ఎల్లో గ్యాంగ్ ‘కిలాడీ’ రాతలు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎల్లో గ్యాంగ్ ‘కిలాడీ’ రాతలు!

ఎల్లో గ్యాంగ్ ‘కిలాడీ’ రాతలు!

Written By news on Thursday, July 11, 2013 | 7/11/2013

- వైఎస్సార్ సీపీ నేతలు అంబటి, జోగి రమేశ్, శోభా నాగిరెడ్డి ధ్వజం
- పచ్చ పత్రికల కథనాలపై వైఎస్సార్‌సీపీ ధ్వజం
- పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ‘పచ్చ’ పన్నాగాలు
- కాంగ్రెస్, టీడీపీలతో కలిసి చౌకబారు ఎత్తుగడలు
- వైఎస్సార్‌సీపీలో నేరగాళ్లున్నారంటూ అభూతకల్పనలు
- అంబటి, శోభా నాగిరెడ్డి, జోగి రమేశ్ మండిపాటు

‘‘కాంగ్రెస్, టీడీపీలతో జతకట్టిన రెండు పత్రికలు వైఎస్సార్‌సీపీపై సందు దొరికినప్పుడల్లా చౌకబారు విమర్శలు చేస్తున్నాయి. వైట్ కాలర్ క్రిమినల్, పొలిటికల్ క్రిమినల్ ఎవరంటే చంద్రబాబేనని చిన్న పిల్లాడు కూడా చెబుతాడు’’
- అంబటి రాంబాబు
‘‘అత్యాచారం కేసులో ఉన్న ఓ ఎమ్మెల్యే, దొంగనోట్ల చలామణి కేసులో అరెస్టయిన టీడీపీ మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ ఇప్పటికీ టీడీపీలోనే కొనసాగుతున్నారు. బాబు మాటిమాటికీ చెప్పే ‘పిల్ల కాంగ్రెస్’ నిజానికి టీడీపీనే’’
- శోభా నాగిరెడ్డి
‘‘కత్తి, కర్ర, తుపాకీ వంటివేమీ అవసరం లేకుండా హత్య చేయగల సమర్థుడు చంద్రబాబు. సీఎంగానే గాక విపక్ష నేతగా కూడా అడ్డంగా దోచుకుంటున్న ఘనుడు’’
- జోగి రమేశ్ 

సాక్షి, హైదరాబాద్/గుంటూరు/ఆళ్లగడ్డ: సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్, టీడీపీలు తమ అనుబంధ పత్రికలైన ఈనాడు, ఆంధ్రజ్యోతిలతో అసత్యాలను ప్రచారం చేయిస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. రాజమండ్రిలో సెక్యూరిటీ ఇన్‌చార్జిని చంపి కోట్లు కొల్లగొట్టిన కేసులో ముద్దాయి వైఎస్సార్‌సీపీలో కీలక నేత అంటూ అభూతకల్పనతో ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నాయంటూ మండిపడింది. కాంగ్రెస్, టీడీపీలతో జత కట్టిన రెండు పత్రికలు, రెండు చానళ్లు వైఎస్సార్‌సీపీపై సందు దొరికినప్పుడల్లా చౌకబారు విమర్శలు చేయడం హేయమని పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. 

ఆ రెండు పత్రికలూ ప్రజా సమస్యలను విస్మరించి అసత్యాలను వండివార్చడం... మర్నాడు కాంగ్రెస్, టీడీపీ నేతలు వాటినే వల్లెవేయడం అందరికీ తెలిసిందేనని పార్టీ శాసనసభాపక్ష ఉప నేత శోభా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్సార్‌సీపీ నంబర్‌వన్‌గా ఉన్నందుకే పచ్చ పత్రికలు ఇలా పచ్చ రాతలతో బురద జల్లుతున్నాయని మాజీ ఎమ్మెల్యే జోగి రమేశ్ ధ్వజమెత్తారు. బుధవారం అంబటి గుంటూరులో, శోభ ఆళ్లగడ్డలో, రమేశ్ హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. రాజమండ్రి ఏటీఎం డబ్బు దోపిడీ కేసు ముద్దాయి శ్రీధర్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ప్రధాన అనుచరుడని, పార్టీలో ప్రధాన నాయకుడని ఎల్లో మీడియా చిత్రించిన తీరును అంబటి ఖండించారు. చౌకబారు ఎత్తుగడలతో వైఎస్సార్‌సీపీని ఎదుర్కోలేరన్నారు. ఒక వేలు చూపిస్తే, నాలుగు వేళ్లు వారివైపే చూపిస్తాయని కాంగ్రెస్, టీడీపీ చెంబు బృందం గుర్తుంచుకోవాలన్నారు.

టీడీపీ వారు అద్దంలో చూసుకోవాలి: వైఎస్సార్‌సీపీపై పలు చానళ్లలో ఇష్టానికి విషప్రచారం చేస్తున్న రేవంత్‌రెడ్డి వంటి బాబు తాబేదార్లు ఒకసారి అద్దంలో ముఖాలు చూసుకోవాలని అంబటి సూచించారు. ‘యూరో లాటరీ అంటూ మోసగించిన కోలా కృష్ణమోహన్‌తో బాబు ఫొటోలు దిగలేదా? అతని నుంచి బాబు రూ.50 లక్షలు తీసుకుని, మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇవ్వజూడలేదా? బాబు మంత్రివర్గంలో ఉన్న కృష్ణా యాదవ్ నకిలీ స్టాంపుల కుంభకోణంలో జైలు జీవితం గడపడం రేవంత్ మరిచారేమో. ఇలాంటి బాబును దొంగలకే గజదొంగ అనాలా?’’ అని ప్రశ్నించారు. 

చంద్రబాబు పేరిట రిజిస్టరయిన కారులో 2010లో కదిరిలో రూ.7 కోట్లు పట్టుబడ్డాయని గుర్తుచేశారు. ఆ సొమ్మంతా బాబుదేనని, కావాలంటే ఆయనతో ఫోన్లో మాట్లాడాలని టీడీపీ నేత పేరం హరిబాబు నేరుగా పోలీసులకే చెప్పడాన్ని అంబటి గుర్తు చేశారు. ‘కిరణ్‌తో బాబు లాలూచీ పడితే ఆ కేసు ఏమైంది? కేసు వివరాలను బయటపెట్టండి’ అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘‘బాబు చేసిన ఘోర తప్పిదాలను ప్రజలు మరవలేదు. వైట్ కాలర్ క్రిమినల్, పొలిటికల్ క్రిమినల్ ఎవరంటే చంద్రబాబేనని పసి పిల్లాడిని అడిగినా చెబుతాడు. బాబును ప్రజలు మూడోసారి కూడా తిరస్కరించేందుకు సిద్ధంగా ఉన్నారు. 

ఈ విషయం మాకంటే బాబుకే ఎక్కువ తెలుసు’’ అన్నారు. దివంగత వైఎస్‌పై, ఆయన కుటుంబంపై విమర్శలు చేసే కాంగ్రెస్ ఎంపీ వి.హన్మంతరావు ఒకసారి తన చరిత్రను గుర్తు చేసుకోవాలని సూచించారు. ‘‘గతంలో ఉస్మానియా వర్సిటీలో డ్రైవర్‌గా పని చేసిన వీహెచ్, ఆయిల్ దొంగతనం, టైర్ల దొంగతనం చేసినందుకు సస్పెండయ్యారు. కాబట్టి కాంగ్రెస్‌ను ఆయిల్ దొంగలు, టైర్ల దొంగల పార్టీ అనాలా?’’ అని ప్రశ్నించారు. బాబు పాదయాత్రకు కోటానుకోట్లు ఖర్చు పెట్టి ఉండొచ్చని, కానీ వైఎస్ జగన్ సోదరి షర్మిల పాదయాత్రకు జనం తండోపతండాలుగా తరలివచ్చి అభిమానాన్ని చాటుకుంటున్నారని గుర్తుంచుకోవాలన్నారు. ఆకాశంపై ఉమ్మితే తిరిగి తమ మీదే పడుతుందని కాంగ్రెస్, టీడీపీలకు హితవు పలికారు.

టీడీపీ నేతలపై ఉన్న కేసుల మాటేమిటి: శోభ
చంద్రబాబు మాటిమాటికీ చెప్పే ‘పిల్ల కాంగ్రెస్’ నిజానికి టీడీపీయేనని శోభ ఎద్దేవా చేశారు. ఈ విషయాన్ని ప్రజలు ఎప్పుడో తెలుసుకున్నారన్నారు. కోలా కృష్ణమోహన్ నుంచి డబ్బు తీసుకోవడమే గాక, అతను మోసగాడని ముందుగా ఎలా తెలుస్తుందంటూ బాబు దబాయించారని గుర్తు చేశారు. ‘‘అత్యాచారం కేసు ఎదుర్కొంటున్న ఓ ఎమ్మెల్యే, దొంగ నోట్ల చలామణి కేసులో అరెస్టయిన టీడీపీ మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ ఇంకా టీడీపీలోనే కొనసాగుతున్న విషయం ప్రజలందరికీ తెలుసు. కడప ఉప ఎన్నికల్లో రూ.7 కోట్లు, కొవ్వూరు ఉప ఎన్నికల్లో రూ.కోటి టీడీపీ నేతల వద్ద పట్టుబడలేదా? డీజిల్ అమ్మి సస్పెండైన వ్యక్తి కాంగ్రెస్‌లో చేరి నేడు జగన్‌ను విమర్శించడం హాస్యాస్పదం. 

కడప, కొవ్వూరు, అనంతరం 18 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో రెండు పార్టీలూ ఎన్ని అసత్యాలను ప్రచారం చేసినా ప్రజలు జగన్‌కే అండగా నిలిచిన విషయాన్ని మర్చిపోయినట్టున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ అవిశ్వాసంలో పాల్గొనకుండా కాంగ్రెస్‌కు మద్దతివ్వడం బాబుకే చెల్లింది! జగన్ ప్రజల్లోకి వస్తే కాంగ్రెస్, టీడీపీలకు మనుగడ ఉండదనే చంద్రబాబు, సీఎం కిరణ్ ఢిల్లీ వెళ్లి సోనియా కాళ్లు పట్టుకుని అడ్డుకుంటున్నారు’’ అంటూ దుమ్మెత్తిపోశారు. సర్పంచ్ సహా ఏ ఎన్నికల్లోనైనా ప్రజలు వైఎస్సార్‌సీపీకే అండగా నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.

విపక్ష నేతగానూ బాబు దోపిడీ: రమేశ్
ఆ రెండు పత్రికల తీరు పచ్చ కామెర్ల రోగి చందంగా ఉందని రమేశ్ విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో 80 శాతాన్ని వైఎస్సార్‌సీపీయే గెల్చుకునేలా కన్పిస్తుండటం వల్లే ఇలాంటి అభాండాలు వేస్తున్నారన్నారు. ‘‘వైఎస్సార్‌సీపీకి కోట్లాది కార్యకర్తలున్నారు. వారిలో ఎవరో తప్పు చేస్తే దాన్ని నాయకత్వానికి ఆపాదిస్తూ రాస్తారా? ఇది జర్నలిజం విలువలను మంటగలపడం కాదా?’’ అని ప్రశ్నించారు. అంతర్రాష్ట్ర ముఠా దొంగల భుజాలపై చంద్రబాబు చేతులు వేసి తీయించుకున్న ఫొటోలను విలేకరులకు రమేశ్ ప్రదర్శించారు. ‘‘వీరంతా చిత్తూరుకు చెందిన అంతర్రాష్ట్ర నేరస్తులు. 

కాబట్టి చంద్రబాబును అంతర్రాష్ట్రీయ దొంగ అనుకోవాలా?’’ అని ప్రశ్నించారు. ‘‘రాజకీయాల్లో హత్యలు చేసిన వ్యక్తి బాబు. ఎన్టీఆర్‌ను ఆయన హత్య చేయలేదా? మానసిక క్షోభ పెట్టి హత్య చేశారు. కత్తి, కర్ర, తుపాకీ వంటివేమీ అవసరం లేకుండా హత్య చేయగల సమర్థుడు చంద్రబాబు. సీఎంగా రాష్ట్రాన్ని ఎంతలా దోచుకున్నాడో అందరికీ తెలుసు. విపక్ష నేత హోదాలో కూడా దోచుకుంటున్నారు. రాజ్యసభలో ఎఫ్‌డీఐ ఓటింగ్‌కు సహకరించి విదేశీ సంస్థల నుంచి వేల కోట్ల రుణం, కేంద్రం నుంచి లంచం పొందారు. రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సమయంలో దొడ్డిదారిన పారిపోయి కాంగ్రెస్ నుంచి వేల కోట్లు లంచం తీసుకున్నారు. టీడీపీ మహానాడుకు కోట్లాది రూపాయల వసూలు చేశారు. దోచుకున్న సొమ్మును దాచుకోవడానికే చంద్రబాబు అమెరికా వెళ్లారు. రాజకీయాల్లో ఇంత నీచంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేయడమా?’’ అంటూ దుమ్మెత్తిపోశారు.

కోలాకు యూరో లాటరీ వచ్చిందని నమ్మి, ఆ సొమ్మును భారత్‌కు తీసుకురావడానికి ఆదాయపు పన్ను మినహాయింపు కోరుతూ సీఎం హోదాలో కేంద్రానికి బాబు లేఖ రాయలేదా? ఆయన మంత్రివర్గంలోని కృష్ణాయాదవ్ స్టాంపుల కుంభకోణంలో జైలుపాలు కాలేదా? అప్పట్లో నలుగురు మంత్రులు, పదిమంది ఎమ్మెల్యేలను తప్పించారు’’ అని గుర్తు చేశారు. టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, రేవంత్‌రెడ్డి రాజకీయాల్లో చిల్లరగాళ్లంటూ దుయ్యబట్టారు. ‘నీ బతుకేంటి? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ పుట్టు పూర్వోత్తరాలేమిటి?’ అని ఒక పత్రికా యజమానిని ఉద్దేశించి ప్రశ్నించారు. ‘‘ఇలా వార్తలు రాసిన పత్రికా యజమానుల్లో ఒకరు గతంలో గేదెలు కాచేవారు. మరొకరు సైకిల్‌పై పాలమ్ముకుని బతికారు. అవేమీ నామోషీ కాదు. ఒకప్పుడు అలా ఉన్నవాళ్లు శరవేగంగా వేల కోట్లెలా సంపాదించారు? ఒకరిపై బురదజల్లే ముందు తమ వెనక ఉన్నదేమిటో చూసుకోవాలి. ఇలాగే వ్యవహరిస్తూ ఉంటే ప్రజలు వీరికి బుద్ధి చెప్పే రోజు వస్తుంది’’ అని హెచ్చరించారు.
Share this article :

0 comments: