బొత్స నాయకత్వం చెబుతుంది కాంగ్రెస్ వాదమేమిటో - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బొత్స నాయకత్వం చెబుతుంది కాంగ్రెస్ వాదమేమిటో

బొత్స నాయకత్వం చెబుతుంది కాంగ్రెస్ వాదమేమిటో

Written By news on Thursday, July 18, 2013 | 7/18/2013

మరో ప్రజాప్రస్థానం 18-07-2013బొబ్బిలి 18 జూలై 2013: దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తన ఐదేళ్ళ పాలనలో కుల,మతాలకు అతీతంగా ఆలోచించి అద్భుతమైన పథకాలను రూపొందించారని శ్రీమతి వైయస్ షర్మిల పేర్కొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో గురువారం సాయంత్రం ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, విజయనగరం జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న బొత్స కుటుంబంపై ఆమె నిప్పులు చెరిగారు. ఆమె ప్రసంగం ఆమె మాటల్లోనే.. 
ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓటెయ్యాలి? ఒక్క పింఛనూ ఇవ్వనందుకు ఓటెయ్యాలా.. ఫీజు రీయింబర్సుమెంటును నీరుగార్చినందుకు ఓటేయాలా? ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసినందుకు ఓటేయాలా? రైతుకు ఉచిత విద్యుత్తును సక్రమంగా ఇవ్వనందుకు ఓటేయాలా అని అడుగుతున్నాం. తొమ్మిది గంటలు ఉచిత విద్యుత్తు ఇస్తాననీ, 30 కిలోల బియ్యం ఇస్తాననీ మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసి ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. పోలవరం లాంటి ప్రాజెక్టును గాలికొదిలేసినందుకు ఓటేయాలా అని అడుగుతున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని ఏ మొహం పెట్టుకుని అడుగుతున్నారు. వ్యవసాయం, పరిశ్రమలు కుదేలయిపోయాయి. 

ఈ రాజ్యంలో మద్యం ఏరులై పారుతోంది. నా పాదయాత్రలో ఓ చిన్నారి నాతో కలిసి నాలుగడుగులు వేయాలని వచ్చాడు. బాబు ఎందుకు చెప్పులు వేసుకోలేదు అని అడిగాను. డబ్బులు లేవనీ, అమ్మ,నాన్న  కూలీ చేసి డబ్బు సంపాదిస్తారనీ, నాన్న తన తల్లిని కొట్టి తాగేసి వస్తాడనీ, అమ్మను,మమ్మల్ని కొడతాడనీ చెప్పాడన్నారు. ఇది నాకు ఓ లక్షసార్లు గుర్తొచ్చి ఉంటుంది. మన నాయకులు ఎలాంటి వారో ఒకసారి గమనించండి. 

ఈ జిల్లాకు చెందిన మంత్రి బొత్సగారు. మన రాష్ట్రంలోనే ఆయన అతి పెద్ద మాఫియా డాన్. మద్యం వ్యాపారంలో ఆయనను మించిన వారు లేరని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మహాత్మా గాంధీ ఆదర్శమని చెప్పుకుంటూ ఓ మద్యం మాఫియా డాన్ ని పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకోవడంతోనే ఈ కాంగ్రెస్  అనుసరించేది గాంధేయవాదమో, బ్రాందేయవాదమో తేలిపోయింది. బొత్స గారికి మద్యం వ్యాపారం మీద ఉన్న శ్రద్ధలో పదో వంతును జిల్లాపై పెట్టుంటే ఎంతో బాగుపడేది ఉండేది. బొత్స గారికి మద్యం మాఫియా నుంచి మామూలు మాఫియా వరకూ సంబంధం ఉందని ఈ జిల్లా ప్రజలే చెబుతున్నారు. ప్రభుత్వమున్నది ప్రజల కోసమా బొత్స గారిలాంటి వారికోసమా అని ఈ ప్రజలే ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నాయకులున్న కాంగ్రెస్ ప్రతి విషయంలో విఫలమైంది. ఎవ్వరికీ నమ్మకం లేదు. కానీ ఒక వ్యక్తి.. చంద్రబాబుకు ఈ కాంగ్రెస్ మీద నమ్మకముంది.  మైనారిటీలో ఉన్న ఈ ప్రభుత్వం చంద్రబాబు వల్లే అధికారంలో ఉంది. చంద్రబాబు ఏ ఒక్క వాగ్దానమూ నిలబెట్టుకోలేదు. ఇప్పుడు మళ్ళీ బాలికపుడితే రెండు లక్షలిస్తాననీ, అంటూ వాగ్దానాలిస్తారన్నారు. చంద్రబాబు అధికారంలో  ఉన్నా పనిచేయరు, లేకున్నా పనిచేయరన్నారు. ఆయనపై విచారణ జరగకుండా చీకటి ఒప్పందాలు చేసుకుని కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారు. ఇక్కడి సుజయ కృష్ణ రంగారావులాంటి 15మంది ప్రజల పక్షాన నిలబడి అవిశ్వాసానికి మద్దతుగా ఓటేస్తే... ఇక ఎన్నికలు రావని నిర్ధారించుకన్న తరవాతవారిపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. అప్పుడే అనర్హత వేటు వేస్తే ఎన్నికలొచ్చి ఏం జరుగుతుందో ప్రభుత్వానికి తెలుసు. మొత్తం వైయస్ఆర్ కాంగ్రెస్ గెలుచుకుంటుందనే ఇలా చేశారు. వీరిని నాయకులంటారా.. పిరికిపందాలంటారా. విలువలతో కూడిన రాజకీయాలు చేసే ధైర్యం లేదు.. ఈ కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు. ఈ రాష్ట్రంలో తమ రెండు పార్టీలే ఉండాలని కుట్రలు పన్ని జగనన్నను జైలు పాలుచేశారు. 

ప్రతి ఎకరాకు నీరివ్వాలని రాజన్న జలయజ్ఞం తలపెట్టారు. ప్రతి రైతుకు ఉచిత విద్యుత్తు ఇచ్చారు.. సాగునీరిచ్చారు. మద్దతు ధర ఇచ్చారు.  ప్రతి క్షణం ప్రజల గురించే ఆలోచించారు. అవే అద్భుత పథకాలయ్యాయి. ఆ పథకాలను చిత్తశుద్ధితో అద్భుతంగా అమలు చేసి చూపారు. లక్ష కోట్లతో 86 సాగు ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టారు. రైతులకు ప్రోత్సాహమిచ్చారు. నీళ్ళిచ్చారు, కరెంటు ఇచ్చారు., సబ్సిడీ ఇచ్చారు. వడ్డీ మాఫీ చేశారు. విద్యుత్తు బకాయిలు కూడా మాఫీ చేసిన ఘనత డాక్టర్ రాజశేఖర రెడ్డిగారిది.

రైతులకి, మహిళలకి పావలా వడ్డీకే రుణాలిచ్చారు. బ్యాంకుకు వెళ్ళని మహిళలు కూడా వెళ్లి రుణాలు తీసుకున్నారు. పేదరికం ఊబిలోంచి బయటకు రావాలని మహానేత విద్యార్థులకోసం ఫీజు రీయింబర్సుమెంటు పెట్టారు. భరోసా కల్పించారు. లక్షలమంది గొప్ప చదువులు చదివి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఆరోగ్యశ్రీ.. పెట్టారు. లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందించారు.  ఐదేళ్ళలో 47 లక్షల ఇళ్ళు కట్టారు. ఇప్పడుండి ఉంటే రెండో టెర్ములో మరో 50 లక్షల ఇళ్ళు కట్టించి ఉండే వారు. 
చంద్రబాబు తన హయాంలో 16 లక్షల మందికి పింఛన్లిస్తే రాజన్న 70 లక్షల మందికి పింఛన్లు అందించారు.  ఆయన తన పాలనలో ఒక్క చార్జీ పెంచలేదు. గ్యాస్ ధర 305 దాటలేదు. ఆర్టీసీ చార్జీ పెరగలేదు. ఒక్క రూపాయి కరెంటు చార్జీలు పెంచారని ప్రతిపక్షాలు కూడా అనలేదు. పేదవారిపై భార పడకూడదనుకుని రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు. రాజన్న ఓ కుటుంబానికి  తండ్రిలా ప్రజల గురించి ఆలోచించారు. కుల, మతాలకు అతీతంగా ఆలోచించారు. ఆయన వెళ్ళిపోయినతర్వాత.. దుర్మార్గ ప్రభుత్వం.. రాక్షస రాజ్యం తయారయ్యాయి. 

ఈ సర్కారు రాజన్న పథకాలకు తూట్లు పొడిచింది. జలయజ్ఞాన్ని అటకెక్కించింది. మూడు గంటలు కూడా కరెంటు ఇవ్వడంలేదు. ఉన్న పింఛన్లు తీసేస్తోంది. పరిస్థితి చూస్తుంటే కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి. అభయహస్తాన్ని తొలగించింది. రాజన్న హామీలను పట్టించుకోవడంలేదు ఈ సర్కారు. 

గుంటనక్కలు ఈలలు వేసినట్లు
ప్రతిపక్షాలు అవిశ్వాసం పెడితే చంద్రబాబు ప్రభుత్వ పక్షాన నిలబడి విప్ జారీ చేసి కాపాడారు. అసమ్మతి ఎమ్మెల్యేలను కలుపుకుంటే కాంగ్రెస్ బలం 146 మాత్రమే. మైనారిటీ ప్రభుత్వానికి  చంద్రబాబు వత్తాసు పలుకుతున్నారు. అవిశ్వాసానికి బాబు మద్దతిచ్చి ఉంటే ప్రభుత్వం కూలిపోయేది. ఈ కష్టాలు ఉండేవి కావు. రాబందులు రాజ్యమేలుతుంటే.. గుంట నక్కలు ఈలలు వేసినట్లు కిరణ్ ప్రభుత్వ చేష్టలకు చంద్రబాబు చప్పట్లు కొడుతున్నారు.

చంద్రబాబు హయాంలో పేదలు అల్లాడారు. వారిని పురుగుల్లా చూశారు. జీవనోపాధి లేక ప్రజలు వలసలు వెళ్ళారు. ఆయన నిర్లక్ష్యం వల్ల వ్యవసాయం కుదేలైంది. ఎనిమిది సార్లు కరెంటు చార్జీలు పెంచారు. బిల్లులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు చంద్రబాబు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదు. రాజన్న వారి కుటుంబాలకు పరిహారం అందించారు.
విలువలకూ విశ్వసనీయతకూ మారుపేరు జగన్
బాబు నిర్దోషని ఏ కోర్టూ చెప్పలేదు. చిరంజీవి నిర్దోషని ఏ కోర్టూ చెప్పలేదు. బొత్స ఉత్తముడని ఏ కోర్టూ చెప్పలేదు. చంద్రబాబుకు చావు తెలివి తేటలు ఎక్కువ కనుక విచారణ జరగకుండా చూసుకున్నారు.  2014లో ముఖ్యమంత్రవుతానని జగనన్నకు తెలుసు. పార్టీని వీడితే కష్టాలొస్తాయనీ తెలుసు.. విలువలకూ, విశ్వసనీయతకూ మారుపేరు జగన్. దేవుడి మీద నమ్మకంతో ముందడుగు వేశారు. ఇవేవీ కాంగ్రెస్, టీడీపీలకు లేవు. అంత దమ్మూ, ధైర్యం లేదు. దుర్మార్గులంతా ఒక్కటయ్యి.. జగన్ ను జైలు పాలు చేశారు. బోనులో ఉన్నా సింహ సింహమే.. ఉదయించే సూర్యుణ్ణి ఎవరూ ఆపలేరు. 

జగనన్న ఏ తప్పు చేయలేదు.. ఆయన తప్పకుండా బయటకొస్తారు.. ముఖ్యమంత్రి అవుతారు.. రాబోయే రాజన్న రాజ్యంలో అందరి కష్టాలూ తీరతాయని శ్రీమతి షర్మిల చెప్పారు. జగనన్న ముఖ్యమంత్రయిన తర్వాత పరిస్థితులు చక్కబడతాయన్నారు. మాట ఇచ్చారంటే ప్రాణం పోయినా నిలుపుకుంటారని తెలిపారు. మహిళలకు, రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తారని స్పష్టంచేశారు. రోడ్ల సమస్య, కరెంటు సమస్యలాంటివి ఉండవన్నారు. అమ్మ ఒడి పధకం కింద ప్రతి నెలా అమ్మ బ్యాంకు ఖాతాలో సొమ్ము జమవుతుందనీ వాటితో పిల్లలను చదివించుకోవచ్చనీ వివరించారు. పింఛన్లు పెరుగుతాయి.. బియ్యం 30 కిలోలు ఇస్తారు.. బెల్టు షాపులుండవు.. నియోజకవర్గానికి ఒకే ఒక మద్యం దుకాణం ఉంటుందని తెలిపారు. రానున్న ఏ ఎన్నికలోనైనా మీరంతా కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధిచెప్పాలనీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనీ కోరారు. అందరూ జగన్మోహన్ రెడ్డిగారినీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని శ్రీమతి షర్మిల ప్రజలను కోరారు.
Share this article :

0 comments: