ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమన

ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే భూమన

Written By news on Tuesday, July 2, 2013 | 7/02/2013

ఇంటికో బారు.. మనిషికో బీరు!
- ప్రజలపై పన్నుల భారం, సంక్షేమానికి దూరం
- సంక్షేమాన్ని మరచి ప్రజల నడ్డి విరవడం గర్హనీయం

సాక్షి, హైదరాబాద్: ‘ఇంటికో బారు... మనిషికో బీరు... ఇదీ ప్రభుత్వ తీరు ’ అన్న విధంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని, ఇలాంటి ప్రజాకంటక ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడటం ఖాయమని వైఎస్సార్ కాంగ్రెస్ సీజీసీ సభ్యుడు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2004 నుంచి 2009 వరకూ ఐదేళ్ల పాటు దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రజలపై ఎలాంటి పన్నులు వేయకుండా సంక్షేమ రాజ్యాన్ని అందించారని చెప్పారు.

వైఎస్సార్ తన రెక్కల కష్టంతో కాంగ్రెస్‌ను రెండోసారి అధికారంలోకి తెస్తే, అదే ప్రభుత్వంలో ఉన్న ప్రస్తుత పాలకులు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఇష్టానుసారం ప్రజలపై భారం వేస్తూ నడ్డి విరుస్తున్నారని దుయ్యబట్టారు. విద్యుత్ చార్జీలు, ఇంధన సర్‌చార్జి సర్దుబాటు పేరుతో ఇప్పటికే రూ.32 వేల కోట్లు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రజలపై రూ.542 కోట్ల మేరకు సర్‌చార్జి భారాన్ని మోపుతోందని విమర్శించారు. ఒక్క రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు ద్వారానే రూ.రెండువేల కోట్ల భారాన్ని మోపిందని చెప్పారు. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వం రూ.22 వేలకోట్ల ఆదాయాన్ని పెంచుకుందన్నారు. నాలుగేళ్లలో ప్రభుత్వ ఆదాయం రూ.50 వేల కోట్ల మేరకు పెరిగిందని, ఈ డబ్బంతా ఎక్కడకు పోతోందని ప్రశ్నించారు. 

సంక్షేమ పథకాలను విస్మరించిన సర్కారు
ప్రభుత్వ ఆదాయం పెరిగినా విద్యార్థుల ఫీజుల చెల్లింపుపై ప్రభుత్వానికి శ్రద్ద లేకుండా పోయిందని, ఆరోగ్యశ్రీ పథకం పరిధి నుంచి 133 రకాల వ్యాధులను తొలగించారని భూమన దుయ్యబట్టారు. ఇక 104, 108 పథకాలపై పూర్తిగా శ్రద్ధ లోపించిందన్నారు. వరికి మద్దతు ధర పెరిగింది కేవలం 60 రూపాయలైతే వ్యవసాయానికి అవసరమైన ఎరువుల ధరలు మాత్రం 500 శాతం పెంచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయదారులకు, ఉద్యోగులకు, కార్మికులకు... ఇలా ఒక్క పౌరుడికి కూడా ప్రయోజనం లేకుండా ప్రభుత్వం పరిపాలిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఒక్క నెలలోనే మూడు సార్లు పెట్రోలు, డీజిల్ ధరలు పెంచిన ఘనత యూపీఏ ప్రభుత్వానిదేనని విమర్శించారు. సహజవాయువు ధరను ఒక్కసారిగా పెంచేసి రిలయన్స్ సంస్థకు రూ.47,500 కోట్ల ఆదాయం వచ్చేలా చేసిందని దుయ్యబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిది కోట్ల మంది ప్రజల ఆదరాభిమానాల పునాదులపై ఏర్పడిన పార్టీ అనీ, కొందరు నేతలు పోయినంత మాత్రాన ఇబ్బందేమీ ఉండదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణపై తమ వైఖరిని ప్లీనరీలోనే ప్రకటించామని, నిర్ణయం తీసుకోవాల్సింది యూపీఏ ప్రభుత్వమేనని భూమన స్పష్టంచేశారు.
Share this article :

0 comments: