ఈ పాలనలో మాకు భరోసాయే లేకుండా పోయింది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈ పాలనలో మాకు భరోసాయే లేకుండా పోయింది

ఈ పాలనలో మాకు భరోసాయే లేకుండా పోయింది

Written By news on Tuesday, July 16, 2013 | 7/16/2013

- మరో ప్రజాప్రస్థానంలో షర్మిలతో గోడు వెళ్లబోసుకున్న ప్రజలు
- వైఎస్ పథకాలకు తూట్లు పొడుస్తున్నారు
- ఈ పాలనలో మాకు భరోసాయే లేకుండా పోయింది
- 75 ఏళ్ల వయసులోనూ కూలీకి వెళ్లాల్సి వస్తోంది
- కరెంటు లేక పరిశ్రమలు మూతపడుతున్నాయి

 ప్రతీ కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలి.. పాడి పంటలు సమృద్ధిగా ఉండాలి.. రాష్ట్రం అన్నింటా అగ్రగామిగా నిలవాలి.. దీనికోసమే వైఎస్సార్ అహరహం తపించారు! ప్రజాశ్రేయస్సే లక్ష్యంగా ఎన్నో పథకాలు.. మరెన్నో కార్యక్రమాలు చేపట్టారు. జనం కోసమే బతికి వారి గుండెల్లో కొలువయ్యారు. ప్రజల మనిషిగా నిలిచిపోయారు. ఆయన ఉన్నంతకాలం వేగంగా సాగిన పథ కాలన్నీ ఇప్పుడు నత్తను తలపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో వైఎస్ పథకాలను అటకెక్కించిన పాల కులు.. మరెన్నో పథకాల ఊపిరి తీస్తున్నారు. పింఛన్లు.. ఫీజు రీయింబర్స్‌మెంట్.. ఆరోగ్యశ్రీ, 108.. అభయహస్తం.. పావలా రుణాలు.. ఒక్కటేమిటీ పథకాలన్నింటినీ భ్రష్టు పట్టించారు. 

వీటికితోడు కరెంటు కష్టాలు. చార్జీల మోతలు. విద్యుత్ అందక పరిశ్రమలు మూతపడుతుండడంతో లక్షల మంది కార్మికుల బతుకులు రోడ్డున పడుతున్నాయి. మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా షర్మిల ఎక్కడకు వెళ్లినా జనం ఈ సమస్యలను ప్రస్తావిస్తూ తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. రాజన్న రాజ్యాన్ని గుర్తుచేసుకుంటూ మళ్లీ ఆ పాలన రావాల్సిందేనని నినదిస్తున్నారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలోని పల్లెల్లో సాగింది. ఈ గ్రామాల మీదుగా వెళ్తున్నప్పుడు ప్రజలు వారి బాధలు షర్మిలకు చెప్పుకున్నారు.

చిత్రంలో కనిపిస్తున్న ఈ వాటర్ ట్యాంక్ గురించే వీరు షర్మిలతో తమ బాధలు చెప్పుకుంటున్నారు. విజయనగరం జిల్లా ప్రజలకు తాగునీరు అందించేందుకు వైఎస్సార్ ఇందిరమ్మ సుజలధార పథకాన్ని తెచ్చారు. ఈ పథకం కింద శ్రీకాకుళం జిల్లా సంకిలి గ్రామం వద్ద నాగావళి నది నుంచి నీటిని విద్యుత్తు మోటార్ల ద్వారా తోడి విజయనగరంలోని చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మండలాల్లో 69 గ్రామాలకు తాగునీరు అందించాలన్నది వైఎస్ సంకల్పం. మొదటి దశ కింద రూ.85 కోట్లు మంజూరు చేశారు. దాదాపు 48 గ్రామాలకు మంచినీళ్లు అందించారు. వైఎస్సార్ మరణం తర్వాత పనులు కదలడం లేదు. 

రెండో దశ పనులకు నిధులు మంజూరు కాలేదు. దీంతో వాటర్ ట్యాంకుల నిర్మాణం ఎక్కడికక్కడ ఆగిపోయాయి. నిర్మాణం పూర్తై పైప్‌లైన్ కనెక్షన్ ఇవ్వలేదు. బాగు వలస గ్రామంలో ఈ వాటర్ ట్యాంకును 2009లో కట్టారు. పైపులైన్ కనెక్షన్ ఇవ్వాలి. కానీ నిధులు లేవంటూ ఆ పని చేయడం లేదు. ‘‘నాన్న ఉన్నప్పుడే డబ్బులిచ్చారు. వాటర్ ట్యాంకు పనులు చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు ఆగిపోయాయి. జగనన్న వస్తేనే ఈ ట్యాంకు నీళ్లు తాగుతాం తల్లీ’ అని బాగు వలస గ్రామానికి చెందిన తాళ్లవలస సావిత్రి, లెంక లక్ష్మి షర్మిలకు చెప్పారు. 

షర్మిలతో మాట్లాడుతున్న వీరు ఫెర్రో అల్లాయిస్ కంపెనీల యజమానులు. చీపురుపల్లి చుట్టుపక్కల మొత్తం 10 నుంచి 15 వరకు ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో దాదాపు 2 వేలకు పైగా కార్మికులు పని చేస్తున్నారు. ఒక్కో కంపెనీకి నెలకు రూ 2.20 లక్షల నుంచి 2.30 లక్షల కరెంటు బిల్లు వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వం అధికారికంగా 12 రోజుల పవర్ హాలిడే ఇచ్చింది. ఇవి కాకుండా సాయంత్రం 6 నుంచి 10 గంటల వరకు విద్యుత్తు వినియోగంపై ఆంక్షలు పెట్టింది. వీటికితోడు మరో రెండు, మూడు రోజుల అనధికార పవర్ కట్. అయినా లక్షలకు లక్షలు కరె ంటు బిల్లు కట్టాల్సి వస్తుందని, పరిశ్రమలను మూసివేసే పరిస్థితి వచ్చిందని యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు.

షర్మిల వద్ద కన్నీళ్లు పెట్టుకుంటున్న ఈ పండుటాకుల పేర్లు సంద పైడమ్మ, కన్నమ్మ. వీరిది వెదుల్ల వలస గ్రామం. పైడమ్మ వయసు 75 ఏళ్లు. రెండేళ్ల కిందట భర్త చనిపోయాడు. వృద్ధాప్య పింఛనుకైనా, వితంతు పింఛనుకైనా ఈమె అర్హురాలే. పింఛను కోసం రెండేళ్లుగా తహశీల్దారు కార్యాలయం చుట్టూ తిరిగినా పింఛను రాలేదు. శరీరం సహకరించకపోయినా పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్తోంది. ‘‘ఈ సర్కారు పింఛను ఇస్తే ఎలాగోలా నెట్టికొద్దునమ్మా.. మింగేటోళ్లేగానీ.. మాకేసి సూసినోడు లేడమ్మా’’ అంటూ వీరు కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఒక్క మనిషి లేకపోవడంతో రాష్ట్రం అతలాకుతలమైంది: షర్మిల
ఈ ప్రభుత్వం చేస్తున్న, చేసిన తప్పులకు రైతులు, పారిశ్రామిక వేత్తలు శిక్షలు అనుభవిస్తున్నారని షర్మిల మండిపడ్డారు. పలుచోట్ల తనతో సమస్యలు చెప్పుకున్న ప్రజలకు భరోసా కల్పిస్తూ ముందుకు సాగారు. ‘‘వైఎస్సార్ ప్రతి వర్గానికి సేవలు చేశారు కాబట్టే ఈ రోజు కులాలు, మతాలకు అతీతంగా ప్రజలు ఆయన్ను ఇంతలా గుర్తుపెట్టుకున్నారు. ఆ ఒక్క మనిషి లేకపోవడం వల్ల రాష్ట్రం అతలాకుతలమైపోయింది. పేదలంటే ఆయనకు ప్రేమ. ఇప్పుడున్న పాలకులు అసలు రైతుల గురించి ఆలోచనే చేయడం లేదు. వైఎస్సార్ ఎన్నో అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టారు. కానీ ఒక్క రూపాయి కూడా చార్జీలు పెంచలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్మికుల పక్షాన నిలబడుతుంది. వారికి ఉపాధి, ఇళ్లు, తెల్లరేషన్‌కార్డులు, పిల్లల చదువుల విషయంలో అండగా ఉంటుంది. గుజరాత్‌ను మించేలా ఇక్కడున్న గ్రానైట్ పరిశ్రమను జగనన్న తీర్చిదిద్దుతారు. మనం అందరం సమయం వచ్చినప్పుడు మిగిలిన పార్టీలకు బుద్ధి చెప్పి జగనన్నను ఆశీర్వదిస్తే రాజన్న రాజ్యం తప్పకుండా వస్తుంది’’ అని షర్మిల చెప్పారు.

16.3 కి.మీ. నడక..
సోమవారం 210 వరోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చీపురుపల్లి నియోజకవర్గంలోని ఆకులపేట గ్రామం నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి బాగు వలస, వెదుల్ల వలస, వెంకటాపురం ఎక్స్ రోడ్, బిళ్లల వలస మీదుగా గర్భం చేరుకున్నారు. ఇదే గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.15 గంటలకు చేరుకున్నారు. మొత్తం16.3 కిలోమీటర్లు నడిచారు. షర్మిల వెంట నడిచిన వారిలో తాజా మాజీ ఎమ్మెల్యేలు సుజయ్ కృష్ణరంగారావు ఉన్నారు. గజపతినగరం కో-ఆర్డినేటర్ కడుబండి శ్రీనివాసరావు, చీపురుపల్లి సమన్వయకర్తలు మాజీ ఎమ్మెల్యే గద్దె బాబురావు, కోట్ల సూర్యనారాయణనాయుడు, సిమ్మి నాయుడు షర్మిలను కలిశారు.
Share this article :

0 comments: