ప్రజా తీర్పు వినే దమ్మేదీ!! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రజా తీర్పు వినే దమ్మేదీ!!

ప్రజా తీర్పు వినే దమ్మేదీ!!

Written By news on Friday, July 26, 2013 | 7/26/2013

విలువలతో కూడిన రాజకీయాలు చేసే ధైర్యం వీళ్లకు లేదు
అందుకే పంచాయతీ ఎన్నికలను పార్టీ గుర్తుల మీద జరపలేదు
ఈ పార్టీలకు ఎన్నికలన్న పదం వింటేనే వణుకు పుడుతోంది..
ఉప ఎన్నికలు జరిపే ధైర్యమే లేని వీళ్లను నాయకులంటారా? పిరికిపందలంటారా?
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ గురువారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 220, కిలోమీటర్లు: 2,955

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘విలువలతో కూడిన రాజకీయాలు చేసే దమ్ము, ధైర్యం ఈ కాంగ్రెస్ టీడీపీ నాయకులకు లేనే లేదు. నిజంగా ఈ కాంగ్రెస్ పార్టీకి ధైర్యం ఉండి ఉంటే ఈ పంచాయతీ ఎన్నికలను పార్టీల గుర్తుల మీదనే జరిపించేది. పంచాయతీ ఎన్నికలు పార్టీల గుర్తుల మీద జరపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజైతే డి మాండ్ చేసిందో.. అదే రోజు ఈ చంద్రబాబు కూడా పార్టీల గుర్తుల మీదనే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేసేవారు. కానీ ఈ కాంగ్రెస్, టీడీపీలకు ఎన్నికలు అనే పదం వింటేనే వెన్నులో వణుకు పుడుతోంది. ప్రజా న్యాయస్థానంలో ప్రజలిచ్చే తీర్పు వినే దమ్ము కూడా ఈ నాయకులకు లేదు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల తీవ్రంగా విమర్శించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని, దానితో అంటకాగుతున్న చంద్రబాబు వైఖరిని ఎండగడుతూ షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర గురువారం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలో సాగింది. ఆమదాలవలసలో భారీగా తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు.

ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

పిరికిపందలు..: ‘‘ఇప్పుడు చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ఎవరికి వారు ‘మేమే ఎక్కువ పంచాయతీలు గెలిచామంటే.. కాదు మేమే ఎక్కువ గెలుచుకున్నాం’ అని ప్రకటనలు చేస్తున్నారు. వాళ్ల మీడియా ద్వారా బ్రహ్మాండంగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ నిజంగా చూస్తే ఎవరు ఎన్ని పంచాయతీలు గెలుచుకున్నారన్నది చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఈ పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరిగినవి కాదు. అందుకనే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉబ్బితబ్బిబ్బు అయిపోయి ‘మేమంటే... మేమే ఎక్కువ పంచాయతీలు గెలుచుకున్నాం’ అని చెప్పుకుంటున్నారు. నిజానికి మార్చి నెలలో అన్ని ప్రతిపక్ష పార్టీలూ కలిసి పెట్టిన అవిశ్వాస తీర్మానంలో 15 మంది ఎమ్మెల్యేలు అవిశ్వాసానికి మద్దతు ఇచ్చారు. అదే మార్చి నెలలోనే విప్ ధిక్కరించిన 15 మంది ఎమ్మెల్యేల మీద సస్పెన్షన్ వేటు వేయాల్సి ఉంది. కానీ వారి మీద వేటు వేయకుండా, సాగదీసి.. సాగదీసి తీరా జూన్ మాసం వచ్చాక ఇక ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదని తెలిశాక అప్పుడు వారి మీద సస్పెన్షన్ వేటు వేశారు. ఈ కాంగ్రెస్, టీడీపీలకు ధైర్యం ఉండి ఉంటే.. విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేల మీద వేటు వేసి ఎన్నికలు పెట్టాలని ఆ రోజే కోరి ఉండేవారు. కానీ అలా కోరలేదు. ఎందుకంటే వీళ్లకు తెలుసు ఉప ఎన్నికలు వచ్చాయి అంటే.. పోయిన ఏడాది జరిగిన ఉప ఎన్నికల్లో మాదిరిగా అన్ని సీట్లూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని, కనీసం డిపాజిట్లు కూడా రావని వీళ్లకు తెలుసు. ఉప ఎన్నికలకు కాదు.. కనీసం పంచాయతీ ఎన్నికలకు కూడా భయపడే వీళ్లను నాయకులు అంటారా? లేక పిరికిపందలు అంటారా?

వైఎస్ చేసిన పనులను తమ ఖాతాలో వేసుకుంటున్నారు: మొన్న రెవెన్యూ శాఖమంత్రి గారు ఒక మాటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 7.65 లక్షల ఎకరాల భూ పంపిణీ చేసిందని చెప్పారు. కానీ వాస్తవ లెక్కలను పరిశీలిస్తే వైఎస్సార్ ఉన్న ఐదేళ్లలో నాలుగు విడతల్లో 6 లక్షల ఎకరాలు భూ పంపిణీ చేశారు. ఐదో విడత కోసం లక్ష ఎకరాల భూమిని సేకరించారు. మరి ఈ కిరణ్ సర్కారు పంచింది ఎంత? ఈ మంత్రి చెబుతున్న లెక్కల ప్రకారమేచూసినా.. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నాలుగేళ్లలో 65 వేల ఎకరాలు మాత్రమే పంపిణీ చేసింది. ఇక ఈ ప్రభుత్వానికి పేదల మీద శ్రద్ధ ఉందా? మొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 22.45 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిందట. కానీ లెక్కల ప్రకారం చూస్తే వైఎస్సార్ ఉండగానే 21 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. అంటే ఈ సీఎం నాలుగేళ్లలో 1.45 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు. ఇదీ వీళ్ల ఘనకార్యం. ఎవరో సంపాదించిన కుర్చీ మీద కూర్చొని అధికారం అనుభవించడం, ఎవరో చేసిన మంచి పనులను తామే చేశామని గొప్పలు చెప్పుకోవడం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఘనకార్యం.’’

13.1 కిలోమీటర్ల మేర యాత్ర..

గురువారం 220వ రోజు ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలోని మండాది గ్రామం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి అక్కులపేట, తాళ్లవలస, తిమ్మాపురం, లక్ష్ముడిపేట, బొడ్డేపల్లిపేట గ్రామాల మీదుగా ఆమదాలవలస నియోజకవర్గ కేంద్రం చేరుకున్నారు. రైల్వే స్టేషన్ సెంటర్‌లో భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. అనంతరం ఊసవానిపేట మీదుగా శొట్టవానిపేట గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.30 గంటలకు చేరుకున్నారు. గురువారం మొత్తం 13.1 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 2,955 కిలోమీటర్ల యాత్ర పూర్తయ్యింది. షర్మిల వెంట నడిచిన వారిలో నర్సన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు, జిల్లా పార్టీ కన్వీనర్ ధర్మాన పద్మప్రియ, మాజీ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు, ఆమదాలవలస నియోజకవర్గం సమన్వయకర్తలు బొడ్డేపల్లి మాధురి, కిల్లి రామ్మోహన్‌రావు, వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు వరుదు కళ్యాణి, వైవీ సూర్యనారాయణ, స్థానిక నాయకులు కూన మంగమ్మ, బొడ్డేపల్లి పద్మజ, కొయ్య ప్రసాదరెడ్డి, దుప్పల రవీంద్ర తదితరులు ఉన్నారు.
  
రాష్ట్రీయం
Listings రాజీనామాలు!Listings మెడికల్ కాలేజీలపై ఐటీ దాడులు
Listings షర్మిలను కలిసిన మహిళా సర్పంచ్‌లుListings కాంగ్రెస్‌ది డబుల్ గేమ్
Share this article :

0 comments: