ఫీజులు చెల్లించకుండా ఎగ్గొట్టేందుకే రీయింబర్స్‌మెంట్ అమలులో అనేక మెలికలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఫీజులు చెల్లించకుండా ఎగ్గొట్టేందుకే రీయింబర్స్‌మెంట్ అమలులో అనేక మెలికలు

ఫీజులు చెల్లించకుండా ఎగ్గొట్టేందుకే రీయింబర్స్‌మెంట్ అమలులో అనేక మెలికలు

Written By news on Friday, July 19, 2013 | 7/19/2013

- నేటి ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం: విజయమ్మ
- ఇందిరా పార్కు వద్ద రెండు రోజుల ఫీజు దీక్ష ప్రారంభం
- వెల్లువలా తరలివచ్చి దీక్షకు మద్దతిచ్చిన విద్యార్థి లోకం
- ప్రజా సమస్యలు అసలే పట్టని ప్రభుత్వమిది
- రీయింబర్స్‌మెంట్ పరిరక్షణకు విద్యార్థులే కదలిరావాలి: విజయమ్మ 

ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉంటుందో, ఉండదోనని ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలోనూ విద్యార్థులు, తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. ఇది చాలా బాధాకరం. విద్యార్థులకు ఫీజులు చెల్లించకుండా ఎగ్గొట్టేందుకే ఈ పథకంపై అనేక ఆంక్షలు విధిస్తున్నారు

రూ.35 వేలే చెల్లిస్తామంటే ఎంత దారుణం! మిగతా రూ.15 వేల నుంచి 75వేల దాకా పేదలు ఎలా కట్టుకుంటారు? ఆ డబ్బు లేకనే కదా, గతంలో వాళ్లు చదువుకోలేకపోయింది

ఈ రోజు మనం దీక్ష చేస్తున్నామంటే ప్రభుత్వం ఫీజుల పథకంపై సమీక్ష చేస్తోంది. కనీసం ఈ మటుకైనా చేస్తున్నా రంటే ఈ దీక్షల వల్లే. దీక్షలు చేస్తూ ఉంటే ఈ పథకాన్ని తీసేయడానికి ప్రభుత్వం భయపడుతుంది 

సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఓ విప్లవంలా, ఉద్యమం మాదిరిగా సాగిన విద్యార్థుల ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పరిరక్షించుకునేందుకు అందరూ, ముఖ్యంగా విద్యార్థులు ముందుకు రావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పిలుపునిచ్చారు. పేద విద్యార్థుల మొత్తం ఫీజును ప్రభుత్వమే భరించాలన్నది వైఎస్ ఆశయమైతే ఇప్పటి ప్రభుత్వం దానిపై పరిమితులు, ఆంక్షలు విధించి లక్ష్యాన్ని నీరుగారుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజుల రీయింబర్స్‌మెంట్ పథకం కోసం గురువారం ఉదయం ఇందిరాపార్కు వద్ద ఆమె రెండు రోజుల ‘ఫీజు దీక్ష’ను చేపట్టారు. వేదికపై ఏర్పాటు చేసిన వైఎస్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం వేలాది మంది నినాదాల నడుమ దీక్షకు కూర్చున్నారు. విజయమ్మ దీక్షకు విద్యార్థుల నుంచి అద్భుత స్పందన లభించింది. పలు వృత్తి విద్యా కాలేజీల విద్యార్థులు, తమ తల్లిదండ్రులతో కలిసి వేలాదిగా దీక్షకు తరలి వచ్చారు. ఉదయం నుంచి రోజంతా వర్షం కురిసినా లెక్క చేయకుండా దీక్షకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ‘జోహార్ వైఎస్సార్’!, ‘జై జగన్’ నినాదాలతో దీక్షా ప్రాంగణం హోరెత్తింది. వైఎస్ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ సాయంతో ఇంజనీరింగ్ చదివి ప్రస్తుతం ఉద్యోగాల్లో స్థిరపడ్డ పలువురు విజయమ్మకు వైఎస్సార్ విగ్రహాన్ని బహూకరించారు.

మరికొందరు లబ్ధిదారులు వేదికపైకి వచ్చి పథకం ప్రాశస్త్యాన్ని వివరించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, బీసీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ సహా పలు సంఘాల నేతలు కూడా దీక్షకు హాజరై విజయమ్మ పోరుకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా విజయమ్మ ప్రసంగిస్తూ... రీయింబర్స్‌మెంట్ పథకం వల్ల వైఎస్ హయాంలో లక్షలాది మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిందన్నారు. ‘‘వారు ఇంజినీరింగ్ చదివి పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో, విదేశాల్లో ఉద్యోగాలతో తమ కుటుంబాల్లో వెలుగును నింపి చీకటికి చరమగీతం పాడారు. కానీ ప్రస్తుత ప్రభుత్వానికి పథకం అమలుపై ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. ఫీజు సమస్యపై ఇప్పుడే కాదు, 2011లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వారం రోజుల పాటు ఇదే ఇందిరా పార్కు వద్ద నిరాహార దీక్ష చేశారు. ఏడు రోజులు ఏమీ తినకుండా ఎలా ఉంటావని నేనడిగితే, ‘ఫర్వాలేదమ్మా. ఉండగలను. నా దీక్ష వల్ల విద్యార్థులకు ఏ కాస్త మేలు జరిగినా మంచిదే కదా’ అని జవాబిచ్చారు.

2012 జనవరిలో ఇదే సమస్యపై పార్టీ తరపున రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేశాం. ఒంగోలులో జగన్ పాల్గొన్నారు. అదే ఏడాది ఆగస్టులో ఏలూరులోనూ, మళ్లీ సెప్టెంబర్‌లో ఇందిరా పార్కు వద్ద నేను రెండేసి రోజుల పాటు దీక్ష చేశాను. ఈ అంశంపై మేం పోరాడుతూనే ఉంటాం’’ అని నిర్ద్వంద్వంగా ప్రకటించారు. పేద విద్యార్థులకు ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యను దూరం చేస్తూ ఫీజుల విషయంలో ప్రభుత్వం చేస్తున్న విచిత్రమైన విన్యాసాలు హాస్యాస్పదంగా ఉన్నాయంటూ మండిపడ్డారు. పద్ధతీ పాడూ లేకుండా ఫీజులను నిర్ణయించి ఇంజినీరింగ్ చదువులను చట్టుబండలు చేశారని దుయ్యబట్టారు. వైఎస్సార్‌సీపీ దీక్ష కార్పొరేట్ కాలేజీలకు కొమ్ముకాసేందుకేనన్న మంత్రి పితాని సత్యనారాయణ విమర్శలను ఆమె తిప్పికొట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్పొరేట్ కాలేజీల కొమ్ముకాసే పార్టీ ఎంతమాత్రం కాదని, ప్రజల పక్షాన ఉండే పార్టీ అని పునరుద్ఘాటించారు. తమ పార్టీ నిత్యం ప్రజల్లో ఉంటూ వారిసమస్యల పరిష్కారానికి పాటుపడుతుందని ప్రకటించారు. దీక్ష ప్రారంభం సందర్భంగా విజయమ్మ ప్రసంగం ఆమె మాటల్లోనే...

ఫీజులు ఎగ్గొట్టేందుకే: ‘‘విద్యార్థులకు ఫీజులు చెల్లించకుండా ఎగ్గొట్టేందుకే రీయింబర్స్‌మెంట్ పథకం అమలులో అనేక మెలికలు పెట్టి ఆంక్షలు విధిస్తున్నారు. ఆంక్షలతో విద్యార్థులను గందరగోళంలోకి నెట్టేశారు. పది వేల లోపు ర్యాంకు వచ్చిన వారికి మాత్రమే ఫీజులు చెల్లిస్తామనడం చాలా బాధాకరం, ఇది దారుణమని వైఎస్సార్‌సీపీ తొలి నుంచీ చెబుతోంది. పోరాటం చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఇచ్చే ఫీజులో 70 శాతం మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం భరించేది 30 శాతం మాత్రమే! అయినా బీసీ, మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల విషయంలో పది వేల ర్యాంకు పరిమితిని విధించి వారికిచ్చే ఫీజులో ప్రభుత్వం కత్తెర వేస్తోంది. ‘మేం చెల్లించేది రూ.35 వేలే. మిగతాది మీరే చెల్లించుకోండ’ని చెబుతోంది. కాలేజీల్లో రకరకాలుగా ఫీజులు నిర్ణయించారు.

ఇంజనీరింగ్‌కు ఒక కాలేజీలో రూ. 1.09 లక్షలుంటే మరోదాంట్లో రూ.1.13 లక్షలుంది. 259 కాలేజీల్లో రూ.35,000 చొప్పున, 195 కాలేజీల్లో రూ.30 వేలు, కొన్నింట్లో రూ.50 వేలు, రూ.59,200... ఇలా రకరకాలుగా ఉన్నాయి. కాలేజీలో చేరే విద్యార్థికి తానెంత ఫీజు చెల్లించాలో తెలియని పరిస్థితి! ఇలాంటి దుస్థితి ఉండకూడదనే ఆ రోజు రాజశేఖరరెడ్డి తపించారు. డబ్బుకు పేదలైనా చదువుకు పేదలు కాకూడదనే ఉద్దేశంతో ఏ కోర్సు చదవాలనుకుంటే అందులో అవకాశం కల్పించి అవసరమైన ఫీజు ప్రభుత్వమే చెల్లించే ఏర్పాటు చేశారు. ఇంజనీరైనా, డాక్టరైనా, ఎంసీఏ, ఎంబీఏ ఇలా ఏ చదువైనా ఉచితంగా పేదలు చదువు కోవాలని అభిలషించారు. మొత్తం ఫీజు చెల్లించాలని, ఉన్నత చదువులు చదివించడం ప్రభుత్వ బాధ్యత అని వైఎస్ భావించారు. మరిప్పుడు రూ.35 వేలే చెల్లిస్తామంటే మిగతాది పేదలు ఎక్కడి నుంచి తెచ్చుకోగలరు? రూ.15 వేల నుంచి 75 వేల దాకా వారెలా కట్టుకుంటారు? ఇది దారుణం.’’

నాలుగేళ్లుగా గందరగోళమే: ‘‘వైఎస్ మన మధ్య నుంచి వెళ్లిపోయాక గత నాలుగేళ్లుగా ఫీజుల విషయంలో గందరగోళమే నెలకొంది. రీయింబర్స్‌మెంట్ ఉంటుందో, ఉండదోనని ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థులు, తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. 2012-13కు ఈ పథకానికి కేవలం రూ. 289 కోట్లే విడుదల చేశారు. ఇది చాలా తక్కువ. ప్రభుత్వం కేటాయింపులు మాత్రం చేస్తూ, విడుదల విషయంలో చేతి వాటం చూపిస్తోంది. కాలేజీలకు బకాయిలు చెల్లించకపోతే ఆ ప్రభావం విద్యార్థులపై పడుతుంది. కాలేజీ యాజమాన్యం ఫీజు వేధింపులకు తాళలేక వరలక్ష్మి అనే ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది’’

వైఎస్ అంటే ఓ భరోసా: ‘‘అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించారు వైఎస్. ప్రతి ఒక్కరి అవసరాలనూ దృష్టి లో ఉంచుకుని పథకాలు రూపొందించారు. అందుకే వైఎస్ అంటే ఓ నమ్మకం, వైఎస్ అంటే ఓ ఆశయం, వైఎస్ అంటే ఓ భరోసా అని ప్రజలు భావించారు. ఈ రోజు ఏ ఊరికైనా వెళ్లి, మీకు వైఎస్ ఏం చేశారని ప్రశ్నిస్తే మాకది చేశారు, మాకిది చేశారని చెప్పేవారే కనిపిస్తారు. విద్యార్థులను అడిగితే లక్షలాది మంది ముందుకొచ్చి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వల్లే తామంతా చదువుకున్నామని చెబుతారు’’

ప్రభుత్వం సమస్యలు సృష్టిస్తోంది: ‘‘ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం ప్రజలకు ఏం మేలు చేస్తా ఉందంటే ఏమీ చెప్పలేని పరిస్థితి! సమస్యలకు జవాబు చెప్పకపోగా, ఇంకా జటిలమైన సమస్యలను సృష్టిస్తా ఉంది. ఏ వర్గానికీ, ఏ ప్రాంతం వారికీ కూడా న్యాయం చేసే పరిస్థితి లేదు. వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ ప్రజల పక్షాన ఉండి, ప్రజల్లో ఉండి పోరాటాలన్నింటిలో ముందుంటుంది. ఇంకా పోరాటం చేస్తుంది. మీకోసం జగన్ నాయకత్వంలో వైఎస్ సువర్ణయుగాన్ని తెచ్చుకుంటే వైఎస్ ఏ విధంగా విద్యార్థుల పట్ల ఆలోచించారో, రేపు జగన్ కూడా అలాగే చేస్తారు. వైఎస్ పాలనలో మాదిరిగానే జగన్ కూడా పేద విద్యార్థులకు ఏ చదువు కావాలంటే ఆ చదువు చదివిస్తారు’’

ప్రభుత్వం భయపడాలి: ‘‘ఈ రోజు మనం దీక్ష చేస్తున్నామంటే ప్రభుత్వం ఫీజుల పథకంపై సమీక్ష చేస్తోంది. కనీసం ఈ మటుకైనా చేస్తున్నారంటే ఈ దీక్షల వల్లే. దీక్షలు చేస్తూ ఉంటే ఈ పథకాన్ని తీసేయడానికి ప్రభుత్వం భయపడుతుంది. అందుకే పథకాన్ని అత్యంత ప్రధానాంశంగా తీసుకుని, దీన్ని రక్షించుకునేందుకు వైఎస్సార్‌సీపీ పోరాడుతుంది. దీక్షలో మీరంతా పాల్గొనాలి. అప్పుడు ప్రభుత్వం భయపడుతుంది. జంటనగరాల విద్యార్థులంతా కదలి వచ్చి ఈ దీక్ష బలం ఏమిటో ప్రభుత్వానికి చూపాలి’’ 

ఫీజు దీక్షకు వెల్లువెత్తిన విద్యార్థులు
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని కోరుతూ వైఎస్ విజయమ్మ చేపట్టిన దీక్షకు తొలి రోజున విద్యార్థుల నుంచి అద్భుత స్పందన లభించింది. ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కాలేజీల విద్యార్థులు వేలాదిగా తరలి వచ్చి మద్దతు తెలిపారు. గుంపులుగా తరలి వచ్చిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో దీక్షా శిబిరమంతా కోలాహలంగా తయారైంది. విజయమ్మ దీక్షకు అండగా ఉంటామని విద్యార్థి నాయకులు, ప్రజాసంఘాల నేతలు ప్రకటించారు. దీక్ష ప్రారంభమయేప్పుడు తుంపరగా ప్రారంభమైన వర్షం రోజంతా కొనసాగినా ప్రజలు లెక్క చేయలేదు. తడుస్తూనే శిబిరానికి చేరుకున్నారు. పలు స్కూళ్ల విద్యార్థులు కూడా వచ్చి విజయమ్మకు పూలు అందజేసి నైతిక మద్దతు తెలిపారు. తాను దీక్షకు పూనుకున్న కారణాన్ని విజయమ్మ వివరించినప్పుడు పార్టీ శ్రేణులతో పాటు ప్రజల్లోనూ ఉత్సాహం, ఉత్తేజం కన్పించాయి.

జగన్ జైల్లో ఉన్నా వైఎస్ కుటుంబం మాత్రం ప్రజల కోసం పోరాటం చేయకుండా ఉండబోదని పలువురు వక్తలు ప్రకటించినప్పుడు సభికుల నుంచి హర్షధ్వానాలు వెల్లువెత్తాయి. ‘జోహార్ వైఎస్సార్!’, ‘జై...జగన్!’ నినాదాలతో శిబిరం మారుమోగింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ వల్ల లబ్ధి పొంది, ఇంజనీరింగ్ చదివి ఉద్యోగాల్లో స్థిరపడ్డ కృష్ణా జిల్లాకు చెందిన కొందరు విద్యార్థులు చెక్కతో చేసిన వైఎస్సార్ బొమ్మను విజయమ్మకు బహూకరించి కృతజ్ఞత చాటుకున్నారు. లబ్ధిదారులైన మరికొందరు విద్యార్థులు వచ్చి పథకం ప్రాశస్త్యాన్ని వివరించారు. వైఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలను కళ్లకు కడుతూ నిజామాబాద్ కళా బృందం సభ్యులు పాడిన పాటలు విద్యార్థులతో సహా అందరినీ ఉర్రూతలూగించాయి. దీక్షను వైఎస్సార్‌సీపీ నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభించారు. 

‘అమ్మ’ పాటకు చలించిన విజయమ్మ
‘అమ్మంటే నీలా ఉండాలని’ అంటూ ములకలపల్లి రవి అనే కళాకారుడు పాడిన పాట విని వైఎస్ విజయమ్మ భావోద్వేగంతో చలించిపోయారు. హైదరాబాద్‌కు చెందిన రవి, విజయమ్మపై తాను రాసిన ఆ పాటను గురువారం రాత్రి ఫీజు దీక్ష శిబిరం వేదికపై పాడి విన్పించారు. ‘అమ్మంటే నీలా ఉండాలని ఆంధ్రదేశం అనుకుంటోందమ్మా. తల్లంటే నీలా ఉండాలని ప్రతి తల్లీ అనుకుంటోందమ్మా..’ అంటూ ఆయన పాడుతుంటే ఒక దశలో విజయమ్మ కంటితడి పెట్టారు. 

పోరాడకుంటే పథకాలన్నీ ఎత్తేస్తారు
పేద విద్యార్థులకు ఉన్నత చదువులందించే ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగారుస్తున్న ప్రభుత్వ తీరుపై ఏ పార్టీ స్పందించకపోవడం సిగ్గుచేటు. వైఎస్ విజయమ్మ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ చేపట్టిన ఈ దీక్షకు బీసీ సంక్షేమ సంఘం పూర్తి మద్దతు తెలుపుతోంది. రీయింబర్స్‌మెంటుకు తూట్లు పొడిచే ధోరణికి నాటి సీఎం రోశయ్య తెర తీస్తే కిరణ్ దాన్ని కొనసాగిస్తూ పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు. ఐఏఎస్‌లందరినీ బదిలీ చేస్తున్న కిరణ్ ప్రభుత్వం, రీయింబర్స్‌మెంట్‌ను నీరుగారుస్తున్న రేమండ్ పీటర్‌ను ఎందుకు బదిలీ చేయడం లేదు? ఉన్న పథకాలను నీరుగారుస్తూ, బంగారు తల్లి అనే పథకం పెట్టారు. 

త్వరలో చిట్టితల్లి పథకమూ పెడతారేమో! ఎన్ని పథకాలు పెట్టినా ప్రజలు కాంగ్రెస్ నెత్తిన భస్మాసుర హస్తం తప్పక పెడతారు. కాంగ్రెస్‌లో ఉన్న వృద్ధులు సైతం ప్రధాని, ముఖ్యమంత్రి లేదా గవర్నర్ కావాలనుకుంటారు. అలాంటిది చదువుకునే విద్యార్థులకు మాత్రం వయోపరిమితి విధిస్తారా? నిబంధనలతో బందీలు చేయడం సబబా? రెండు పీజీలు చేసిన వారు రీయింబర్స్‌మెంట్‌కు అనర్హులా? ప్రపంచమంతటా వస్తున్న విప్లవాల స్పూర్తితో రాష్ట్రంలోనూ విప్లవం వస్తే కాంగ్రెస్‌ను గోతిలో పాతిపెడతారు. కాంగ్రెస్‌కు ఇవే చివరి ఎన్నికలు. ఇంజనీరింగ్ ఫీజులను ఏడాదిలో రూ.85,000 పెంచారు. ఈ ప్రభుత్వానికి సిగ్గూ, శరం ఏమైనా ఉన్నాయా?
- ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు

రీయింబర్స్‌మెంట్‌కే ఉప సంఘమా?
ఫీజు రీయింబర్స్‌మెంట్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన పథకమే అయితే మిగతా రాష్ట్రాల్లో ఎందుకు లేదు? వైఎస్ పెట్టిన పథకాన్ని కొనసాగిస్తే ఆ ఘనత ఆయనకు పోతుందనే దాన్ని పట్టించుకోవడం లేదు. ఏ పథకానికీ లేనివిధంగా రీయింబర్స్‌మెంట్‌పై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. 37 సార్లు సమావేశమైన ఆ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలన్నీ విద్యార్థులకు వ్యతిరేకమైనవే. మేనేజ్‌మెంట్, స్పాట్‌లో సీటు దక్కించుకున్నవారు, రెండో పీజీ చదువుతున్న వారికి రీయింబర్స్‌మెంట్ వర్తించదని నిర్ణయించారు. ఇలా 80% కోతలు విధిస్తూ 20 శాతమే చెల్లిస్తున్నారు. దానికి వంద శాతమని ప్రచారం చేసుకుంటున్నారు. తుదిశ్వాస విడిచే స్థితిలో ఉన్న కాంగ్రెస్ అన్నీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలే తీసుకుంటోంది. బీసీలకు వంద సీట్లు ఇస్తామంటున్న చంద్రబాబు గతంలో ఎన్నిచ్చారు? వందమంది బీసీలను అసెంబ్లీకి పంపుదామన్న విజయమ్మ ప్రతిపాద నపై ఆయన ఎందుకు స్పందించరు?
- జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ యువజన విభాగ రాష్ర్ట అధ్యక్షుడు
Share this article :

0 comments: