ప్లీనరీ తీర్మానానికి లోబడే పార్టీ వైఖరి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్లీనరీ తీర్మానానికి లోబడే పార్టీ వైఖరి

ప్లీనరీ తీర్మానానికి లోబడే పార్టీ వైఖరి

Written By news on Saturday, July 27, 2013 | 7/27/2013

సీమాంధ్ర నేతల రాజీనామాల నేపథ్యంలో తెలంగాణ నేతలతో భేటీ
ప్లీనరీ నిర్ణయానికి కట్టుబడాలన్న కొండా సురేఖ
పదవులకంటే తెలంగాణే తమకు ముఖ్యమని ప్రకటన

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విషయంలో ప్లీనరీలో ప్రకటించిన విధానమే పార్టీ విధానమని వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ స్పష్టం చేశారు. ఆమె శుక్రవారం సాయంత్రం పార్టీ తెలంగాణ నేతలతో తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాలు, కేంద్రంలో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. విభజన విషయంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగానే పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశామన్నారని ఈ సందర్భంగా విజయమ్మ సమావేశంలో వివరించారు. సమావేశంలో పార్టీ ముఖ్య నేతలు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కొండా సురేఖ, కొండా మురళి, ఏ.ఇంద్రకరణ్‌రెడ్డి, కె.కె.మహేందర్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాష్, జిట్టా బాలకృష్ణారెడ్డి, బి.జనక్ ప్రసాద్, ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, ఎం.వి.మైసూరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తాజా పరిణామాలపై శనివారం మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. మహేందర్‌రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డిలు ఉదయం కూడా విజయమ్మతో సమావేశమయ్యారు. అనంతరం మహేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ప్లీనరీ తీర్మానానికి లోబడే పార్టీ వైఖరి ఉంటుందని తమకు గౌరవాధ్యక్షురాలు స్పష్టం చేశారని చెప్పారు. గురువారం నాటి పరిణామాలతో తాము కొంత కలత చెందిన మాట వాస్తవమేనని అయితే పార్టీలో అందరూ చర్చించి ఒక తాటిపైనే వెళ్లాలనేది తమ అభిమతమని తెలిపారు. విజయమ్మను కలిసి తమ బాధను వివరించామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారి ప్రాంత ప్రజల మనోభావాలను బట్టి ఏదైనా మాట్లాడి ఉండవచ్చని, తాము కూడా పలుమార్లు తమ ప్రాంతంలోని మనోభావాలకు అనుగుణంగా మాట్లాడామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజీనామాల తరువాత ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సి ఉందని, తాము తొందరపడటం లేదని మరో ప్రశ్నకు బదులిచ్చారు.

ప్లీనరీ నిర్ణయానికి కట్టుబడాలి: కొండా సురేఖ

వరంగల్: తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరే తరుణంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడం తనకు మనస్తాపం కలిగించిందని మాజీ మంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రాజీనామాలు వ్యక్తిగతమా... పార్టీ నిర్ణయమా అనేది స్పష్టం చేయాలన్నారు. ఆమె శుక్రవారం సాయంత్రం పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మతో సమావేశమయ్యారు. అంతకుముందు ఉదయం హన్మకొండలో విలేకరుల సమావేశంలో సురేఖ మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల రాజీనామాలతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ప్లీనరీలో తీసుకున్న తీర్మానాలకు విరుద్ధంగా సీమాంధ్ర ఎమ్మెల్యేలు ప్రవర్తించడం సరికాదన్నారు. ఉప ఎన్నికల ప్రచారానికి వరంగల్ వచ్చిన సందర్భంలోనూ విజయమ్మ కేంద్రం తెలంగాణ ఇస్తే అడ్డుకోమని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. గందరగోళ పరిస్థితిని తొలగించేందుకు రాజీనామాలపై నేతలు పునరాలోచించాలని, వ్యక్తిగత నిర్ణయమైతే స్పష్టమైన వివరణ ఇవ్వాలని సూచించారు. తాను, తన భర్త కొండా మురళి తెలంగాణ కోసం రాజీనామా చేయడంతో పాటు, పార్టీ కోసం మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులు త్యాగం చేశామని చెప్పారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నందుకే పరకాల నియోజకవర్గ ప్రజలు తనను ఆదరించారని, వైఎస్సార్‌సీపీ కూడా అందుకు అనుకూలమని ప్రజలు నమ్మినందుకే ఉప ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతోనే ఓడిపోయినట్లు చెప్పారు. కేంద్రం తెలంగాణ ఇవ్వాలని.. ఇచ్చి తీరాలని కోరుకునే వారిలో కొండా దంపతులు ముందు వరుసలో ఉంటారన్నారు. రాజకీయ వ్యక్తిగత పదవీ ప్రయోజనాల కంటే తమకు తెలంగాణ ప్రజల ఆకాంక్ష ముఖ్యమని సురేఖ స్పష్టం చేశారు. తెలంగాణకు అడ్డుపడే ఏ శక్తులనైనా ఇంటా.. బయటా ఎక్కడైనా సహించేది లేదని ఆమె తేల్చి చెప్పారు. 
Share this article :

0 comments: