ది హిందూ-సీఎన్‌ఎన్ సర్వే ఫలితాలపై ప్రముఖుల విశ్లేషణ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ది హిందూ-సీఎన్‌ఎన్ సర్వే ఫలితాలపై ప్రముఖుల విశ్లేషణ

ది హిందూ-సీఎన్‌ఎన్ సర్వే ఫలితాలపై ప్రముఖుల విశ్లేషణ

Written By news on Thursday, July 25, 2013 | 7/25/2013

వారంతా జగనే సీఎం కావాలంటున్నారు
ది హిందూ-సీఎన్‌ఎన్ సర్వే ఫలితాలపై ప్రముఖుల విశ్లేషణ
రాష్ట్రంలో కాంగ్రెస్‌కు సింగిల్ డిజిటేనన్న వక్తలు
ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ఆషామాషీ కాదని వ్యాఖ్య
బాబును ‘మీడియా డార్లింగ్’గా అభివర్ణించిన వక్తలు!

సాక్షి, హైదరాబాద్: ‘‘కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు, మద్దతుదారుల్లో కూడా ఏకంగా 40 శాతం మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు. జగన్‌పై కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే కక్ష సాధిస్తోందని కూడా వారంతా పూర్తిగా విశ్వసిస్తున్నారు’’ అని ద హిందూ-సీఎన్‌ఎన్ ఐబీఎన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సర్వేపై చర్చలో వక్తలు అభిప్రాయపడ్డారు. సీఎన్‌ఎన్-ఐబీఎన్‌లో జరిగిన ఈ చర్చకు చానల్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాజ్‌దీప్ సర్దేశాయ్ సారథ్యం వహించారు. రాష్ట్ర ప్రజల్లో 25 శాతం మంది జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని భావిస్తున్నట్టు సర్వేలో తేలిన విషయాన్ని ఆయన ప్రస్తావించగా, చర్చలో పాల్గొన్న ప్రొఫెసర్ సందీప్ శాస్త్రి పై విధంగా వ్యాఖ్యానించారు. ఆయనతో పాటు ‘ది హిందూ’ ఆంగ్ల దినపత్రిక మాజీ చీఫ్ ఎడిటర్ ఎన్.రామ్, రూరల్ ఎడిటర్ పాలగుమ్మి సాయినాథ్, చరిత్రకారుడు రామచంద్ర గుహ, సీనియర్ కాలమిస్టు స్వపన్ దాస్‌గుప్తా ఈ చర్చలో పాల్గొన్నారు. 

జగన్‌ను ఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని వారంతా అభిప్రాయపడ్డారు. జగన్ కాంగ్రెస్‌లోకి వస్తే బాగుండునని కూడా ఆ పార్టీలో చాలామంది భావిస్తున్నారని గుహ అన్నారు. ‘‘జగన్ అనుభవలేమి కారణంగా వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయనను సీఎంను చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం నిరాకరించిందంటే కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. కానీ కేసుల పేరుతో ఈ స్థాయిలో వేధించడాన్ని మాత్రం ప్రజలు ఏమాత్రమూ హర్షించడం లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. ఏడాదిన్నర పాటు బెయిలే ఇవ్వకుండా జైలుపాలు చేయడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని గుహ, సాయినాథ్ అభిప్రాయపడ్డారు. జగన్ హవా రాష్ట్రవ్యాప్తంగా ఉందని రామ్ అభిపాయ్రపడ్డారు. ఇటీవలి ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించిన విషయాన్ని విస్మరించలేమన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జగన్ నిర్ణాయక శక్తిగా అవతరించారని రాజ్‌దీప్ అన్నారు. సామదాన భేద దండోపాయాల్లో ఆరితేరిన కాంగ్రెస్, అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఏం చేసేందుకైనా వెనకాడబోదని వక్తలన్నారు.

కాంగ్రెస్‌కు చావుదెబ్బే: ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు 2009లో కంటే 7 శాతం తక్కువగా 32 శాతం ఓట్లు లభిస్తాయన్న సర్వే అంచనాలతో రాజ్‌దీప్ సహా వక్తలంతా విభేదించడం విశేషం! నిజానికి కాంగ్రెస్‌కు ఓట్ల శాతం బాగా తగ్గుతుందని శాస్త్రి అభిప్రాయపడ్డారు. దానితో రాజ్‌దీప్‌తో పాటు వక్తలంతా ఏకీభవించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 11 నుంచి 15 లోక్‌సభ స్థానాలు వస్తాయని సర్వే పేర్కొనగా, ఆ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ అంతకంటే చాలా తక్కువ స్థానాలే వస్తాయని ఎన్.రామ్ అభిప్రాయపడ్డారు. అంతా భావిస్తున్నట్టుగా ఒకవేళ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినా రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగు పడేదేమీ ఉండబోదన్నారు. 

‘ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినంత వరకు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చావుదెబ్బ తినడం ఖాయమే. ఏ పరిస్థితీ దాన్ని మార్చజాలదు’ అని ఆయన జోస్యం చెప్పారు. ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 11 నుంచి 15 లోక్‌సభ సీట్లు రావచ్చని సర్వేలో తేలినట్టు ఆంధ్రప్రదేశ్‌లోని జర్నలిస్టులకు నేను చెబితే వారంతా ఎంతగానో ఆశ్చర్యపోయారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌కు సింగిల్ డిజిట్ దాటదని వారంతా ముక్త కంఠంతో చెప్పారు’’ అని రాజ్‌దీప్ కూడా వివరించారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో సర్వే అంచనాలు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎప్పుడూ తప్పే అవుతుంటాయన్న వాస్తవాన్ని ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలని సాయినాథ్ అన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ను అసలు పరిపాలనే లేని రాష్ట్రంగా అభివర్ణించడం సబబన్నారు! ‘‘కరెంటు చార్జీల అడ్డగోలు పెంపు వంటి పలు ప్రజావ్యతిరేక నిర్ణయాలపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి ఎన్ని వీలైతే అన్ని పథకాలను ప్రవేశపెట్టి ఎంతో కొంత లబ్ధి పొందేందుకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కానీ సమయం బాగా మించిపోయింది’’ అన్నారు. గతేడాది ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సాధించిన ఘన విజయాన్ని తేలిగ్గా తీసుకోజాలమని కూడా సాయినాథ్ అన్నారు. ‘‘మొత్తం ఒక లోక్‌సభ, 17 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగితే వైఎస్సార్‌సీపీ లోక్‌సభతో పాటు 15 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. అందులోనూ ఏడు చోట్ల 30 నుంచి 40 వేల పై చిలుకు మెజారిటీ సాధించింది! ఐదు చోట్ల 20 వేలకు పైగా, రెండింట్లో 15 వేల మెజారిటీతో నెగ్గింది. అసెంబ్లీ స్థానాలకు ఇంతింత మెజారిటీలు సాధించడమంటే ఆషామాషీ కాదు. అత్యంత కీలకమైన విషయమిది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. నెల్లూరు లోక్‌సభ స్థానంలో సుబ్బరామిరెడ్డి వంటి అత్యంత ధనవంతుణ్ని కాంగ్రెస్ ఏరి కోరి పోటీకి దింపినా అక్కడ కూడా వైఎస్సార్‌సీపీ ఏకంగా 1.5 లక్షల పై చిలుకు ఓట్ల మెజారిటీ (వాస్తవ మెజారిటీ 2.91 లక్షలు) సాధించడమంటే ఆషామాషీ కాదన్నారు. ఆ అభిప్రాయంతో రాజ్‌దీప్ కూడా ఏకీభవించారు. పైగా ఆ ఉప ఎన్నికల్లో సుబ్బరామిరెడ్డి ఏకంగా రూ.80 కోట్ల నుంచి రూ.90 కోట్ల దాకా ఖర్చు చేసినట్టు అంతా చెప్పుకున్నారని ఆయన గుర్తు చేశారు.

రాష్ట్రంలో పాలనే లేదు: అన్ని విషయాల్లోనూ ఘోరంగా విఫలం కావడంలో రాష్ర్టంలో కాంగ్రెస్ పాలన అచ్చం కేంద్రంలో సాగుతున్న యూపీఏ-2 పాలనకు నకలుగా ఉందని రాజ్‌దీప్ విశ్లేషించారు. రాష్ట్రంలో ‘అత్యంత బలహీనమైన నాయకత్వం, అతి పేలవమైన పాలన’ సాగుతున్నాయన్నారు. పైగా ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర ప్రజలపై రుద్దిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇలాంటి వాటిని తెలుగు ప్రజలు అంగీకరించరని చరిత్ర చెబుతోందని, దీనికి తమ ఓటు ద్వారా వారు తగిన విధంగా బదులిస్తారని వక్తలన్నారు. ఎన్నికల లబ్ధి తదితర కారణాలతో రాష్ట్రాలను విభజించబూనడం ప్రమాదకర పరిణామమని అభిప్రాయపడ్డారు. ఇక టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ‘మీడియా డార్లింగ్’గా వక్తలంతా ముక్తకంఠంతో అభివర్ణించడం విశేషం! 2004 ఎన్నికల సందర్భంగా ఎటు చూసినా బాబు నామస్మరణే కన్పించిందంటే, మీడియా సృష్టించిన హైపే అందుకు కారణమని వారన్నారు. ‘‘తానే కింగ్‌మేకర్‌నని చెప్పుకున్న బాబు సామాన్యులను పట్టించుకోలేదు. హైటెక్ తరహాలో, సీఈవో మాదిరిగా పరిపాలించారు. అన్నదాత గోడును విస్మరించారు. ఇవన్నీ ఆయన కొంప ముంచాయి’’ అన్నారు.
Share this article :

0 comments: