దర్యాప్తు మొదలుపెట్టక ముందే సీబీఐ చెప్పింది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దర్యాప్తు మొదలుపెట్టక ముందే సీబీఐ చెప్పింది

దర్యాప్తు మొదలుపెట్టక ముందే సీబీఐ చెప్పింది

Written By news on Saturday, July 6, 2013 | 7/06/2013

 తమ చార్జిషీట్లలో ఏ-1గా జగన్, ఏ-2గా సాయిరెడ్డి ఉంటారని దర్యాప్తు మొదలుపెట్టక ముందే సీబీఐ చెప్పింది: షర్మిల
- కేంద్రం చూపించిన వారిపై మొరగడమే సీబీఐ పని
- ఒక్క నిర్దోషికీ శిక్ష పడకూడదని న్యాయశాస్త్రం చెప్తోంది
- ఒక పౌరుడిగా జగన్‌మోహన్‌రెడ్డికి హక్కులు లేవా?
- 90 రోజుల తర్వాత బెయిల్ ఇవ్వాలని చట్టం చెప్తుంటే.. ఆయనకు అది ఎందుకు వర్తించడం లేదు?
- కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్, టీడీపీల పాపం పండే రోజు దగ్గర్లోనే ఉంది

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘న్యాయస్థానాలు న్యాయం చేయాలి. 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికీ శిక్ష పడటానికి వీలు లేదని న్యాయశాస్త్రం చెప్తోంది. మరి ఇక్కడ ఏం జరుగుతోంది? ఇది న్యాయమా? ఇది ప్రజాస్వామ్యమా? ఒక పౌరుడిగా జగన్‌మోహన్‌రెడ్డికి హక్కులు లేవా? 90 రోజుల రిమాండ్ తరువాత బెయిల్ ఇవ్వాలని చట్టం చెప్తుంటే.. జగన్‌మోహన్‌రెడ్డికి మటుకు అది ఎందుకు వర్తించడం లేదు? ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్న ఈ భారతదేశంలో న్యాయానికి, ధర్మానికి, ప్రజాభిప్రాయానికి విలువ లేదా?’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ప్రశ్నించారు. తాము వేయబోయే చార్జిషీట్లలో ఏ-1, ఏ-2లుగా ఎవరుంటారో దర్యాప్తు మొదలుపెట్టక ముందే సీబీఐ ప్రకటించిందని, కేసును ఎలా నడపదలచుకుందో ఆ రోజే స్పష్టమైందని విమర్శించారు.

‘‘కారు చీకట్లో ఉన్నా జగనన్న కాంతి కిరణమే. జైల్లో ఉన్నా ఆయన తిరుగులేని జన నేతే. కుమ్మక్కు రాజకీయాలతో కుట్రలు పన్నుతున్న వీళ్ల పాపం పండి, పాపాల పుట్ట పగిలి అందులోంచి వచ్చిన విష సర్పాలను ప్రజలు ఓటు అనే ఆయుధంతో వేటాడే రోజు కూడా దగ్గరలోనే ఉంది’’ అని ఉద్ఘాటించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని, ప్రజాస్వామ్య విరుద్ధంగా దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరిని ఎండగడుతూ జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర శుక్రవారం 200 రోజులు పూర్తిచేసుకుంది. ఇప్పటివరకు యాత్రలో 100 నియోజకవర్గాల్లో షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా విశాఖ సముద్ర తీరాన ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు జన సంద్రం పోటెత్తింది. వారిని ఉద్దేశించి షర్మిల ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

ప్రభుత్వం వైపు నుంచి తప్పు జరిగిందా: జగన్‌మోహన్‌రెడ్డిపై కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితం. జగనన్నపై కేసు పెట్టింది కూడా శంకర్రావు అనే కాంగ్రెస్ నాయకుడు. ఆయనతో చంద్రబాబు నాయుడి మనిషి కూడా కలిసి వెళ్లి ఈ కేసు పెట్టారు. వైఎస్సార్ హయాంలో పరిశ్రమలకు కొన్ని భూములు పొందినవారు.. అందుకు ప్రతిఫలంగా జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడి పెట్టారని కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఆరోపణలు చేశారు. కానీ దుర్మార్గం ఏమిటంటే ప్రభుత్వం వైపు నుంచి తప్పు జరిగిందా? లేదా? అనే విషయాన్ని సీబీఐ పూర్తిగా పక్కనబెట్టి జగన్‌మోహన్‌రెడ్డి మీద, ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారి ఇళ్ల మీద దాడులు చేసింది. అరెస్టుల మీద అరెస్టులు చేసింది. 

చార్జిషీట్ల మీద చార్జిషీట్లు వేసింది. సీబీఐ విచారణ అనే దిక్కుమాలిన కథలో ఇంకో విచిత్రం ఏమిటంటే.. దర్యాప్తు ఇంకా మొదలు కాకముందే సీబీఐ అధికారి ఒక ప్రకటన చే శారు. సీబీఐ దాఖలు చేయబోయే అన్ని చార్జిషీట్లలో జగన్‌మోహన్‌రెడ్డి ఏ-1గా ఉంటారని, విజయసాయిరెడ్డి ఏ-2గా ఉంటారని ముందే ప్రకటించారు. అంటే దర్యాప్తు ఇంకా ప్రారంభం కాకముందే, దర్యాప్తుతో సంబంధం లేకుండానే ఏ-1గా ఎవరుండాలి? ఏ-2గా ఎవరుండాలి అని సీబీఐ ముందే నిర్ణయించిందీ అంటే.. ఇక సీబీఐ ఈ కేసును ఎలా నడపదలుచుకుందో ఆ రోజే తేలిపోయింది.

కేంద్రం చెప్పినట్లే సీబీఐ ఆడుతుంది: సీబీఐ అనే వ్యవస్థ కేంద్రం చేతిలో కీలుబొమ్మ అని, అది కేంద్రం కోసమే పని చేస్తోందని, వాళ్లు ఎలా ఆడమంటే అలా ఆడుతుందనే విషయం ఇప్పటికే బొగ్గు కుంభకోణంతో సహా పలు సార్లు రుజువైంది. సీబీఐ అనే సంస్థ కేంద్ర ప్రభుత్వ పంజరంలో చిలుక అని, కేం ద్రం పెరట్లో కుక్క అని, ఆ నాయకులు ఎవరి మీద మొరగమంటే వారి మీద మొరుగుతుందని, మొరగటం ఆపేసి కూర్చోమంటే వెనక్కి వస్తుందని కరుణానిధి కుమారుడు స్టాలిన్ కేసుతోపాటు ఇప్పటికే పలుమార్లు మన దేశంలో రుజువైన నిజం. సీబీఐ అనేది ఈ రోజు దర్యాప్తు సంస్థ ఏమాత్రం కాదు. అది ఒక బ్లాక్ మెయిల్ సంస్థ.

చంద్రబాబుకి చెప్పుకునేంత చరిత్ర లేదు..
రాజకీయ నాయకుడు అన్న వాడు ప్రజల గురించి ఆలోచన చేయాలి. చేతనైనంత మేరకు ప్రజలకు సహాయపడాలి. ప్రజలకు ఏదైనా కీడు జరుగుతుంటే వాళ్లకు అండగా నిలబడి పోరాటం చేయాలి. ఇప్పుడు రాష్ట్ర ప్రజలను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ కాలర్ పట్టుకొని నిలదీయాల్సింది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు. 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా.. ‘నేను ఇంత మందికి మంచి చేశాను. ఫలానా గొప్ప పథకం పెట్టడం వల్లఇంత మంది ప్రజలకు మేలు చేశాను’ అని చెప్పుకునే పరిస్థితిలో ఆయన లేరు. ‘తొమ్మిదేళ్ల ప్రతిపక్ష నాయకునిగా ఫలాన ఉద్యమం చేశాను, ఫలానా సందర్భంలో ప్రజల పక్షాన పోరాటం చేశాను.. ఇది సాధించాను. రైతుల కోసం ఫలానా విధంగా ప్రభుత్వం మెడ వంచాను’ అని కూడా చెప్పుకునే పరిస్థితిలో ఆయన లేరు. ఎందుకంటే చంద్రబాబుకి చెప్పుకునేంత చరిత్రే లేదు.’’

ఆర్కే బీచ్‌కు పోటెత్తిన జన సంద్రం: ‘మరో ప్రజాప్రస్థానం’ 200వ రోజు శుక్రవారం షర్మిల విశాఖపట్నం జిల్లా దక్షిణ నియోజకవర్గంలోని తాటిచెట్లపాలెం నుంచి యాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి అక్కయ్యపాలెం, గురుద్వార జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, డాబాగార్డెన్స్, జగదాంబ జంక్షన్ మీదుగా ఆర్కే బీచ్‌కు చేరుకున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వారిని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం.. సమీపంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.00 గంటలకు చేరుకున్నారు. శుక్రవారం ఆమె మొత్తం 12 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 2,664.8 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది.

షర్మిల వెంట నడిచిన వారిలో జిల్లా పార్టీ కన్వీనర్, ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, విశాఖ నగర కన్వీనర్, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంశీకృష్ణ యాదవ్, ఎమ్మెల్యే కృష్ణదాసు, తాజా మాజీ ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు, మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు, పెన్మత్స సాంబశివరాజు, బలిరెడ్డి సత్యారావు, నేతలు అంబటి రాంబాబు, గోనె ప్రకాశ్‌రావు, మాజీ ఎంపీ కణితి విశ్వనాథం, మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జి, చెంగల వెంకట్రావు, ముదునూరి ప్రసాదరాజు, పూడి మంగపతిరావు, కుంభా రవిబాబు, పిన్నింటి వరలక్ష్మి, వివిధ నియోజకవర్గాల కో-ఆర్డినేటర్లు పెట్ల ఉమాశంకర్ గణేష్, తిప్పల నాగిరెడ్డి, కిడారి సర్వేశ్వర్‌రావు, కోల గురువులు, ప్రగడ నాగేశ్వరరావు, కోరాడ రాజబాబు, బూడి ముత్యాల నాయుడు, బొడ్డేటి ప్రసాద్, వంజంగి కాంతమ్మ, పాడేరు సత్యవాణి, జీవీ రవిరాజు, స్థానిక నాయకులు దాడి రత్నాకర్, కొత్తపల్లి గీత, కొయ్య ప్రసాదరెడ్డి, పీలా ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. పాదయాత్రలో షర్మిల వెన్నంటే ఉన్న వారిలో తలశిల రఘురాం, వాసిరెడ్డి పద్మ, ఆర్కే, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, వైఎస్ రాయల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

8 నుంచి విజయనగరం జిల్లాలో యాత్ర: పెనుమత్స
విజయనగరం, న్యూస్‌లైన్: షర్మిల పాదయాత్ర ఈ నెల 8 నుంచి విజయనగరం జిల్లాలో నిర్వహించనున్నట్టు వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు తెలిపారు. శుక్రవారం విజయనగరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 8 నుంచి దాదాపు 12 రోజుల పాటూ జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లో పాదయాత్ర జరుగు తుందన్నారు. 

ఒక్కడిపై వెయ్యి కుట్రలు!
‘‘జగన్‌మోహన్‌రెడ్డిని ఒక్కడిని చేసి 100 మంది కలిసి వెయ్యి కుట్రలు పన్ని వ్యవస్థలను వాడుకొని ఆయనను తొక్కేయాలనుకుంటున్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేస్తున్నా జగన్‌మోహన్‌రెడ్డి గుండె నిబ్బరం ఏమాత్రం చెక్కు చెదరలేదు. జైల్లో పెట్టినా ప్రజల గురించే ఆలోచన చేస్తున్నారు. ప్రజా సమస్యల విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందించాలి, ప్రజల పక్షాన నిలబడి ఎలా పోరాడాలి అని పార్టీ నేతలకు నిర్దేశిస్తూనే ఉన్నారు. అది జగన్‌మోహన్‌రెడ్డి గుండె ధైర్యం. బోనులో ఉన్నా సింహం సింహమే.’’

ప్రజా సమస్యలపై ఎంత మంది మాట్లాడారు?
‘‘మూడున్నరేళ్లుగా ఎంత మంది కాంగ్రెస్ నాయకులు, ఎంత మంది టీడీపీ నాయకులు ప్రజల సమస్యల గురించి మాట్లాడారు? ఎంత మంది టీడీపీ, కాంగ్రెస్ నేతలు మా కుటుంబాన్ని టార్గెట్ చేసుకొని మాట్లాడారు? మూడున్నర ఏళ్లుగా వీళ్ల ఏకైక లక్ష్యం వైఎస్సే. వీళ్ల అజెండా జగనే. కనుకనే ఈ ఆరోపణలు.. కనుకనే ఈ కుట్రలు... కనుకనే ఈ అరెస్టులు. ఈ ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, టీడీపీ నాయకుల్లో ఏ మాత్రం నిజాయితీ ఉన్నా, ఆరోపణల్లో ఏ మాత్రం నిజం ఉన్నా, వాటిని వైఎస్సార్ బతికున్నప్పుడే చేసి ఉండేవారు.’’
Share this article :

0 comments: