వైఎస్ పథకాల పరిస్థితి ఎలా ఉందో రాష్ట్రంలో గడపగడపా చెబుతుంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ పథకాల పరిస్థితి ఎలా ఉందో రాష్ట్రంలో గడపగడపా చెబుతుంది

వైఎస్ పథకాల పరిస్థితి ఎలా ఉందో రాష్ట్రంలో గడపగడపా చెబుతుంది

Written By news on Saturday, July 20, 2013 | 7/20/2013

- ‘ఫీజు దీక్ష’ ముగింపు సభలో సర్కారుపై విజయమ్మ నిప్పులు
- వైఎస్ పథకాల పరిస్థితి ఎలా ఉందో రాష్ట్రంలో గడపగడపా చెబుతుంది
- ఒక తండ్రిలా ఆలోచించి వైఎస్ ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రవేశపెట్టారు
- ఈ ప్రభుత్వం పథకానికి తూట్లు పొడుస్తూ విద్యార్థులను క్షోభ పెడుతోంది

సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల పరిస్థితి ఏమిటని అడిగితే రాష్ట్రంలోని గడపగడపా సమాధానం చెబుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ అన్నారు. అవి ఎప్పుడో ఆగిపోయాయన్న విషయాన్ని ప్రతి గొంతూ వినిపిస్తుందని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సక్రమంగా అమలు చేయాలన్న డిమాండ్‌తో చేపట్టిన ‘ఫీజు దీక్ష’ ముగింపు సందర్భంగా శుక్రవారం ధర్నాచౌక్ వద్ద విజయమ్మ మాట్లాడారు. అంతకుముందు విద్యార్థులు సాలెహ బేగం, ప్రీతి, స్వాతి, బిందు, అనంతరామన్, ఉదయ్‌కిరణ్‌లు విజయమ్మకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. తర్వాత విజయమ్మ ప్రసంగించారు. ఒక తండ్రిలా ఆలోచన చేసి ప్రతీ పేద విద్యార్థి కూడా ఉన్నత చదువులు చదవాలన్న ఆశయంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని విజయమ్మ గుర్తుచేశారు.

సుదీర్ఘమైన రాష్ట్ర రాజకీయాల్లో రాజశేఖరరెడ్డి ప్రజల కష్టాలు, బాధలు తెలుసుకొని, అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, పక్కా ప్రణాళికతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించారన్నారు. అవసరమైనచోట ప్రాజెక్టులు కట్టడం, పరిశ్రమలు నెలకొల్పడంతో పాటు అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నారన్నారు. ‘‘కొందరు కాంగ్రెస్ నేతలు, సీఎం మాట్లాడుతూ... వైఎస్ అమలు చేసిన పథకాలు ఎక్కడ ఆగాయని ప్రశ్నిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఏకంగా సవాల్ విసురుతున్నారు. వైఎస్ అనే పదం రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పింది. పాలనకు వైఎస్ అనే పదం కొత్త అర్థం చెప్పింది. ఆ పదం ప్రజానాయకుడు ఎలా ఉండాలనే దానికి భావితరాలకు మార్గదర్శకంగా నిలిచింది. పేదలకు, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు వెలుగునిచ్చింది.

అన్నింటికీ మించి వైఎస్ అనే పదం రాష్ట్ర ప్రజలకొక భరోసా ఇచ్చింది. ఇప్పుడు వైఎస్ పథకాలు ఎలా ఉన్నాయని అడిగితే గడప గడపా సమాధానం చెబుతుంది. పథకాలు ఎప్పుడో ఆగిపోయాయని ప్రతీ గొంతు వినిపిస్తోంది..’’ అని స్పష్టంచేశారు. రాజశేఖరరెడ్డి అంటే ఒక నమ్మకం, ఒక ఆశయం కాబట్టే ఆయన రాష్ట్ర ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారన్నారు. విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వల్ల చదువుకొని ఇంజనీర్లు, డాక్టర్లమయ్యామని చెప్పుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు. తన ఐదేళ్ల హయాంలో ఒక్కపైసా పన్ను పెంచకుండా అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని డజన్ల కొద్దీ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి తెలుగువారు గర్వంగా తలెత్తుకునేలా చేస్తే.. ప్రస్తుత పాలకులు దుష్ట ఆలోచనలతో రకరకాల ఆంక్షలు పెట్టి ఆ పథకాలను ఒక్కొక్కటిగా నీరుగారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

బడ్జెట్ రూ.1.61 లక్ష కోట్లకు చేరినా ఫీజులివ్వరా..?
రాజశేఖరరెడ్డి పాలన పగ్గాలు చేపట్టినప్పుడు ప్రభుత్వ ఖజానా కేవలం రూ. 40 వేల కోట్లు మాత్రమే ఉండగా.. ఆయన ఐదేళ్ల పాలనలో రూ. 1.40 లక్షల కోట్లకు చేర్చారని విజయమ్మ గుర్తుచేశారు. ‘‘ప్రస్తుతం ప్రభుత్వ బడ్జెట్ 1.61 లక్షల కోట్లకు చేరింది. ఖజానా ఇంత పెరిగినా విద్యార్థులకు ఫీజులు ఎందుకు చెల్లించడంలేదు? ఇంత గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారు..’’ అని విజయమ్మ సూటిగా ప్రశ్నిం చారు. బడ్జెట్‌లో ఒకేసారి నిధులు ఎందుకు కేటాయించడంలేదని నిలదీశారు.

వైఎస్ 25 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కల్పించారని, అప్పట్లో ఎలాంటి కొరత లేకుండా ఫీజులు మొత్తం ప్రభుత్వమే భరించిందని వివరించారు. ప్రస్తుత పాలకులు మాత్రం ఒక్కో కాలేజీకి ఒక్కో ఫీజు సృష్టించి విద్యార్థులను, వారి తల్లిదండ్రులను గందరగోళంలోకి నెడుతున్నారని విమర్శించారు. ‘‘పదివేల ర్యాంకుపైబడిన విద్యార్థులకు ఫీజురీయింబర్స్‌మెంట్ ఇవ్వరట! సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను ఆ పథకం నుంచి తీసేశారు. రెండేళ్ల విరామం ఉంటే అనర్హులట. మళ్లీ ఈ పథకానికి ఆధార్‌లింక్ చేస్తున్నారు. ఎమ్మార్వో నుంచి పేదరికం సర్టిఫికెట్ తెచ్చుకోవాలట. ఇలా రకరకాల ఆంక్షలు పెట్టి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నీరుగార్చుతున్నారు’’ అని మండిపడ్డారు.

పథకాన్ని గందరగోళంలోకి నెట్టిన సీఎం కిరణ్... ఏ శాస్త్రీయత ఆధారంగా ఒక్కో కాలేజీకి ఒక్కో ఫీజు నిర్ధారించారని ప్రశ్నించారు. ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క ఏడాదిలో ఫీజులు ఎందుకు మారుతున్నాయో ఎవరికీ అంతుపట్టని విషయంగా ఉందన్నారు. యాజమాన్య కోటా సీట్లు కూడా అండర్‌టేకింగ్‌లో అమ్ముకోవచ్చంటూ పచ్చజెండా ఊపిన ప్రభుత్వం ఎవరికి కొమ్ముకాస్తున్నట్లు అని అడిగారు. వీళ్లా మమ్మల్ని విమర్శించేవారంటూ దుయ్యబట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా ఐదుసార్లు దీక్షలు చేసినట్లు తెలిపారు. పథకం సక్రమంగా అమలు చేయాలని తాము ఎంత డిమాండ్ చేసినా ఈ మొద్దు ప్రభుత్వంలో చలనం కలగడంలేదని నిప్పులు చెరిగారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సక్రమంగా అమలు చేయకపోవడం వల్లే దళిత విద్యార్థిని వరలక్ష్మి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ఈ ప్రభుత్వం గుర్తుచేసుకోవాలని హితవు పలికారు.

కౌన్సెలింగ్ ఎప్పుడో ఎవరికీ తెలియదు..
ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభం కావాల్సిన ఈ సమయంలో ఇప్పటిదాకా కౌన్సెలింగ్ తేదీలను ప్రకటించే స్థితిలో కూడా ప్రభుత్వం లేదని విజయమ్మ విమర్శించారు. పక్క రాష్ట్రాల్లో కౌన్సిలింగ్ పూర్తి చేసి తరగతులు ప్రారంభిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రపోతోందని దుయ్యబట్టారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా నీట్, ఐఐటీ లాంటి వాటిల్లో రాష్ట్ర విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. నీట్, ఐఐటీ లాంటి ప్రవేశ పరీక్షలపై నిర్ణయం తీసుకునే అపెక్స్ బోర్డులో రాష్ట్రానికి చెందిన సభ్యులు లేకపోవడం వల్లే అన్యాయం జరుగుతోందన్నారు. కేంద్రమంత్రివర్గంలో రాష్ట్రం నుంచి 13 మంది మంత్రులు, 30 మంది ఎంపీలు ఉండి కూడా అపెక్స్‌బోర్డులో సభ్యుడిని చేర్పించలేకపోయారన్నారు. కేంద్ర అనాలోచిత చర్యల కారణంగా రాష్ట్రానికి చెందిన వేలాది మంది విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.

ఉన్న స్కూళ్లను మూసేస్తున్నారు..
కేంద్రం ప్రవేశపెట్టిన విద్యాహక్కు చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడమే లేదని విజయమ్మ విమర్శించారు. విద్యార్థులు లేరనే సాకుతో ఇప్పటిదాకా 1,850 స్కూళ్లను మూసేసిందని, పాఠశాలలో లోపాలను సరిచేయకుండా.. విద్యార్థులు లేరంటూ మూసేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికీ రాష్ట్రంలో ఒక్క టీచర్‌తో నడుస్తున్న పాఠశాలలు ఐదారు వేలకు పైబడి ఉన్నాయని చెప్పారు. బీసీ విద్యార్థుల కోసం రాజశేఖరరెడ్డి దాదాపు 300 హాస్టళ్లను తీసుకొస్తే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా మూసేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధ్వానంగా సంక్షేమ హాస్టళ్లు..
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి అధ్వానంగా తయారైందని విజయమ్మ అన్నారు. బడ్జెట్‌లో సంక్షేమ హాస్టళ్ల నిర్వాహణ కోసం రూ.6,830 కోట్లు కేటాయించి కేవలం రూ.3,108 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. మెస్‌చార్జీల విషయంలో కూడా అదే ధోరణి ప్రదర్శిస్తోందన్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌కు రూ.8,600 కోట్లు కేటాయించామని ప్రకటించడమే తప్ప వాటిని ఖర్చుచేసింది లేదన్నారు సరైన పర్యవేక్షణ లేకపోవడంతో అధికారుల పరిస్థితి కూడా యథారాజా.. తథాప్రజా అన్నట్లు తయారైందన్నారు. ఈ ప్రభుత్వం వల్ల ఏ ఒక్క వర్గానికి మేలు జరగడంలేదని, వైఎస్ మరణం తర్వాత ఇప్పటి దాకా ఒక కొత్త ఇల్లు, తెల్లరేషన్‌కార్డు, పెన్షన్లు మంజూరు చేసిన దాఖలాలు లేవని చెప్పారు.

రైతులకు రాజశేఖరరెడ్డి ఇన్‌పుట్ సబ్సిడీ 300 శాతం పెంచితే, కిరణ్ ప్రభుత్వం అంతే శాతం తగ్గించిందన్నారు. ఈ ప్రభుత్వం ఓవైపు ఉన్న పథకాలకు తూట్లుపొడుస్తూ.. మరోవైపు రోజుకో కొత్త పథకం ప్రవేశపెడుతోందని మండిపడ్డారు. బంగారు తల్లి పథకం ప్రవేశపెట్టి దాన్ని కూడా ఆధార్‌కు లింక్ చేసి ఆంక్షలు విధించారన్నారు. రాష్ట్రంలో సగం మందికి ఆధార్ లేకపోతే పథకానికి ఎలా అర్హులు అవుతారని ప్రశ్నించారు. ఈ పాలకులకు పథకాలు ప్రవేశపెట్టడమే తప్ప వాటిని చిత్తశుద్ధితో అమలు చేయాలన్న ఆలోచన లేదని విజయమ్మ అన్నారు. 

విద్యార్థులూ.. మీ ఫీజుల ఇబ్బందులు చెప్పండి!
ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక విద్యార్థులు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయినా ప్రభుత్వం అలాంటిదేమీ లేదని చెబుతోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు తమ వివరాలను తెలియజేయాలని, అందుకోసం పార్టీ ఐటీ విభాగం ద్వారా ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను రూపొందించినట్టు విజయమ్మ ప్రకటించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రావడంలో ఇబ్బందులు పడుతున్న విద్యార్థినీ, విద్యార్థులు తమ వివరాలను వెబ్‌సైట్ feesreimbursement@ ysrcongress.com కు మెయిల్ చేయాలని కోరారు.

కాలేజీలకు వెళ్లి చెప్పే ధైర్యం ఉందా?: శోభానాగిరెడ్డి
విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ సౌకర్యం కల్పిస్తున్నామని ప్రకటిస్తున్న ప్రభుత్వానికి అదే విషయాన్ని కాలేజీలకు వెళ్లి చెప్పే ధైర్యం ఉందా? రీయింబర్స్‌మెంట్ అందరికీ అందితే వైఎస్ విజయమ్మ మూడుసార్లు, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండుసార్లు దీక్ష చేయాల్సిన అవసరమేముంది? ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, సంతృప్త స్థాయిలో పింఛన్లు అంటే తానే గుర్తొచ్చేలా వైఎస్ రాజశేఖరరెడ్డి పథకాలు పెట్టారు. ఆ పేరును మరిపించే కుట్ర జరుగుతోంది. వైఎస్‌పై అభిమానం ఉందని చెప్తున్న ఉండవల్లి ఆయన పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినపుడు ఎందుకు మాట్లాడలేదు? విచారణ పేరుతో 14 నెలలుగా జగన్‌ను జైల్లో ఉంచితే ఎందుకు మాట్లాడటం లేదు? సీబీఐ కాంగ్రెస్ పెంపుడు కుక్కలాగా మారిపోయింది. ఈ విషయాన్ని మేం చెప్పడం కాదు. యూపీఏ మిత్రపక్షాలే ఆరోపిస్తున్న విషయం ఉండవల్లి గమనించడం లేదా? 


షర్మిల పాదయాత్ర చూసి బొత్సకు నిద్ర పట్టడం లేదు: కొండా సురేఖ
పాదయాత్ర సమయంలో చూసిన కష్టాలకు స్పందించిన వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వర్గానికి మేలుచేసే నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు తన ప్రజా వ్యతిరేక చర్యలతో వారు ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి తీసుకెళ్తోంది. సమస్యల్లో విలవిలాడుతున్న ప్రజలకు ధైర్యం చెప్పేందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. షర్మిల పాదయాత్ర కు విజయనగరం జిల్లాలో వచ్చిన స్పందన చూసి నిద్ర పట్టకపోవడంవల్లే పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఆరోపణలు చేస్తున్నారు. వైఎస్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా బొత్స తన స్థాయి ఏంటో నిరూపించుకుంటున్నారు. వైఎస్ మరణించిన తర్వాత జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయాలంటూ సంతకాల సేకరణ చేసింది బొత్స కాదా?
Share this article :

0 comments: