ప్రముఖులకు షాక్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రముఖులకు షాక్

ప్రముఖులకు షాక్

Written By news on Sunday, July 28, 2013 | 7/28/2013

రఘువీరా, పితాని, సుదర్శన్‌రెడ్డి, సుద్దాల, గుత్తా,తుమ్మలకూ అదే పరిస్థితి
శోభా నాగిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్లగడ్డలో 51 మంది వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల గెలుపు

సాక్షి, హైదరాబాద్: మలి దశ పంచాయతీ పోరులో అధికార, ప్రతిపక్ష పార్టీలోని పలువురు ప్రముఖుల నియోజకవర్గాల్లో ఓటర్లు వాళ్లకు షాకిచ్చారు. పంచాయతీలో తామే గెలుస్తామన్న ధీమాతో ఉన్న నాయకులకు ప్రజలు ఓటుతో బుద్ధిచెప్పారు. దీంతో బంధువులను బరిలోకి దింపి రాజకీయాలు చేయి జారకుండా చూసుకోవాలనుకున్న పలువురు నాయకుల ఆశలు అడియాశలయ్యాయి. పీసీసీ అధ్యక్షుడు, మంత్రి బొత్స సత్యనారాయణకు చీపురుపల్లి మేజర్ పంచాయతీ ఫలితం తలబొప్పి కట్టించింది. అక్కడ ఆయన బలపరిచిన అభ్యర్థి ఘోరపరాజయం పొందగా, బొత్స నిర్ణయాన్ని వ్యతిరేకించి రెబల్‌గా తన భార్యను పోటీచేయించిన మీసాల వరహాలనాయుడు భారీ మెజారిటీతో ఆమెను గెలిపించుకోవడం విశేషం. నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రిగా ఉన్న సుదర్శన్‌రెడ్డి, అనంతపురం నుంచి మంత్రిగా ఉన్న రఘువీరారెడ్డి, టీడీపీ చొప్పదండి ఎమ్మెల్యే దేవయ్య, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు(కోరుట్ల), చెన్నమనేని రమేశ్‌బాబు(వేములవాడ), కాంగ్రెస్ ఎంపీ గుత్తాసుఖేందర్‌రెడ్డి, తణుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, నర్సీపట్నం అధికారపార్టీ ఎమ్మెల్యే ముత్యాలపాపకూ పరాభవం తప్పలేదు. అదే సమయంలో వైఎస్సార్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న శోభానాగిరెడ్డి నియోజకవర్గంలో పార్టీ మద్దతుదారులు.. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు కుట్రను ఎదుర్కొని మెజారిటీ స్థానాల్లో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రెడ్డివారి చెంగల్‌రెడ్డి సొంత గ్రామంలో కాంగ్రెస్ విఫలయత్నం చేసినా.. పరాభవం తప్పలేదు. అక్కడ వైఎస్సార్ మద్దతుదారుడు భారీ మెజారిటీతో గెలుపొందడం కాంగ్రెస్‌కు పెద్దషాక్.

షాక్ తిన్న ప్రముఖుల వివరాలివీ..

బొత్స సత్యనారాయణ(చీపురుపల్లి): చీపురుపల్లి మేజర్ పంచాయతీలో తాను బలపరిచిన అభ్యర్థి కాకుండా రెబల్‌గా రంగంలోకి దిగిన అభ్యర్థి విజయం సాధించడం బొత్సకు మింగుడుపడని అంశంగా భావిస్తున్నారు. 30 ఏళ్లుగా పంచాయతీపై ఆధిపత్యం చెలాయిస్తున్న బెల్లాన చంద్రశేఖర్ కుటుంబానికి ప్రజలు ఈసారి సెలవిచ్చారు. సర్పంచ్ అభ్యర్థే కాదు, వార్డుల్లోనూ 18 వార్డులను రెబల్ అభ్యర్థి మద్దతుదారులు గెలుచుకున్నారు. 14 వేలకుపైగా ఓట్లున్న ఈ పంచాయతీలో రెబల్ అభ్యర్థి మీసాల సరోజని ఐదువేలకు పైగా ఓట్లతో గెలవడం విశేషం.

రఘువీరారెడ్డి(కల్యాణదుర్గం): పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంతో అవగాహన రఘువీరారెడ్డి కొంపముంచింది. నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థులు దారుణంగా దెబ్బతిన్నారు. రఘువీరా ప్రాతినిధ్యం వహిస్తున్న కల్యాణదుర్గంలో 73 పంచాయతీలు ఉంటే.. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు కేవలం 19 పంచాయతీల్లో గెలుపొందడం గమనార్హం.
సుద్దాల దేవయ్య(చొప్పదండి): కరీంనగర్ జిల్లా చొప్పదండి తెలుగుదేశం ఎమ్మెల్యే దేవయ్య తన మాదిరిగానే తన పుత్రుడిని సర్పంచ్‌గా బరిలోకి దించి అధికార పదవీ అరంగేట్రం చేయిద్దామని యత్నించారు. కానీ ఆయనకు నిరాశే ఎదురైంది. బల్వంతపూర్‌లో ఆయన కుమారుడు వెంకటగౌతంకృష్ణ ఓడిపోయారు. జడ్పీ చైర్‌పర్సన్‌గా, మంత్రిగా పనిచేసిన దేవయ్య.. సర్పంచ్ పదవిలో తన కుమారుడిని మాత్రం గెలిపించుకోలేకపోయారు.

తుమ్మల నాగేశ్వరరావు(ఖమ్మం): ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలంలో టీడీపీ ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావుకు వైఎస్సార్‌సీపీ గట్టిషాకిచ్చింది. ఆ మండలంలో 14 పంచాయతీలు ఉంటే..అందులో ఎనిమిదింటిలో వైఎస్సార్‌సీపీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడంతో, తెలుగుదేశం అభ్యర్థులు చతికిలపడ్డారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే నాగేశ్వరరావు పార్టీ బలపరిచిన అభ్యర్థులను మాత్రం గెలిపించుకోలేకపోయారు.
సుదర్శన్‌రెడ్డి(బోధన్): భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బోధన్ నియోజకవర్గంలోని రెంజల్ మండలంలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తలిగింది. రెంజల్ మండల కేంద్రంలో డిపాజిట్ కూడా కోల్పోయారు.
పితాని సత్యనారాయణ(ఆచంట): పశ్చిమ గోదావరి జిల్లాలో మేజర్ పంచాయతీల్లో ఒకటైన పెనుగొండలోని ఓటర్లు మంత్రి పితాని సత్యనారాయణకు షాకిచ్చారు. మంత్రి స్వయంగా పరిశీలిస్తూ వచ్చిన ఈ పంచాయతీని వైఎస్సార్‌సీపీ మద్దతుదారు యాదుల ఆశాజ్యోతి గెలుచుకున్నారు. ఒకప్పుడు ఈ పంచాయతీ పేరుతోనే నియోజకవర్గం ఉండేది. ఇప్పుడది ఆచంటగా మారిన విషయం విదితమే. కాగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఒక మండలంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఒక్క పంచాయతీలో మాత్రమే కాంగ్రెస్ మద్దతుదారు విజయం సాధించారు.

శోభానాగిరెడ్డి (ఆళ్లగడ్డ): కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై వైఎస్సార్ సీపీ అభ్యర్థులను దెబ్బతీయాలన్న పన్నాగం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఫలించలేదు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో మొత్తం 85 పంచాయతీలుంటే.. కాంగ్రెస్ 19, టీడీపీ తొమ్మిది స్థానాలకే పరిమితమయ్యాయి. అక్కడ వైఎస్సార్‌సీపీ బలపరిచిన 51 మంది అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. ఈ నియోజకవర్గంలో భూమా దంపతులు భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డిలకు ఎదురులేదని అక్కడి ఓటర్లు తీర్పునిచ్చారు.

ఒకే ఒక్క ఓటు..! 

కరీంనగర్ జిల్లాలో.. కథలాపూర్ మండలం పెగ్గెర్లలో కనకందుల దేవక్క(వైఎస్సార్‌సీపీ), బోయిన్‌పల్లి మండలం కొత్తపేటలో నర్సింగారావు (టీఆర్‌ఎస్), మేడిపల్లి మండలం విలాయతాబాద్‌లో పోచమల్లు (స్వతంత్ర అభ్యర్థి) కేవలం ఒకే ఒక్క ఓటుతో గెలుపొందారు.

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం తిమ్మంపేటలో కాంగ్రెస్ బలపరిచిన నరహరి రమాదేవి, టీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి ఎలకంటి మంజులపై ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. రమాదేవికి 659 ఓట్లు, మంజులకు 658 ఓట్లు వచ్చాయి.ప్రముఖులకు షాక్
Share this article :

0 comments: