మళ్లీ చెబుతున్నా.. మేమే నంబర్ వన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మళ్లీ చెబుతున్నా.. మేమే నంబర్ వన్

మళ్లీ చెబుతున్నా.. మేమే నంబర్ వన్

Written By news on Thursday, July 25, 2013 | 7/25/2013

ఎప్పుడు, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి మా జాబితాను ప్రకటిస్తాం
గ్రామాల్లో వైఎస్సార్ సీపీకి కేడర్ లేదన్న వారికి ఈ ఫలితాలే సమాధానం
అనేక చోట్ల అధికార, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కయ్యాయి
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిపి ఉంటే ఏ పార్టీకి ఎన్ని స్థానాలు
వచ్చేవో రాష్ట్ర ఎన్నికల సంఘమే ప్రకటించి ఉండేది
స్థానిక సంస్థలను నీరుగార్చింది చంద్రబాబే
స్థానిక సంస్థలకు పది అంశాల్లో అధికారాలను బదిలీ చేసింది వైఎస్సే


సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్సే నంబర్ వన్ స్థానంలో ఉందని, ఈ విషయంలో ఎక్కడకు రమ్మంటే అక్కడకు వచ్చి ఎన్నికైన తమ పార్టీ మద్దతుదారుల జాబితాను విడుదల చేస్తామని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి చెప్పారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘మంగళవారం ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లోనూ ఏకగ్రీవాల్లోనూ మేమే నంబర్ వన్‌గా నిలిచాం. మా పార్టీ మద్దతుదారులు గెలిచి అగ్రస్థానంలో ఉన్నారని మళ్లీ నొక్కి వక్కాణిస్తున్నాను. మా పార్టీ వ్యవస్థ ద్వారా సేకరించిన కచ్చితమైన వివరాల ఆధారంగా నేనీమాట చెబుతున్నాను’’ అని స్పష్టంచేశారు. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ ఓ వైపు, 30 ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీ మరో వైపు మోహరించాయి. 

కేవలం రెండేళ్ల కిందట పుట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగి ఇంత పోటాపోటీగా సర్పంచ్ స్థానాలను గెల్చుకోవడం గొప్ప విశేషం అని చెప్పారు. ‘‘గ్రామాల్లో మా పార్టీకి కేడర్ లేదని, నామరూపాలు లేకుండా పోతుందని శాపనార్థాలు పెట్టారు. అలాంటి వారికి ఈ ఎన్నికల ఫలితాలే ఓ జవాబు. వారి శాపాలన్నీ మా పార్టీ సాధించిన ఫలితాల్లో కొట్టుకుపోయాయి’’ అని చెప్పారు. పంచాయతీ తొలి విడత ఎన్నికల ఫలితాలు తమ పార్టీకి పూర్తి సంతృప్తి నిచ్చాయని తెలిపారు. గెలుపొందిన వారి జాబితాలను ప్రకటించాలని వస్తున్న సవాళ్లపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ.. ‘‘తేదీ, సమయం, స్థలం చెబితే మేము అక్కడకు వచ్చి మా పార్టీ మద్దతుదారులైన సర్పంచ్‌ల జాబితాను సవివరంగా ప్రకటిస్తాం. ఇతర పార్టీల వారు కూడా వారి జాబితాను ప్రకటించడానికి సిద్ధపడాలి’’ అని స్పష్టంచేశారు. ఈ ఎన్నికలు స్థానిక అంశాలు, వ్యక్తుల మధ్య జరిగినవి కనుక పూర్తిగా స్థానిక నాయకులకే తాము వదిలేశామని, వారే పోరాడారని తెలిపారు. ఇతర పార్టీలు ఈ ఎన్నికల్లో మద్యం, డబ్బు యథేచ్ఛగా పంచాయని చెప్పారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు అనేక చోట్ల కుమ్మక్కై జిమ్మిక్కులకు పాల్పడ్డాయని తెలిపారు. 

పార్టీ రహితంగా జరిగిన ఈ ఎన్నికలపై సవాళ్లు, ప్రతిసవాళ్లు సరికాదని, వెనుక జరగాల్సిన సర్పంచ్ ఎన్నికలు కాకుండా, ముందుగా జరగాల్సిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిపి ఉంటే ఎవరికి ఎన్ని స్థానాలు వచ్చేవో రాష్ట్ర ఎన్నికల సంఘమే ప్రకటించి ఉండేదని అన్నారు. కాంగ్రెస్, టీడీపీలు దొంగచాటుగా మాట్లాడుకుని ఈ ఎన్నికలు గాని, ఉప ఎన్నికలు గాని జరపకుండా చేశాయన్నారు. స్థానిక సంస్థలను తాను బలోపేతం చేస్తే వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్వీర్యం చేసినట్లుగా టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు చెప్పుకోవడం హాస్యాస్పదమని మైసూరా అన్నారు. వాటిని నీరుగార్చింది చంద్రబాబేనని చెప్పారు. వాస్తవానికి స్థానిక సంస్థలను బలోపేతం చేసింది వైఎస్ రాజశేఖరరెడ్డేనని, 73వ రాజ్యాంగ సవరణలోని 9వ షెడ్యూలులో ఉన్న పది అంశాలను 2007-08 మధ్య కాలంలోనే స్థానిక సంస్థలకు అప్పగించారని తెలిపారు. అవి ఇప్పుడు అమలవుతున్నాయో లేదో చూసుకుని ఇప్పటి ప్రభుత్వాన్ని విమర్శించాల్సింది పోయి వైఎస్‌ను విమర్శించడం సమంజసం కాదన్నారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే మొట్టమొదట నీరుగార్చేది స్థానిక సంస్థలనే అని మైసూరా చెప్పారు.

ఆ సర్వే వాస్తవాలను ప్రతిబింబించలేదు: రాష్ట్ర రాజకీయ పరిస్థితిపై ‘సీఎన్‌ఎన్ ఐబీఎన్-ది హిందూ’ నిర్వహించిన సర్వే వాస్తవాలను ప్రతిబింబించలేదని, పరస్పర వైరుధ్యాలతో కూడుకుని ఉన్నదని మైసూరారెడ్డి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సర్వేపై టీవీలో చర్చలో పాల్గొన్న వారే అది వాస్తవంగా ఉందనుకోలేమన్నారని తెలిపారు. చర్చలో పాల్గొన్న ఓ ప్రముఖ రిటైర్డు ఎడిటర్ కూడా వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో ప్రధాన శక్తిగా ఉంటారని చెప్పారన్నారు. అయినా పది కోట్ల మంది ప్రజల్లో 1,680 మంది నుంచి మాత్రమే సమాచారాన్ని సేకరించారని, దీన్నిబట్టే శాంపిల్స్ తక్కువనే విషయం వెల్లడవుతోందని అన్నారు. కాంగ్రెస్‌కు రాష్ట్రంలో పరపతి పోయిందని, ఓట్ల శాతం బాగా పడిపోయిందని ఓవైపు చెబుతూనే.., మరోవైపు గణనీయమైన సంఖ్యలో లోక్‌సభ సీట్లు వస్తాయని చెప్పడం విరుద్ధంగా ఉందన్నారు. వారే జగన్ ప్రధాన శక్తిగా ఉన్నారని కూడా చెప్పారన్నారు. అందుకే ఈ సర్వేలో వాస్తవాలు ప్రతిబింబించడంలేదని అంటున్నానని, అసలు అలాంటి సర్వే గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదని మైసూరా అన్నారు.

ఉప ఎన్నికలు నిర్వహిస్తే తెలుస్తుంది
సర్వేలకన్నా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలుగానీ, ఖాళీగా ఉన్న ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలుగాని నిర్వహిస్తే ఎవరి బలం ఏమిటో తెలిసిపోతుందని మైసూరా మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాజకీయంగా ప్రజల మనోభావాలు తెలుసుకోవాలంటే సవాళ్లు, ప్రతి సవాళ్లు అవసరమే లేదని, ఉప ఎన్నికలు జరిపితే చాలని, ఈ సవాలును ఇతర పార్టీల వారు స్వీకరిస్తారా అని అన్నారు. 

అవనిగడ్డపై అడిగితే పరిశీలిస్తాం

అవనిగడ్డ శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నికలో మద్దతివ్వాలని దివంగత అంబటి బ్రాహ్మణయ్య కుటుంబీకులు వచ్చి అడిగితే వారి విజ్ఞప్తిని తమ పార్టీ పరిశీలిస్తుందని, అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముందు ఈ విషయాన్ని ఉంచుతామని మైసూరా ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వారు అడగకపోతే అని ప్రశ్నించగా.. ‘ఏముంది.. పోటీ చేస్తాం’ అని బదులిచ్చారు.
Share this article :

0 comments: