బాబు గురించి మాట్లాడవేం ఉండవల్లీ ? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు గురించి మాట్లాడవేం ఉండవల్లీ ?

బాబు గురించి మాట్లాడవేం ఉండవల్లీ ?

Written By news on Saturday, July 13, 2013 | 7/13/2013

 మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో షర్మిల ధ్వజం
- ఎంపీగా గెలుస్తానని ఉండవల్లికే నమ్మకం లేదు.. కానీ, వైఎస్సార్ ఆయన్ని రెండుసార్లు ఎంపీని చేశారు
- ఇప్పుడు అదే ఉండవల్లి వైఎస్సార్‌పై క్విడ్‌ప్రోకో ఆరోపణలు చేస్తున్నారు
- జగన్‌పై విషంగక్కి.. బాబు గురించి ఒక్కమాటా మాట్లాడలేదు
- వైఎస్సార్ పథకాలకు తూట్లు పొడుస్తున్న కిరణ్‌నూ విమర్శించలేదు
- బొత్స కుటుంబానికి వైఎస్సార్ ఎంత మేలు చేశారో అందరికీ తెలుసు.. అయినా వైఎస్‌పై బొత్సకు కృతజ్ఞత లేదు
- విలువలు, విశ్వాసం, విశ్వసనీయత లేకపోతే మనిషికి, మృగానికి తేడా లేదు 

(మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి) : ‘బొత్సగారి కుటుంబానికి వైఎస్సార్ ఎంత మేలు చేశారో, ఆయన కుటుంబానికి ఎన్ని పదవులు ఇచ్చారో మీ అందరికీ తెలుసు. కానీ సత్తిబాబు గారికి ఆ కృతజ్ఞత లేదు. రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ గారికైతే ఎంపీగా గెలుస్తారని ఆయనకే నమ్మకం లేదు. కానీ, ఉండవల్లి గారిని వైఎస్సార్ ఒకసారి కాదు, రెండుసార్లు ఎంపీగా చేశారు. ఇప్పుడు ఆయన జగన్‌మోహన్‌రెడ్డి మీద విషం కక్కుతున్నారు. మనిషి అన్న తరువాత కృతజ్ఞత ఉండాలి. విలువలు, విశ్వాసం, విశ్వనీయత ఉండాలి. ఇవి లేకపోతే మనిషికి, మృగానికి తేడా లేదు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఘాటుగా విమర్శించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబునాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం విజయనగరం నియోజకవర్గంలో సాగింది. జిల్లా కేంద్రంలోని మూడు లాంతర్ల సెంటర్లో భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలనుద్దేశించి షర్మిల మాట్లాడారు. ఈ ప్రసంగం సారాంశం ఆమె మాటల్లోనే...

మొన్న ఉండవల్లి అరుణ్‌కుమార్‌గారు రాజమండ్రిలో ఒక సభ పెట్టారు. జగన్‌మోహన్‌రెడ్డిగారిని ఇష్టమొచ్చినట్లు విమర్శించారు. వైఎస్సార్, జగనన్న క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. కానీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుగారి గురించి మాట్లాడలేదు. ఆయన మీద ఏ విమర్శా చేయలేదు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన మంచి పథకాలకు తూట్లు పొడుస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డిగారి మీద కూడా ఎంపీ హోదాలో ఈ ఉండవల్లి అరుణ్‌కుమార్‌గారు ఏ విమర్శలూ చేయలేదు. అలాగే సీబీఐ కాంగ్రెస్ పెరట్లో కుక్క అని, కాంగ్రెస్ పంజరంలో చిలుక అని మన దేశంలోనే బొగ్గు కుంభకోణం కేసుతో సహా మొన్న రైల్వేమంత్రి బన్సల్‌గారి కేసు వరకు రుజువైన విషయాలను కూడా ఉండవల్లిగారు ప్రస్తావించలేదు. కానీ, జగన్‌మోహన్‌రెడ్డిగారి మీద మాత్రం విషంగక్కారు. మిగతా వాళ్లను ఎందుకు విమర్శించలేదు ఉండవల్లిగారూ అని అడిగితే.. ‘నా పక్కన ఉన్నాయనకు ట్రైన్ టైం అయిపోయింది. అందుకే బాబును విమర్శించలేదు. నా కింద కూర్చున్నాయనకు చాయ్ టైం అయింది. అందుకే టీడీపీని విమర్శించలేదు’ అంటూ సమాధానం చెప్పారు. రెండుసార్లు ఎంపీగా గెలిపించిన వైఎస్సార్‌పై ఉండవల్లిగారికి కృతజ్ఞత లేదు. వైఎస్సార్ పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేరుస్తుంటే కళ్లప్పగించి చూశారు. ఈ రోజేమో వైఎస్సార్ క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారని ఆరోపణలు చేస్తున్నారు.

రాజశేఖరరెడ్డిగారు, జగన్‌మోహన్‌రెడ్డిగారు అవినీతికి పాల్పడ్డారు కాబట్టే సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది అని బొత్సగారు అంటున్నారు. నిజానికి జగన్‌మోహన్‌రెడ్డిగారు దోషిగా ఈరోజు జైల్లో లేరు. కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్న సీబీఐ అనే కీలుబొమ్మ.. జగన్‌మోహన్‌రెడ్డి బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారంటూ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే, విచారణ జరపడానికి ఇంకా సమయం కావాలని ఆ సంస్థ అడిగితే కోర్టు సమయం ఇచ్చింది. అంతే. జగనన్న మీద ఇంకా ట్రయలే మొదలుకాలేదు. ట్రయల్ కూడా ప్రారంభం కాకపోతే ఏ కోర్టైనా జగన్‌మోహన్‌రెడ్డి గారిని ఎలా దోషి అంటుందనే ఇంగితం కూడా మీకు లేదా బొత్సగారూ అని అడుగుతున్నాం. జగన్‌మోహన్‌రెడ్డి గారి మీద ఆరోపణలు చేస్తూ కేసులు వేసింది ప్రజలు కాదు. మీ పార్టీకే చెందిన శంకర్‌రావు అనే వ్యక్తి. ఆ తరువాతే ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇది క్విడ్ ప్రోకో కాదా బొత్సగారూ అని అడుగుతున్నాం. 

బొత్సగారు మన రాష్ట్రంలోనే పెద్ద లిక్కర్ మాఫియా డాన్ అని, రాష్ట్రమంతటా ఆయన బినామీలే మద్యం వ్యాపారం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ వాళ్లే ఆరోపిస్తున్నారు. వైఎస్సార్ హయాంలో ఇలాంటి ఆరోపణలు వస్తే ఆయనే స్వయంగా విచారణకు ఆదేశించుకునేవారు. ఈ బొత్సగారు ఆయనపై వస్తున్న ఆరోపణలకు విచారణ వేసుకోవడంలేదు. పైగా, సీఎంతో బేరాలు చేసుకొని, విచారణ చేస్తున్న అధికారులను బదిలీ చేయించిన చరిత్ర బొత్సగారిది. వైఎస్సార్ మన రాష్ర్టంలో ప్రతి ఒక్కరికీ మేలు చేశారు. వైఎస్సార్ ఎంత మంచి వారో, బొత్సగారి కుటుంబానికి ఎంత మేలు చేశారో, ఆయనకు గుర్తులేకపోతే ఆయన కుటుంబంలోనే పదవులు అనుభవిస్తున్న ఆయన భార్య గారిని, తమ్ముడిని, బావమరిదిని అడిగితే చెప్తారు.

మన ఖర్మకొద్దీ ఇలాంటి నాయకులు ఉన్నారు. వారి చేతిలో ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వంతో కుమ్మక్కైన ఇంకో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు ఒకప్పుడు సొంత మామకు వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం సాక్షిగా ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. అన్ని పార్టీలు అవిశ్వాసం పెడితే చంద్రబాబుగారు రెండు చేతులూ అడ్డంపెట్టి కాపాడారు. ప్రభుత్వం అధికారంలో ఉండాలంటే కనీసం 148 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. ఈ కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారుకు ఉన్న ఎమ్మెల్యేల బలం కేవలం 146 మంది మాత్రమే. మైనార్టీలో ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఎలా ఉంది? ఎవరి మద్దతుతో కొనసాగుతోంది? చంద్రబాబుగారి మద్దతుతో కాదా? ప్రజలు చాలా తెలివైన వారు, అన్నీ గమనిస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడు జగనన్నను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు.

13.1 కిలోమీటర్లు నడిచిన షర్మిల
శుక్రవారం 207వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలోని రామవరం గ్రామం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి కారక వలస, అయ్యన్నపాలెం మీదుగా విజయనగరం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. మూడు లాంతర్ల సెంటర్లో భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడి నుంచి కొత్తపేట మీదుగా పూల్‌బాగ్ సెంటర్ సమీపంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8.15 గంటలకు చేరుకున్నారు. మొత్తం 13.1 కిలోమీటర్లు నడిచారు. షర్మిల వెంట విజయనగరం జిల్లా పార్టీ కన్వీనర్, మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు, తాజా మాజీ ఎమ్మెల్యేలు సుజయ్ కృష్ణ రంగారావు, విజయనగరం సమన్వయకర్తలు అవినాపు విజయ్, గురాన అయ్యలు, గజపతినగరం సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, స్థానిక నాయకులు కాళ్ల గౌరీశంకర్, పెన్మత్స వీవీ సూర్యనారాయణరాజు, కొయ్య ప్రసాదరెడ్డి, గుంటిరెడ్డి రమాదేవి తదితరులు ఉన్నారు.
Share this article :

0 comments: