెదిరించడం వంటి ఆగడాలతో అధికార పార్టీ నేతలు హల్‌చల్ చేశారు. ఇంత జరిగినా రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గణనీయ స్థానాలు కైవసం చేసుకుంది. శనివారం రాత్రి ఒంటి గంట వరకు అందిన సమాచారం ప్రకారం మలి దశ ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ 1,334, కాంగ్రెస్ 1,964, టీడీపీ 1,829, టీఆర్‌ఎస్ 593, సీపీఐ 44, సీపీఎం 79, బీజేపీ 59, ఇతరులు 646 సాధించాయి. ఇప్పటివరకు ఏకగ్రీవాలతో కలిపి తొలి, మలి దశ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 3,767, కాంగ్రెస్ 4,125, టీడీపీ 3,852, టీఆర్‌ఎస్ 1,129, సీపీఐ 50, సీపీఎం 120, బీజేపీ 130, ఇతరులు 1,738 స్థానాలు గెలుచుకున్నారు.

పల్లె ఎన్నికలకు వందల కోట్లు..: రెండోదశ పంచాయతీ ఎన్నికల్లో డబ్బు ప్రవాహం విచ్చలవిడిగా సాగింది. ప్రతి పంచాయతీకి కనీసంగా పది నుంచి పదిహేను లక్షలు, కాస్త పోటీ ఉన్న చోట పాతిక వరకు, ఇక, ప్రతిష్టాత్మకంగా పోరు సాగిన పంచాయతీల్లో రూ.కోట్లలో ఖర్చు చేశారు. ప్రకాశం జిల్లా దర్శి మండలంలో కేవలం 1974మంది ఓటర్లున్న పోతవరం పంచాయతీ ఎన్నికలో కాంగ్రెస్, టీడీపీల ఉమ్మడి అభ్యర్థి కోట్ల సువార్తమ్మను వైఎస్సార్సీపీ మద్దతుదారుపై గెలిపించేందుకు ఆ రెండు పార్టీల నేతలుదాదాపు రూ.25 లక్షలకుపైగా వ్యయం చేశారు. పొన్నలూరు మండలంలోని రావలపొల్లు, చెరుకూరు పంచాయతీల్లో కూడా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల ఉమ్మడి అభ్యర్థులు బరిలోకి దిగారు. చెరుకూరులో టీడీపీ అభ్యర్థి ఆరికట్ల సుబ్బరత్నమ్మకు, రావలపొల్లులో టీడీపీ అభ్యర్థి పాలడుగు కోటమ్మకు కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చింది. చిన్న పంచాయతీలైనప్పటికీ రెండు పార్టీలు కలిపి ఒక్కో పంచాయతీకి రూ.30 లక్షలవరకు ఖర్చుపెట్టాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు మేజర్ పంచాయతీలో 13,600 ఓట్లు ఉంటే ఒక్కో ఓటుకు రూ.1200 నుంచి రూ.1500 వ రకూ కాంగ్రెస్, టీడీపీల అభ్యర్థులు పంపిణీ చేశారు. అంటే ఒక్కో అభ్యర్థి రూ.2 కోట్లకు పైగానే ఖర్చుచేశారన్నమాట. అలాగే నిడదవోలు మండలం సమిశ్రగూడెం పంచాయతీని దక్కించుకోవడానికి టీడీపీ అభ్యర్థి రూ.60 లక్షల వరకూ ఖర్చుచేశారు. అనంతపురం జిల్లా పరిటాల ఇలాకా పెనుగొండలో జరిగిన తొలివిడత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పాగా వేయడంతో కంగుతిన్న టీడీపీ శ్రేణులు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సొంత మండలం రామగిరిలో ఓటుకు రూ. 500 నుంచి రూ. 2,000 వరకు పంచిపెట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలోని తాడిమర్రి మేజర్ పంచాయతీలో ఓటుకు రూ.1,000 చొప్పున పంపిణీ చేశారు.

మంత్రిగారా.. మజాకా!: అనేక చోట్ల అధికారపార్టీ నేతలు, సాక్షాత్తూ మంత్రులే వైఎస్సార్సీపీ శ్రేణులపై బెదిరింపులకు పాల్పడ్డారు. మంత్రి తోట నర్సింహం తూర్పుగోదావరి జిల్లా సొంత గ్రామం వీరవరంలో తన భార్య వాణిని గెలిపించుకునేందుకు అనుచరులతో కలిసి వైఎస్సార్సీపీ ఏజెంట్లను మీ అంతుచూస్తానంటూ దుర్భాషలాడారు. ఏకంగా వైఎస్సార్సీపీ ఏజెంట్లను గెంటేయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుదారు తోట సత్యవతి నుంచి గట్టి పోటీ ఎదురవ్వడంతో మంత్రి తోట తీవ్ర అసహనానికి లోనై బెదిరింపులకు దిగారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లకు జనరల్ పాస్‌లు ఇవ్వడంపై అధికారులపై విరుచుకుపడ్డారు. వైఎస్సార్సీపీ మద్దతుదారులను తన్ని తరిమేయండంటూ మంత్రి ఆవేశంతో ఊగిపోవడం చూసి అక్కడున్న ఓటర్లు విస్తుపోయారు. అధికార దర్పం ప్రదర్శించడంతో సరిపెట్టకుండా ఒక్కో ఓటరుకు వెయ్యిరూపాయల వరకు మంత్రి అనుచరులు అందజేశారు.

వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలిచినా.. ఫలితం తారుమారు..: టీడీపీ నేతలైతే పోలీసులపైనే వీరంగం వేశారు. డబ్బు, మద్యం పంపిణీ చేస్తోన్న అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, రెచ్చిపోయిన కేశవ్ ఎస్‌ఐ శ్రీరాంపై చెప్పుతో దాడి చేసేందుకు యత్నించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు అండతోనే కేశవ్ ఇలా రెచ్చిపోయారన్నది అక్కడ బహిరంగ రహస్యం. కాగా శనివారం బెళుగుప్ప మండలం జీడిపల్లిలో తొలుత వైఎస్సార్ సీపీ అభ్యర్థి మూడు ఓట్లతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కానీ.. కేశవ్ ఒత్తిళ్లకు తలొగ్గి రీకౌంటింగ్ చేసి.. చివరకు టీడీపీ అభ్యర్థి గెలుపొందినట్లు తేల్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గుంటూరు జిల్లా తాడికొండ మాజీ సర్పంచి, వైఎస్‌ఆర్ సీపీ నేత మహ్మద్‌ముస్తాఫాను గృహ నిర్బంధం చేసిన పోలీసులు టీడీపీ, కాంగ్రెస్ నేతలను వదిలేయడంతో వారు పోలింగ్ కేంద్రాల వద్ద యథేచ్ఛగా తిరిగారు. ఇక కుమ్మక్కు కుట్రలకు అంతేలేదు. అభ్యర్థులను బరిలోకి దించకుండా ఇరు పార్టీలూ పరస్పరసహకారంతో కొన్నిపంచాయతీలు సాధించుకున్నాయి. విశాఖ జిల్లా పాయకరావు పేట మేజర్ పంచాయతీలో వైఎస్సార్ సీపీ గాలి వీస్తుండటంతో అక్కడ టీడీపీ అభ్యర్థిని నిలపకుండా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతిచ్చింది. ఇక్కడ ఈ రెండు పార్టీలు కలిసి ఓటర్లను పెద్ద ఎత్తున ప్రలోభాలకు గురిచేశాయి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం పి.దొంతమూరు పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎస్.వి.ఎస్.వర్మ తల్లి శ్రీవత్సవాయి పద్మావతి పోటీచేయగా, కాంగ్రెస్ మద్దతుదారు బరిలో ఉన్నప్పటికీ శుక్రవారం రాత్రికి రాత్రే కుమ్మక్కయ్యారు. ఫలితంగా టీడీపీ మద్దతుదారు పద్మావతికి వెయ్యి ఓట్లు వస్తే, కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 90 ఓట్లు మాత్రమే రావడం చూస్తే ఈ రెండు పార్టీల కుమ్మక్కు తేటతెల్లమైంది. 

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని ఆరు పంచాయతీల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఉమ్మడి అభ్యర్థులను నిలిపి పరస్పరం పదవులను పంచుకొన్నాయి. కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం వెలటూరులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని వెల్లూరు సుజానమ్మ విజయం సాధించడంతో ఉక్రోషం పట్టలేని తెలుగుదేశం వర్గీయులు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ నలుగురిని ఆసుపత్రికి తరలించారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబునాయుడుల సొంత జిల్లా చిత్తూరులో రెండు పార్టీల నేతలు పలుచోట్ల కుమ్మక్కయ్యారు. పూతలపట్టు నియోజకవర్గంలో పదికిపైగా సర్పంచ్ స్థానాల్లో అధికార పార్టీ బహిరంగంగానే తెలుగుదేశానికి మద్దతిచ్చింది. కొన్ని చోట్ల సర్పంచ్ పదవి ఒక పార్టీకి, ఉప సర్పంచ్ మరో పార్టీకి అన్నట్లుగా ఒప్పందాలు కుదిరాయి. ఇలా రాష్ట్ర రాజకీయ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా అధికార, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కలిసి కుట్రలు చేసినా వైఎస్సార్ సీపీ మద్దతుదారులు మలి దశలో సైతం విశేష స్థానాలే గెలుచుకున్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి స్థానిక సమరంలో.. క్షేత్రస్థాయిలో బలీయమైన శక్తులుగా అవతరించారు. 
Share this article :

0 comments: