నేడు, రేపు విజయమ్మ ‘ఫీజు పోరు’ దీక్ష - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు, రేపు విజయమ్మ ‘ఫీజు పోరు’ దీక్ష

నేడు, రేపు విజయమ్మ ‘ఫీజు పోరు’ దీక్ష

Written By news on Thursday, July 18, 2013 | 7/18/2013

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం నీరుగారుస్తున్నందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ‘పెద్ద చదువులు... పేదోళ్లందరి హక్కు..!’ అనే నినాదంతో గురు, శుక్రవారాల్లో ఫీజు పోరు పేరుతో దీక్ష చేయనున్నారు. డబ్బుకు పేదోళ్లయినా, విద్యకు పేదోళ్లు కారాదనే మహదాశయంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇంజనీరింగ్, మెడిసిన్ సహా ఉన్నత, వృత్తి విద్యా కోర్సులకయ్యే ఫీజులను ప్రభుత్వమే చెల్లించి, పేద విద్యార్థుల జీవితాలకు వెలుగునిచ్చేలా పథకాన్ని రూపొందించారు. కానీ, ఆయన తరువాత వచ్చిన ప్రభుత్వాలు ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’కు తూట్లు పొడవడం ప్రారంభించాయి. అలవి మాలిన ఆంక్షలు విధించి, పేదలకు ఉన్నత విద్యను అందకుండా చేస్తున్నాయి.


ఇటీవల ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సుల ఫీజులను తానే పెంచిన ప్రభుత్వం... చెల్లింపునకు మాత్రం పరిమితులు విధించింది. ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజు ఎంత ఉన్నా తాము చెల్లించేది రూ. 35 వేలేనని జీవో కూడా ఇచ్చింది. ఇలా ఆ బృహత్తర పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంటే... విద్యార్థులను జాగృతం చేసి, దానిని పరిరక్షించుకునేందుకు విజయమ్మ ఈ దీక్ష చేపడుతున్నారు. ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’ పథకం పరిరక్షణ కోసం 2011లో ఫిబ్రవరి 18 నుంచి 24వ తేదీ వరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇందిరా పార్కు వద్ద నిరాహార దీక్ష చేశారు. ఆ తరువాత ఈ పథకం పరిరక్షణను కోరుతూ 2012 జనవరి 4న రాష్ట్రవ్యాప్తంగా ఒక రోజు ధర్నాలు చేశారు. ఒంగోలులో జగన్ స్వయంగా ధర్నాలో పాల్గొన్నారు. ఇదే అంశంపై 2012 ఆగస్టు 13, 14 తేదీల్లో విజయమ్మ ఏలూరులో దీక్ష చేశారు. 2012 సెప్టెంబర్ 6, 7 తేదీల్లో హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద కూడా ఆమె దీక్ష చేశారు. అయినా.. పేద విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ ఉండటంతో విజయమ్మ మూడోసారి దీక్షకు పూనుకుంటున్నారు.


కాగా.. విజయమ్మ చేపట్టనున్న ‘ఫీజు పోరు’ దీక్ష పోస్టర్‌ను బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, గొల్ల బాబూరావు, బి.గురునాథరెడ్డి, రంగారెడ్డి జిల్లా పార్టీ అడ్‌హాక్ కమిటీ కన్వీనర్, ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సమక్షంలో విడుదల చేశారు. కాగా.. ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో నిర్వహించనున్న ‘ఫీజు పోరు’ దీక్షా వేదిక ఏర్పాట్లను బుధవారం సాయంత్రం వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, సీనియర్ నేతలు కేకే మహేందర్ రెడ్డి, జనక్ ప్రసాద్, బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, గట్టు రామచందర్‌రావు, విజయారెడ్డి తదితరులు పరిశీలించారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల కోసం వైఎస్ ప్రవేశ పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు.

దీక్షకు మద్దతు ప్రకటించండి: భూమన

వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక బృహత్తరమైన ఆశయంతో ప్రవేశపెట్టిన ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’ పథకాన్ని పరిరక్షించేందుకు విజయమ్మ చేయబోతున్న దీక్షకు అందరూ మద్దతు ఇవ్వాలని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. పోస్టర్ విడుదల సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యంగా విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, దీక్షకు సంఘీభావం ప్రకటించాలని పిలుపునిచ్చారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని ఆయన రెక్కల కష్టంతో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగార్చడం శోచనీయమని పేర్కొన్నారు. ఈ పథకం అమల్లో అడ్డగోలు నిబంధనలను తొలగించాలని, పేద విద్యార్థులందరికీ న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

మైనారిటీలకు వరం: రెహ్మాన్

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం వల్ల ఎక్కువగా మేలు జరిగే ది ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు వర్గాల విద్యార్థులకేనని.. అందులోనూ మైనారిటీ విద్యార్థులకు ఈ పథకం ఎంతో ప్రయోజనకరమని పార్టీ మైనారిటీల రాష్ట్ర విభాగం కన్వీనర్ హెచ్.ఏ.రెహ్మాన్ అన్నారు. విజయమ్మ దీక్షకు మైనారిటీలు భారీ సంఖ్య లో హాజరై సంఘీభావం ప్రకటించాలని పిలుపునిచ్చారు.
Share this article :

0 comments: