పేదల ప్రాణాలంటే లెక్కే లేదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పేదల ప్రాణాలంటే లెక్కే లేదు

పేదల ప్రాణాలంటే లెక్కే లేదు

Written By news on Sunday, July 7, 2013 | 7/07/2013

కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి తెచ్చేందుకు వైఎస్ ఆరోగ్యశ్రీ పెట్టారు
కానీ ఈ సర్కారు ఆ పథకానికి తూట్లు పొడుస్తోంది
వైఎస్ నిర్మించ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులనూ నీరుగారుస్తోంది
విశాఖలో విమ్స్ ఆస్పత్రి నిర్మాణానికి ప్రభుత్వం నిధులివ్వకపోవడంపై స్థానికుల ఆగ్రహం
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ శనివారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 201,కిలోమీటర్లు: 2,678.9

సాక్షి, విశాఖపట్నం: పేదలకు ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు మహానేత రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి ఈ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. ఈ పథకంతోపాటు ఆయన హయాంలో పేదల కోసం నిర్మించ తలపెట్టిన ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను కూడా ప్రభుత్వం నీరు గార్చిందని అన్నారు. ఈ ప్రభుత్వానికి పేదల ప్రాణాలంటే లెక్కే లేదని, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేదని మండిపడ్డారు. షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర విశాఖలోని తూర్పు నియోజకవర్గంలో శనివారం కొనసాగింది. ఈ యాత్రలో భాగంగా ఆమె జాతీయ రహదారిపై ఉన్న విమ్స్ వద్దకు చేరుకునేసరికి స్థానికులు ఆమెను కలిసి విమ్స్ సమస్యల్ని ఏకరువు పెట్టారు.

వైఎస్ మరణం తర్వాత విమ్స్‌ను పక్కన పడేశారు..

‘‘నిమ్స్ తరహాలో ఉత్తరాంధ్ర ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందించాలని దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి రూ.250 కోట్ల అంచనాతో 2007 జనవరిలో విమ్స్(విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్)కు శంకుస్థాపన చేశారు. 2010 డిసెంబరునాటికి నిర్మాణం పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. తొలి విడతలో భవన నిర్మాణానికి రూ.55 కోట్ల నిధులు కేటాయించారు. తొలి దశలో 450 పడకలు, 6 సూపర్ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులోకి తీసుకురావాలని, మొత్తం 1,130 పడకలు, 21 సూపర్ స్పెషాలిటీ విభాగాలతో మెరుగైన వైద్యసేవలందించాలని నిర్ణయించారు. ఆ మహానేత మరణం తర్వాత ఈ ప్రభుత్వం విమ్స్‌ను పూర్తిగా పక్కకు నెట్టేసింది’’ అని స్థానికులు షర్మిల ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

వైఎస్‌కు పేరు రాకూడదనే..

వైఎస్సార్ మరణం తర్వాత రోశయ్య ఈ ఆస్పత్రిని తన అల్లుడికి కట్టబెట్టాలనుకున్నారని స్థానికులు చెప్పారు. అయితే కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక టీడీపీ ఎంపీకి చెందిన గీతం యూనివర్సిటీకి అప్పగించేందుకు ప్రయత్నించారన్నారు. దీనిపై పార్టీలకతీతంగా అందరూ ఆందోళనకు దిగితే ఆ ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకుందని చెప్పారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఏడాది కిందట విశాఖలో పర్యటించినపుడు విమ్స్‌కు రూ.65 కోట్లు కేటాయిస్తామని హామీలిచ్చి, ఇప్పటికి రూ.15 కోట్లు మాత్రమే విదిల్చారని చెప్పారు. విమ్స్ పూర్తయితే ఎక్కడ వైఎస్సార్‌కు ఘనత దక్కుతుందోనన్న అక్కసుతోనే ఇదంతా చేస్తున్నారని ఆక్షేపించారు. ఈ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే వేయిమందికి పైగానే ఉపాధి దక్కుతుందని, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు చెందిన లక్షల మందికి మెరుగైన వైద్యసేవలందుతాయని వారు ఆమెకు విన్నవించారు.

ఆరు నెలలు ఓపిక పట్టండి: వారి సమస్యలు విన్న షర్మిల స్పందిస్తూ ‘‘ఇంకొక్క ఆరుమాసాలు ఆగండన్నా.. జగనన్న ముఖ్యమంత్రి అవుతారు. వైఎస్సార్ హయాంలో ప్రారంభించి, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటారు. జగనన్నతో ప్రజలకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకుంది’’ అంటూ భరోసా ఇచ్చారు. 

14.1 కిలోమీటర్ల యాత్ర: ‘మరో ప్రజాప్రస్థానం’ 201వ రోజు శనివారం షర్మిల పాదయాత్ర విశాఖ జిల్లా తూర్పు నియోజకవర్గంలోని కిర్లంపూడి లేఅవుట్ బీచ్‌రోడ్డు నుంచి ప్రారంభమయింది. ఇక్కడ వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన షర్మిల.. చినవాల్తేరు, పెదవాల్తేరు, ఉషోదయ కూడలి, ఏఎస్ రాజా మైదానం, ఎంవీపీ డబుల్ రోడ్, ఇసుకతోట, హనుమంతవాక, డెయిరీఫామ్, ఆదర్శనగర్, రవీంద్రనగర్, తోటగరువు, బాలాజీనగర్, అంబేద్కర్ కూడలి, దుర్గాబజార్, ఆరిలోవ చివరి బస్టాప్, ముడసర్లోవ జలాశయం మీదుగా యాత్ర చేశారు. రామకృష్ణాపురం వద్ద ఏర్పాటు చేసిన బసకు రాత్రి 8.30 గంటల సమయంలో చేరుకున్నారు. శనివారం ఆమె మొత్తం 14.1 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. దీంతో ఇప్పటి వరకు 2,678.9 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. సిటీ కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, విశాఖ పార్లమెంటరీ సమన్వయకర్త ముదునూరి ప్రసాదరాజు, నియోజకవర్గాల సమన్వయకర్తలు కోలా గురువులు, జి.వి.రవిరాజు, కోరాడ రాజబాబు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పీలా వెంకటలక్ష్మి, రాష్ట్ర గిడ్డంగుల శాఖ మాజీ చైర్మన్ సత్తిరామకృష్ణారెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు గుడ్లపోలిరెడ్డి, స్థానిక నేతలు దాడి రత్నాకర్, కొయ్య ప్రసాదరెడ్డి, సుబ్బరాజు ఉన్నారు.
Share this article :

0 comments: